పాఠశాల అనేది కేవలం పుస్తకాల జ్ఞానం అందించే స్థలం మాత్రమే కాదు; అది జీవితాన్ని అర్థం చేసుకోవడం నేర్పే పుణ్యక్షేత్రం కూడా. ఈ భావాన్ని ఆచరణలో చూపిస్తూ విద్యార్థులకు విద్యతో పాటు జీవన నైపుణ్యాలను బోధిస్తున్న గురువుల్లో తెలుగు భాషోపాధ్యాయురాలు తిరునగరి పద్మ గారు ఒకరు.
తన బోధన విధానంలో క్రమశిక్షణ, బాధ్యత, స్వీయనిర్భరత వంటి విలువలను విద్యార్థులలో పెంపొందించే ప్రయత్నం చేస్తూ, చదువు మాత్రమే కాకుండా జీవన మార్గాన్ని చూపించే గురువుగా నిలుస్తున్నారు. ఆమె అనుభవాలు, ఆలోచనలు, బోధనలోని ప్రత్యేకతల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో తరుణి పత్రిక తరఫున ఆమెతో చేసిన ముఖాముఖి!
పాఠ్యాంశం దాటి, విద్యార్థులలో క్రమశిక్షణ, స్వీయనిర్భరత పెంచే బోధనా విధానాన్ని అమలు చేస్తున్న మీతో సంభాషణ చాలా సంతోషానిస్తున్నది. తరుణి పాఠకులకు మీ సమగ్ర కృషిని తెలుపుతారా?
తిరునగరి పద్మ :- తప్పకుండా మేడం. ఇది నా అదృష్టంగా భావిస్తాను.
పద్మజ* :- మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి వివరించగలరా?
తిరునగరి:- నేను హన్మకొండ జిల్లా, పరకాల దగ్గరున్న పోచారంలో పుట్టాను. అమ్మ పుష్పలత, నాన్న తిరునగరి శేషయ్య. ఆయన సీనియర్ అకౌంటెంట్ గా పనిచేసేవారు. ఉద్యోగ రీత్యా ఊరూరు మారడం వల్ల నా విద్యాభ్యాసం కూడా అనేక చోట్ల జరిగింది. 1 నుండి 9వ తరగతి వరకు స్టేషన్ ఘనాపూర్ లోనూ, 10వ తరగతి ములుగులోనూ గడిచింది. ఇంటర్ మరియు డిగ్రీ పినిగిల్లి ఉమెన్స్ PG కాలేజీలోనూ, MA తెలుగు కాకతీయ విశ్వవిద్యాలయంలోనూ, Bed , Med ఏకశిలా కాలేజీ జనగామలో జరిగింది. మా వారు లంకా రఘు, టైపిస్ట్ గా పని చేస్తున్నారు.
పద్మజ – తెలుగు భాషోపాధ్యాయురాలిగా మారడానికి మీకు ప్రేరణ ఏమిటి?
తిరునగరి :-విద్యార్థులను నైతిక మార్గంలో నడిపించడానికి, వారిలో జీవన నైపుణ్యాలను పెంపొందించి, భావి భారత పౌరులుగా.. తీర్చిదిద్ది..
సమాజానికి ఉన్నత వ్యక్తిత్వ విలువలు ఉన్న పౌరులుగా.. మార్చడం కేవలం తెలుగు భాషో పాధ్యాయులకు మాత్రమే సాధ్యం. అందుకే ఈ తెలుగు భాషలో ,నేను ప్రావీణ్యాన్ని సంపాదించడం ,మరియు విద్యార్థులను ప్రావీణ్యులుగా.. ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం నా ఉద్దేశం.

పద్మజ :- గురువుగా మీ ప్రయాణంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు లేదా అనుభవాలు ఏమిటి?
