జరిగిన కథ:
ప్రమీలాదేవి మహారాజుల శయ్యాగృహంలో పెట్టిన చిత్రపటాన్ని గాంచిన, విక్రమసింహుడు, ఆమె మనసునర్థం చేసుకొని యుద్ధానికి బయలుదేరుతాడు. యుద్ధం జరుగుతున్న సమయంలో, ఆగంతకులతో మహారాజున్నారని, అనంతుడు కీడుని శంకించినా, అనంతునికి ధైర్యం చెప్పి అంగరక్షకులుగా వారిని నియమిస్తాడు మహారాజు. తర్వాత వారితో మరి కొంతమంది చేరి, అనంతునికి రాబోయే ప్రమాదాన్ని అడ్డుకోవడమే కాకుండా, యుద్ధరంగంలో చేయూతనిస్తారు. తర్వాత వారు శిబిరాలలో లేరనే విషయం తెలియగా, మహారాజు కోసం శిబిరానికి వెళ్లిన అనంతుడికి మహారాజక్కడ కనిపించరు. అంతేకాదు, ఆ ఆగంతకులతోపాటు రహస్యంగా అర్ధరాత్రి శిబిరాన్ని విడిచి వెళ్లారని తెలియగానే, మహారాజుకు పొంచి ఉండే ముప్పునూహించి, కరవాలాన్ని చేతబూని ఆగంతకులను పట్టుకోవడానికి బయలుదేరుతాడు అనంతుడు.
అనంతుడు వారిని పట్టుకున్నాడా! మహారాజుకు ఏమైందో! తెలుసుకుందాం రండి…
అన్నిటికన్నా ముందు మహారాజుల వారికి క్షేమం ముఖ్యమని, శిబిరంలో చెయ్యవలసిన ఏర్పాట్లను సేనాధిపతులకు అప్పగించి, ఆ ఆగంతకులను పట్టుకోవడానికి, కరవాలాన్ని చేతబూని మహోగ్రంతో ముందుకు సాగాడనంతుడు. మహారాజ శిబిరం బయటకు అనంతుడు వెళ్లకముందే, మహారాజు ఎదురొచ్చారు.
“అనంతా! ఈ సమయంలో నువ్విక్కడ? ఏమైనది? ముఖమంతా స్వేద జలంతో నిండినదేమి? ఆ కోపమెందులకు? అర్ధరాత్రి ఎవరిపై కత్తి దూయబోతున్నావు?” అనంతుని మనఃస్థితి పూర్తిగా అవగతమైనా, ఏమీ తెలియనట్లు అడిగాడు విక్రమ సింహ.
మహారాజు వేస్తున్న యుద్ధతంత్రాన్ని తనతో పంచుకోకుండా తననింత ఆందోళనకు గురి చేసినందుకు, కినుక వచ్చినా మహారాజులకు ఏమీ కానందుకు, మిక్కిలి సంతోషించినవాడై, “ఏమీలేదు ప్రభూ! ఎందుకో మీ క్షేమం గురించి… “ అని మాట నాన్చేశాడు అనంతుడు.
“ఆ వీరులను అనుమానిస్తున్నావు కదా!” నవ్వుతూ సూటిగా అడిగిన మహారాజు మాటలకు, గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది అనంతునికి.
“యుద్ధాన్ని కొనసాగించాలా లేక లొంగిపోవాలా అన్న నిర్ణయాన్ని తీసుకోలేక సతమతమవుతున్నాడు శత్రువు. ఇక తొందరలో విజయలక్ష్మి మనలను వరిస్తుంది. అందుకే ఈ వీరుల అవసరం మనకిక్కడ లేదు. వారి కోరిక మేరకు, నేనే సెలవు ఇప్పించాను వారికి” అని సమాధానమిస్తూ,
“అనంతా! ఎప్పుడూ నా క్షేమం గురించి ఆలోచించే నీలాంటి స్నేహితుడు నా ప్రక్కన ఉండడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. నిన్ను సర్వ సేనాధిపతిగా పొందడం ఈ రాజ్యం చేసుకున్న అదృష్టం. ఇలారా” అని తన బాహువులలో బంధించాడు మహారాజు. మహారాజు మాటలు, చేతలు… అన్నీ చిత్రంగా తోస్తున్నాయి అనంతునికి. మహారాజు తన నుండి ఏదో దాస్తున్నారన్న విషయం అర్థమవుతుంది. మారు మాటాడకుండా సెలవు తీసుకొని తన శిబిరానికి నడిచాడు.
రెండు రోజులలో యుద్ధం ముగిసింది. యుద్ధంలో ఓడిన, కుంతలదేశపు రాజును సకల మర్యాదలతో ఆ రాజ్యానికి ప్రభువుగా అధిష్టించి, తమకు అర్పించబోయిన వారి రాకుమారిని, “మీ రాకుమారి, మాకు సోదరీ సమానురాలు. వారికి తగిన వరుడిని చూసి పెండ్లి చేద్దాం” అని వారికి చెప్పి తమ రాజ్యానికి చేరుకున్నారు.
