దక్షిణామూర్తి గారికి వేరే ఊరికి బదిలీ అవడం వల్ల రాగ మాలను అతని స్నేహితుడు ఇంట్లో ఉంచడానికి నిర్ణయించుకున్నారుఆ విషయం మోహన్ కి ఉత్తరంలో రాసింది రాగమాల. ఇద్దరూ కలిసి ఒకే బస్సు ఎక్కాలని అనుకుంటారు
ఆ తర్వాత కథ
ఆ తర్వాత స్టేజ్ లో బస్సు ఆగింది. ఆ బస్సు ఎక్కుతున్న అతనిని చూసి భయపడి పోయింది రాగమాల.
అతను ఎవరో కాదు రాగమాల మేనమామ. ‘ఆరోజు పెళ్లిలో మోహన్ ను అదోరకంగా చూశాడు. ఇప్పుడు ఇద్దరినీ ఒక్క చోట చూశాడంటే ఏం జరుగుతుందో తెలియదు’ అనుకున్నది రాగమాల.
“మోహన్ వెనక్కి వెళ్లి నిలబడు. మా మామ బస్సు ఎక్కాడు. అదిగో వచ్చేది అతనే”అని మెల్లగా చెప్పింది రాగమాల.
మెల్లగా మోహన్ వెనుక వైపుకు వెళ్ళిపోయాడు. రాగ మాల మామ మోహన్ ని చూసాడో లేదో తెలియదు.కానీ ఆయన మాములుగానే ఉన్నాడు .
“సెలవులు అయిపోయాయా? కాలేజీ కోసం వెళ్తున్నావా?”అన్నాడు రాగమాల మామ.
“అవును మామ! ఎల్లుండి నుండి కాలేజీ స్టార్ట్ అవుతుంది. ఈసారి మన ఇల్లు ఖాళీ చేశాము కదా! నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉండమన్నారు. అక్కడికే వెళ్తున్నాను”అని చెప్పింది రాగమాల.
టౌన్ వచ్చాక బస్సు దిగి, రాగమాల బయట మోహన్ కోసం ఎదురు చూస్తూ నిల బడ్డది. మోహన్ వచ్చి రాగ మాలను కలుసుకొని..
“ఇద్దరం కలిసి వెళ్దామా? మీ ఇంటి వరకు వస్తాను”అని అడిగాడు మోహన్.
“ఇల్లు ఎక్కడుంది ఇప్పుడు? నేను వెళ్ళేది నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి కదా! వాళ్ళందరూ పరిచయమే!కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు . ఎల్లుండి కాలేజీకి వెళ్లేటప్పుడు నిన్ను కలుస్తాను.నేను కరెక్ట్ గ పదకొండు గంటలకి స్టార్ట్ అవుతాను”అని చెప్పింది రాగ మాల.
“అదంతా సరే, వాళ్ళిల్లు నాకు తెలియాలి కదా! ఎక్కడ నీ కోసం నిలబడాలి?” అన్నాడు మోహన్.
“నువ్వు నాకు కొంచెం దూరంగా నాతో రా! దూరం నుండి ఇల్లు చూసి వెళ్ళిపో” అని చెప్పింది రాగ మాల.
బయలుదేరే ముందు..
“ఆగు, నీకు ఒకటి ఇవ్వాలి” అంటూ ఒక పెయింటింగ్ వేసిన కవర్ మరియు ఉత్తరం ఇచ్చాడు.
“ఇంటి కెళ్ళాక చూసి రేపు ఉత్తరంలో ఎలా ఉందో రాయి”అన్నాడు మోహన్.
“ఇదిగో నా ఉత్తరం” అంటూ ఒక పెద్ద మడత పెట్టిన ఉత్తరం కట్ట తీసి ఇచ్చింది.
“కాస్త తృప్తిగా చదువుకోవచ్చు.పెద్ద ఊతరం రాసావు” అన్నాడు మోహన్ నవ్వుతూ.
