అనంతం-అద్భుతం- అపూర్వం.

“నాస్తి మాతృ సమా ఛాయా / నాస్తి మాతృ సమా గతిః/
నాస్తి మాతృ సమం ప్రాణం/
నాస్తి మాతృ సమా ప్రియా”..
అని మాతృతత్వ మహత్యాన్ని వర్ణిస్తూ సంస్కృతంలో ఒక సుభాషితం చెబుతుంది.
ఈ సృష్టిలో తల్లికి సమానమైన నీడ, తల్లికి సమానమైన గమ్యము, తల్లికి సమానమైన రక్షణ, మరియు తల్లికి సమానమైన ప్రియత్వం అంటూ వేరే ఏమీ లేవని దీని అర్థం.

మాతృతత్వము అతులనీయమైన దని దీనిఅర్థం.

84 లక్షల జీవరాశులలో ఈ మాతృత్వం అనేది ఉండటం చేతనే, సృష్టి క్రమంగా నిరాటంకంగా సాగుతోంది.

అందువల్లనే ఈ మాతృతత్వంలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించిన మార్కండేయ మహర్షి వారు, దుర్గా సప్తశతిలో

“యా దేవి సర్వభూతేషు/ మాతృ రూపేణ సంస్థితా/
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః.
అంటూ స్తుతించడం జరిగింది.

చండీ సప్తశతి లో సృష్టికి మూలాధారం శక్తి అని, మాతృ రూపంగానే వర్ణించి ఆరాధించడం జరిగింది.
ఏది ఏమైనా ఈ అనంతమైన సృష్టికి, జీవి
స్థితి మరియు లయములకు కూడా
మాతృ రూపమైన శక్తియే ఆధారమని అర్థమవుతుంది.

కాబట్టి, మన సంస్కృతిలో, మాతృ స్థానాన్ని దివ్యత్వాన్ని జోడించి, సర్వదా పూజనీయమని ఉద్ఘాటించారు మన పెద్దలు.

భాషలో చిన్నదైనా! భావంలో అనంతమైన పదం “అమ్మ” .
ఈ ఒక్క పదంలో సృష్టి, సంరక్షణ ,త్యాగం, కరుణ ,ప్రేమ దైవత్వం ఇలా అన్నీ నిండిఉంటాయి.

భారతీయ సంస్కృతిలో అమ్మ అనే పదం కేవలం కుటుంబ సంబంధాలను సూచించేది మాత్రమే కాదు /
అది దేవతా తత్వానికి ప్రతిరూపంగా వర్ణింపబడింది .
వేదాలలో తల్లి స్థానాన్ని అత్యున్నతంగా పేర్కొన్నారు .

ముఖ్యంగా” మాతృదేవోభవ “అనే వాక్యం
తైత్తిరీయ ఉపనిషత్తులో కనిపిస్తుంది. ఇది తల్లిని దేవతగా భావించమని ఆజ్ఞాపిస్తుంది .తల్లి మొదటి గురువు. తల్లి మొదటి దేవత .తల్లి ప్రేమ నిస్వార్ధమైనది.

వేద దృష్టిలో తల్లి సృష్టి. స్థితి. లయ కారిణి గా భావించబడింది. ఇక మన పురాణాల్లో అయితే తల్లి అనేక రూపాలలో దర్శనమిస్తుంది .ఆమె సృష్టికి మూలమైన ఆదిపరాశక్తిగా, ప్రేమను, శాంతిని పంచే పార్వతీదేవిగా ,
ఐశ్వర్యాన్ని పంచే లక్ష్మీదేవిగా, జ్ఞానాన్ని పంచే సరస్వతీ దేవిగా జగత్తును పోషించే శక్తి స్వరూపిణిగా అభివర్ణింపబడినది. ఇతిహాసాల్లో తల్లి పాత్ర ఆదర్శవంతంగా త్యాగమూర్తిగా వర్ణించబడింది .

ఇక భారతీయుల తత్వశాస్త్రం ప్రకారం తల్లి ప్రేమ స్వరూపిణిగా, క్షమామూర్తిగా, త్యాగమయిగా, వర్ణింపబడింది. ప్రపంచంలో ఏ బంధం కూడా
తల్లి బంధంతో సమానంగా ఉండదని నిరూపించింది .
*జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ “
సృష్టికి మూలం స్త్రీ. ప్రకృతియే ప్రకృతిని సృష్టించి, పోషించి, లీనం చేసుకునే తత్వం స్త్రీ రూపంలో మమ్ముూర్తుల మూర్తీభవించి ఉంటుంది .అందుకే ఆమె మాతృమూర్తిగా బిడ్డలను కని పోషిస్తుంది. వారిని జ్ఞాన మార్గాన పయనింప జేసి, ఆనంద ధామం వైపు నడిపిస్తుంది..

