ఒడిపిళ్ళు-22

ధారావాహిక నవల

ఏ తిరుగుబాటునైనా అణిచివేసేందుకు పన్నే మొదటి వ్యూహం ‘భయ పెట్టడం’.

గిరిజనుల తిరుగుబాట్లను అణచివేసే మార్గం నిరంతర భయాన్ని కలిగించడమే అని షాహుకార్ గ్రహించాడు. అధికారులు ఆ గ్రామాలకి వచ్చినప్పుడల్లా సాహుకార్ పేద్ద సమస్యల జాబితాతో కలిసేవాడు. అతని పంటలు దోచుకున్నారని, అతని పండ్ల తోటలో దొంగలు పడ్డారని. అతని సేవకులు దాడి చేశారని. ఒక నిజాయితీ గల మనిషిగా తను ఈ దొంగవెధవల కారణంగా శాంతితో నివసించడం కుదరటం లేదని అతను చట్టం నుండి రక్షణ కోరుకుంటాడు. కానీ అది కుదరదు. వారి అధికార ప్రదర్శన కంటే ఏదీ ఇష్టపడని అధికారులు, చట్టాన్ని ఉల్లంఘించిన గ్రామాల నుండి ప్రజలను పిలిచి వారు పద్ధతులు మార్చుకోక పోతే భయంకరమైన పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. దానితో సాహుకార్ బాగా బలిసిన ఒక గోదురుకప్పలా తయారయ్యాడు.

వందల చిల్లర పనుల కోసం అనేక రకాల కార్మికులను సాహుకార్ నియమించుకున్నాడు. కొంతమంది వేతనాలకు బదులు ఆహారాన్ని ఇస్తానని; ఇతరులకు నగదు చెల్లిస్తానని చెప్పేవాడు. కానీ అతడు ఎవ్వరికీ డబ్బును ముందస్తుగా ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే వారు అస్సాంలో టీ-తోటలకు పారిపోతారని భయం.

అతని వద్ద పనిచేసివారు అనేక రకాల పనులు చేయవలసి ఉంటుంది. పర్యటనకు అధికారులు వచ్చినప్పుడు కూడా అధికారులకు అన్ని రకాల విధులు నిర్వహించాల్సి వచ్చేది: వారి సామాను తరువాతి శిబిరం-స్థలానికి తీసుకెళ్ళడం, వంటచెరకు తేవడం, శిబిరాలను ఏర్పాటు చేయడం వంటివి. కొన్నిసార్లు వారిలో దయగల అధికారులు కొందరు కొన్ని రాగి నాణాలు ఇచ్చేవారు; కానీ అది ఊహించనిది, అధికారులు ఆయన ఆదేశాల ప్రకారం నటించేవారు, వారికి ఆతిథ్యమిచ్చి ప్రశంసలందుకునే వాడు సాహుకార్.

సాహుకర్ కు విసుగు కలిగినప్పుడు, ఇంకొక వినోదం కనిపించక, రెండు గ్రామాల్లోని కొందరు గిరిజన బాలికలను ‘అతని కోసం నృత్యం’ చేసేందుకు తీసుకురమ్మని ఆయన తన సేవకులను కోరాడు. అతని కంటే అటువంటి పనులు ఇంక ఎవరు చెప్పగలరు?

వేడి వేసవి మధ్యాహ్నాలు, షాహుకార్ యొక్క కొందరు గోటీలు తాగడానికి నీటి కోసమో, చుట్ట వెలిగించుకోడానికి నిప్పు కోసమో ఆగుతారు. ఆ గృహిణి సానుభూతి నిండిన స్వరంతో “మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారా, సోదరా? చూడండి, మీరు చెమటతో తడిసి అలిసి పోయినట్టున్నారు. లోపలికి వచ్చి విశ్రాంతిగా కూచోండి అంటుంది,

అతని చుట్టూ మురికిగా ఉన్న ఆ ఇంటి పిల్లలు నవ్వుతూ చేరతారు. తన ఇంటిలో ఉన్న అంబలిని కూడా అతనికివ్వడానికి సిద్దపడుతుంది. ఒక గాయపడిన వ్యక్తే తన వంటి మరొక బాధితుణ్ణి అర్థం చేసుకుంటాడు.

సాయంత్రం, రెండు గ్రామాల నుండి వచ్చిన గోటీలు, మిగిలిన కూలీలు, పెద్ద మర్రిచెట్టు కింద వెలుగుతున్న మంట చుట్టూ చేరారు. విశ్రాంతిగా వారి చుట్టలను వెలిగించారు. అక్కడ చేరినప్రతి మనిషి సాహుకారు వల్ల కలిగే సమస్యలను, తమ అనుభవాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఆ విధంగా చెప్తూ పొగ ఒక దమ్ము పీల్చి వదిలి వారి ఛాతీని తేలికగా చేసుకుంటారు. “అతను మనం చచ్చేదాకా పని చేయించుకుంటాడు”, అన్నాడు ‘బుడా పరజా’

“రోగాలపాలయ్యేదాకా పని చేసినప్పటికీ ఒకరోజు విశ్రాంతి దొరకదు.”