తిరునగరి :-నేను పల్లెటూరి పిల్లగాడ పాఠం బోధిస్తుంటే… మిర్యాలగూడమోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, మహాత్మా హెల్పింగ్ హాండ్స్ అధినేత శ్రీ గంట రవీందర్ గారు.. అకస్మాత్తుగా మా పాఠశాలకు వచ్చారు.. కృత్యాధార పద్ధతి లో ఇంత బాగా చెప్తారా? అని.. మా పాఠశాల పిల్లలకు సుమారుగా 30 వేల రూపాయలు విలువగల టీ షర్ట్స్ బహుమతిగా ఇచ్చారు. అప్పుడు నేను చాలా ప్రభావితురాలినై.. ఇంకా బాగా చెప్పడం మొదలుపెట్టాను. చాలా సంతోషం వేసింది..
పద్మజ :- కృత్యాధార బోధనలో ప్రత్యేకత ఎలా ఉంటుంది?
తిరునగరి :-ఉపాధ్యాయులు అంటే కేవలం పుస్తక జ్ఞానాన్ని మాత్రమే అందించడం కాదు, విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేయాలి..ఒక ఉపాధ్యాయుడు బహు రూపుల వేషాలు వేసుకుంటూ వారి స్థాయికి దిగి వారికి అర్థమయ్యేలాగా బోధించాలి అంటే కేవలం కృత్యా ధార బోధనతో మాత్రమే సాధ్యం అందుకే వీలైనంతగా విద్యార్థులకు కొన్ని పాత్రలు ఇచ్చి, వారు ఆ పాత్రలో లీనమై వారు ఆ పాఠ్యాంశాన్ని నేర్చుకున్నట్లుగా..అనిపించకుండా.. కొన్ని
పాఠ్యాంశాలను బడి గోడలపై కుడ్య చిత్రాలుగా చిత్రీకరించుకుంటూ, వారిని భాగస్వాములుగా చేస్తూ ఆటపాటల ద్వారా విద్యను అందిస్తున్నాను..
పద్మజ :- విద్యతో పాటు జీవననైపుణ్యాలను బోధించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది?
తిరునగరి :-నేను పదవ తరగతి ములుగు బాలికోన్నత పాఠశాలలో చదివేటప్పుడు మా డ్రాయింగ్ మాస్టర్ శ్రీ రామాచారి గారు మాకు ఎంతో చక్కగా నైపుణ్యంతో చిత్రలేఖనాన్ని నేర్పించారు. అది నాకు ఒక అభిరుచిగా మారి, తరచుగా వేసి, ప్రావీణ్యాన్ని సంపాదించిన తర్వాత చీరలపై ఫ్యాబ్రిక్ పెయింట్ వేస్తూ ఉద్యోగం రాకముందు, అది ఒక వృత్తిగా పెట్టుకున్నాను. ఆ విధంగా డబ్బులు సంపాదించుకున్నాను. నేను ఎవరిపై ఆధారపడకుండా, నా సంపాదన నాకు ఉంది అని గర్వంతో జీవించాను. అలాగే నేను కూడా నా విద్యార్థులకు చిత్రలేఖనాన్ని నేర్పిస్తున్నాను. చాలామంది విద్యార్థులు చక్కగా నేర్చుకొని వారు కూడా ఇప్పుడు ఒక వృత్తిగా పెట్టుకున్నారు. ఆ విద్యార్థులు నాకు ఫోన్ చేసి “టీచర్ ! మేము మీ వల్ల చీరలపై పెయింట్ వేస్తూ, మా డబ్బులు మేము సంపాదించుకుంటున్నాము.. మా కాళ్ళ పైన మేము నిలబడుతున్నాము” అని చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఇది చాలు! నాకు ఎన్నో అవార్డులు వచ్చినంత సంతృప్తి కలిగింది.
పద్మజ :–మీరు విద్యార్థులకు నేర్పించే ముఖ్యమైన జీవన నైపుణ్యాలు ఏమిటి?
తిరునగరి :-జీవితంలో ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవాలి. కష్టం వచ్చిందని కృంగిపోకూడదు,
విజయం వచ్చిందని విర్రవీగిపోకూడదు. కలిమిలేములను సమానంగా చూడాలని, అహంకారం, గర్వం కూడదని, వినయ విధేయతలతో మెలగమని చెబుతాను.

