రావి సీతాదేవి

తెలంగాణా రైతాంగ పోరాటం, స్వాతంత్ర్య సమరాలలో క్రియాశీల పాత్ర పోషించిన రావి సీతాదేవి గారు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా సూర్యాపేటలో భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, స్వాతంత్ర సమరయోధులైన శ్రీ రావి నారాయణరెడ్డి గారి సహధర్మచారిణి. వారితో పాటు తెలంగాణ రైతాంగ పోరాటం, స్వాతంత్ర్య సమరాలలో ప్రత్యక్షంగా పాల్గొని తన సంపూర్ణ సహాయ సహకారాల్ని అందించిన ధీరవనిత. భర్త నెలల తరబడి అజ్ఞాతంలో ఉన్నా ఏమాత్రం చింతపడకుండా అతనికి చేదోడై నిలిచిన ధీశాలి.

నిజాం నిరంకుశ పాలనపై పోరాటం సాగించే కమ్యూనిస్టులను నిజాం పోలీసుల ,రజాకార్ల డేగ కళ్ళ నుంచి కాపాడేందుకు తన నివాసాన్నే ఆంతరంగిక మందిరంగా చేసి విప్లవకారులకు ఆశ్రయాన్నిచ్చి వారికి వెన్నుదన్నై నిలిచిన వీర వనిత.

సీతాదేవి పలు సామాజిక, సేవా కార్యక్రమాల్లో అత్యంత క్రియాశీలంగా ఉంటూ స్త్రీ శక్తిని జాగృతపరుస్తూ , నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధులకు మద్దతునిస్తూ ముందుకు నడిపించిన
స్ఫూర్తి ప్రదాత .
ఉన్నత కుటుంబంలో జన్మించినా ,నారాయణ రెడ్డిగారితో ఆదర్శ వివాహం జరిగిన అనంతరం వారి అడుగుజాడల్లో నడుస్తూ సామాన్య జీవనం గడిపిన ఉత్తమ ఇల్లాలు. ‘ విదేశీ వస్త్ర బహిష్కరణ’లో తనకు ఎంతో ఇష్టమైన పట్టు వస్త్రాలను రోడ్డుపై దహనం చేసిన స్త్రీ మూర్తి .

‘హరిజనోద్ధరణ నిధి ‘ కోసం గాంధీజీ జోలె పట్టి విరాళాలు సేకరించినపుడు తన ఒంటిపైనున్న బంగారంతో పాటు మంగళసూత్రాల్ని కూడా విరాళంగా ఇచ్చిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపి ఎంతో మంది స్త్రీ మూర్తులను స్ఫూర్తి పొందేలా చేసిందట. నిజాం నిరంకుశ పాలకుల వేధింపులతో పురుషులంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోగా వారికి ఆహారం మరియు రహస్య సమాచారాన్ని అందించే బాధ్యత తన భుజస్కందాలపై వేసుకున్న కారుణ్య.

రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రతి గ్రామంలో తిరుగుతూ ప్రజా చైతన్యం కలిగిస్తూ, మహిళలకు ముష్కరులపై ప్రతి దాడి చేయడంలో ఇంట్లో అందుబాటులోని వస్తువులైన కారప్పొడి ,రోకలిబండ , గొడ్డలి మొదలైన వాటిని ఆయుధాలుగా చేసుకుని ప్రత్యక్ష పోరాటం ఎలా చేయాలో నేర్పి వారిని సమరాంగణలుగా తీర్చిదిద్దిన యోధురాలు .

నైజాం ప్రభుత్వం
రావి నారాయణ రెడ్డి గారిని పట్టిస్తే నజరానా ప్రకటించినప్పుడు ఆమె చంటి పిల్లలతో అడవిదారి పట్టి అజ్ఞాతంలో ఉంటూనే ప్రజల్లో చైతన్యం రగిల్చిన నిప్పురవ్వ. వెట్టిచాకిరీపై నిరసనగా దండోరా మోగించి ‘భాగేలా’ (జీతగాళ్ళ) వ్యవస్థకు చరమగీతం పాడాలంటూ గొంతెత్తిన సాహసి. సాయుధ పోరాటంలో బలైనవారికి ఆశ్రయం ఇచ్చి అండగా నిలిచిన దయార్ద్ర .

