
మూడు జనరేషన్స్ ను చూస్తున్న ఎనబై పదులు వయసులో నాకు మా చిన్నతనం, మా పెద్దవాళ్ళను, మా సంతానం ప్రస్తుత వారి పిల్లల జీవనశైలి గుర్తుచేసుకోవాలనిపిస్తుంది. మేము ఆరుగురం, ఐదు మంది పిల్లలo మాకు ఒక అన్న ఊరికి, ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు, దూరం కాకుండానే కొంత మార్పుతో హైదరాబాదులో ఉంటున్నాo కనుక చదువులకని మా చిన్నాన్న పెద్దమ్మల పిల్లలు మరొకిద్దరు మగపిల్లలుండేవారు కాగా ఆడపిల్లలందరికి పొడవాటి వెంట్రకలుండేవి అప్పట్లో క్రఫ్ లు అంతగా లేవు. జడలు వేసి రిబ్బన్లతో కట్టేది అమ్మ. ఉదయాన్నే టిఫిన్ తిని పాలు తాగి అప్పట్లో ఇంట్లో చేసే పలహారాలు తప్ప ఎప్పుడో జ్వరం వచ్చినప్పుడు బ్రెడ్ అంతే కాని “కెలాగ్స్” లాటివి తెలియవు. ఆ కార్యక్రమంతో పాటు అమ్మ లంచ్ బాక్సలు సిద్ధం చేసి స్కూళ్ళకు పంపేది. మేం లేచేసరికి అమ్మ స్నానాధికాలు, పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని మరీ మా కన్నీ సిద్ధం చేసేది. మద్య మద్య నాన్నకు ఆయన కొరకు వచ్చే వాళ్ళ కొరకు కాఫీ, టీ లు వగైరా అందిస్తుండేది, ఆ కాలంలో రైతు కుటుంబాల్లో మగవాళ్ళు వ్యవసాయం బయట వ్యవహారాలూ తప్ప ఇంటి విషయాలు కానీ, పిల్లల చదువుల గురించి గానీ పెద్దగ పట్టించుకొనేవాళ్ళు కాదు. ఎవరైన కొత్తగ అతిధులు వచ్చినప్పుడు మేమేమీ చదువుతున్నామో వాళ్ళు మా నాన్నను అడిగినపుడు మమ్మల్నె అడిగి చెప్పేవారు ఆయన.
తగవులు, అలుగులు, గొడవపడుతూ పిల్లల్లో సహజంగా అన్ని రకాల వాళ్ళముండేవాళ్ళం. అయినా మా పెద్దవాళ్ళ నుండి మా ఒంటి పై ఒక్క దెబ్బ పడి ఎరుగము. కనీసం విసుగులు, కసుర్లు లాంటివి కూడా మాకు తెలియదు సంతానం కూడ ఒక భాగ్యOగ భావించే రోజులవి. వెలితి లేని ప్రమ మా కందరికి దొరికింది. పండగయినా ప్రయాణమయినా ఆనందమైన జ్ఞాపకాలుగ మిగుల్చుకున్నాము సాయంత్రం స్కూళ్ళ నుండి రాగానే చిరుతిండ్లు (బొరుగుముద్దలు, సున్నుoడలు, నువ్వుముద్దలు, ఉప్పు చెక్కలు, కారప్పూస, మణుగుబూలు) ఇవెప్పుడు ఇంట్లో ఉండేవి తినేసి కాసేపు ఆడుకుని స్నానాలు చేసేవాళ్ళము. సంధ్య దీపం పెట్టగానే ఆరున్నర ఏడు గంటలలోపు ఆరు బయట తులసి కోట అరుగు పై అందరం కూర్చుంటే అమ్మ వేడి వేడి అన్నంలో కమ్మని నెయ్యి వేసి పచ్చడి ముద్దలు కలిపి పెడుతూ ఎన్ని విలువలుకూడిన కధలు, మాటలు చెప్పేది. రాత్రి పూట పెరుగు, మజ్జిగ నిషిదం. ఉదయం వంట వేరు, రాత్ర వంట వేరు మెనూ మారిపోయేది. భోజన కార్యక్రమం పూర్తికాగానే ఆ రోజు
హాoవర్కులు, చదువులు పూర్తి చేసుకుని అందరం తలొక గ్లాసు పలు తాగి పడకల మీదికి చేరి ఏవో మాట్లాడుకుంటూ తొమిదిన్నర కల్లా నిద్రపోయేవాళ్ళం. నాన్న భోజనం కాగానే అమ్మ, ఆ పై, పని వాళ్ళ భోజనాలు పూర్తయి ప్రద్దునకు వంటిల్లు సిద్ధం చేసుకుని పడుకునే వాళ్ళు .