“ఓహ్, అతని గురించి మాట్లాడకండి” అని ఐతా పరజ అన్నాడు.

“మొత్తం జిల్లాలో ఇతని వంటి కొంచపు మనిషి ఉండడు. అతనికి మన గురించి ఎందుకు ఆలోచన చేస్తాడు? అతడి ధ్యాసంతా అతని బంగారం మీదే” అని మధు ముదులీ అన్నాడు.

“మరి స్త్రీల విషయం మర్చిపోవద్దు! ఆడపిల్లల కోసం ఏదైనా చేస్తాడు నీచుడు, అతనొక మధన కామరాజు. అమ్మాయిని చూస్తే వాడి నోట్లో నీరు ఊరుతాయి. డోంబ్, క్రిష్టియన్, పరజ ఎవరైనా సరే వదలడు” అంగా పరజా అన్నాడు వెంటనే.

“ఓహ్, ఇది ఎప్పుడూ జరిగేదే కదా..

బంగారం ఒక మనిషిని వ్యభిచారిని చేస్తుంది. సమస్య ఏమిటంటే ముసలి వెధవ ఒక అమ్మాయి కోసం ఒక పెన్నీ ఖర్చు పెట్టడు. కానీ గిరిజనుల ఇంటి నుండి ఒక అమ్మాయిని బలవంతంగా గుంజుకు పోగలడు, రెండు రోజులు ఆమెను వాడుకుని, బయటకు గెంటేస్తాడు. ఆమె నదిలో మునిగి చచ్చిపోయిందా, అవమానాన్ని భరించి తన వాళ్ళ వద్దకు తిరిగి వెళ్ళిందా అతనికి సంబంధం లేదు” అని దుర్గా పరజాఅన్నాడు తెలివిగా.

“ఓహ్, అతను ఒక మోసగాడు. నేను అతని వద్దకు పనికోసం ఎప్పటికీ వచ్చేవాడిని కాను. కానీ నేను పెళ్లి చేసుకునే అమ్మాయి తండ్రికి డబ్బును చెల్లించాలి. అమ్మాయి వేచివుంటుంది; కానీ ఆమె తండ్రికి డబ్బు పిచ్చి. అతడొక జలగ వంటి వాడు. ఆమెను ఎవరికైనా అమ్మవచ్చని చెప్పింది ఆమె. నేను అతనికి ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది, కాబట్టి ఇక్కడ నేను సాహుకారుకు గోటి అయ్యాను. నేను అతనిని వదిలేసే ఏకైక మార్గం నా భార్యతో పారిపోవటం మాత్రమే”

సిదా పరజా క్రూరంగా చెప్పాడు.

సోమ్లా అతని కొడుకులు అక్కడే కూర్చుని చుట్టతాగుతూ వారు మాట్లాడే ప్రతిదీ వింటూన్నారు.

సాహూకర్ తమ పూర్వీకులను నిశ్చింతగా బతకనివ్వలేదని ఏకగ్రీవంగా అంగీకరించారు. అతనిలో డోంబ్ జాతి రక్తం ఉండి ఉండాలి. భూమి మీద గొప్పవాళ్ళు, అలాంటి గంభీర జానపదుల గురించి తమ అభిప్రాయాలను తెలిపేందుకు శ్రద్ధ చూపడమే లేదు. వారు విధ్వంసంలో తాము కూడా కారణమై మిగిలి ఉన్న బూడిదను మాత్రమే చూస్తారు, కానీ ఆ బూడిదల కింద తమకు తామే అంతర్దహనమయ్యే జీవితాలు కనబడవు. వారి అధికారంలో అణచబడతూ స్వయంగా వారిని పోషిస్తూంటారు. నిప్పు తనను తాను రగుల్చుకుంటూ వేచి ఉంటుంది