అలా రాగ మాలతో వెళ్లి, తాను ఉండే ఇల్లు చూసి వెళ్ళిపోయాడు మోహన్.
బంధువుల ఇంట్లోకి బెరుకుగా అడుగు పెట్టింది రాగ మాల.
ఊహించినంత భయం లేదని అర్థం అయ్యింది రాగ మాలకు.
దక్షిణా మూర్తి గారి స్నేహితుడు,అతని భార్య, ముగ్గురు ఆడ పిల్లలలో ఒకమ్మాయి పెళ్లి చేసుకుని అత్తవారింట్లో ఉంది.ఒక అబ్బాయి. అందరూ చక్కగా పలకరించారు.
అందరూ తనకన్నా చిన్న వారే!కాబట్టి వాళ్ళు అక్కా అని పిలిచారు. తన పుస్తకాలు బట్టలు సర్దుకుని హాల్లో కి వచ్చి కూర్చుంది.
వాళ్ళింట్లో కొన్ని ఖచ్చితమైన అలవాట్లు ఉన్నాయి.అవే కొంచెం ఇబ్బంది పెట్టాయి రాగ మాలను.
ఉదయం ఐదు గంటలకు లేవాలి.అందరూ కలిసి పూజ దగ్గర కూర్చుంటారు. దక్షిణ మూర్తి స్నేహితుడు కిషన్ రావు గారు,భార్య సుమిత్ర .వాళ్ళని అత్తయ్య,మామయ్య అని పిలిచింది రాగ మాల.
అతను పూజ చేస్తుంటే అక్కడ సుమిత్ర వంట చేసేది.అందరూ కలిసి భోజనం చేయాలి.రాగ మాలకు పదకొండు గంటలకి కాలేజ్ .కానీ ఉదయం తొమ్మిది గంటలకి కంచాల్లో అన్నం వడ్డించి పిలిచేది సుమిత్ర. ఆ సమయంలో తినాలని లేకున్నా, ఆ ఇంటి పద్ధతి కోసం తినడం అలవాటు చేసుకుంది.సాయంత్రం కూడా అంతే. ఒకేసారి భోజనాలు కావాలి. ముందు గదిలో పిల్లల పడకలు,చదువు.
కొన్ని పనిష్మెంట్ లు కూడా ఉండేవి. ఆలస్యంగా నిద్ర లేస్తే ,అందరూ కప్పుకునే దుప్పట్లు మడత వేయాలి.ఆలస్యంగా తింటే వంటిల్లు ఒక్కరే శుభ్రం చేయాలి.
“ఇదేం సిస్టం బాబు” అనుకున్నది రాగ మాల.
రాగ మాలకి ఆ ఇంట్లో పద్ధతులు ఇంకా తెలియవు. ఇంట్లో అయితే ఏడు గంటలకు లేస్తుంది. ముందు గదిలో అలాగే పడుకొని ఉంది రాగమాల .
వాళ్ళింట్లో చిన్న అమ్మాయి పేరు త్రిష. ఐదవ తరగతి చదువుతుంది. చాలా పొట్టిగా ఉండేది. దాని హైట్ కి, దాని మాటలకు సంబంధం ఉండేది కాదు. తప్పించు కోవడంలో నెంబర్ వన్. ఆ ఇంట్లో ఉన్న పద్ధతులను ఎలా బ్రేక్ చేయాలి అని నిరంతరం అన్వేషణలో ఉండేది.
మెల్లిగా రాగమాల దగ్గరికి వచ్చింది త్రిష.
“అక్క! నువ్వు తొందరగా లేవ కుంటే బట్టలన్నీ నీతో మడత వేయిస్తారు. నువ్వు కొత్త కాబట్టి ఈరోజు నీకు చెప్ప రేమో! ఆ పనిష్మెంట్ నాకు రోజూ పడుతుంది”అన్నది త్రిష రాగ మాలను లేపుతూ..
ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది . ఎక్కడుందో తెలియడానికి క్షణం పట్టింది రాగ మాలకి.