ఇక పెద్ద పండగ (సంక్రాంతి), వేసవి సెలవులకు తప్పక ఊరికి చేరేవాళ్ళం. మా వూరు నెల్లూరు జిల్లా అల్లూరు అమ్మమ్మగారి వూరు కూడా అక్కడికి దగ్గరలో ఇందు పూరు ఎనిమిది మంది పిల్లలం మూడు నాలుగు ట్రంకు పెట్టలు (సూట్ కేసుల పరిచయంకాలేదు) చిన్న చితక సంచులు ప్లాట్ ఫాo నిండి పోయేది. హై దరాబాదు నుండి అర్ధ రాత్రి ఖాజీ పేట చేరిన రైలు నుండి నిద్ర కళ్ళతో పట్టాలపై ఆగివున్న రైళ్ళ క్రింద దూరి అవతలి ప్లాట్ ఫారం ఎక్కేవాళ్ళం ఇప్పుడు తలచుకుంటే “ఆయుస్సుOడాలే గాని బ్రతుకు భరోసాకేమీ ఢోకా లేదని పిస్తుంది” . అక్కడ మళ్ళీ రైలు ఎక్కితే తెల్ల వారు ఝామున తలమంచి స్టేషను చేరగానే అక్కడ మా కొరకు గుర్రపు బండ్లు వచ్చి ఉండేవి. అందులో మళ్ళీ రొండు మూడు గంటల ప్రయాణంతో ఊరు చేరేవాళ్ళము. ఇంత ప్రయాణము బడలిక కూడ తెలియకుండ పిల్లలం ఎంజాయ్ చేసేవాళ్ళము. క్రమంగా మా కందరికి పెళ్ళిళ్ళయి తలోక చోట ఉన్నాము నలుగురు ముగ్గురు మా సంతానం. మా పిల్లలకు ఇద్దరు ఒక్కరు అయినా ఆరుగురిని, నలుగురిని పెంచినదాని కన్నా అలసిపోతున్నారు. వంతులు, వాదులతో సతమత మవుతూ, కంఫోర్ట్స్ అనే ఉచ్చులో కంఫర్ట్ బుల్ జీవితం బిగుసుకుపోతున్నది.
తల్లి దండ్రుల పరుగులు, పిల్లలతో గడిపేoదుకు సమయం దొరకని వారి వెలితిని నింపేందుకు “అనవసరమైన స్వేచ్ఛను అవసరంలేని వసతులను” పిల్లలకు అందిస్తూ వారిని మరో ప్రపంచం వైపుకు నడిపిస్తున్నారు. పోటీ జీవితానికి పందెపు కోళ్ళను సాకి నట్లు పిల్లలు పెరుగుతున్నారు. అప్పట్లో శరీర వ్యాయామానికి కొరత లేకుండ నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునేవరకు ఇంట్లో ప్రతి ఒక్కరి అవసరాలు గమనిస్తూ అనవసరమయిన ఆలోచనలులేని ఆరోగ్యకరమైన జీవితం గడిపాము. ఉమ్మడి కుటుంబాలు అత్త ఆడపడుచుల పెత్తనం, తోటి కోడళ్ళ పొరపొచ్చాలు, ఇరుగు పొరుగు పలకరింపులు, బంధు జనం రాకపోకలు ఇన్నింటి మద్య ఎవరి విలువలు వారి కుoడేవి. అందరి మధ్య నా వాళ్ళు అనే భావం చెప్పలేని అనుబంధం ఉండేది. కొంత మెరుగైన సౌకర్యాలతో మా పిల్లల వరకు ఇంచు మించు ఇలాగే గడిచింది. పల్లెటూర్లు పండగల సరదాల రుచిచూసే కానీ వాళ్ళ పిల్లలకు ఆ భాగ్యం దక్కలేదు. చదువులు, ఉద్యోగవేటలతో టౌన్లు , పట్టణాలు నిండిపోతున్నాయి . సహజ సౌందర్యానికి దూరమయి ఊర్లు మూగబోయాయి. కృత్రిమ సొగసులతో పట్టణాలు పగలు రాత్రికి తేడా లేకుండ వెలిగి పోతూ మనిషి మనుగడనే అయోమయంలో పడేశాయి. పీల్చేగాలి తినేతిండి, తాగేనీరు అంతటా కాలుష్యం. ఆలోచనలు మారాయి, అవసరాలు పెరిగాయి. బఫేకు, బంతి భోజనానికున్నంత తేడా “బొన్సాయి” జీవితం ఎదుర్కొంటున్నది. కడుపు నిండదు, కోరిక తీరదు, పెరిగిన వసతులు ఉప్పు నీటి సముద్రాలయి దాహం తీర్చవు . అలుపు ఎరుగని ఆనందం అప్పుడు అనుభవించాము. ఆనందమే అలసిపోతున్నదిప్పుడు అనుకుంటూ సుదీర్ఘమైన నిట్టూర్పుతో ప్రస్తుతంలో నిలిచాను.
- శ్యామదాసి