పద్మజ- తరగతి గదిలో ఈ పద్ధతిని ఎలా అమలు చేస్తారు?
తిరునగరి :-ఒకసారి ఫస్ట్ వచ్చిన పిల్లలు గర్వంతో సరిగ్గా చదవక ఇంకో పరీక్షల్లో తక్కువగా మార్కులు వస్తాయి. ముందుగా తక్కువ మార్కులు వచ్చిన పిల్లలు, పోటీపడి చక్కగా చదివి, మంచిర్యాంకు పొందుతారు. అందుకే మంచి ర్యాంకు వచ్చిందని పొగరు వద్దు, ఫెయిల్ అయినామని కుంగిపోవద్దు. ఎప్పుడు ఎవరి సమయం ఎలా ఉంటుందో తెలియదు! మన చేతిలో ఉన్నదల్లా కృషి ..కేవలం కృషి.. పట్టుదల.
పద్మజ :- ఈ పద్ధతి వల్ల విద్యార్థుల్లో మీరు గమనించిన ముఖ్యమైన మార్పులు ఏమిటి?
క్రమశిక్షణ, స్వీయనిర్భరత పెరిగిన ఒక సంఘటన గుర్తుంటే చెప్పగలరా?
తిరునగరి :-మా పాఠశాలలో ఒక విద్యార్థి బాగా చదువుతున్నానని గర్వంతో పదవ తరగతి పరీక్షల సమయంలో అసలే చదవలేదు. చదవమంటే..”ప్రతి పరీక్షలో నేనే ఫస్ట్ వస్తాను కదా టీచర్! నాకు చదవడం అవసరం లేదు” అనేవాడు. వేరొక అమ్మాయి మామూలుగా చదివేది. ఆమె ఫస్ట్ రావాలని అనుకున్నది. గట్టిగా పట్టు పట్టి చదివింది.
ఏ ప్లస్ గ్రేడ్ సాధించింది. బాసర ఐఐటీలో సీటు సంపాదించుకుంది. బాగా చదివే కుర్రాడు నాలుగు సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు. ప్రస్తుతం ట్రాక్టర్ నడుపుతున్నాడు. అందుకే విజయం వరించిందని గర్వం తలకెక్కితే, అథః పాతాళానికి తోసేస్తుంది అని చెబుతాను.
పద్మజ :- ఈ విధమైన బోధనలో మీకు ఎదురైన సవాళ్లు ఏమిటి?
తిరునగరి :-ఎప్పుడైనా ఒకరు మంచి చేస్తుంటే , వెనకకు లాగి కింద పడేయాలని చాలామంది చూస్తారు. అలా చాలా సవాళ్లను ఎదుర్కొన్నాను. నాకు నేనుగా ధైర్యం చెప్పుకొని భుజం తట్టుకొని, నా ఉద్యోగ ప్రస్థానంలో పట్టు వీడని విక్రమార్కిణిలా, కృత్యాధార పద్ధతిలో బోధన కొనసాగిస్తున్నాను.

పద్మజ :- గురువుగా మీకు అత్యంత ఆనందం కలిగించిన క్షణం ఏది?
తిరునగరి :-ఒక అమ్మాయి సరిగ్గా పాఠశాలకు రాకపోయేది, ఒకసారి నేను ఆ అమ్మాయితో ఒక ఫోటో దిగాను. నా ఫోటో ముందు పెట్టుకుని, ఇంటి దగ్గర కూర్చొని చదువుకొని, అప్పుడప్పుడు పాఠశాలకు వచ్చి, పరీక్షలు రాసి, అందరికంటే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. కేవలం 5వ తరగతి అమ్మాయి. అప్పుడు నా కళ్ళ వెంబడి ఆనంద భాష్పాలు జలజలా రాలిపోయాయి.
పద్మజ :- నేటి విద్యావ్యవస్థలో జీవన నైపుణ్యాల విద్య ఎంతవరకు అవసరం?
తిరునగరి :-నేటి అస్తవ్యస్తమైన విద్యా వ్యవస్థలో విలువలతో కూడిన విద్య ఎంతో అవసరం.
