అనిశెట్టి రజిత కు అక్షర నీరాజనాలు

ఆమె గొంతు ఎత్తిందంటే పాట పరగున వస్తుంది. ఆమె కలం పట్టిందంటే కవితలు జాలువారుతాయి. గాయకురాలు, ఉపన్యాసకురాలు, కవయిత్రి, వ్యాస రచయిత్రి , ఉద్యమకారిణి , ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆవిర్భావ సభ్యురాలుగా అందరికీ సుపరిచితమే. ప్ర.ర.వే కు ప్రస్తుత జాతీయ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన అనిశెట్టి రజిత ఎన్నో సాహిత్య సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
ఆనాడు కాళోజీ నారాయణరావు గారి అడుగుజాడల్లో నడుస్తూ కవయిత్రి గా తన ప్రయాణం మొదలు పెట్టిన అనిశెట్టి రజిత దాదాపు 10 కవితల పుస్తకాలు ప్రచురించారు . రచయిత్రి గా పుస్తకాలు తీసుకొచ్చినా , స్వీయ సంపాదకత్వం లో సంకలనాలను తీసుకొచ్చినా తనదైన ముద్రతో ఉంటాయి పుస్తకాలు.

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు అనిశెట్టి రజిత హైస్కూల్ విద్యార్థి. ఇంటర్ విద్యార్థిగా ఉన్నప్పుడే ప్రగతిశీల మహిళా సంఘం పిలుపుతో ఉద్యమ కార్యకర్తగా నిలిచింది. సమకాలీన సామాజిక వైషమ్యాల కదిలిపోయింది. కాకతీయ అధ్యాపక బృందం విద్యార్థులు కలిసి ఏర్పాటు చేసిన స్త్రీజనాభ్యుదయ అధ్యయన సంస్థతో కలిసి పనిచేసిన రజిత పేద ప్రజల బాధలకు చలించిపోయేది. స్త్రీ సమస్యలను ప్రతిబింబించే లా రచించిన తన కవితలను 1984 లో గులాబీలు జ్వలిస్తున్నాయి అనే చిన్న కవితా సంపుటిగా తీసుకువచ్చారు. స్త్రీల పక్షాన నిలబడి స్త్రీ కేంద్రంగా రచించిన కవితలే ఉన్నాయి. స్త్రీ సమస్యపై కలాన్ని సంధించిన రజిత వాళ్ళ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు.

మహిళా ఉద్యమ కార్యకర్తగా రచయిత్రిగా పేరుతెచ్చుకున్న రజిత సభా వేదిక ఎక్కిందంటే జానపద గాయకురాలు అయ్యేది. ధిక్కారం స్వరం ఆమె గానంలోనూ ఒదిగిపోయేది. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరినీ కదిలించిన సారా వ్యతిరేక ఉద్యమం లో చురుకుగా పాల్గొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో గట్టిగా తన గొంతు వినిపించింది. పాటై మాటై పోరాటమై నిలిచింది.

అప్పుడు పెద్ద సమస్య అనుకున్న పోలవరం ప్రాజెక్ట్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ది. నిరసన తెలిపేప్పుడైనా ఉద్యమాలు చేసేప్పుడైనా ఏదైనా కానీ ఆనాటి నుండి నిన్న 2025 ఆగస్ట్ 11 న మరణించే వరకు పోరాటమే ఆమె ఊపిరి. ఒకచేత్తో ఉద్యమ జండా ఒకచేత్తో కవిత్వపు జండా ఏం అనవసర ఎజెండా లకూ తావీయక నిలిచింది, నినాదమై నడిచింది అనిశెట్టి రజిత.
2014 లో తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రతి
నాలుగు కవితా సంపుటాలు రజిత వి – నేనొకనల్ల మబ్బునవుతా’(1997), చెమట చెట్టు (1998), ఉసురు (2002), అనగా అనగా కాలం (2005), దస్తఖత్ 2005, నానీలు గోరంతదీపాలు 2005, నన్హే ఓ నన్హే 2007) ఆమె వ్రాసిన హైకూలు. ఓ లచ్చవ్వ 2005, మార్కెట్ స్మార్ట్ శ్రీమతి (2010) ఆమె వ్రాసిన దీర్ఘ కవితలు. సామాజిక ఉద్యమ సందర్భాలకు స్పందిస్తూ, ఉద్యమాలలో ఊరేగింపులలో భాగమవుతూ వ్రాసిన కవిత్వాన్ని తన కవిత సంపుటాల నుండి ఏర్చి కూర్చి ’నిర్భయాకాశం కింద’ అనే కవితా సంపుటిని 2016 లో ప్రచురించింది. మరికొన్ని కథలు, అనేక సాహిత్య సంపుటాలకి సంపాదకత్వం వహించిన రజిత ఆమె సాహిత్య వ్యక్తిత్వం ఆదర్శ ప్రాయంగా ఉండేది.
తెలంగాణ తొలి దశ ఉద్యమం లో పాల్గొన్నదీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ది. ప్రొఫెసర్ జయశంకర్ సారు ప్రోత్సాహం తోనూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావసరాలనూ రజిత గౌరవం చూపించి ఉద్యమకాలంలో తెలంగాణ రచయితల వేదిక నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించింది.
మహిళా ఉద్యమ అస్తిత్వ చైతన్యం ఆమె. బహుళ అస్తిత్వాల సమభావన ఆమె.
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక నిర్మాణంలో భాగమైనప్పటినుంచి ఈ పదహారేళ్ళుగా ప్రరవే జాతీయ కార్యవర్గంలో బాధ్యతాయుతమైన స్థానాల్లో పనిచేసింది. తను అనుకున్న కార్యాలు పూర్తయ్యేవరకు మనుషుల వెంట పడి వెంటపడి పనిని పూర్తి చేసి గాని స్థమితపడేది. సమాజం పట్ల బాధ్యత ఉంది అని భావించి సంఘర్షణల వైరుధ్యాలను అర్ధం చేసుకొని, న్యాయం జరిగేలా ఎంతదూరమైనా పోయే తత్వం ఆమెది. రజిత హఠాన్మరణం ప్రరవేకి తీరని లోటు. ప్రరవే కు అనిశెట్టి రజిత ఎంతో సేవ చేసారు.

ఆగస్ట్ 12 వ తేదీ ఉదయం 11 గంటల వరకూ కాకతీయ విశ్వవిద్యాలయం మొదటి గేటుకి ఎదురుగా ఉన్న ప్రొ. కాత్యాయనీ విద్మహే ఇంటివద్ద అనిశెట్టి రజిత పార్థివ దేహం ఉంటుందని చెప్పారని కవులూ రచయితలూ వెళ్లి చూసారు. కాకతీయ వైద్య కళాశాలకి తన దేహాన్ని అప్పగించాలని అనిశెట్టి రజిత కోరిక కాబట్టి అదే ప్రకారం చేసారు.
తెలంగాణ ఆధునిక యుగంలో తొలి కవయిత్రులలో అనిశెట్టి రజిత అగ్రగణ్యురాలు. అనిశెట్టి రజిత కు అక్షర నీరాజనాలు పలుకుతూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
– డాక్టర్ కొండపల్లి నీహారిణి
– ⁠తరుణి పత్రిక ఎడిటర్

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆట  – ఆడు

వచసా స్మరామి! శిరసా నమామి!!