నేడు మహిళలు అన్నిరంగాల్లో ముందుకు దూసుకుపోతూ అగ్రస్థానంలో ఉన్నారు.కానీ కొంత మంది మాత్రమే అంధులకు, జీవితంలో దగాపడిన వారికి తోడ్పడుతూ, వారిలోని చీకటిని పోగొట్టి మానసికంగా దృఢంగా తయారుచేయగలరు దానికి ఎంతో ఓర్పు నేర్పు పట్టుదల భగవద్గీతను బాగా వంటపట్టించుకున్నవారు మాత్రమే సమర్ధులు.దానికి ప్రత్యక్ష సాక్షి శ్రీమతి ప్రణవలత. మనం భక్తిమార్గంలో పయనిస్తూ ,జీవితంలో దగాపడినవారికి కనుచూపుకరువైన వారికి ఆమె నిశబ్దంగా ఒక మెంటర్ గా సేవలందిస్తున్నారు.ఇస్కాన్ సంస్థ లో ప్రణవలత ఒక అధ్యాపకురాలిగా మార్గదర్శిగా బాలికల వింగ్ కి మెంటర్ గా ఉన్నారు.మరి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
” నా అసలుపేరు ప్రణవలత. కర్నూల్ లో పుట్టిపెరిగాను. శ్రీమతి వరలక్ష్మి ఆనందంగార్లు నాతల్లిదండ్రులు. ఇద్దరు సోదరులు.మంచి క్రమశిక్షణ విద్యావినయ సంపన్నత, పరోపకారం,ఆధ్యాత్మిక భావాలున్న మాకుటుంబవాతావరణం ఈనాడు నన్నొక మాతాజీగా నిలబెట్టింది.”తల్లి గృహిణి,తండ్రి ఓకంపెనీ మేనేజర్.ఎం.ఎస్సీ.కంప్యూటర్ చదివిన ప్రణవలత కొన్నాళ్లు టీచర్ గా ఆపై 6ఏళ్లు బిజినెస్ కన్సల్టెంట్ గా పనిచేశారు.చిన్నప్పటినుంచీ పుస్తకాల పురుగు.ఆధ్యాత్మిక వేదాంత గ్రంధాలు బాగా చదువుతూ భగవద్గీత ను బాగా వంటపట్టించుకున్నారామె.భర్త రిటైరైన వింగ్ కమాండర్ ఏర్ ఫోర్స్ ఆఫీసర్.పెద్ద కొడుకు కాలిఫోర్నియాలో చిన్న కొడుకు డబ్లిన్ లో ఉన్నారు.తల్లిబాధ్యతలు తీరాక ఆమె ఆధ్యాత్మిక మార్గం లో నడుస్తూ, యువత కి దిశానిర్దేశం చేస్తున్నారు.

పూజ్యశ్రీ భక్తి రాఘవస్వామి మహారాజ్ శిష్యురాలైన ఈమె2006లో దీక్ష తీసుకున్న తర్వాత చంపకలతమాతాజీగా పిలువబడుతున్నారు.ప్రస్తుతం ఆబిడ్స్ లోని ఇస్కాన్ లో యూత్ వింగ్ మెంటర్ గా యువతులకి క్లాస్ తీసుకుంటున్నారు.సాయంత్రం5.30నించి ఇక్కడికి అమ్మాయిలు వస్తారు.13నించి 28ఏళ్ల యువతులు ఆధ్యాత్మిక ప్రసంగాలు విని తమసందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.రాధేశ్యాంప్రభుజీ నేతృత్వంలో పనిచేస్తున్న ఈమెజీవితవిలువలు ఆధ్యాత్మిక చింతన వ్యక్తిత్వ వికాసంగూర్చి బోధిస్తారు.పెళ్లయిన అమ్మాయిలుకూడా వస్తారు
అంధ బాలలకి కూడా ఈమె వెలుగుబాటగా నిలిచారు.కనుచూపుకరువైన వారు మంచి క్రమశిక్షణ తో పెరిగి లాయర్ టీచర్ బ్యాంకర్లుగా స్థిరపడ్డారు. 18మంది సాయంతో బ్రెయిలీలో భగవద్గీత ను,కథల్ని అంధులకోసం సిద్ధం చేశారు.
ఈమె జ్యువనైల్ హోంలో ఉండే 8_18ఏళ్ల బాలికలకు ఆధ్యాత్మిక బోధన తో పాటు కౌన్సిలింగ్ చేసి వారిలో మానసిక పరివర్తన వచ్చేలా కృషిచేస్తున్నారు.తెలిసీ తెలియక తప్పులు నేరాలు చేసిన బాలికలలో మంచిపెంచేలా,జీవితంపై ఆశకలిగేలా తనబోధనలతో మార్పు తేవడం నిజంగా హర్షణీయం! మానసిక దృఢత్వం శక్తిని ప్రచోదనం చేస్తున్న మాతాజీ మనందరికీ ఆదర్శ నారి.ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2026లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈమెకు నారీశక్తి అవార్డ్ ఇచ్చి సత్కరించింది. ఇలాంటి సంఘసేవికలు దేశానికి వెన్నెముక. వారి జీవితాలు ధన్యం ఈమె ఇంకా ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవాలని ఆశిద్దాం

