స్నేహబాట పరిమళాలు

(స్వీయానుభవం)

రక్తసంబంధంగా పుట్టకపోయినా – అనుబంధంగా రూపుదిద్దుకొని
కలిసిన సమయము నుండి నేటి వరకు నీడనిచ్చేది మా స్నేహం
అలాంటి బాంధవ్యాన్ని పొందినది మా స్నేహబాట. ప్రతి మనిషి జీవితంలో అత్యంత విలువైన బంధం స్నేహబంధం నిస్వార్ధమైన ప్రేమ, నమ్మకం, ఆప్యాయతతో కూడినది.
మేము గురుకులంలో చేరినప్పటి నుండి అడపాదడపా కలిసినా, బోధన ప్రణాళికలు, తెలుగు విషయంగా చర్చలు జరిగేవి. నగరంలో వివేకానంద డిగ్రీ కళాశాల వారు నిర్వహించిన “ప్రసార మాధ్యమాల్లోతెలుగు “అనే అంశం (UGC)జాతీయ సదస్సులో ఇద్దరం పత్రసమర్పణ చేయడంతో తొలిసాహితిఅడుగు వేసాము. 2014నవంబర్ 1న నుండి సాహితీ వేదికలు పరిచయమై, మమ్మల్ని ఆ దిశ వైపు పయనింప చేసింది. నాలోని సాహిత్య అభిమానానికి బీజం పడింది అప్పుడే.’నాగఫణి శర్మ’ గారి సహస్రావధానం ఢిల్లీలో జరిగినప్పుడు, పద్మావతి, జయశ్రీ, వాణి, దివిజ, నేను వెళ్ళాము. అక్కడ కార్యక్రమంలో పృచ్ఛకులుగా పాల్గొని, ఢిల్లీ పరిసరాలను చూసి వచ్చాము. అక్కడి కొన్ని అనుభూతులు మరవరానివి. ఢిల్లీలో పది రోజులు మాకు ఒక ఆలయప్రాంగణంలో వసతి కల్పించారు. మేము ఐదుగురం ఒకే గదిలో ఉన్నాము. అది కార్తీకమాసం అవడంతో, అక్కడ శివాలయంలో రోజు దీపారాధన చేసుకొని సభకు హాజరయ్యే వాళ్ళం. చక్కగా ఆసాంతం కార్యక్రమాన్ని చూసి, నచ్చిన అంశాలను వ్రాసుకునే వాళ్ళం. చివరలో మా ఐదుగురికి మంచి శ్రోతలుగా గుర్తింపు వచ్చింది. చివరి రెండు రోజుల్లో- మొదటి రోజు రిషికేష్ వెళ్లి, గంగా హారతి, హరిద్వార్ లో కృష్ణ మందిరాలు, పరిసర ప్రాంతాలు సందర్శించి వచ్చాము. తెల్లవారి మధుర &బృందావనం వెళ్లి, అక్కడ శ్రీకృష్ణుడు నడయాడిన నేలను తడిమి వచ్చాము. వచ్చేపుడు రైల్వేస్టేషన్లో ఎస్కులేటర్ ఎక్కబోయి పద్మావతి మేడం, గిరిజను పట్టుకొని పడిపోవడం… సరదాగా గడిపిన ఆనందాలు మరువలేనివి, మరపురానివి.
పద్మావతి గారిది నిస్వార్ధమైన బంధం. తనతో పాటు ఆసక్తి కలిగిన అందరికీ అవకాశం కలిపింప చేస్తుంది. తనకు తెలిసిన విషయాన్ని పదిమందికి తెలియపరుస్తుంది. ప్రతిఫలాన్ని ఆశించని స్వచ్ఛమైన మనసు. అదే కదా స్నేహమంటే. కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ, మానసిక ఉల్లాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేస్తుంది. ఏ వేదికకు వెళ్ళినా మా ఇరువురిని కలిపే చూస్తారు. అలాంటి విడదీయని బంధంగా ఏర్పడింది.
ఆమెది నాయకత్వ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న మూర్తిమత్వం. ఎక్కడ ఏ పరిస్థితులు ఉన్న, వాటిని అధికమించి పనిని సులభతరం చేయగల నైపుణ్యం తనకున్నది.