*
రాజ్య పొలిమేరలలో మహారాజు చూపులు ఎవరినో వెతుకుతున్నట్లు అనిపించాయి అనంతుడికి. ఎవరికోసం? ఇంతలో ప్రధానమంత్రి రాజుకు ఎదురేగి స్వాగత సత్కారాలనర్పించారు.
మహారాజుల రథం ముందు అనంతుడు అశ్వారూఢుడై వెళ్తున్నాడు. విజయలక్ష్మిని వెంట నిడుకొని వచ్చిన ఏ మహారాజైనా ముందుగా అంతఃపురాన్ని చేరుకొని, మహారాణి ఇచ్చే స్వాగత సత్కారాలను స్వీకరించి, ఆపై రాజమందిరంలో సభ తీరుస్తారు. యుద్ధంలో గెలిచినందుకు, వీరులందరికీ కానుకలిచ్చి సంతృప్తి పరుస్తారు. ఇప్పుడు మహారాజ మందిరానికి వెళ్లాలా! అంతఃపురానికి వెళ్లాలా! మహారాణి, వారి పుట్టింటి నుండి అంతఃపురానికి చేరుకున్నారన్న వార్త నిన్ననే అందింది. మరి ప్రభువుల నిర్ణయమేమిటి? మహారాజుల మందిరమా! అంతఃపురమా! యుద్ధానికి బయలుదేరేముందు, ప్రభువు రాకుమారిని కలుసుకోవాలని ఆత్రుత పడడం గుర్తుకొచ్చింది. మహారాజు రాకుమారిని కలుసుకోవడానికి ఎంతగానో ఎదురు చూస్తూ ఉండి ఉంటారు. అంతఃపురానికే వెళ్లాలి.
అనంతుడీ నిర్ణయం తీసుకునేలోగా, అతని అశ్వం అలవాటుగా మహారాజ మందిరం వేపు దారి తీసింది. ఇప్పుడు అశ్వాన్ని దారి మళ్లిస్తే… మహారాజుల రథం, దాని వెనకున్న మిగిలిన వాహనాలు కూడా దారి మళ్లాలి. ఈ జన సందోహంలో అది సాధ్యం కాదు. ఇలా జరిగినందుకు మహారాజు తనపై కెనుక వహిస్తారా? అనంతుడు ఆలోచనలలో ఉండగానే అశ్వం మహారాజ మందిరాన్ని చేరుకుంది. రథం మహారాజుల మందిరం చేరుకోగానే, పరిచారికలు వెంటరాగా లోపలనుండి మేలి ముసుగులో మహారాణి స్వయంగా వచ్చి, మహారాజుకు దిష్టితీసి, తిలకం దిద్ది, దగ్గరుండి లోపలకి తీసుకుపోయారు. అంతఃపురంలో కాకుండా మహారాజ మందిరంలో విదర్భ రాకుమారి… ఆశ్చర్యాన్ని అణుచుకోలేకపోయాడు అనంతుడు. అనంతుడికిది ఊహించని పరిణామం. ఊహించనిదే అయినా ఆనందకరమైనదే.
మహారాజు, మహారాణి అన్యోన్యంగా ఉంటే అంతకన్నా కావలసినదేముంది. మహారాజుల వద్ద సెలవు తీసుకుని తన మందిరానికేగాడు అనంతుడు. వెళ్ళాడే కానీ అనంతుని ఆలోచనలు, అనంతంగా సాగుతూనే ఉన్నాయి.
*
మహారాణి విధర్భదేశం వెళ్లే ముందు జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చాయి. ఆమె మహారాజులకు ఆ చిత్రపటాన్ని బహుకరించడంలో అంతరార్థం ఏమిటి? అందులోని వ్యక్తులెవరు? అందులోని యువకుడు మారువేషంలో ఉన్న మహారాజై ఉండే అవకాశముందా? నిద్రించిన సమయంలో తప్ప, తానేనాడూ మహారాజును విడిచి ఉండలేదు. మరి ఆ యువకుడెవరు? మరి ఆ స్త్రీ మూర్తి ఎవరై ఉంటారు? విదర్భ దేశపు రాకుమారా! దగ్గర నుండి ఎప్పుడూ మహారాణిని చూడలేదు కనుక ఆ విషయము నిర్ధారించలేడు. కానీ ఆ చిత్రపటాన్ని చూసి ఆ రోజు ప్రభువులు ఉన్మాదిలా ప్రవర్తించారు. అంటే చిత్రపటం లోని వ్యక్తులెవరో మహారాజులకు తెలుసు. వివాహానంతరం ఎప్పుడూ మహారాజ మందిరానికి రాని, మహారాణి ఇప్పుడు మహారాజు మందిరంలో ఉండడానికి కారణమేమిటి? ఆమెకు, ఆ చిత్రపటంలోని వ్యక్తులకు సంబంధమేమిటి? ఎంత ఆలోచించినా అర్థం కాలేదు.