ముఖ్యంగా అబ్బాయిలు, అమ్మాయిలను ప్రేమించడం, అమ్మాయిలు కూడా విచిత్ర వస్త్రధారణతో అబ్బాయిలను ఆకట్టుకోవడం..అబ్బాయిలు చింపిరి జుట్టు, పిట్టగూళ్ల కటింగ్ లతో.. చిత్రవిచిత్రమైన, హెయిర్ స్టైల్స్, కలర్స్ తో విద్యను పక్కనపెట్టి, అనవసరపు విషయాలపై మక్కువ చూపుతున్నారు. అలాంటివి పాఠశాల స్థాయిలోనే ఉపాధ్యాయులు వాటిని ఖండించి, వారిని సరైన దారిలో పెడితే సమాజానికి నీతి, నిజాయితీ , నైపుణ్యం గల మంచి భావిభారత పౌరులను అందించగలము.
పద్మజ :- గురువుగా మీ ప్రయాణంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు లేదా అనుభవాలు ఏమిటి?
తిరునగరి :- నా మొట్టమొదటి ఉద్యోగ ప్రస్థానం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రామరాజు పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో. మా ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి మంగు ప్రవీణ గారు. ఆమె విద్యార్థులకు చక్కగా గణితం బోధించేది. శ్రీసోమరాజు గారు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు చాలా సహనంతో వారి స్థాయికి దిగి, ఎలా చెప్పాలో… చక్కగా వివరించి చెప్పేవారు.
శ్రీ రాధాకృష్ణ గారు, ప్రవీణ్ గారు, ప్రసన్న గారు, ఇలా ఒక్కొక్కరి నుండి ఒకటి గ్రహించుకొని, నాదైన శైలిలో విద్యార్థులకు కృత్యాధార బోధన పద్ధతిలో ఇలా చెప్పాలని, నాలో బోధనా నైపుణ్యానికి నాంది పడింది. ఇంట్లో మావారు, మా బాబు, మా అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అందరూ కూడా నన్ను చాలా ప్రోత్సహించేవారు.
పద్మజ :- విద్యాబోధన అంటే మీ దృష్టిలో ఏమిటి? కేవలం పాఠ్యాంశం బోధించడమేనా లేక మరేదైనా విస్తృతమైన అర్థం ఉందా?
తిరునగరి :-విద్యా బోధన అందరూ చేస్తారు కానీ “హృద్యమైన విద్యా బోధన” అందరూ చేయరు.
విద్యార్థి స్థాయికి దిగి, వారి భాషలో సరళమైన శైలిలో మనం వారికి పాఠం చెప్పిన విషయం కూడా తెలియకుండా, వారితోనే ఆటపాటల ద్వారా నేర్చుకునేటట్టు కృత్యాధార పద్ధతిలో చేయించడం. ఇది ఎక్కువగా ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో సాధ్యమయ్యే విద్యా బోధన. ఇక్కడ ఈ చిన్న తరగతులలోనే పునాది గట్టిగా ఉంటేనే ఎన్ని అంతస్తులైన వేయగలమనే నానుడితో క్షేత్రస్థాయిలోనే విద్యార్థులకు బేసిక్స్ బాగా నేర్పించి వదిలిపెడితే, వారు ఏదైనా చదవగలరనే ఉద్దేశం నాది..

పద్మజ :- మీరు తరగతిలో విద్యతో పాటు జీవన నైపుణ్యాలను కూడా నేర్పిస్తారని వింటున్నాం. ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? విద్యార్థులకు నేర్పించే ముఖ్యమైన జీవన నైపుణ్యాలు ఏమిటేమిటి?