**** ****

మార్చి నెలలో వసంతోత్సవం పండుగ వస్తుంది. ఆ నెలలో రెండు వారాలు గిరిజనులంతా పండుగ సందర్భంగా ఏ పనులు చేయరు. గోటీలుగా పనిచేసే వాళ్లు కూడా ఆ వెట్టిని వదలి బయటికి వస్తారు. షావుకారు వసంతోత్సవానికి సెలవు ఇచ్చేందుకు పరిహారంగా అదనపు పని చేయించుకుంటాడు. వసంతోత్సవం సమయంలో పంపడం కోసం. సోమ్లా భూములను దున్నుతున్నాడు. అతను మొదలుపెట్టిన ధాన్యపుకొట్టు నిర్మాణం పూర్తయింది. షావుకారు కోసం టిక్యా సహాయంతో నాలుగుమంచాలను కూడా తయారుచేశాడు. వాటికి తాళ్లతో అల్లిక చేశాడు. అతనికి విశ్రాంతి అనేది లేదు. కుప్పలుగా పోసిన ధాన్యం, ఎండుమిర్చీని జనపనార బస్తాల్లో నింపి ఎడ్ల బండి పై వేసుకొని అడవి గుండా మార్కెట్టుకు తీసుకువెళ్లి పోతున్నాడు బూక్యా. అతడు ఎడ్లవెంట నడవడానికి ఇష్టపడ్డాడు ఒకవేళ సంతలో కమిలీ కనిపిస్తుందేమోనని అతని ఆశ. కానీ అతని కోరిక నెరవేరలేదు.

సాధారణంగా టీక్యా పని నాగలి దున్నడం. కానీ కొన్నిసార్లు షావుకారు పశువుల మందను అడవిలో మేపడానికి వెళ్ళవలసి వచ్చేది. అలా వెళ్లడం అతనికి కొంత ఆనందాన్నిచ్చేది. పశువులను వాటి ఇష్టానికి మేతకు వదిలి మిగిలిన పశువుల కాపరులతో కలిసి ఆడుకునేవాడు. అప్పుడప్పుడు అడవిలో పూలు తెంపడానికి వచ్చిన అమ్మాయిలను చూసేవాడు. అప్పుడతను తన ఫ్లూట్ తీసుకొని గిరిజన సంప్రదాయాన్ని అనుసరించి పెళ్లి పాటలను, ప్రణయ గీతాలను పాడేవాడు అమ్మాయిలను పెళ్ళికోసం అభ్యర్థిస్తున్నట్టు. అమ్మాయిలు కూడా దానికి సమాధానంగా పాట పాడేవారు దానితో టిక్యా చాలా సంతోషించేవాడు.

….

మార్చి నెలలో ఎండ తీవ్రంగా ఉంది. ఆకాశం స్పష్టంగా మెరుస్తోంది. చెట్లపై కొత్త చిగుళ్లు నాట్యం చేస్తున్నాయి. మార్చి నెల గిరిజనులకు నృత్యం చేసే రుతువు.

అడవంతా సిమిలి , ధాటికి, పలస వంటి రుధిరవర్ణపు పూలతో ప్రజ్వలిస్తోంది. సీతాకోక చిలుకలు మెత్తటి కొత్త రెక్కలతో ఎగురుతున్నాయి. మార్చి నెల గాలులు ఆహ్లాదంగా ఉన్నాయి. కొత్త పువ్వులు ఆకులు పక్షులు అన్ని ఒకే ఎరుపు వర్ణాన్ని ఆస్వాదిస్తూన్నాయి. అడవంతా ఆవహించిన ఎరుపు రంగు రక్తంలో కొత్త ఉద్వేగాలను, ఆవేశాన్ని కలిగిస్తుంది. చిన్నపాటి జింకలు పెద్ద పెద్ద కొమ్ములున్న ఆడ జింకల వైపు పరుగెత్తుతున్నాయి. యువకులంతా యువతుల వైపు కొత్త చూపులు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు వసంతాన్ని సేవించి మత్తులో ఉన్నారు.

కానీ మార్చి నెలకు ఇంకొక కోణం ఉంది ఈ వసంతం కొండ ప్రాంతాల్లో ఎక్కువసేపు నిలువదు. త్వరత్వరగా ఎండుటాకులు సుడిగాలిలో గుండ్రంగా తిరుగుతూ ధూళి మేఘం ఆకాశంలోకి పోతోంది. ఎండిన చెట్లు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నట్టు వసంతం గడిచిపోతుంది.

గిరిజనులంతా వసంతోత్సవం కోసం తయారీలు ఒక నెల ముందు నుంచే మొదలుపెడతారు. ధాన్యం నిల్వ చేసుకోవడం ఒడ్లు దంచి బియ్యం చేసుకొని , చిరుధాన్యాలను పిండి తయారు చేసుకొని అన్ని సిద్ధంగా పెట్టుకుంటారు. వీలైనంత తొందరగా అన్నీ సిద్ధం చేసుకుంటారు. పండుగ సమయంలో కేవలం డాన్సులు, పాటలు, వేట, విందు భోజనాలు, తాగడం అంతే మరి దేనికి చోటు ఉండదు.

