ఒక విజేత మంగళ దాయిని

నిగ్రహం కోల్పోయి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారి నూతిని గోతిని వెతికే వాళ్ళు,అమ్మ అన్నదనో,నాన్న తిట్టాడనో,పరీక్షల్లో తప్పామనో చీటికీ మాటికి చితిని పేర్చుకునే వాళ్ళు,ఆఫీసు వత్తిడి తట్టుకోలేకనో వేరే ఏవేవో కారణాలతో ఆత్మహత్యకు పాల్పడుతున్న వాళ్ళను నిత్యం చూస్తూనేవున్నాం.తెల్లారి లేచింది మొదలు  ఏవేవో వార్తలు వింటున్నాం. నిన్న మొన్న పిల్లలతో పాటు చర్లపల్లి  రైల్వేస్టేషన్ లో  రైలు పట్టాలపై ఇద్దరు పిల్లలతో పాటు చనిపోయిన ఓ తల్లి ఆత్మహత్యకు కారణాలు తెలియని అయోమయ పరిస్థితి. ఇట్లా లోకంలో జరిగే సంఘటనలు ఒకవైపు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని ధైర్యంతో ఎదుర్కొని, చచ్చి ఏం సాధిస్తారు ఏదైనా బతికి సాధించాలని, సూటిపోటి మాటలను లెక్కచేయక  ఒక లక్ష్యం వైపు పయనించడం, పలువురికి ఆదర్శంగా నిలవడంతో తన శక్తిని చాటిన మేటి మహిళ, చరిత్రను సృష్టించిన మధ్యప్రదేశ్ గ్వాలియర్  కు చెందిన వీరవనిత  డా.మంగళ కపూర్.

పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. మఁగళ్ కపూర్
భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని కన్నవారి కడుపుతీపిని  వృధా చేయక ఆటుపోట్లు భరించి తనకు తాను ఒక  కొత్త బాటను వేసుకుని తన బ్రతుకును తాను తీర్చిదిద్దుకున్న సాహసి, ధైర్య వనిత..గ్వాలియర్ ఘరానాకు చెందిన ప్రొఫెసర్ మంగళ కపూర్.
తన 12 వ యేట 1962 సంవత్సరంలో బట్టలకొట్టులో ఉన్న విద్వేషాల కారణంగా కొంతమంది రాక్షసులు అర్ధరాత్రి ఆమెపై యాసిడ్ దాడి చేశారు. 6 సంవత్సరాలు హాస్పిటల్  చుట్టూ తిరిగి తిరిగి  బాల్య జీవితాన్ని ఫణంగా పెట్టింది. చిన్న వయసులో
37 ఆపరేషన్లు జరిగాయి .అందవికారమైన మోముతో చదువుకోవడానికి బడికి  వెళితే వెక్కిరించే వాళ్ళు.ముక్కుసూటి మాటలు,అవహేళన చూసి చనిపోదామనుకుని కూడా  తండ్రి చెప్పిన మాట ‘ఒక లక్ష్యం ఏర్పర్చుకుని ముందుకు సాగాలి కానీ వెనక్కి పోతే బలహీనులమౌతాము’ అన్న ఆ మాట గుర్తుకు వచ్చి ఆత్మహత్య అనే విషయాన్ని వెనక్కి నెట్టి  తనకిష్టమైన హిందూస్థానీ సంగీతాన్ని ఇంటివద్దనే గురువుదగ్గర నేర్చుకుంది. దూరవిద్య ద్వారా పి.జి.చేసింది.తర్వాత మెరిట్ స్కాలర్ షిప్ తో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో   పి.హెచ్.డి., పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందింది.
తర్వాత అదే విశ్వవిద్యాలయంలో శాస్త్రీయ సంగీతంలో ప్రొఫెసర్ స్ధాయికి  చేరుకుని పదవీ విరమణ పొందింది.
ఆత్మవిశ్వాసం, పట్టుదల, దృఢసంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్నదానికి నిదర్శనంగా నిలిచిన వీరనారి మంగళ కపూర్.

పిల్లలకు పాఠాలు చెప్తూనే కచేరీలు చేసేది.శ్రోతలను తన గాత్రంతో  మంత్రముగ్దులను చేసేది. ప్రముఖ గాయని లతామంగేష్కర్ లాగా మంచి  స్వరం, గానం అని *”కాశీలతా”  అనే బిరుదును తరంగ్ ఫౌండేషన్ వాళ్లు ఇచ్చారు.రాజ్యసభ  “రోల్ మోడల్”   బిరుడునిచ్చి సత్కరించింది.

 సమాజంలో వెనుకబడిన పిల్లల జీవితాలలో సానుకూలమైన మార్పు రావాలని చాలా కృషి చేస్తోంది మంగళ. 2018 లో
*”సీరత్”  పేరుతో తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే ఒక గ్రంథం రాసింది.అది మరాఠీ భాషలో  “మంగళ”  పేరుతో 2018 సంవత్సరంలో ఒక చలన చిత్రం విడుదల అయ్యింది.
ఈ చిత్రంలో  జీవితంలో తాను ఎదుర్కొన్న కష్టాలు,కన్నీళ్లు, సవాళ్లు అన్ని చక్కగా చూపించారు.
పదవీ విరమణ అనంతరం కూడా ఆమె పేద విద్యార్థులకు ఉచితంగా సంగీతం బోధిస్తోంది.
తాను చేసిన కృషిని గుర్తించి భారత దేశ ప్రభుత్వం ఈ  2026 సంవత్సరంలో  కళారంగంలో  ఆమెకు పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించింది.
ప్రొఫెసర్ మంగళ తాను జీవితానికి భయపడి ,కష్టాలు చూచి వెనక్కి తగ్గితే  పద్మశ్రీ సాంధిచేదా? బ్రతుకు పోరులో గెలిచి తన సత్తాను చాటిన మహా మహిమాన్విత స్త్రీ రత్నం భావితరాలకు ఆదర్శం, విజేతగా నిలిచిన స్త్రీమూర్తి,
మానసిక బలహీనులైన  మహిళ లకు స్ఫూర్తిప్రదాత మంగళ   అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అట్టి డాక్టర్ మంగళ కపూర్ కు నా హృదయపూర్వక అభినందనలు.
జయహో మంగళ జయహో జయహో మంగళ!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

హరిచందన – 10వ భాగం

The Cruise – ఓ దృశ్య ప్రయాణం – పార్ట్ 4