వృత్తిలోనైనా, నా జీవనంలోనైనా కష్టకాలంలో ధైర్యాన్ని ఇచ్చి, ముందుకు నడిపిన స్నేహశీలి. సంతోషాలను పంచుకొని ఆనందపడేదాన్ని. తోడబుట్టిన వారితో పంచుకోలేని విషయాలను స్నేహితులతో పంచుకుంటూ ఎలాంటి క్లిష్ట పరిస్థితులలోనూ కూడా తోడున్న నా నేస్తం.
మేము కలిసి వెళ్లిన సాహితీ కార్యక్రమాలు ఎన్నో… రాజమండ్రి నన్నయ విశ్వవిద్యాలయం కవి సమ్మేళనానికి వెళ్లి, పాపికొండలు & భద్రాచలం చూసి వచ్చాము.అక్కడనుండి గోదావరిలో పడవ ప్రయాణం చేసి, పాపికొండలు చూస్తూ భద్రాచలం చేరుకున్నాము. ఆ పడవలో మేము అందరము కలిసి నృత్యం చేశాము. అది తలుచుకుంటే ఇప్పటికీ నవ్వు వస్తుంది. వాణి భద్రాచలంలో ప్రత్యేక దర్శనం కల్పించింది. రాములోరిని గర్భగుడిలో నుంచి చేరువగా దర్శించుకోవడం మా అదృష్టం.
మా సాహితీ ప్రయాణం లోని మరో జ్ఞాపకం రాజేంద్రనగర్ లో SCRTవారి శిక్షణ శిబిరంలో పాల్గొన్నాం. సాయంత్రం రవీంద్రభారతిలో ‘సినారే సాహితీ సభ’ లో పాల్గొనాలి. ఇద్దరం మధ్యాహ్నం అనుమతి తీసుకుని ఆటోలో బయలుదేరాం. ఆటోలోనే సినారే కవితలు ఇద్దరం రాసుకొని, సభలో వినిపించి, సన్మానం పొందాము.
బొంబాయిలో జరిగిన అంతర్జాతీయ తెలుగు సదస్సుకు వెళ్ళి, సాహితీ ప్రముఖులను కలిసాము. అక్కడ మాకు ఇచ్చిన వసతి గృహంలో ఆతిథ్యము మరువలేనిది. పత్రసమర్పణ చేసి,మార్షియన్ ఉపప్రధాని చేత సన్మానం పొందాము. మార్షిస్ లో 80%తెలుగు వారే ఉంటారని,మన తెలుగు పండగ ఉగాదికి సెలవు కూడా ఉంటుందని తెలిసి ఒకింత ఆశ్చర్యపోయాం. వారితో మాట్లాడి అనుభవాలను పంచుకున్నాము. నాళేశ్వరం శంకరంగారు, ఐయిత చంద్రయ్య, గడ్డం శ్యామల, కందుకూరి శ్రీరాములు, మన్నే లలిత, శర్మగారు మొదలగు వారంతా హాజరై తెలుగు వైభవాన్ని వినిపించాము. మన తెలంగాణ సంస్కృతిగుర్తు బతుకమ్మను ఆవేదికపై ఆడాము.
నెల్లూరులో దొడ్ల కౌసల్య కళాశాలలో ‘అంతర్జాలంలో తెలుగు సాహితీ సౌరభం’అనే అంశంపై యుజిసి అంతర్జాతీయ సదస్సులో పాల్గొని, పత్ర సమర్పణ చేసాము. అక్కడ దివిజ ఇంట్లో ఉండి రెండు రోజులు గడిపాము. ఆ కళాశాలలో ఏనుగు పాదం చెట్టు, హాలులోని చిత్రపటాలు ఎంతో ఆకర్షించాయి. తిక్కన సమాధిని చూసి ఆ మహనీయుడు తిరిగిన నేలను స్పృశించి పునీతులమయ్యాము.
విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు హాజరయ్యాము. నేను, సుధాకర్ సార్, మన్నే లలిత, జయశ్రీ, పద్మావతి వెళ్ళాము. అక్కడ కవి సమ్మేళనములో పాల్గొని, కవిత గానం చేసాము. రాత్రి మా అన్నయ్య గారి ఇంట్లో బస చేసి, ఉదయాన్నే పానకాల నరసింహస్వామి దర్శించుకున్నాము. వెళ్లేటప్పుడు కారు అదుపుతప్పి తృటిలో ప్రమాదం తప్పించుకున్న సన్నివేశం తలుచుకుంటే, గుండెలో గుబులు ఇప్పటికీ కూడా.
