బుజ్జి కన్నమ్మలు ప్రేమకు నిజంగా మనల్ని కన్న అమ్మలే. పాలవంటి స్వచ్ఛమైన మనసు. “కుడుమిస్తే పండుగ” అనుకునే అమాయకత్వం.ప్రేమించే వ్యక్తికి తాము తినేది సైతం పెట్టాలనే తపన.ఇంట్లో అమ్మ పెట్టింది పుస్తకాల సంచీలోనో , పరికిణీ, గౌను చాటుగా దాచి ఇదో ఇది నీ కోసమే అనడంలో మీరు అని గౌరవించలేదనే భావన ఉంటుందా?అస్సలు ఉండదు.ఆ వాత్సల్యం ఎంత అపురూపంగా ఉంటుందో ఊహించలేనిది. మరి అలాంటి ప్రేమను కొలిచే కొలమానం ఉందా?
పండుగ మరుసటి రోజు చూడాలి. రకరకాలుగా వాళ్ళ ప్రేమ.”టీచర్ ! పండక్కి మా అమ్మ కారప్పూస చేసింది ఇగ్గో నీకోసమే కాయితంల పొట్లం కట్టుకోనొచ్చిన.నీ బ్యాగుల పెడుతున్న.మరో మాటకు అవకాశం లేకుండా చనువుగా బ్యాగ్ లో పెట్టేస్తుంది ఓ బంగారు తల్లి.
పండక్కి మా అమ్మ అరిశెలు, బూరెలు చేసింది. నువ్వు చేసినవా? పాలిథిన్ కవర్లో పెట్టుకొని ఆప్యాయంగా అందులో ఓ ముక్క తీసి ఆప్యాయంగా నోటికందిస్తుంది ఓ చిన్న తల్లి.
మా యమ్మ మాసం కూర పూరీలు చేసింది టీచర్! నువ్వు మాసం తినవుగా.అందుకే తేలే. తేలేకపోయినందుకు బాధ నంతా మాటల్లో ఒలికిస్తుంది ఓ బుజ్జి తల్లి.
ఈ విధంగా వాళ్ళు ఇంటి నుంచి తీసుకొచ్చేది, పట్టుకొచ్చేది కారప్పూసనో,అరిశనో మరోటో కాదు వాళ్ళ కల్మషం లేని అనురాగం.అంతులేని ప్రేమ, ఇష్టం.మన పట్ల అమ్మా నాన్నల పట్ల ఉన్నంత నమ్మకం.తనకు కావాల్సిన వాళ్ళమనే భావన. ఇది చాలు గురు శిష్యుల మధ్య ఎలాంటి బంధం ఉండాలో …!
అలా వాళ్ళ ఆత్మీయతకు బంధీనై ఉండటం ఇష్టం.ఆ ఒకటి రెండు తరగతుల పసికూనలకు పాఠాలు చెబుతూ వాళ్ళ అంతులేని ప్రేమను పొందడం మరీ మరీ ఇష్టం.
వెన్నెల నవ్వింది
***
ఓ బుజ్జి కన్నమ్మను తీసుకుని వాళ్ళమ్మ మా బడిలో చేర్పించడానికి వచ్చింది. ఆ బుజ్జి తల్లి పుచ్చ పువ్వులా తెల్లగా మెరిసిపోతూ ఉంది.ఆ కళ్ళు హరిణ నయనాల్లా బిక్కు బిక్కు మంటూ బిత్తర చూపులు చూస్తున్నాయి. అమ్మ కుచ్చిళ్ళు పట్టుకొని కొంగు చాటున నిలబడి చూస్తుంటే అచ్చు మబ్బుల మాటున దాగిన చందమామలా ఎంత అందంగా ఉందో…!
పేరు నమోదు చేయిస్తూ వాళ్ళమ్మ ” ఇది వొట్టి మూగిమొద్దు.ఎవరితోనూ మాట్లాడదు.ఎలా బతుకుతుందో ఏమో? నోట్లో నాలుక లేదు.” అంటున్న ఆమె మాటలు విన్న మా బుజ్జి కన్నయ్యల్లో ఓ కొంటె గడుగ్గాయ్ “నేను చూసిన టీచర్! నోట్లో నాలుక ఉంది.” గుసగుసగా నా పక్కన చేరి అంటుంటే ఫక్కున నవ్వాను.
ఎందుకు నవ్వానో అర్థం కాక ఆ తల్లి అయోమయంగా చూస్తుంటే విషయం చెప్పాను.ఆమె కూడా నాతో పాటు శృతి కలిపింది.
ఇక విషయంలోకి వద్దాం. ఈ బుజ్జి కన్నమ్మను సాయంత్రం వరకు బడిలో ఉంచడం ఓ ప్రళయం అయింది. తల్లికి కబురు చేస్తే వచ్చింది. తనని తీసుకుని పోతూ “టీచర్ గారూ! ఇట్ల చికాకు చేస్తుంది.ఏం చదువొస్తుందో ఏమో! విసుక్కుంది.