పక్షికి ఎగరడం, చేపకు ఈదడం. నెమలికి ఆడడం ఎంత సహజమో ! అమ్మ తన వాత్సల్యాన్ని తమ సంతానం మీద ప్రదర్శించడం కూడా అంతే సహజం. అమ్మకు ఈ గుణం ఎవరో నేర్పితే వచ్చింది కాదు. ఇది సనాతనమైన సహజమైన గుణం.

నిజానికి నేర్పితే నేర్చినది విద్య కాదు .
అమ్మ ప్రకృతి .ఆమెలో అనుభూతి సహజం. ఆమె ప్రకృతి కాబట్టి ఆమె నుండి ఆమె సమకూర్చుకున్నది ధర్మం .
ఈ సనాతన ధర్మాలు స్త్రీలో పూత పూసినట్లుగా పురుషుల్లో కనిపించవు. ఒకవేళ కనిపించినా అవి స్త్రీత్వం పరావర్తనం చెందినపుడు మాత్రమే. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అని త్రికరణాలలో మొదటి స్థానం అమ్మకే దక్కింది .

భగవంతుడు భూమిపైకి వచ్చి ప్రజల్ని సన్మార్గంలో పెట్టాలని తలచి, తనకు బదులుగా తల్లినిపంపించాడని ఒక కథనం ఉన్నది.

దేవుడు చేయని, ఈయని సంస్కారం ,తల్లి ఇస్తుందనే కదా,దీనిభావం.

ఒకవేళ దేవుడే భువికి దిగి వచ్చినా, అమ్మ గర్భాన్ని ఆశ్రయించవలసిందే ! అతనికి కూడా వేరే మార్గం లేదు .

మానవులుగా జన్మించిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు తల్లి గర్భాన్నే కదా ఆశ్రయించారు? …

అమ్మ అనే పదం కమ్మనిది తీయనిది. అమ్మ పాలధార అమృతభాండం. పున్నమి వెన్నెల. ఆనందాన్నిచ్చే నదీ ప్రవాహం. అనంతమైన కడలి. ఆమె కన్నతల్లి భూమాత,
గోమాత, భూమాత, దేశమాత. అన్నీ ఆమే…..అమ్మ అనంతం, అమ్మ అద్భుతం, అమ్మ ఆశ్చర్యం .

“స్త్రీలలో అమ్మను దర్శించడం, పారమార్థిక మార్గాలలో ఆలోచించడం, పవిత్రంగా భావించడం, సనాతనధర్మం.
స్వధర్మే నిధనం శ్రేయః/ పరధర్మోభయావహః” అనే గీతాచార్యుని బోధనను గుర్తులో ఉంచుకొని, మన భారత భూమిపై తల్లిని ఏ విధంగా గౌరవిస్తామో , ఆమె కంట తడిపెడితే ఎంతటి ఉత్పాతాలు సంభవిస్తాయో తెలుసుకుంటూ, తల్లిని గౌరవంగా, మర్యాదగా చూసుకోవాలి…

పర స్త్రీలో అమ్మతనాన్ని చూడడం వల్ల, ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. అందుకే ప్రహ్లాదుని గురించి భాగవతంలో ,
“కన్నుదోయికి అన్యకాంత లడ్డం బైన/ మాతృభావన చేసి మరలు వాడు” అన్నారు పోతన కవి .
కాబట్టే! అతనికి మిగతా సద్గుణాలు అలవడ్డాయి. విష్ణుభక్తి లభించింది.

పుట్టిన ప్రతి జీవి ఆకలిని తీర్చేది అమ్మ మాత్రమే. ఆ అమ్మను అన్నపూర్ణమ్మ అని అభివర్ణిస్తున్నాయి. మన ఇతిహాసాలు.

ఎవరికైనా అమ్మా! ఆకలిని తప్ప, ఇంకో శబ్దం
నోటి వెంట దొర్లదు” ..

అతి ప్రాచీన కాలం నుండి, ఆధునిక కాలం వరకూ, ఆకలి తీర్చేది, ఆత్మీయత పంచేది, అనురాగంలో ముంచి తేల్చేది అమ్మతనం మాత్రమే.