వసంతోత్సవం జనాకర్షణంగా ముగిసింది. మండే ఎండలతో ఏప్రిల్ మే జూన్ నెలలు వచ్చేసాయి. తరువాత ఒక్కసారిగా వర్షం మొదలై రుతుపవనాల రాకతో అకాల వర్షం వరద లాగ వస్తుంది. వరి నారు తగినంత ఎదగకపోతే వరదలకు కొట్టుకుపోతుంది. వసంతోత్సవానికి ముందే వరి నారు సిద్ధం చేసి పెట్టుకోవాలి. గిరిజనులంతా పొలాలు దున్ని, పదును చేసుకొని, ఎరువులు చల్లి ఏరువాకకు సిద్ధంగా ఉంచుకుంటారు.

వసంతోత్సవానికి ముందే అడవిలో కొత్త వ్యవసాయం కోసం భూమి ఎంపిక చేసుకుంటారు. భూమి ఎంపిక చాలా జాగ్రత్తగా మరీ ఏటవాలుగా లేని నేలను , దట్టమైన అడవి లేకుండా సారవంతమైన నేలలు ఎంపిక చేసుకుంటారు వ్యవసాయం కోసం. సాధారణంగా ఈ ఎంపిక ఉత్సవం తర్వాత దేవుడిని ప్రసన్నం చేసుకుని పూజలు చేసి ప్రసాదాలు పంచిన తర్వాత చేస్తారు. ఎక్కడైతే పోడు వ్యవసాయం మొదలు పెట్టాలో అక్కడ కొన్ని చెట్లను కాలుస్తారు. వసంతోత్సవానికి ముందు గ్రామస్తులంతా పనిలో తీరిక లేకుండా ఉంటారు. వారు తమ గొడ్డళ్లతో చెట్లు నరికుతుంటారు. ఫారెస్ట్ గార్డ్ ఆ సమయంలో అనేకసార్లు ఊరి చుట్టూ తిరుగుతుంటాడు. పండుగ సమయం కనుక కాల్చిన బొగ్గులను చూసి కనీసం నిందితులు ఎవరో కూడా కనిపెట్టలేడు.

వసంతోత్సవానికి ముందు అందరూ ఉత్సాహంగా పనులు చేసుకుంటారు యువకులు కట్టెలను సేకరిస్తూ, పురుషులు పొలాల్లో పని చేస్తూ, స్త్రీలు అనేక రకాల పనులతో చాలా చాలా తీరిక లేకుండా ఉంటారు.

సోమ్లా అతని కొడుకులు కూడా పండుగ ఉత్సాహంలో ఉన్నారు. సోమ్లా ఈసారి తన పొలాలు పంటకు సిద్ధం చేయడం లేదని నిస్సహాయంగా దిగులుపడ్డాడు.

*** *** *** *** ***

Written by Jwalitha

కవి, రచయిత, అనువాదకురాలు, ఫ్యామిలీ కౌన్సిలర్, సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త, ప్రకృతి ప్రేమికురాలు, తెలంగాణ ఉద్యమ కారిణి అయిన జ్వలిత అసలు పేరు విజయకుమారి దెంచనాల.
‘బహళ’ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక మహిళా పత్రికను 2021నుండి నడుపుతున్నారు.
వీరి రచనలు-
కాలాన్ని జయిస్తూ నేను, సుదీర్ఘ హత్య, అగ్ని లిపి, సంగడి ముంత అనే నాలుగు కవితా సంపుటులు; ఆత్మాన్వేషణ, రూపాంతరం అనే రెండు కథల సంపుటులు; జ్వలితార్ణవాలు అనే సాహిత్య సామాజిక వ్యాసాల పుస్తకం; ఎర్రరంగు బురద, ఆత్మార్ణవం, జగన్నాటకం, ఒడిపిళ్ళు అనే నాలుగు నవలలు మొత్తం 11 పుస్తకాలు రచించారు. ముజహర్ నగర్ లో దీపావళి, ‘పరజ’ వంటి అనువాదాలతోపాటు, బహుజన కథయిత్రుల పరిచయం, మెరిసే అనువాదాలు, అనువాద నవలలు పేరుతో శీర్షికలను నిర్వహించారు.
స్వీయ సంపాదకత్వంలో ఖమ్మం కథలు, మల్లెసాల చేతివృత్తికథలు, కొత్తచూపు స్త్రీల కథలు, పరివ్యాప్త, సంఘటిత, రుంజ, కరోనా డైరీ, లేఖావలోకనం, గల్పికా తరువు, ఓరు వంటి పదో సంకలనాలను ప్రచురించారు. గాయాలే గేయాలై, పూలసింగిడి వంటి అనేక పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు.
మర్డర్ ప్రొలాంగేర్, వుండెడ్ లైవ్స్ పేరుతో వీరి కవిత్వం ఆంగ్లానువాద పుస్తకాలు వెలువడ్డాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

..శిశిరవసంతం……

ఆదిలోనే హంస పాదు