సతీదేవి, దక్షయజ్ఞంలో తనువునర్పిస్తే, ఆమె మృతదేహాన్ని భుజాన వేసుకున్న శివుని కోపాగ్ని, ప్రమథ గణాలు విళయాన్ని సృష్టిస్తుంటే, దానినాపడానికి విష్ణువు సతీదేవి శరీరాన్ని ఖండాలుగా నరికాడని ఆ ఖండాలు వివిధ ప్రాంతాలలో పడి శక్తి పీఠాలుగా మారాయని మనందరికీ తెలిసిందే! హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఐదు (నైనాదేవి, చింతాపూర్ణి, జ్వాలాముఖి, వజ్రేశ్వరి మాత, చాముండా దేవి) శక్తి పీఠాలలో మూడింటి గురించి ఈ వ్యాసంలో దర్శిద్దాం
నైనాదేవి శక్తిపీఠం:
ఇది హిమాచల్ ప్రదేశ్ లోని భిలాస్ పూర్ జిల్లాలో ఉంటుంది. నైనాదేవి ఆలయం కొండపైన ఉంటుంది. ఆ ఘాట్ రోడ్డులో బస్సు వెళ్తుంటే అందమైన దృశ్యాలు మనలను సమ్మోహితులను చేస్తుంటాయి. రెప్పకూడా వాల్చకుండా ప్రకృతిని చూస్తూనే ఉండాలనిపిస్తుంటుంది. అందులో మేమెళ్లిన రోజు వర్షం కూడా పడుతుందేమో! బస్సు వెళుతుంటే ఒక ప్రక్క కొండ, ఇంకొక ప్రక్క లోయ. అంతా దట్టమైన అడవి. లోయలో మబ్బులలా, అలా ఆకుపచ్చని వృక్షాల నడుమ కదులుతూ… ఎంత చూసినా తనివి తీరదు. అయ్యో! ఈ దృశ్యాన్ని దాటిపోయాం అనుకుంటే, మరొక దృశ్యం మనల్ని అలరించడానికి సిద్ధంగా ఉంటుంది. అలా ప్రకృతి అందాలను చూస్తూ, పులకించిపోతూ నైనాదేవి ఆలయమున్న కొండ దిగువ ప్రాంతానికి చేరుకున్నాం.
బస్సు దిగగానే అలలుగా పొగమంచు మన ముఖాలను తాకుతుంటే, ఎంత హాయిగా ఉందో! బస్సు దిగిన ప్రాంతం నుండి చుట్టూ చూస్తుంటే కొండలు, లోయలు, కనుచూపుమేరా పచ్చని వనాలు, అక్కడి నుండి కదలాలనిపించదు. అక్కడనుండి జీపులుంటాయి. రాను పోను 60 రూపాయలు తీసుకున్నారు. జీపులో కొంత దూరం వెళ్తే ఊరు వస్తుంది. ఒక ప్రక్కగా మెట్ల మార్గముంటుంది. పూర్తి పాలరాతి మెట్లు. ఆలయం వరకు వెళ్లడానికి కేబుల్ కారు కూడా ఉంది. మెట్లకు ఇరుప్రక్కలా దుకాణాలున్నాయి.
ఇక్కడ సతీదేవి నయనాలు పడ్డాయని ప్రతీతి. ఇక్కడ అమ్మవారు పిండి (రాయి) రూపంలో ఉంటారు. ప్రస్ఫుటంగా కనిపించేలా ఆ పిండికి బంగారు కన్నులతో అలంకరిస్తారు. ఈ పిండికి ఎడమవైపున నలుపురంగులో ఉన్న గణేశుడు, కుడివైపున సర్వాలంకార శోభితురాలైన అమ్మవారి ప్రతిమ ఉంటాయి.
ఆలయ ప్రాంగణానికి చేరుకోగానే పెద్ద రావిచెట్టు కనిపిస్తుంది. రావిచెట్టు నిండా తోరణాలు కట్టి ఉన్నాయి. అమ్మవారి ఆలయం ప్రక్కన శివమందిరం, ఆ ప్రక్కన హోమగుండం ఉంటుంది. ఒక ప్రక్కగా భైరవనాధ్ మూర్తి, ఆంజనేయస్వామి, గణేశుడి ఆలయాలున్నాయి. చక్కగా దర్శనం చేసుకున్నాం.
మేము మెట్లు ఎక్కుతుండగానే పెద్ద వర్షం… వర్షంలో తడుస్తూనే దర్శనాలు చేసుకున్నాం. అక్కడనుండి చింతాపూర్ణి ఆలయముండే నంగల్ అనే ఊరు చేరుకొని రాత్రికక్కడ బస చేశాం.
*
మరుసటి రోజు తెల్లవారి ఏడున్నరకే ఆలయానికి బయలుదేరాం.