బిడ్డను కనినా, పెంచినా, కన్న బిడ్డలైనా, కాకపోయినా వారైనా, మాతృత్వంతో మురిసిపోయే స్త్రీ మూర్తి,
బిడ్డ పాలన, పోషణ కోసం తన సమస్త శక్తులు ధార వస్తుంది. అలా చేయగలిగేది తల్లి మాత్రమే..దాంపత్య ధర్మం అంటూ ఉంటేనే! ఈ మాతృభావన పరిపుష్టమవుతుంది . ఈ భావం నుండి సమాజము, సామాజిక ధర్మాలు అన్నీ ఆవిష్కరింప బడ్డాయి.

మాతృమూర్తిని గౌరవించడం ద్వారా పురుషులు ఉన్నతిని పొందినట్లుగానే, స్త్రీలు తమ సంతానం ద్వారా, ఉన్నత మార్గాల వైపు నడుస్తారు. శ్రీరామ సోదరులే ఉదాహరణ.
పిల్లల్ని పెంచి, ప్రేమ పంచడంలో, వారి తల్లులు ఎన్నుకున్న దారులు, ఆదికావ్యం రామాయణంలో అద్భుతంగా వర్ణింపబడ్డాయి. అమ్మ అంటే ఏమిటో తెలియజేస్తుంది రామాయణం. కౌసల్య మాత సౌశీల్యం, సుమిత్ర సహనం,
కైకేయి అతిశయం ఏ విధంగా తెలియజేస్తుందో!

సంతానాన్ని సమర జ్వాలల నుండి తప్పించడానికి మండోదరి చేసిన మహా యత్నాలు కూడా మనకు మాతృమూర్తి హృదయ వేదనను తెలియజేస్తాయి.

భర్త చేత పరిత్యజింప బడినా, నీలాపనిందలకు గురి అయినా, నిండు గర్భిణీ అయినా, జానకి దేవి, ఆశ్రమ వాటికలలో అష్ట కష్టాలు పడి తన సంతానాన్ని తీర్చిదిద్దిన విధానం ఆదర్శనీయం. రామాయణ, భారత, భాగవతాలలో, అష్టాదశ పురాణాలలో, ఆధునిక కావ్యాలలో, కొందరు తల్లులు పిల్లలను ప్రయోజకులను చేయడం కోసం, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం కోసం, పడిన తపన, ఎదుర్కొన్న కష్టాలు, చదివినా, విన్నా, గుండె చెరువై పోతుంది.

సంతానానికి దూరమైన దేవకీదేవి సంతాపాన్ని, అల్లరి కృష్ణుని ఆటపాటలతో ఆనందించినా కూడా పుత్రుడు, తనను విడిచి వెళ్ళినప్పుడు తల్లి పొందే వేదనకు పరాకాష్టగా యశోద మాతను, మనం గమనించవచ్చును.

అలాగే మాతృత్వాన్ని కాంక్షించి, ముగ్గురు మూర్తులను పసిపాపలుగా మార్చి జోలలు పాడిన అనసూయదేవి మాతృమూర్తిగా మమకారాన్ని తన పిల్లలకు అందించడమే కాదు. కఠోర తపస్సు ఫలితాన్నంతా ఆకలి గొన్నవారికి ఆహారాన్ని అందించడం కోసం, జలాన్ని రప్పించడం కోసం ధార పోసిన వైనం ఆమె అత్యుత్తమ మాతృమూర్తి అనడానికి నిదర్శనం..అరుంధతి, అదితి నుండి నేటి వరకు ఎందరో తల్లులు సంస్కారవంతమైన సమాజాన్ని సృష్టించారు, సృష్టిస్తున్నారు, అలా సంస్కారవంతమైన, సమాజాన్ని సృష్టించడానికి, ప్రధానమైనది, ప్రశస్తమైనది, విశిష్టమైనది, మాతృ స్థానం…

స్త్రీ సంస్కార బలం చేతనే, ఉత్తమ సంతానం కలుగుతుంది.
నారదుని ఉపదేశానుసారంతోనే లీలావతి ప్రహ్లాద సుపుత్రుని కన్నది. కశ్యప ప్రజాపతి వంటి మహనీయుని ధర్మపత్ని అయిన అదితి, ఆమె తన సంస్కార బలంతో దేవతలను కన్నది. ఆ కశ్యపుడే భర్త అయినప్పటికీ దితి తన కుసంస్కారం బలం చేత, రాక్షసులను కన్నది .

ఇక వినత,కద్రువ పిల్లల పెంపకంలో అవలంబించిన విధానాల వలన వాళ్ళు ఎలా తయారయ్యారో మనకు ఆ గాథల ద్వారా తెలుస్తుంది. అలా పెరిగిన వారి వ్యక్తిత్వాలను మనం చదువుకున్నాం చూస్తున్నాం.