తిరునగరి :- ఒకసారి నేను రామరాజు పల్లి పాఠశాలలో పనిచేసేటప్పుడు.. శ్రీకాంత్ అనే ఆరవ తరగతి విద్యార్థి బడికి సరిగ్గా రాక, చదవకపోయేవాడు. వాడు కోళ్ల ఫారంలో పనిచేసేవాడు. ఒక రోజు వాళ్ళ అమ్మ నా దగ్గరికి వచ్చి, “టీచర్! మా బాబుని తీసుకొని ఊరికి పోతుంటే బస్టాండ్ కి వెళ్లి, బస్సు పేరు చదవమంటే వాడు వేరే వాళ్ళని అడిగాడు. మీరు ఏమి చదువుచెప్పుచున్నారు? వాడు బడికి రాకపోతే మీరు పట్టించుకోరా?” అని అడిగింది. అప్పుడు నేను ప్రతిరోజూ సరిగ్గా బడికి పంపాలి, లేకపోతే వారు విద్యలో వెనుకబడుతారని సమాధానం ఇచ్చాను. విద్యార్థులలో జీవన నైపుణ్యాలను పెంపొందించి,
వారిని ముందుగా సక్రమంగా బడికి వచ్చేటట్టుగా ఆకట్టుకోవాలంటే కేవలం పుస్తకాల ద్వారా మాత్రమే కాదు వారికి నచ్చిన విధంగా వారితోనే ఆ పాఠ్యాంశానికి సంబంధించిన బోధనా సామాగ్రిని తయారు చేయిస్తూ, వారికి తగిన ప్రోత్సాహక బహుమతులు ఇస్తూ, వారిలో జీవన నైపుణ్యాలను పెంపొందించాలనే ఆలోచన నాకు కలిగింది. నేను ముఖ్యంగా విద్యార్థులకు బోధించే జీవన నైపుణ్యాలు ఏమిటంటే? కేవలం విద్య ద్వారానే కాకుండా, సహ పాఠ్యాంశ కార్యక్రమాలైన ఆటలు, ఎన్సిసి, చిత్రలేఖనం.. ఇలా ఏదో ఒక దాంట్లో ప్రావీణ్యత సంపాదిస్తే, కేవలం ఉద్యోగం పైన మాత్రమే ఆధారపడకుండా వారే సొంతంగా ఏమైనా..వ్యాపారం మొదలుపెట్టి, నలుగురికి జీవనోపాధి కల్పిస్తారు. ఏది నేర్చుకున్నా పట్టుదలతో నేర్చుకొని,
విజయాన్ని సాధించే దిశలో పయనించి, వినయ విధేయతలతో మెలగాలని చెబుతాను. విద్యార్థులను ప్రభావితం చేసేది ఎక్కువగా ఉపాధ్యాయులే!
ఉదాహరణకు ఒక పిల్లాడు చక్కగా చదివి, సంస్కారంతో మెలిగితే, అక్కడ ఊళ్లో వాళ్ళు కానీ వారి బంధువులు కానీ “అరె బాబు నువ్వు బాగా చదువుతున్నావు. ఏ స్కూల్లో చదువుతున్నావు.
మీ తెలుగు టీచర్ ఎవరు., వెరీ గుడ్ చక్కగా నేర్పిస్తున్నారు” అని మెచ్చుకుంటారు..
అదే చదువకుండా , పొగరుగా ఉంటే, “ఎవతిరా, ఎవడ్రా నీకు చదువు చెప్పేది? ఏదీ పోదాం పారా మీ సార్/మీ టీచర్ దగ్గరికి, ఏం చెప్తాండ్రో అడుగుతా పదరా! నడువు రా!.. ” అని తిట్టుకుంటూ వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తారు. కాబట్టి విద్యార్థులను వినయ విధేయతలు గల విద్యాసంపదగా భావించి, వారికి జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను వారికి వారే పరిష్కరించే విధంగా ఆత్మస్థైర్యాన్ని మనోబలాన్ని పెంపొందించుతాను..
పద్మజ :-ఈ విధానం అమలు చేసే సమయంలో మీరు అనుసరించే పద్ధతులు ఏమిటి?
సాధారణ బోధన విధానంతో పోలిస్తే ఈ పద్ధతిలో విద్యార్థుల్లో మీరు గమనించిన మార్పులు ఏమిటి?
తిరునగరి :-సాధారణ బోధన విద్యార్థులకు విసుగుగా ఉంటుంది. ఈ కృత్యాధార బోధనతో..