చింతాపూర్ణి శక్తిపీఠం:
చింతాపూర్ణినే, చినమస్థకాదేవి అని కూడా అంటారు. ఇక్కడ సతీదేవి పాదాలు పడ్డాయి. మార్కండేయ పురాణం ప్రకారం, చండీమాత రాక్షసులను సంహరించాక, జయ విజయ అనే ఇద్దరు యోగినిలకు ఇంకా రక్తతృష్ణ తీరకపోతే, తన శిరస్సునే ఖండించి, ఒక చేతితో ఆ శిరస్సును పట్టుకుంటే, దాని నుండి వచ్చే రక్తధారలను, చండి, జయ,విజయలు త్రాగుతున్నట్టుగా మనకక్కడ చిత్రం కనిపిస్తుంది.
ఇక్కడ కూడా అమ్మవారు పిండిరూపంలోనే ఉంటారు. పసుపు కుంకుమలతోనే అలంకృతులై ఉన్నారు. ఆ పసుపు కుంకుమల మధ్య అమ్మవారి నయనాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అక్కడున్న సెక్యూరిటీ గార్డునడిగి ఫోటోకూడా తీసుకున్నాం. రద్దీ లేదు కనుక, చక్కటి దర్శనమయింది. ఆలయ మందిర ప్రధాన ద్వారానికి ఇరువైపుల, కుడిచేతి వైపు భైరవుడు, ఎడమచేతి వైపు ఆంజనేయస్వామి ఉన్నారు. మందిరంలోకి వెళ్ళగానే గణేషుని ప్రతిమ ఉంది.
అమ్మవారి దర్శనం చేసుకుని బయటికి రాగానే శివాలయముంది. ప్రక్కగా ఉన్న రావిచెట్టుకు మొక్కుకొని, ఎరుపురంగు వస్త్రాలు కడుతున్నారు. ఆ ప్రక్కనే ఉన్న హాలులో, అమ్మవారు పట్టినవారికి పూజలు చేస్తున్నారు.
ఆలయం నుండి కిందకు చూస్తే, పచ్చని చెట్లతో మరీమరీ చూడాలనిపించేంత అందంగా ఉంది ప్రకృతి. కొద్దిగా వర్షం పడిందేమో, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. ఆకాశం నిర్మలంగా తెలిమబ్బులతో కూడి ఉంది.
మేమున్న హోటల్ నుండి, ఆలయానికి వెళ్లడానికి క్యాబ్ కు మనిషికి అరవై రూపాయలు తీసుకున్నారు. క్యాబ్ దిగాక మెట్లెక్కాలి. ఆ మెట్లు మరీ స్టీప్ గా లేవు. ఇక్కడకూడా మెట్లు పాలరాతితోనే వేశారు. మెట్ల కిరువైపులా దుకాణాలున్నాయి. ఆ మరుసటి రోజు జ్వాలాముఖికి (కాంగ్రా జిల్లా) బయలుదేరాం. బస్సులో మూడు గంటలు పట్టింది.
జ్వాలాముఖి:
అష్టాదశ శక్తి పీఠాలలో అతి ముఖ్యమైనది. ఇక్కడ సతీదేవి నాలుక పడింది. ఇక్కడ మనకు అమ్మవారి ప్రతిమేమీ ఉండదు. ఆలయం మూలల నుండి అగ్ని జ్వాలలు కనిపిస్తూ ఉంటాయి. తొమ్మిది జ్వాలలు కనిపిస్తాయి. ఆ తొమ్మిదీ నవదుర్గల్ని సూచిస్తాయి (జ్వాలాముఖి, అన్నపూర్ణ, వింధ్యవాసిని, చండీదేవి, మహాలక్ష్మి, హింజలాదేవి, సరస్వతి, అంబిక, అంజి). జ్వాలలనలా చూస్తుంటే మనసు ఒకింత ఉద్విగ్నంగా అనిపిస్తుంది. జ్వాలలెలా కనిపిస్తాయా, ఏమిటా అని కాస్త గందరగోళంతో ఆలయంలోకి ప్రవేశిస్తాం గాని, వెళ్లాక వాటిని చూస్తూ అలా ఉండిపోతాం.
అమ్మవారి ఆలయానికి మెట్లెక్కి వెళ్లాలి. 200-300 మీటర్ల దూరం ఉందనిపించింది. ఇక్కడ కూడా త్రోవకిరువైపులా దుకాణాలున్నాయి.