ఎంత చెప్పినా తరగని కావ్యం, ఎంత వినినా తనివి తీరని చరితం అమ్మే అంటే, అతిశయోక్తి లేదేమో!

“కు పుత్రో జాయతే / కు మాతో న భవతి“ అని ప్రమాణమైన వాక్యాన్ని వెలువరించిన శంకరభగవత్పాదుల వారిని ఈ సమయంలో మనం స్మరించుకోవాలి.

ప్రపంచవ్యాప్తంగా మదర్ తెరిసా, ఆర్యాంబ, భువనేశ్వరి దేవి, జిజియా బాయి, పుతలీ దేవి, క్వీన్ విక్టోరియా,
ప్రిన్స్ డయానా, Harry potter writer J.K, Rowling . Biyonce ప్రపంచ ప్రఖ్యాత గాయని, మలాలాతల్లి వంటి తల్లులు, మాతృ దినోత్సవ సందర్భంగా స్మరణీయులు.

దేశ రక్షణ కోసం, దేశ సేవ కోసం, ధీరమాతలై
తమ సంతానాన్ని సన్నద్ధం చేసి పంపుతున్న ఎందరో మాతృమూర్తులు! వారందరికీ ఈ మాతృ దినోత్సవం సందర్భంగా శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాను..

సమాజానికి మార్గదర్శకులు, సంస్కర్తలు,
సహృదయులు, వీరులు ,శూరులు, ధీరులు, ఉత్తమ పౌరులు, వీరవనితలు ధీరమాతలను, తయారు చేసేది అమ్మ. ఆ అమ్మ చూపించిన ప్రేమ ,త్యాగం, ధైర్యం, సేవ, వాత్సల్యం , మార్గదర్శకత్వమై ఎందరినో ఉన్నత స్థానాల్లో, ఉత్తములుగా సంస్కారవంతులుగా, సమాజంలో నిలబెట్టాయి.

మాతృ దినోత్సవం అనేది తల్లితనాన్ని గౌరవించే ఒక పవిత్రమైన సందర్భం. అమ్మ అనే పదాన్ని అపహాస్యం చేస్తున్న ఆధునిక కాలంలో, అమ్మ ప్రాశస్త్యాన్ని తెలుసుకొని, ఆమెకు ఆనందాన్ని చేకూర్చి, ఆదర్శంగా మసలే
ఉత్తమ సంతానాన్ని అభినందిద్దాం. తల్లిని గౌరవిస్తూ,
అమ్మ మనసును కనుక్కొని, ఉత్తమురాలైన ఆ తల్లి, ఆశయాలకు, ఆశలకు, అనుగుణంగా జీవించిన నాడు,ఈ భూమి స్వర్గతుల్యమవుతుంది.

ఇది అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తే అద్భుత అవకాశం. ఎందరో ఉత్తమమైన తల్లులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.
వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకోవాలి.
ఆకలి కేక వినేసరికి అయ్యో నాయనా వస్తున్నాను ఆగు అంటూ మరుక్షణంలోనే ప్రత్యక్షమై, ఆదరించిన అమ్మ
డొక్కా సీతమ్మ గారు వంటి దయార్ద్ర హృదయులు అయిన తల్లులను, వారి చిరస్మరణీయ సేవలను తలచుకుందాం.

ఈనాటికి ఎందరో తల్లులు మాతృత్వ మమకారంతో , మానసికంగా, శారీరకంగా, నలిగిపోతున్నా, తమ సంతానాన్ని సమున్నత స్థానంలో నిలపడంకోసం, సర్వ శక్తులు ఒడ్డి, పోరాడుతునే ఉన్నారు. అలాంటి మాతృ మూర్తులందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం.

మాతృ దినోత్సవ నాడు మాత్రమే మాతృత్వాన్ని, మాతృ మూర్తులని గుర్తిస్తూ, సంవత్సరం పొడవునా సమస్యల
పాల్జేసే కు సంస్కారవంతులైన సంతానానికి ఆ పని ఎంత మాత్రం తగదని, కన్నవారి ఋణం కడదాకా తీర్చుకోలేమని తెలియజేద్దాం. అమ్మను సంతోష పెట్టడానికి సంతానం సహృదయతను కలిగి ఉండాలని విన్నవించుకుంటూ ,

..మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మే డే శుభాకాంక్షలు…

విలువైన వజ్రం