అలాగే జైత్రయాత్రలో యుద్ధంలో పాల్గొన్న ఆ వీరులిద్దరు, వారితో జత కలిసిన ఆ మరో పదిమంది ఎవరు? వారెవరో ఇప్పటికీ తెలుసుకోలేక పోయాడు. ఏదో జరుగుతుంది. తనకు తెలియని రహస్యమేదో ఉంది. అది మహారాజుకు తెలుసనే విషయం తేటతెల్లమౌతుంది. మహారాజులనే ఆ విషయం అడగాలని నిర్ణయించుకున్నాక, మనసు ప్రశాంతంగా తోచింది. సందేహాలను ప్రక్కన పెట్టి, చాలా రోజుల తర్వాత హాయిగా నిద్రపోయాడు అనంతుడు.
*
రాజ్యానికి వెళ్ళిన మరుసటి రోజు, నారాయణాచార్యుల వారి సమక్షంలో లాంఛనంగా విజయోత్సవాన్ని జరిపి, అందరికీ విశ్రాంతి తీసుకోమని రాజాజ్ఞ ప్రకటించారు. ఇంకా, వీరులెవరినీ సత్కరించనూ లేదు. వారికి కానుకలనూ ఇవ్వలేదు. పూర్తిస్థాయిలో విజయోత్సవాలనూ జరపలేదు. మహారాజుల మనోగతమేమిటో అవగతమవలేదు అనంతునికి. తనతో చర్చించకుండా ఏ నిర్ణయమూ తీసుకోని మహారాజు, అంతపురం నుండే పాలన సాగిస్తున్నారన్న విషయం అవగతమవుతోంది.
“మహారాజు అంతరంగిక మందిరంలో ఉన్నారు. అత్యవసరమైతేనే, కలవడానికి అనుమతి తీసుకోమన్నారు. అదికూడా అనంతుడికైతేనే” అన్న మహారాజు మాటలను, రెండవ రోజు మహారాజుని కలవడానికి వెళ్లిన అనంతునికి చేరవేసింది దేవసేన.
తనతో చర్చించకుండా, ఏ నిర్ణయాన్నీ తీసుకోని మహారాజు, ఈసారి దానికి విరుద్ధంగా విజయోత్సవాన్ని లాంఛనంగా ముగించారు. మరలా పూర్తిస్థాయిలో ఎప్పుడనేది కూడా, తనకు తెలియపరచలేదు. మహారాజ మందిరంలో ఏనాడూ తనను అడ్డిన వారే లేరు. ఆఖరికి అర్ధరాత్రి సమయంలోనైనా. అటువంటిదిప్పుడు అత్యవసరమైతే… అన్నారంటే ప్రభువు తనను దూరం పెడుతున్నారా? ఛ,ఛ… మహారాజులెప్పుడూ అలా చెయ్యరు. మరి యిదంతా మహారాణివారి చేస్తున్నదా! ఆమె అటువంటి వారు కాదని మనసు గట్టిగా చెప్తుంది. ఏది ఏమైనా, తాను తన కర్తవ్యాన్ని విడిచిపెట్టకూడదు, నిర్ణయించుకున్నాడు అనంతుడు.
ఇంకా పూర్తిస్థాయి వేడుకలు జరగకపోయినా, దేశ ప్రజలంతా విజయోత్సవ ఆనందంలో ఉన్నారు. ప్రభువుల వారు అంతరంగిక మందిరంలోనే కాలం గడుపుతున్నారు. వారి ఏకాంతానికి భంగం చేయరాదని, అనంతుడే సభా వ్యవహారాలను చూసుకుంటున్నాడు.
వారం రోజుల తర్వాత ప్రభువులు సభ తీర్చారు. యుద్ధంలో గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ సన్మానం చేశారు. “ఆఖరుగా మన సైన్యంలో లేకపోయినా, ఈ విజయంలో పాలుపంచుకోవలిసిన వీరులలో, ప్రస్తుతం ఇక్కడున్న ఇద్దరు వీరులకు సన్మానం చేయవలసినదిగా, మన సర్వ సైన్యాధిపతి అనంతుడిని కోరుతున్నాను, అంటూ ఆ వీరులిద్దరిని వేదికమీదకు పిలిచాడు మహారాజు.
వారిరువురినీ చూసి ఆశ్చర్యపోయాడు అనంతుడు. ఎవరి ఆచూకీ కోసమైతే తాను విశ్వప్రయత్నం చేస్తూ ఉన్నాడో, ఆ వీరులే వీరు. వేగులవారిని ఎందరినో నియమించాడు. ఎవరూ వారి ఆచూకీ కనుగొనలేకపోయారు. తన చేతి క్రింద ఉన్న నిఘా వ్యవస్థ విఫలమైనందుకు, తన కన్నుగప్పి వారు తమ రాజ్యంలోనే ఉన్నందుకు,తలకొట్టేసినట్టైంది అనంతునికి.
ఆ వీరులెవరో, అనంతునికంత ఆశ్చర్యమెందుకో, తరువాయి భాగంలో..