బాసర వెళ్ళి, సాహితీ కార్యక్రమంలో పాల్గొని, సరస్వతి దేవిని దర్శించుకున్నాము. కరోనా కరోనా కరోనా సమయంలో Tsat ద్వారా పాఠ్యఅంశాలను బోధించాము.మేక రవీంద్ర గారు నిర్వహించిన అంతర్జాల సాహితీ కార్యక్రమాల్లో భాగస్వాములమై రచయిత్రులుగా గుర్తింపు రావడం సంతోషంగా వుంది. కృషికవిత, జలకవితోత్సవం, మహబూబ్ నగర్ లో మహిళాకవితోత్సవం, నల్గొండ డిగ్రీ కళాశాలలో’కూరెళ్ల విఠలాచార్య సాహితీ సమాలోచన.. ఇలా ఎన్నో కార్యక్రమాలలో ఇరువురం కలిసే పాల్గొని, తెలుగు అభిమానాన్ని పెంచుకున్నాము,పంచుకున్నాము. కలిసి వెళ్లిన అనేక సాహితీ కార్యక్రమాలు తిరిగిన ప్రదేశాలు పొందిన అనుభూతులు ఎన్నెన్నో మనసు వీణను మీటుతూనే ఉన్నాయి.
మంచి స్నేహం మన తప్పులను ఎత్తిచూపి, సన్మార్గంలో నడిపిస్తారు. అలా నా రచనల్లోని దోషాలను సవరించే గురువయ్యారు. తొందరపాటుతో చేసే పనులలోని తప్పిదాలను సున్నితంగా సవరించే సన్నిహితురాలు మా పద్మావతి మేడం.
తెలుగు బతికించాలని తపన. తెలుగు కోసం ఆరాటపడే మనస్తత్వం. ఒకసారి మా డిగ్రీ కళాశాలలో ఫ్రెంచిని ప్రవేశపెట్టాలన్నప్పుడు, తెలుగుకు ప్రమాదం వస్తుందేమో? అని తెలుగు అధ్యాపకులుగా చలించాము. ఆసక్తిగల విద్యార్థులకు (ఐచ్చిక) ప్రత్యేకంగా పెట్టమని అధికారులతో (సెక్రటరీ గారితో) అభిప్రాయాన్ని, ఆలోచనను వ్యక్తపరిచి తెలుగు భాషకు ప్రమాదం కలుగకుండా చూసాము. తెలుగు మాతృభాష అభివృద్ధికై తెలుగు కూటమిలో మరియు అనేక సంస్థలలో సభ్యురాలుగా చేరి, నేటికీ శ్రమిస్తూనే ఉన్నారు. ఏ సాహితీ వేదికకు వెళ్ళిన తన గళాన్ని వినిపిస్తూ ప్రోత్సహిస్తారు. ఎందరో సాహిత్య అభిమానులను చేయి పట్టుకుని ముందుకు నడిపించి సాహితీ కార్యక్రమాలలో పాల్గొనేలా చేశారు.
సాహిత్యంతోపాటు సామాజికస్పృహ,ఆధ్యాత్మికత కల సహృదయురాలు. మేము ఎచటికి వెళ్ళిన మార్గంలోని దేవాలయాలను సందర్శించాల్సిందే.. దారిలో ఎవరైనా బిక్షాటకులు కనిపిస్తే తప్పకుండా చేతిలో ఏదున్నా వారికిచ్చి తృప్తి చెందేది.కూడలిలో ఏదైనా విగ్రహం కనిపిస్తే, దానికివేసిన పాతపూలదండలను తీయించేది (అలా నాతో రాంపల్లి చౌరస్తాలో భగత్ సింగ్ కి వేసిన పాత దండను తీయించింది ).కష్టాలలో వున్నవారిని ఆదుకోవడం, వృద్దాశ్రమాలలో వస్త్ర &ఆర్ధిక సహాయం చేయడం, ప్రకృతి వైపరీత్యాలలో చేయూతనివ్వడం తనకు పరిపాటే…
తన విద్యార్థులంటే తనకు వల్లమాలిన అభిమానం. తన జ్ఞానాన్ని పంచుతూ తెలుగుదనాన్ని, తెలుగుతనాన్ని వారి మనసుల్లో నింపుతూ, తెలుగు తోటను విరబూయిస్తున్నది నా నేస్తం. ఆ పరిమళాలను అందుకున్న ఎందరో విద్యార్థులను సృజనాత్మక రచనలు చేయిస్తూ, వాటిని అందరికీ పరిచయం చేస్తున్నారు. అంతేకాక తన విద్యార్థుల ప్రతిభకు పురస్కారాలు కూడా అందుతున్నాయి.