విద్యార్థులు ఎంతో ఆసక్తితో వింటారు. స్వయంగా.. వారే ఆ బోధన సామాగ్రిని ఉపయోగిస్తూ నేర్చుకోవడం వల్ల వారు ప్రతి రోజూ పాఠశాలకు రావడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా సబ్జెక్టు పైన ఆ సబ్జెక్టు టీచర్ పైన ఇష్టాన్ని పెంపొందించుకొని విద్యను కష్టంగా కాకుండా ఇష్టంతో నేర్చుకుంటారు.
పద్మజ :- చదువు మాత్రమే కాకుండా జీవితానికి ఉపయోగపడే విలువలు పిల్లలకు నేర్పడం ఎందుకు ముఖ్యమని మీరు భావిస్తారు?
తిరునగరి :- విద్య అందరూ నేర్పిస్తారు. కానీ విలువలతో కూడిన విద్యను కొందరే నేర్పిస్తారు. ఆ విలువలను వారు నేర్చుకొని ఆచరిస్తే సమాజంలో గౌరవింపబడతారు. ఉన్నత స్థాయిలో నిలుస్తారు.
పద్మజ :- తెలుగు భాష బోధనలో మీరు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అంశం ఏమిటి? సాహిత్యం ద్వారా పిల్లల్లో విలువలను పెంపొందించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏమిటి?
తిరునగరి :-తెలుగు భాషా బోధనలో ముందు అక్షరాలను చక్కగా గుండ్రంగా దోష రహితంగా రాయించడం, ధారాళంగా చదియించడం ఇవి రెండు ముఖ్యమైనవి. ఇవి చక్కగా నేర్చుకుంటే, ఏదైనా రాయగలరు, చదవగలరు.
ఇంకా కొన్ని సందర్భాలలో ఒక అందమైన గులాబీ పుష్పాన్ని చూసినా ఒక చిట్టి చిలకమ్మను చెట్టు పైన చూసినా ఒక కమ్మని కోయిలమ్మ పాటను విన్నా మనసు పులకరిస్తుంది. ఆ విషయాలను చిన్నగా కవితల రూపంలో విద్యార్థులతో రాయిస్తూ,ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ల కదలిక అని అక్షర శరాలను సంధిస్తూ సాహిత్యం ద్వారా సాధించలేనిది ఏదీ లేదు. రవి కాంచని చోటును కవిగాంచగలడు అని విద్యార్థులకు బోధిస్తూ, భావి జీవితంలో మీరు కూడా గొప్ప కవులు కావాలని, సమాజ హిత రచనలు చేయాలని, విద్యార్థులకు హితబోధ చేస్తాను.

పద్మజ :- నేటి డిజిటల్ యుగంలో పిల్లల్లో తెలుగు పట్ల ఆసక్తి పెంచడానికి గురువులు ఏమి చేయాలి?
తిరునగరి :-ఇప్పుడు ప్యానెల్ బోర్డులు వచ్చాయి కదా! వాటిని ఆపరేట్ చేస్తూ, విద్యార్థులతోనే చేయిస్తూ, పాఠ్యాంశం అందులోనే వినిపిస్తే వారికి కూడా రొటీన్ టీచింగ్ కు భిన్నంగా ఉంటుంది. చాలా ఆసక్తిగా చిత్రాలను చూస్తూ నేర్చుకుంటారు. ఇంకా నేను బోధించే పాఠ్యాంశాలను ఎక్కువగా టి ఎల్ ఎం ద్వారా మరియు పాఠశాల గోడల పైన కుడ్య చిత్రాలుగా నేను చిత్రీకరిస్తూ విద్యార్థులతో కూడా చిత్రీకరింప చేస్తూ, ఆ గోడ పైన ఆ బొమ్మ చూశారంటే, విద్యార్థికి పాట మొత్తం వచ్చేస్తుంది. ఆ విధంగా కూడా విద్యాబోధన చేస్తే, విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని అనుకుంటాను.