మరుసటి రోజు నా దగ్గర దింపి ఇప్పుడే వస్తానని ఏడవొద్దని చెప్పి వెళ్లిపోయింది. పాపం బిక్కు బిక్కు మంటూ పిల్లలందరికీ దూరంగా కూచుంది. నా దగ్గర వాళ్ళని ఆకర్షించే పాపిన్స్ ఎప్పుడూ ఉంటాయి. వాటిని ఉత్తగే ఇవ్వను. చిన్న ప్రశంస కింద మెచ్చుకుంటూ ఇస్తూ ఉంటాను. అది పొందాలని రకరకాల ఎత్తులు వేస్తుంటే ఆ బుజ్జి బుర్రల్లో ఎన్ని తెలివితేటలో కదా!అని ముచ్చటేస్తుంది.నవ్వు వస్తుంది. ఆ తర్వాత మిగతా పిల్లలకు అలా కొద్ది సేపు ఇవ్వకుండా ఊరించి ఊరించి ఇస్తూ ఉంటాను. అందుకే ప్రశంసలతో వాటిని అందుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.నాక్కావలసింది కూడా అదే. ఇలా నా దగ్గర పాపిన్స్, చాక్లెట్లు వాళ్ళతో చనువూ, స్నేహం పెంచుకోవడానికి మరింత ఉపయోగపడుతుంటాయి.
మరి దూరంగా కూచున్న బుజ్జి కన్నమ్మ మీద ఈ తీయని అస్త్రాలు పని చేశాయా? చూద్దాం.
బుజ్జి కన్నమ్మలు,కన్నయ్యలకు నేను “నిన్నటి వరకు చెప్పినయి, వాళ్ళకి వచ్చినయి చకచకా పలక మీద రాసుకుని ఎవరు ముందు వస్తారో వారికి ఓ పాపిన్ ఇస్తాను ” అన్నానంతే.యమ సీరియస్ గా చకచకా రాయడం మొదలుపెట్టారు.అలా చూస్తుంటే ఎంత బుద్ధిమంతులో కదా! అని భలే సంతోషంగా అనిపించింది.
అలా రాసుకొని వచ్చి చదివిన వారందరికీ ఒకరి తర్వాత మరొకరికి బహుమతిగా ఇస్తూ అందరికీ పంచేస్తూ….
దూరంగా కూర్చుని చూస్తున్న బుజ్జి కన్నమ్మకు కూడా ఇస్తానని ఎంత పిలిచినా ఉఁహూఁ రానని తల అడ్డంగా ఊపుతూ అక్కడే ఉండి పోయింది. దగ్గరకు వెళ్లి ఇచ్చినా తీసుకోవడానికి ఇష్టపడలేదు. “అబ్బో మొండి ఘటమే” అనుకున్నాను.
***
మరుసటి రోజు రిజిస్టర్ లో పేర్లు చదివి హాజరేసిన తర్వాత దానిని ఆఫీస్ రూమ్ లో పెట్టిరమ్మని అన్నాను.అంతే అవకాశమెక్కడ చేజారి పోతుందేమోనని తూనీగలా ఉరికొచ్చి ”నేను పెట్టొస్తా టీచర్!”అంది. నాకు అంతులేని ఆనందం. మౌనం మాట్లాడిందని.వెండి ముత్యాలు రాల్చిందనీ.
ఇక ఆ అవకాశం తనకు ఇచ్చినందుకు చూడాలి ఆ బుజ్జి కన్నమ్మ మోములో చెప్పలేని సంతోషం. మనసులో అది చాలు అనుకున్నాను.
ఇక చేతికి ఇవ్వగానే మిగతా పిల్లలు చేతుల్లోంచి లాక్కుంటారేమో నని దానిని గుండెలకు హత్తుకుని చెప్పిన చోట పెట్టి వచ్చింది.
రాగానే పాపిన్ ఇచ్చాను.వద్దనకుండా తీసుకుంది. ఆ బుజ్జి తల్లి ఆయాచితంగా ఏదీ తీసుకోదని అర్థమైంది.
ఇలా ఆ బుజ్జి కన్నమ్మ నాకు చేరువైంది. ఇంకో ముచ్చట గూడా ఇక్కడ చెప్పుకోవాలి. నేను ఓ పాట పాడినప్పుడల్లా ఆ చిట్టి తల్లి చెక్కిళ్ళు సిగ్గుల గులాబీలు అయ్యేవి. ఇంతకీ ఆ పాట ఏమిటో చెప్పలేదు కదూ! “వెన్నెల వెన్నెల వెన్నేల వెన్నేలమ్మ వెన్నెల.”
ఇప్పుడు తెలిసిపోయుంటుంది ఆ బుజ్జి కన్నమ్మ పేరు ఏమిటో తెలుసా?”వెన్నెల”.
ఈ పాట పిల్లలకు నేర్పేటప్పుడు చూడాలి. వెన్నెల ముఖారవిందంలో వేయి మతాబుల కాంతి.జాబిలి వెలుగుల సోయగం.చందమామ ప్రసరించే వెన్నెల ఎలా నవ్వుతుందో తెలియదు గానీ మా వెన్నెల నవ్వడం చూశాను.ఆ నవ్వులో ఆత్మ విశ్వాస ముత్యాలు రాలడం చూశాను.
మొదట్లో వాళ్ళమ్మ చెప్పినట్లు ఉండే బిడియస్తురాలు,అంతర్ముఖి అయిన ఆ బుజ్జి కన్నమ్మ తర్వాత తర్వాత గలగలపారే సెలయేరు అయ్యింది. అంతే కాదు తరగతిలో తానే లీడర్. పాఠాలు రాని తన వారికి తానో బుజ్జి టీచరమ్మగా మారడం చూస్తుంటే తనను నేను ఎంతగా ప్రభావితం చేసానో తలచుకుంటే మనసు ఆనంద సంద్రమయ్యేది.