“ఏంటి త్రిషా! ఏం చెప్పావు నాకు అర్థం కాలేదు”అన్నది నిద్ర మత్తులో.
“ఇక్కడ అందరూ ఆరు గంటల లోపల లేవాలి. ఆలస్యంగా లేస్తే ఈ బట్టలన్నీ సర్దే సేయ్యాలి”అని ఎవరూ వినకుండా చెవి దగ్గర చెప్పింది త్రిష.
“ఓ, అవునా సరే లేస్తాను”అని నిద్రలేచి పెరట్లోకి వెళ్తూ, వంటింట్లోకి చూసింది. అప్పటికే కిషన్ రావు గారు పూజ దగ్గర కూర్చున్నారు. చుట్టూ కొడుకు రాజు మరో కూతురు వీణ కూర్చున్నారు. త్రిష ఏవీ తెలియనట్లుగా మెల్లగా వచ్చి కూర్చుంది. కళ్ళ తోటి వాళ్ళ నాన్న అడిగాడు. “ఎక్కడికి వెళ్లావని”, తల అడ్డంగా ఊపి కూర్చుంది త్రిష.
వీణ మాత్రం తండ్రి మాటలు తూచా తప్పకుండా పాటిస్తుంది. చాలా విధేయతగల అమ్మాయి. కొడుకు మాత్రం పక్కా మాస్. సిన్సియర్‌గా ఉన్నట్లు నటిస్తాడు. చదువు మీద కూడా అంత శ్రద్ధ ఉండదు.
ఇక పెరట్లోకి వెళ్లి ,నిత్య కృత్యాలు తీర్చుకొని వచ్చింది రాగమాల. అప్పటికే పూజ, వంట అయిపోయింది.
“రామ్మా! రాగమాల! ఇదిగో టీ తాగు అంటూ ఒక కప్పులో చాయ్
పోసి ఇచ్చింది సుమిత్ర .
“సారీ ,అత్తయ్య! లేవడం లేట్ అయింది. ఇంత తొందరగా అందరు లేస్తారని నాకు తెలియదు”అన్నది రాగ మాల.
“అవునమ్మా! అందరికీ తొందరగా లేవడమే అలవాటు. రేపటి నుండి నువ్వు కూడా అలవాటు చేసుకో”అని చెప్పింది. మృదువుగా చెప్పినట్లు ఉంది. కాని ఇది రూల్ అన్నట్లుగా ఉంది.
అక్కడ మోహన్ వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరూ రాలేదు. మోహన్ స్నానం చేసుకుని, అన్నం ఒకటి వండుకొని ,ఆవకాయ వేసుకుని ,తినేసి కాలేజీకి రెడీ అయ్యి కొంచెం ముందుగానే రాగమాల ఇంటికి కాస్త దూరంలో నిలబడ్డాడు.
అప్పటికే తయారై పోయిన రాగమాల ,ముందు గదిలో నుండి మోహన్ ను చూసింది. అప్పటికే ఇంట్లో పిల్లలు స్కూల్‌కు,కిషన్ రావు గారు ఆఫీస్ కి వెళ్ళిపోయారు.
రాగ మాల కూడా బుక్స్ తీసుకొని,
“కాలేజీకి వెళ్లి వస్తాను అత్తయ్య”అని చెప్పి కాలేజీకి బయలుదేరింది.
రాత్రి మోహన్ ఇచ్చిన పెయింటింగ్ చూసి ఉత్తరం రాసింది. పల్లెటూరి వాతావరణంలో ఒక అమ్మాయి ,ఒక అబ్బాయి ఉన్న చిత్రాన్ని ఎంతో అందంగా వేశాడు. మోహన్. అది చూసిన తర్వాత తనకు ఎలా అనిపించిందో ఆ భావాలను ఉత్తరంలో పొందుపరిచింది రాగ మాల.
ఇద్దరూ నడుస్తూ మాట్లాడు కోసాగారు.
“ఇలా లోపలి నుండి వేరే దారి ఉందా”? అని అడిగింది రాగ మాల.