పద్మజ :- ఈ విధమైన బోధనలో మీకు ఎదురైన ప్రధాన సవాళ్లు ఏమిటి? తల్లిదండ్రులు మరియు పాఠశాలల సహకారం ఈ విధానానికి ఎంతవరకు అవసరం?
తిరునగరి :- ఇంతవరకు ఏ మహిళా ఉపాధ్యాయురాలు కూడా పాఠశాలగోడల పైన బొమ్మలు వేసి చెప్పలేదు. చీరల పైన వేశారేమో కానీ అయితే నేను ఇలా వేయడం వల్ల చాలామంది ఉపాధ్యాయులకు ఇంత శ్రమ అవసరమా? ఏదో బడికి వెళ్లి పాఠాలు చెప్పుకోక అని విమర్శలను ఎదుర్కొన్నాను. అంతేగాక పొగడ్తలను కూడా పొందాను. మా సోలిపూర్ ప్రాథమికోన్నత పాఠశాలకు..( తరిగొప్పుల మండలం జనగామ జిల్లా) పాలకుర్తి ఎంఈఓ గారు శ్రీ పోతుగంటి నర్సయ్య గారు మహాత్మా హెల్పింగ్ హాండ్స్ అనే సంస్థను నడిపిస్తున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (మిర్యాలగూడ) శ్రీ గంటా రవీందర్ గారు మరియు వందేమాతరం ఫౌండేషన్ సృష్టికర్త శ్రీ వందేమాతరం రవీందర్ గారు మా పాఠశాలకు వచ్చి, ఎన్నో ఉపకరణాలను దాదాపు లక్ష రూపాయలకు పైగా విలువచేసే, వస్తువులను బహుకరించారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.. శ్రీ యాదగిరి గారు.. రైలు భోగిగా తరగతి గది అనే ఒక చిత్రాన్ని నాకు చూపించారు. వెంటనే మా పాఠశాల గోడలపై మా అటెండర్ యాదలక్ష్మి మరియు విద్యార్థుల సహాయంతో నేను కూడా రైలు మోడిని వేశాను.. అప్పుడు కలెక్టర్ గారు విద్యాశాఖ అధికారి గారు మాపాఠశాలను సందర్శించి మిగతా ఉపాధ్యాయులను కూడా మా పాఠశాలను సందర్శించమని చెప్పారు. “బొమ్మల టీచరమ్మ” అనే శీర్షికతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సాక్షి పేపర్లో నా కథనం వచ్చింది. నాకు చాలా సంతోషం అనిపించింది. నన్ను ప్రోత్సహించిన వీరందరితో పాటుగా మా హిందీ మాస్టర్ నాకు సోదర సమానులు కస్తూరి సతీష్ కుమార్ మరియు సుధా మేడం, సారంగ పాణి, సంపత్ కుమార్, హెచ్ఎం శ్రీ యాదగిరి గారు నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. వీరందరికీ కృతజ్ఞతాభివందనములు.
పద్మజ :– ఒక గురువుగా మీకు అత్యంత సంతృప్తి కలిగించిన క్షణం ఏమిటి?
తిరునగరి :- ప్రస్తుతం పని చేసే పాఠశాల భూపాల్ పల్లి జిల్లా నేరేడుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో నేను 317 G.O లో ట్రాన్స్ఫర్ పై వెళ్ళినప్పుడు ఆ పాఠశాల గోడలు బూజులు పట్టి ఉన్నాయి. అది చూసి నాకు చాలా బాధగా అనిపించింది. ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. అదే ప్రైవేట్ పాఠశాలలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో అందంగా ఉండడం వలన విద్యార్థులను ఆకర్షిస్తాయి. ప్రవేట్ పాఠశాలలకు దీటుగా మాబడిని కూడా తయారు చేయాలని, అంతకుముందు నేను పని చేసిన సోలిపూర్ పాఠశాలలో 65 కుడ్య చిత్రాలను ఒక్కదాన్నే వేసాను. ఇక్కడ వేద్దాము అనగానే మా ప్రధానోపాధ్యాయులు శ్రీ పూలాల సాంబయ్య గారు వెంటనే స్పందించి “సరే చెల్లెమ్మా! ఏమేమి కావాలి చెప్పమ్మా” అని లిస్టు రాయించుకుని
ఆ పెయింట్స్ ను బండి పైన పెట్టుకొని తెస్తున్నప్పుడు, నా హృదయం ఆనంద భాష్పాలతో నిండిపోయింది.
