వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)

చల్ల పులుసు

తరుణి పత్రిక పాఠకుల రుచి కరమైన భోజనం అందించాలని…. ఆ… భోజనమా! అని ఆశ్చర్యపోకండి. అవును! మన రచయిత్రి లక్ష్మీ మదన్ చక్కగా రుచికరమైన వంటలు ఎలా చేసుకోవాలో ఆసక్తికరంగా చెబుతున్నారు. వినండి… అదేనండీ తయారు చేసే విధానం ” ఒంటిల్లు ఒడవని – ముచ్చట” ( కాలమ్) అంటూ వ్రాస్తున్నారు. ప్రతినెలా మీకోసం… చదువుతూ వంటచేసుకోండి. నలభీమ పాకం అన్నారు కదా మనకు కాదనుకోకండి. ఆ నలుడూ భీముడు కూడా ఆనాడు ఇదిగో ఇలాంటి లక్ష్మీ మదన్ వంటి ఏ అమ్మ చేతివంటతిని నేర్చుకున్నారో గాని మనమూ నేర్చుకుందాం. ఏమంటారు? చెప్పే విధానం బాగుండాలి వంటదేం? అనీ అంటారా? అవునవును ఎంత బాగా చెబుతున్నదో ఈ ధారావాహిక క్విక్ కిచెన్ కాలమ్ ను మీరే చూడండి…
                                 – డాక్టర్ కొండపల్లి నీహారిణి తరుణి పత్రిక ఎడిటర్.

అబ్బో! ఇది కూడా చెప్పాలా! పెద్ద బడాయ్! అని అంటున్నారు కదా!

అయినా సరే నేను చెప్పే తీరుతాను.

మన ఇళ్లల్లో అప్పుడప్పుడు బోలెడు చల్ల మిగిలిపోతుంది. అదే మజ్జిగండి!

అప్పట్లో ఇళ్లలో పాడి పంట పుష్కలం.ఇలా పెరుగు ,పాలు కొన్నామా! వాడలో ఓ ఇద్దరి ఇళ్లలో బర్రెలు ఉంటే చాలు.అందరికీ మజ్జిగ ఉచితం. అప్పుడప్పుడు పాలు కూడా ఉచితమే!

సామెత ఉంది కదా! చల్లకొచ్చి ముంత దాచుడు ఎందుకు అని.

మనం ఈ రోజుల్లో పాల కవర్ విప్పి పాలు,పెరుగు,నెయ్యి చిటుక్కున వేసుకుంటున్నాను. కానీ అవి తయారు కావాలంటే ఎంత కష్టమో ఈ తరం వాళ్లకి తెలుసా!

బర్రెలకు కుడితి పెట్టడం దగ్గర నుండి, వాటి పోషణ,పాలు పితకడం లాంటి పనులు ఎన్నుంటాయి! దూడలను జాగ్ర

త్తగా చూసుకోవడం. కంచంలో ఏ పదార్థం వృధా కాకుండా కుడితిలో వేసేయడం. ఆకుకూరలు ఇంకా ఇలాంటివి ఏమైనా శుభ్రం చేసినప్పుడు ఆ మిగిలిన కూరలు బర్రెలకు పెట్టడం.. ఇలా ఏది వృధా కాకుండా ఉండడమే కాకుండా వాటికి మంచి ఆహారం దొరికేది. ఇప్పుడు గేదెలను భయంకరంగా చూస్తున్నారు. లేగ దూడలను పెట్టే చిత్రహింసలు చూస్తే భయమేస్తుంది. పాలు తాగాలన్న భయంగానే ఉంది.

సరే విషయానికొస్తాను. మిగిలిన పుల్లని మజ్జిగను తీసుకొని చక్కగా చిలికి ఇందులో శెనగపిండి కలిపి మరొకసారి చిలికేసి పెట్టుకోండి.

ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అది వేడెక్కాక అందులో పోపు దినుసులు వేసి పచ్చిమిరపకాయలు ఇష్టం ఉంటే కూరగాయలు వేసుకోవచ్చు. సొరకాయ , టమాట ముక్కలతో పాటు బచ్చలి కూర లేదా పాలకూర వేసుకోవచ్చు. ఇది కాస్త మగ్గిన తర్వాత అల్లం తురుము కొత్తిమీర కరివేపాకు వేసి ఈ చిలికిన మజ్జిగను అందులో పోసి అయ్యో! ఉప్పు వేయడం మర్చిపోయానే! ఇప్పుడు వేస్తాను. చక్కగా మరిగించాలి. కమ్మని వాసన వస్తుంది. ఒకవేళ మజ్జిగ పుల్లగా లేదనుకోండి అప్పుడు మామిడి ఒరుగుల పొడి లేదా చింతకాయ రసం వేసుకోవచ్చు లేదా నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. మీ ఇంట్లో ఉన్న వస్తువులను బట్టి చేసుకోండి.

ఈ రోజుల్లో చల్లకు రావడం లేదు. ముంతలు దాచడం లేదు. ఎవరి కడుపు మంతలు వాళ్ళు నింపుకోవడమే కష్టంగా ఉంది.

ఇది పూర్తి ఆహారం కింద వస్తుంది. ఎందుకంటే ఇందులో శనగపిండి ఉంది. అంటే పప్పు వచ్చినట్లే. ఆకుకూరలు కాయగూరలు అన్నీ ఉన్నాయి.

కాస్త వేడి అన్నం పెట్టుకొని రెట్టింపు మజ్జిగ పులుసు వేసుకొని తింటుంటే ఇంకేమీ అవసరం లేదు హాయిగా కడుపునిండా తినవచ్చు. తేలికగా జీర్ణమయ్యే వంటకం.

తెలిసినవాళ్లు చూసి చూడనట్లు వదిలేయండి. తెలియని వాళ్ళు చేసుకోండి!

అంతేనా? ఏమంటారు మరి!

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నేనున్నాను

మన మహిళామణులు – శ్రీమతి మద్దాలి కృష్ణకుమారి