“ఉంది .మేము ఇలాగే కదా ఇంటికి లంచ్ కి వెళ్తాము”అన్నాడు మోహన్.
“సరే, ఎవరైనా చూస్తే బాగుండదు .నేను వెళ్ళిపోతాను. నువ్వు వేరే దారిలో వెళ్ళు”అని చెప్పింది రాగమాల.
“నీకు దారి తెలియదు కదా! నువ్వు నీ ఫ్రెండ్ రమణి ఇంటికి వెళ్తావు కదా అక్కడి వరకు వస్తాను”అన్నాడు మోహన్ దారి చూపే సాకుతో.
“సరే ,ఇదిగో లెటర్ తీసుకో, నిజంగా పెయింటింగ్ చాలా బాగా వేశావు. నాకు కూడా బొమ్మలు వేయడం అలవాటు. కానీ ఒక్కటి కూడా దాచు కోలేదు”అంటూ లెటర్ ఇచ్చింది రాగ మాల.
మోహన్ కూడా తాను రాసిన ఉత్తరాన్ని రాగ మాలకి ఇచ్చాడు.
“నీ సైకిల్ ఏమైంది? నడుస్తూ వచ్చావు? సైకిల్ కూడా ముగ్గురు మూడు రోజులు తీసుకుని వెళ్తారా? షర్ట్ షేర్ చేసుకున్నట్లుగా?”అన్నది రాగ మాల వెక్కిరింపుగా..
“లేదు సైకిల్ కి ఒక కథ ఉంది. పదిహేను రోజుల క్రితం మా సైకిల్ పోయింది. ఏం చేయాలి అనీ అనుకుంటుంటే, మా ఫ్రెండ్ చెప్పాడు.”సైకిల్ పోతే మరొకటి తీసుకోవాలి” అని, ఇలా అందరూ వాళ్ళ సైకిళ్ళు పోతే వేరేవి తీసుకున్నారు. అంటే చివరగా ఒక్కరి సైకిల్ మాత్రమే పోయిందన్నట్లు. ఇప్పుడు ఆ సైకిల్ తీసుకొస్తే దాని ఓనర్ తీసుకెళ్లి పోతాడు. అందుకే ఇక సైకిలు ఇక్కడ వాడ దల్చుకోలేదు”అన్నాడు మోహన్.
ఆశ్చర్య పోయింది రాగమాల.
“అదేంటి వేరే వాళ్ళ సైకిల్ తీసుకుంటే అది దొంగతనం అవుతుంది కదా!’ అన్నది రాగ మాల.
“దొంగతనం ఎందుకు అవుతుంది? మా సైకిల్ పోయింది కదా!”అన్నాడు మోహన్
ఈ లాజిక్ అర్థం కాలేదు రాగ మాలకు. అలాగే అయోమయంగా చూసి ,మగ పిల్లలు ఇలాగే ఉంటారేమో! అని అనుకుంది.
మోహన్ రమణి వాళ్ళ ఇంటి వరకు వచ్చి, అక్కడి నుండి వేరే దారిలో కాలేజీకి వెళ్లిపోయాడు.
రమణి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది రాగమాల. అప్పటికి ఇంకా రమణి తయారు కాలేదు.
“హాయ్ హాయ్! రాగా! ఎప్పుడొచ్చావ్? ఇవాళ కాలేజ్ కి రావేమో! అనుకున్నాను. నేను బట్టలు మార్చుకొని వస్తాను, కూర్చో”అన్నది రమణి.
“మొన్న నైట్ వచ్చాను. మకాం మారింది కదా కొంచెం సర్దు కుందామని ముందే వచ్చాను,”అన్నది రాగమాల.
“ఎలా ఉంది వాళ్ళింట్లో”? అని అడిగింది రమణి..
“చెప్తా గానీ, నువ్వ రెడీ అవ్వు. వెళ్లే దారిలో చెప్తా” అన్నది రాగమాల అక్కడ ఉన్న న్యూస్ పేపర్ చూస్తూ..