మిగతా సహ ఉపాధ్యాయులు, శ్రీ ప్రణీత్ కుమార్, కుమారస్వామి, మల్లికార్జున్, మంజుల, సునీత, లావణ్య ,విజయలక్ష్మి వాళ్ళందరూ ఎంత బాగా సహాయ సహకారాలు అందించారంటే మాటల్లో చెప్పలేను.
ఈ పాఠశాలలో కూడా” రైలు భోగిగా” తరగతి గది పెయింటింగ్ వేస్తున్నప్పుడు ఉపాధ్యాయులు నిచ్చెన పైకెక్కి, డ్రమ్ములు బోర్లించుకుని ఎక్కి, పెయింటింగ్ వేసినప్పుడు నా సంతోషాన్ని మాటలలో చెప్పలేను. అది అనుభవైకవేద్యం. ఈ చిత్రాన్ని చూసి, ఎంపీడీవో గారు భూపాల్ పల్లి కలెక్టర్ గారికి చెబితే మా పాఠశాలకు లక్ష రూపాయలు బహుమతిగా శాంక్షన్ చేశారు. అప్పుడు ఇంకా ఆనందం కలిగింది అది వర్ణనాతీతం..గొర్లవీడు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ రషీద్ గారు, మేము వేసిన కుడ్యచిత్రాలను చూపెట్టడానికి రెండుసార్లు మా పాఠశాలలో ప్రత్యేకంగా కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు.
మిగతా టీచర్లకు మేము ఆదర్శమని చెప్పారు. ఆ ఉత్సాహాన్ని నా మానసికోల్లాసాన్ని ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాను..

పద్మజ :- నేటి విద్యావ్యవస్థలో జీవన నైపుణ్యాల విద్య ఎంత అవసరమని మీరు భావిస్తున్నారు?
కొత్తగా గురువులుగా రావాలనుకునే వారికి మీరు చెప్పే సూచనలు ఏమిటి?
తిరునగరి :-కేవలం పుస్తకాలలో ఉన్న విద్య మాత్రమే కాకుండా ప్రస్తుత సమాజంలో విద్యార్థులు ఎలా మెలగాలి? ఉన్నత వ్యక్తిత్వంతో జీవిస్తూ ఉద్యోగ భద్రతను ఎలా కాపాడుకోవాలి? సాటివారితో ఎలా మెలగాలి? ఇవి నేర్పిస్తే చాలు అనుకుంటున్నాను. కొత్తగా గురువులుగా వచ్చే వారికి నేను ఇచ్చే సలహాలు ఏమిటంటే?
ఎ టీచర్ ఇస్ ఏ రోల్ మోడల్ మనం ఆదర్శంగా ఉంటూ విద్యార్థులకు ఆదర్శంగా ఉంటూ వారి భవితవ్యాన్ని చక్కగా తీర్చిదిద్దే దిశగా ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉంటూ వెలుగుతున్న దీపం ఇతర దీపాలను వెలిగిస్తుంది అన్న చందంగా మెళకువలను జీవన నైపుణ్యాలను బోధించాలి అని చెబుతాను..

పద్మజ :-విద్యార్థులకు మీరు చెప్పదలచిన ఒక ముఖ్యమైన జీవన సూత్రం ఏమిటి?
తిరునగరి :- *”విద్య వల్ల ఎదగాలి వినయంతో మెలగాలి”*
పద్మజ :-చివరిగా, తరుణి పత్రిక పాఠకులకు మీ సందేశం ఏమిటి?
తిరునగరి :-ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి..మనం ఆదర్శంగా ఉంటూ ఇతరులకు ఆదర్శప్రాయంగా మెలగాలి.