కత్తి పట్టి దండనీతి కళాకౌశలం ప్రదర్శించడమే కాకుండా కలంపట్టిన సాహిత్యాభిలాషి. ఒక ఉద్యమనేత్రికి సాహితీ పటిమ తోడైతే బంగారానికి తావి అబ్బినట్లే కదా!
ప్రజా ఉద్యమాల్లో భావోద్రేకానిదే అగ్ర తాంబూలం . జనంలో చైతన్యం నింపాలంటే ఆశయం ఆవేశమై పారినపుడే కల సాకారం అయ్యేది. జనానికి దగ్గర అవ్వాలంటే గజ్జెలు, దరువులు జత కలిసిన జానపదం జనం గుండెల్ని తట్టిలేపాలి. అప్పుడే వారిలో చైతన్యం పెల్లుబికేది. పల్లె జనం నాడి తెలిసేది ప్రజా గాయకులకు మాత్రమే. జానపదాలతో పల్లె ప్రజల్ని జాగృతపరిచే ఉద్యమ గీతాల్ని రాయడమే కాకుండా నైజాంకాలపు అరాచక స్థితిగతులపై సీతాదేవి రాసిన ఎన్నో వ్యాసాలు అనేక పత్రికల్లో ప్రచురించబడ్డాయి .గోల్కొండ, ఆంధ్ర పత్రిక ,
ఆంధ్ర వనిత మొదలైన పత్రికల్లో వీరి వ్యాసాలెన్నో ముద్రించబడ్డాయి. వారి వ్యాసోద్దేశం : దేశం కోసం మహిళలు సైతం ముందుకు రావాలని ,విదేశీ వస్త్ర బహిష్కరణతోనే చేనేత మనుగడ సాధిస్తుందని. ఆ వస్త్రాలు ధరిస్తేనే మన దేశ కార్మిక ,ఆర్థిక వ్యవస్థ సుసంపన్నమౌతుందని.
దేశ స్వేచ్ఛాస్వాతంత్ర్యలు, సమానత్వం అన్నీ మంగళసూత్రాల కన్నా ఎంతో విలువైన వని, సామాజిక రుగ్మతలు అంతమైనప్పుడే నిజమైన స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని వారి రచనల్లోని సారాంశం .

వెట్టిచాకిరి , కులవివక్ష బాల్యవివాహాల రద్దు ,వితంతు వివాహాలు ,స్త్రీ విద్య ఇలా ఎన్నో సామాజిక రుగ్మతలపై అలుపెరుగని పోరాటం చేసి శాశ్వత నిద్రలోకి జారిన ఈ మణిరత్నాన్ని గురించి వారి జీవనసహచరులు శ్రీ రావి నారాయణరెడ్డి గారు తమ ఆత్మ కథలో “సీతాదేవి సహకారమే లేకపోతే నా పోరాట జీవితం ఎప్పుడో కుంటుపడేది, నెలల తరబడి తాను ఇంటికి రాకున్నా పల్లెత్తు మాట అనకుండా నన్ను ప్రోత్సహించింది” అంటూ రాసుకోవడం ఆమె వ్యక్తిత్వానికి మరింత వన్నె తెచ్చిపెట్టిందని నా భావన.

ఈ వ్యాసం రాసే సమయంలో నన్ను అత్యంత బాధకు గురి చేసిన సంఘటన వారి ఫోటో సంపాదించలేకపోవడం. ఎన్నో రకాలుగా వెతికే ప్రయత్నం చేసినా ఎక్కడా లభించలేదు . సీతాదేవి పేరుతో ఇద్దరి ఫోటోలో ఉన్నాయి కానీ సరైన ఆధారాలు లేక పెట్టలేదు .సాయుధ పోరాటంలో ఉంటూనే సామాజిక చైతన్యంలో అవిశ్రాంతి పోరాటం చేసిన ఈ సాహసి , కారుణ్య , యశో మూర్తికి వేనవేల వినమ్ర అక్షర ప్రణతుతో …

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

క్విజ్ పోటీ

ఎగురుతోంది- ఎగురుతోంది