మోహన్ కాలేజ్ కి వెళ్ళాడు. అతని స్నేహితుడైన సురేందర్ ను కలిశాడు. అతను మంచి గాయకుడు. ఆ కాలేజీ లో చాల మంది టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు.
సురేందర్ తో కలిసి క్యాంటీన్ కి వెళ్ళాడు మోహన్.
“ఏంట్రా! ఈ మధ్య తప్పించుకుని తిరుగుతున్నావు? అసలు నాకు టైం ఇవ్వడం లేదు? రాగ మాలనే కారణమా?” అన్నాడు.
“అదేం లేదురా! కొంచెం పనులు.మా ఇంట్లో ఎంత మంది ఉంటారో తెలుసు కదా!” అన్నాడు మోహన్.
“ఒరేయ్ దాచకురా! ఇప్పటికే చాలా మందికి తెలిసింది. నాక్కూడా చెప్పవా?” అన్నాడు సురేందర్.
“చెప్తా! కానీ ఇప్పుడు కాదు.సాయంత్రం మా ఇంటికి రా! ఒక్కడినే ఉన్నా”అని చెప్పి ఇద్దరు చాయ్ తాగి క్లాస్ కి వెళ్ళారు.
“ఇప్పుడు చెప్పవే! కొత్త వాళ్ళ ఇంట్లో నీకు ఎలా ఉంది! అందరూ బాగానే మాట్లాడుతున్నారా”? అని అడిగింది రమణి కాలేజీకి వెళ్తుంటే దారిలో.
“అందరూ బాగానే మాట్లాడారు. కానీ కొన్ని పద్ధతులు ఉన్నాయి వాళ్ళింట్లో. అవి తూచా తప్పకుండా పాటించాలట. తెలుసుగా, నేనేమో స్వేచ్చా జీవిని. మా ఇంట్లో నా ఇష్టం ఉన్నట్లుగా నేను ప్రవర్తించడానికి నాకు ఎవ్వరూ అడ్డు చెప్పలేదు. ఇక్కడ నా పద్ధతులు కొన్ని మార్చు కోవాలేమో”అన్నది రాగం మాల..
“తప్పదు,కొన్ని మార్చుకోవాలి.అయినా మంచిదే కదా!
అన్నట్లు,నాకు ఒక విషయం తెలిసింది. నిజం చెప్తావా”? అన్నది రమణి.
“ఏ విషయం తెలిసింది”? అన్నది రాగమాల.
“నువ్వు లవ్ లో పడ్డావని, అతను కూడా మన కాలేజేనని కూడా తెలిసింది తల్లి”! అన్నది రమణి నవ్వుతూ..
“అంత లేదులే, ఈరోజుల్లో ఎవరితో మాట్లాడినా , ఇలాంటివి పుట్టిస్తారు”అన్నది రాగమాల కొంచెం కంగారుగా.
“అదేం కాదు. రుజువులతో సహా చూపించమంటే చూపిస్తాను. నువ్వే చెప్తావా లేక నన్ను చూపించ మంటావా”అన్నది రమణి బెదిరింపుగా.
“సరేలే, నీ దగ్గర దాచడం ఎందుకు? చెప్తాను. కానీ ఇప్పుడు కాదు”అన్నది రాగ మాల.
“నువ్వేం చెప్పొద్దు, నేనే చెప్తాను.పేరు చెప్పను.అతను ఎలా ఉంటాడంటే,పచ్చ పచ్చగా, ఎత్తు నీ అంత ఉంటాడు..ఆ…ఇంకా”.అంటుంటే రాగమాల..
“ఆపు..ఆపు నీకు విషయం తెలిసిందని నాకు అర్థమైంది. వివరంగా తర్వాత చెప్తాను. ఇప్పుడు కాలేజీకి నడువు”అన్నది రాగమాల చిరు కోపంగా.
క్లాసులు ఏం జరగలేదు. అప్పటికి చాలా రోజులకు కలుసు కున్నందువల్ల ఫ్రెండ్స్ అందరూ కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.