ఇక్కడ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంది. దక్షిణాదిలో ఉన్నట్లు ఆలయాలు గోపురాలతో ఉండవిక్కడ. మందిరంలా ఉంటాయి. ఇక్కడ క్యూ కొంచెం పెద్దగానే ఉంది. క్యూలైనులో వెళ్తుంటే మనకు జ్వాలలు కనిపిస్తాయి. ప్రధాన ఆలయ మందిరంలోనే ఐదు జ్వాలలు కనిపించాయి. ఆ మందిరం మధ్యలో ఒక గొయ్యిలా ఉంది. అందులో ఒక జ్వాల. అదే అసలు జ్వాలాముఖి. ఆ గొయ్యికి ఎదురుగా ఉన్న గోడలో, బంగారు తాపడంతో చిన్న మందిరముంది. అందులో ఒక జ్వాల కనిపిస్తుంది. ఇంకా ఆ గోడలోనే మరో మూడు జ్వాలలు కనిపిస్తున్నాయి.
వాటిని దర్శించుకుని బయటికి వస్తే, మందిరం వెనకవైపు గోపురం పక్కనుండి మెట్లపైకి వెళ్తే అక్కడ చిన్న శివాలయముంది. అక్కడ రెండు జ్వాలలు, ఒకటి పెద్దది, ఇంకొకటి చిన్నది. ఆ ప్రక్కనున్న మందిరంలో అమ్మవారి మూర్తి ఉంది. మనం పైకెక్కే మెట్ల దారి ఒకటి. క్రిందకు దిగే మార్గమొకటి. క్రిందకు దిగి వస్తున్నప్పుడు, ఇరుకుగా ఉన్న మెట్ల మధ్యలో చిన్న నీటి కుండముంది. అక్కడ నీళ్లు మరుగుతున్న శబ్దం కూడా వినిపిస్తుంది. ఈ నీటి కుండానికి ఇరుప్రక్కల రెండు జ్వాలలున్నాయి. ఆ ప్రక్కనే ఇంకొక జ్వాల ఉంది. కాని, మనకది కనిపించకుండా రాయిని అడ్డం పెట్టి, డబ్బులిచ్చిన వాళ్ళకి, ఆ రాయిని ప్రక్కకు జరిపి అక్కడ లైట్ ని ఆఫ్ చేసి, చిన్న దీపాన్ని అక్కడికి తెస్తే, ఆ జ్వాల ఒక్కసారి పెద్దదవడం చూపిస్తున్నారు.
శాస్త్రీయంగా చూస్తే, ఆక్సిజనుతో కలిసి మండే వాయువులు కొండరాళ్ల మధ్య నుండి వెలువడుతూ అలా కనిపిస్తున్నాయని… గాని సంవత్సరాలుగా అలాగే ఉండడమనేది సాధ్యమా? మండే గుణమున్న వాయువులు ఉన్నప్పుడు, ఎన్ని ప్రకృతి వైపరీత్యాలైనా జరగవచ్చు. అటువంటిదేమీ లేకుండా ఏళ్ల తరబడి అలాగే ఉందంటే… అదెలా సాధ్యమో, మీ ఆలోచనకే విడిచిపెడుతున్నాను.
ఆలయం ముందు విశాలమైన ప్రాంగణం. ఫోటోలు తీసుకోవడానికి అనువుగా ఉంది. అక్కడ నుండి దూరంగా, ఇంకా ఎత్తైన కొండలమీద తారామతి ఆలయం కనిపిస్తుంది. ఎత్తయిన కొండలు, పచ్చని వృక్షాలు, ప్రకృతి ఎంత అందంగా కనిపిస్తుందో!
ఆలయానికి వెలుపల ఉన్న మంటపంలో, నేపాల్ రాజు బహుమతిగా ఇచ్చిన కంచుగంట ఉంటుంది. అలాగే అక్బర్ పరిపాలించిన కాలంలో ఈ జ్వాలలను ఆర్పడానికి శత ప్రయత్నం చేసి, విఫలుడై, చివరకు అమ్మవారికి దాసోహమై బంగారు ఛత్రాన్ని బహుమతిగా ఇస్తే, అమ్మవారు అతను చేసిన అపరాధాన్ని క్షమించని కారణంగా, ఆ చత్రం క్రిందపడి నల్లటిరంగులో మారిందట. ఆ ఛత్రం కూడా మనకక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడున్న ఆ ఛత్రం ఏ లోహంతో నిర్మితమైందో కూడా చెప్పలేకపోతున్నారట శాస్త్రజ్ఞులు. ఈ వివరాలకు సంబంధించిన శాసనాలక్కడ కనిపించాయి.
*
మరుసటి రోజు తారామతి, భైరవనాధ్ ఆలయాలకు బయలుదేరాం. ఆటో ఆలయాల వరకు వెళ్తుంది. జ్వాలాముఖి మందిరాన్ని బైపాస్ చేసి ఆ రోడ్డుంటుంది. ఆ రోడ్డుపై నుండి వెళ్తూ ఎత్తు నుండి చూస్తుంటే, మనకు జ్వాలాముఖి ఆలయం చాలా అందంగా కనిపిస్తుంది.