బలమైన స్నేహబంధం ఉన్నవారు తక్కువ ఒత్తిడి, ఎక్కువ కాలం సంతోషంగా జీవించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. మా పట్ల అది నిజం.
పద్మావతి గారితో కలిసి పనిచేయడం కోరుకునేదాన్ని. కానీ ఒకే పోస్టులో ఇద్దరం ఉండలేము కదా! కానీ డిగ్రీ లెక్చరర్ పదోన్నతి పొందిన తర్వాత ఘట్కేసర్ క్యాంపస్ లో మా రెండు కాలేజీలు ఒకే చోట ఉండడంతో ఆ అవకాశం లభించింది. అంతేకాదు మా ఇళ్ళు ఒకే దగ్గర. కళాశాలకు కలిసే వెళ్లే వాళ్ళం. ఆ ప్రయాణంలో ఎన్నో ముచ్చట్లు. రోజు ఏదో ఒక మంచి మాట కొత్త విషయాలను పంచుకునే వాళ్ళము. పాఠ్య బోధన ప్రణాళికలు కూడా దారిలోనే చర్చించుకునేవాళ్లం. కుటుంబ విషయాలు, చుట్టూరా జరిగే సంఘటనలు, ఆర్థిక ప్రణాళికలు, ఒకటేంటి ఎన్నెన్నో కబుర్లు. ఎప్పుడు సానుకూల ప్రతిస్పందనలే ఆరోగ్యం, ఆనందం రెండూ లభించేవి.
స్నేహం అంటే కేవలం సరదాగా తిరగడం కాదు. ఒకరికొకరు తోడుగా ఉంటూ, జీవిత ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను కలిసి జయించడం అలాంటి విజేతలం మేము ఇరువురం.
గురుకుల సంస్థలో 26 సంవత్సరాలు వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి, పూర్తి ఆరోగ్యంతో తన విధులను నిర్వర్తించి, మచ్చలేని మాణిక్యంలా మెలిగిన డాక్టర్ దాసోజు పద్మావతి గారు పదవీ విరమణ చేయుచున్న సందర్భంగా శుభాభినందనలు.
మేడం ఈ గురుకులాన్ని వదిలి బాహ్య ప్రపంచంలో మీ సాహితీ ప్రభంజన భేరి మోగించాలి. మీ వెనకే నేను వస్తాను. మన బంధానికి శాశ్వతత్వం కలిగించి, మదిలో పదుల పరచుకుంటూ, తుది మజిలీ వరకు కొనసాగిద్దాం…

Written by Sribashyam Anuradha

రచయిత్రి :డా. శ్రీభాష్యం అనురాధ
తల్లిదండ్రులు :కీ.శే. శ్రీభాష్యం వకుళాదేవి, వేంకటాచార్య.
జన్మస్థలం :ఖిలాషాపుర్, జనగామ llజిల్లాll (30-6-1966).
విద్యార్హతలు : M.A.; Ph.D ; B.Ed.
భర్త : ఉత్తలూరు అశోక్.
సంతానం :అలేఖ్య( అల్లుడు -అభిజిత్ సింహ)
అభిజ్ఞ
మనుమలు :అశ్వత్ సింహ, అథర్వ్ సింహ.
రచనలు :జ్ఞాపిక, అశోక్ అనుబంధము, బతుకమ్మ పాటలు
నా సంపాదకత్వంలో 20 వరకు ప్రచురణలు.
వివిధ పత్రికలలో సాహితీ వ్యాసాలు.
అవార్డులు :ఉత్తమ ఉపాధ్యాయురాలిగా, రచయితగా, కవయిత్రిగా -రాష్ట్రస్థాయి అవార్డులు
బిరుదు : శతశ్లోక కంఠీరవ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆర్ధ్రఆవేదన

విధి నెదిరించిన వీ రవనితలు