సాయంత్రం మోహన్ ఇంటికి సురేందర్ వెళ్లాడు.
” ఏం చేస్తున్నావ్ రా?”అంటూ లోపలికి వచ్చాడు సురేందర్.
కాళ్లు, చేతులు కడుక్కొని లోపలికి వస్తున్నాడు మోహన్.
“రా!రా! కూర్చో”అంటూ టవల్ తో తుడుచుకునీ, అద్దంలో చూసుకుంటూ, పౌడర్ వేసుకొని, తలను దువ్వి , ముందు జుట్టు వంకీలు తిప్పుకొని, అప్పుడు గాని మాట్లాడలేదు సురేందర్ తో మోహన్.
“ఒరేయ్! ఎంత సేపు తయారవుతావ్ రా? ఇంకా నీకు పిచ్చి తగ్గలేదు. ఊరికే కాళ్లు, చేతులు కడగటం, ఇల్లంతా నీళ్లు చల్లడం, ఎప్పుడు చూసినా పౌడర్ వేసుకోవడం, జుట్టులు వంకులు తిప్పుకోవడం. ఏంట్రా ఎప్పుడు చూసినా ఆడ పిల్లలా అద్దం ముందు ఉంటావు”అన్నాడు సురేందర్.
“మరొకటి మరిచావురా! నేను కను బొమ్మలను కూడా దువ్వి చివర్లు ఇలా తిప్పుతాను”అన్నాడు నవ్వుతూ..
“దీనికేం తక్కువ లేదు”అన్నాడు సురేందర్.
ఇల్లంతా అగర వత్తుల పరిమళం వ్యాపించి ఉంది. మోహన్ కి ఇల్లంతా సువాసనతో ఉండాలి. బట్టలు కూడా మంచి వాసనతో ఉండాలి. బట్టలు నలగకుండ ఫ్రెష్ గా ఉంచుకోవడం అలవాటు. ఎవరి ఇంటికైనా వెళ్తే వాళ్ళ ఇంట్లో శుభ్రంగా ఉంటేనే భోజనం చేస్తాడు. చారు మాత్రం ఎక్కడా పోసు కోడు. చారు చేసేటప్పుడు వాళ్లు చేతులుకడుగుతారో! లేదో! అని అనుమానం. ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ ఊరి కే వెక్కిరించేది.
“ఇప్పుడు అలా అంటావు. కానీ రేపు పెళ్లి అయ్యాక నీ భార్య ఎలా చేసినా చారు పోసుకుంటావు” అని అనేది.
ఇలా కొన్ని విషయాలు మోహన్ సురేందర్ కి చెప్పాడు.
“మాటలు మార్చింది చాలు కానీ, రాగమాల గురించి చెప్పు”అన్నాడు సురేందర్.
“ఏం చెప్పాలి? ఏం ఉందని చెప్పాలి?”అన్నాడు మోహన్.
“మీఇంట్లో కుక్కను కొట్టే కర్ర ఉందా? ఉంటే ఇవ్వు నిన్ను కుక్కని కొట్టినట్లు కొడతాను. చెప్తావా! కర్ర విరిగేలా కొట్ట మంటావా”? అన్నాడు సురేందర్ కుర్చీలో నుండి లేస్తూ..
“అంత హింస వద్దురా! చెప్తాను. అయినా నీకెందుకు అనుమానం వచ్చింది రా?”అన్నాడు మోహన్.
“ఆరోజు నువ్వు రాగ మాల వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్లావ్ గుర్తుందా?” అన్నాడు సురేందర్.
“అవును,గుర్తుంది.యితే?” అన్నాడు మోహన్..
ఆరోజు విషయం ఇద్దరు గుర్తు చేసుకున్నారు.
ఒకరోజు మోహన్ తో పాటు సురేందర్ రాగమాల వాళ్ళ ఇంటికి వచ్చాడు.