రాత్రంతా వర్షం పడింది. మేము వెళ్తున్నప్పుడు చిరుజల్లులు. ప్రకృతి ఎంతందంగా ఉందంటే చెప్పలేనంత! చుట్టూ కొండలు, దట్టమైన చెట్లతో కూడి. అదంతా అటవీ ప్రాంతం. కొండలను పలకరిస్తూ, మేఘాలు క్రిందకి దిగుతున్నాయి. పచ్చని వృక్షాల మధ్య, తేలుతూ తెలిమబ్బులు… అలా అలా సాగుతూ, అటు అమ్మవారి దర్శనం… ఇటు ప్రకృతి సందర్శనం… జన్మ ధన్యమే ధన్యం.
ముందు భైరవనాధుని ఆలయం వస్తుంది. ఆలయమంటే ఏమిటో అనుకునేరు! పైన స్లాబ్ ఉంటుంది. అక్కడున్న పెద్ద రాతిమీద భైరవనాధుని మూర్తి ఉంటుంది. ఎవరూ లేరక్కడ. పంతులు గార్లకేమో, ఒకటి రెండు గదులున్నాయి.
అక్కడ నుండి వ్యూ పాయింట్ అద్భుతం. క్రిందకు చూస్తే జ్వాలాముఖి ఆలయ మందిరాలు. గులాబీ రంగులో, పచ్చనిచెట్ల మధ్య మెరిసిపోతూ… పైకి చూస్తే తారామతి దేవాలయం.
తారామతి ఆలయం వరకు వెళ్తుంది ఆటో. తారామతి తాంత్రిక విద్యలకు ప్రసిద్ధం. అందుకని భయంగానే లోపలికెళ్ళాం, అమ్మవారి మూర్తి ఎలా ఉంటుందోనని! గాని, ఇక్కడ చూస్తే తారామతి అమ్మవారు, చక్కటి చిరు దరహాసంతో మనల్ని పలకరిస్తారు. చూడగానే మై మరిచిపోతాం. నాలుగు చేతుల్లో గండ్రగొడ్డలి, పాశం, పద్మం, పానపాత్ర ఉంటాయి. అమ్మవారిది రాగి మూర్తి. అమ్మవారి పాదం క్రింద పరమశివుడు. శివుని పక్కన నాగాభరణాలు, త్రిశూలం చక్కగా చెక్కి ఉన్నాయి.
ప్రధాన మందిరం మధ్యలో, ఆరడుగుల ఎత్తులో, గుండ్రంగా ఉన్న చిన్న మందిరంలో అమ్మవారుంటారు. ఆ మందిరం ద్వారం, ప్రధాన ద్వారానికి ఎదురుగా కాక ఒక ప్రక్కగా ఉంటుంది. ఈ చిన్న మందిరానికి వెనుక అన్నపూర్ణాదేవి, తారకనాథ్ శివలింగం ఉన్నాయి. ప్రధాన ద్వారానికి ఎదురుగా నవగ్రహాలు, హోమగుండం ఉన్నాయి.
నవగ్రహ మందిరం రెండు ప్రాకారాలలో ఉంటుంది. అంటే, మధ్యలో నవగ్రహాలుంటే, ఆ నవగ్రహ మందిరం చుట్టూ మరల నవగ్రహాలున్నాయి. దాని పక్కన ఉన్న మందిరంలో హోమగుండం, అందులో జ్వాలామాత మూర్తి ఉన్నాయి
ప్రధాన మందిరం ముందు భాగంనుండి క్రిందకు చూస్తే, దట్టమైన చెట్ల మధ్య నుండి జ్వాలాముఖి ఆలయం, ఆ క్రిందుగా భవన నిర్మితమైన ఊరు కనిపిస్తున్నాయి. వెనక నుండి చూస్తే దట్టమైన అడవులతో కూడుకున్న కొండలు, కొండల మధ్య నుండి క్రిందకి దుముకుతున్న సెలయేరు, ఇంకో ప్రక్క నుండి చూస్తే, ఆకాశమంత అలముకున్న నల్లటి మేఘాలు దర్శనమిస్తున్నాయి.
ప్రకృతిని, తారాదేవిని మనసుతీరా కన్నుల నింపుకొని మేము బస చేసిన గీతాభవన్ ధర్మశాల చేరుకున్నాం. ఈ మూడు శక్తి పీఠాలను విజయవంతంగా పూర్తి చేసుకుని, వజ్రేశ్వరి దేవి చాముండా దేవి ఆలయాలకు బయలుదేరాం. మరొక వ్యాసంలో వాటి గురించిన విశేషాలను చెప్పుకుందాం.