పట్టణపు వెలుగుల వెంబడి నడిచాను
నీలి దీపాల నీడల్లో తిరిగాను
ఎత్తైన గోడల మధ్య
మనుషుల గుంపులు కనిపించాయి
కానీ… మనసుల జాడ మాత్రం దొరకలేదు.
చెరువు ఒడ్డున ఆకలి ఏడుపు వినిపించింది.
చిన్నారి కళ్లలో ప్రపంచం మునిగిపోయింది.
“మానవత్వం ఎక్కడ?” అని అడిగితే
జవాబు కాదు కన్నీరు మాత్రమే జారింది.
ఆసుపత్రి గడప వద్ద జీవితం తడబడుతుంటే,
డబ్బు లేక ప్రాణం ఆగిపోతుంటే,
చేతులు జోడించిన తల్లి వేదనగా అడిగింది
“మానవత్వమా… నువ్వూ ధనవంతులింటికే చేరావా?”
రోడ్డు మీద రక్తం కథ చెబుతుంటే,
చుట్టూ నిల్చున్న కళ్ళు కెమెరాలయ్యాయి…
ఒక్క చేయి ముందుకు రాలేదు
అక్కడే మానవత్వం మౌనంగా చనిపోయింది.
కులం గోడలు కట్టిన లోకం ఇది,
మతం కత్తులు దించిన కాలం ఇది,
అధికారపు అహంకారంతో
మనిషి మనిషినే దహించుకుంటున్న దృశ్యం ఇది.
ఇంట్లో తల్లిదండ్రుల నిశ్శబ్దం విలపిస్తోంది,
వృద్ధాశ్రమాలే వారి చిరునామాలయ్యాయి.
బయట ప్రేమను బోధించే వాక్యాలు,
లోపల బంధాలను బంధించే తాళాలు…
అందుకే…
ఈ భూమిపై నీ జాడ కోసం తిరిగి
నా అడుగులు అలసిపోయాయి, మానవత్వమా!
నువ్వింకా బ్రతికి ఉంటే
ఆకలికి అన్నం అయ్యి రా,
కన్నీటికి ఓదార్పు మాటగా మారి రా,
పడిపోయినవారికి తోడు నిలిచే భుజమై రా.
ఎందుకంటే
మనుషుల కోసం గోపురాలు కట్టిన ఈ లోకంలో,
మనసుల కోసం మాత్రం గుడి కట్టలేకపోతున్నారు…
మనిషి కోసం ఒక్క మానవత్వ హృదయం కూడా
కనిపించదు ఈ కాలంలో—
ఇంకా నిన్ను వెతకను…
ఎందుకంటే…
నువ్వుంటే
అది ఒక మనసులో కాదు—
మనిషిలో కనిపించాలి.

డాక్టర్ అరుణ పరంధాములు
తెలుగు అధ్యాపకురాలు
సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా సైనిక శిక్షణ కళాశాల
భువనగిరి యాదాద్రి జిల్లా