రాగమాల వాళ్ళమ్మ కు సంగీతం అంటే చాలా ఇష్టం. తాను పాటలు కూడా పాడుతారు. రాగమాల తల్లి వసుంధరను ఇంప్రెస్ చేయడానికి, మోహన్ సురేందర్ ని వాళ్ళింటికి తీసుకెళ్లాడు. రాగ మాలకు అతను క్లాస్మేట్ కాబట్టి, అతను పాటలు పాడతాడని తెలుసు. ఇంటికి వచ్చిన సురేందర్‌ని రాగమాల తల్లి వసుంధరకు పరిచయం చేసింది.
“అమ్మా! ఇతను మా క్లాస్మేట్. చాలా బాగా పాటలు పాడుతాడు”అని చెప్పింది రాగ మాల.
“అవునా బాబు. ఒక పాట పాడి వినిపించవా?”అని అడిగింది వసుంధర.
అతను ఆ రోజుల్లో ట్రెండింగులో ఉండే రెండు పాటలు ఎక్కువగా పాడేవాడు. “నాలుగు స్తంభాలాట” సినిమాలో” అంకితం నీకే అంకితం”అనే పాట, మరొక పాట ఆ సినిమాలోదే “చినుకులా రాలి వరదలా సాగి ఓ ప్రేమా! నా ప్రేమా”ఈ పాట ఎంతో అద్భుతంగా పాడేవాడు.
ఈరెండు పాటలు పాడి వినిపించి, మరొక భక్తి పాటను కూడా విడిపించాడు సురేందర్.
ఇద్దరు ఆవిషయం గుర్తు చేసుకున్న తర్వాత..
“అప్పుడు నేను గమనించాను? నువ్వు రాగమాల వాళ్ళ అమ్మగారిని ,ఇమ్ప్రెస్ చేయడానికి నన్ను తీసుకెళ్లావని నాకెందుకో అనిపించింది. ఆ తర్వాత మీ ఇద్దరి మాటల్లో కూడా నాకు కొంచెం అర్థమైంది” అన్నాడు సురేందర్.
“నిజమేరా! నాకు రాగ మాల అంటే చాలా ఇష్టం. తను ప్రవర్తన, అందరితో అతి లేకుండా ఎంతలో ఉండాలో అంతగా ఉండడం. కాలేజీలో కూడా సిన్సియర్‌గా ఉండటమే, కాకుండా ఎవరికైనా అవసరం వస్తే సహాయం చేసే తత్వం కూడా ఉంది. అయినా ఇవన్నీ నేను ఆలోచించలేదు. కానీ ఎందుకో తన స్నేహం ముందుగా నాకు నచ్చింది. ఆతర్వాత అది ప్రేమగా ఎప్పుడు మారిందో నాకు తెలియదు. కానీ భవిష్యత్తు ఏంటో అర్థం కావడం లేదు. పెళ్లి వరకు వెళ్తుందా? లేదా ?అనేది మాత్రం నాకు తెలియదు”అన్నాడు మోహన్ సురేందర్ తో
“తప్పురా! పెళ్లి వరకు వెళుతుందో ?లేదో? అని మాట్లాడకూడదు. తను మంచి కుటుంబం నుంచి వచ్చింది. ఇలా ప్రేమించుకున్న తర్వాత, పెళ్లి చేసు కోకుంటే తను జీవితంలో కోలుకోదు. అలాంటి పని మాత్రం చేయకు”అన్నాడు సురేందర్.
ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్న తర్వాత సురేందర్ వెళ్ళిపోయాడు.
ఇప్పుడు మోహన్ కి రాగ మాలను కలుసుకోవడానికి చాలా ఇబ్బందిగా అయింది. కొత్త వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటికి ఎలా వెళ్లాలి ?అని ఆలోచించసాగాడు.
ప్రేమించుకునే వాళ్ళకి బోలెడన్ని అవకాశాలు దొరుకుతాయి. దొరకడం కాదు వాళ్ళు సృష్టించుకుంటారేమో.
మళ్లీ ఇప్పుడు మోహన్ కి సూర్య వైపు దృష్టి మళ్ళింది.
సశేషం