“ఒకప్పుడు పెదనాయుడుగారి పొలంలో కూలినాలి చేసుకునే నేను, ఈ రోజు ఆయనతో సమానంగా ఒక కుర్చీలో కూర్చున్నానంటే, అదంతా ఆ చదువులతల్లి సరస్వతిదేవి అనుగ్రహమే. నా పెద్దబిడ్డ బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుని ఈనాడు ఈ స్కూలుని కట్టించినందుకే కదా, నాకీ గౌరవం? ‘నాయనా! నీ షష్టిపూర్తికేమి కావాలనడిగితే మంచి ఇల్లు కావాలనడుగుదామా! ఇంకా పొలం కొనమందామా! కారడుగుదామా! అనుకున్న నేను ఒక్క నిముషం స్థిమితంగా ఆలోచించాను? దేన్నుండి నా కొడుకు ప్రయోజకుడయ్యాడు? వాడు బాగా చదువుకోబట్టే కదా! ఇప్పటికీ మనూరిలో హైస్కూలు లేదు. చదువుకు పక్కూరికెళ్లాల్సి వస్తోంది. మనూరిలో హైస్కూలుంటే ఎక్కువమంది ప్రయోజకులయ్యే అవకాశముందని, హైస్కూల్ కట్టించమన్నాను’. ఇదిగో ఈ రోజు హైస్కూల్ ప్రారంభోత్సవ సందర్భంగా మనూరి నాయుడుగారి పక్కన నేను కూర్చునే అర్హతను సంపాదించుకున్నాను. ఇదంతా నా కొడుకు వల్లే జరిగింది. అందుకని మీరందరూ బాగా చదువుకొని, ప్రయోజకులయ్యి మీ నాయనలకు మంచి పేరు తీసుకురండి” ఎదురుగా కూర్చున్న పిల్లలనుద్దేశించి అన్నాడు సూరయ్య.
“నా పొలంలో కూలిచేసి, కూలీ డబ్బులకి నా ముందు చెయ్యి చాచిన ఆ సూరయ్య కొడుకెంత చదువుకుంటే మాత్రం… తెలివుండే మాట్లాడుతున్నావా పంతులూ! లేక తాగొచ్చావా! నేనేమిటి? నా అంతస్తేమిటి? ఆడి కొడుకు పెద్దుద్యోగం సంపాదించినంత మాత్రాన… ఆడి కొడుకు కాళ్లు కడిగి నా కూతుర్నివ్వాలా? రేపు నాతో సమానంగా నా పక్కన కుర్చీ యేసి కూర్చోబెట్టుకోవాలా? కూలోడు, నా వియ్యంకుడంటే, నా పరువేమి గాను? ఆలోచించావా?” మండిపడుతున్నాడు ప్రెసిడెంట్ సోమసుందరం, యేభయ్యెకరాల మాగాణికి యజమాని. దాదాపు యిరవయ్యేళ్ల కిందట సోమసుందరమన్న మాటలు… నిన్న కాక మొన్నే జరిగినట్టు అనిపించింది, అదే సమావేశంలో ఉన్న పంతులుకి.
పంతులుకే కాదు, అక్కడ సమావేశంలో ఉన్న పెద్దవాళ్లందరికీ గుర్తొచ్చాయి. “రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. ఓడలు బళ్ళవుతాయి. బళ్ళు ఓడలవుతాయి. ఉంది కదా అని విర్రవీగితే, ఇదిగో ఇలాగే అవుతుంది. మెడలో దండ వేసి మరీ, పక్కన కూర్చోబెట్టుకోవాల్సి వచ్చింది” అనుకున్నారంతా.
అదే సమావేశంలో ఉన్న సూరయ్య కొడుకు ప్రభాకర్ కు మాత్రం, ఎందుకో మేనత్త మాటలు గుర్తొచ్చాయి. “అన్నా! పెళ్లిచూపులు చూసిన గంటలోనే, ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటానని, ఆ పిల్ల నీ కొడుకుతో అనిపించగలిగిందంటే, పెళ్లయ్యాక నీ కొడుకు నీకు దక్కుతాడంటావా? ఆడి తర్వాత మరో మూడు నలుసులున్నాయి. ఆలోచించుకో!” భార్య చనిపోయింది కాబట్టి, ముందు కొడుకుకి పెళ్లి చేసి ఆ తర్వాత రెండో సంతానమైన పెద్ద కూతురికి కొడుకు, కోడలి చేతిమీదుగా పెళ్లి చేద్దామనుకుని, ముందు కొడుకుకి సంబంధాలు చూడడం మొదలు పెట్టాడు తండ్రి. చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని, ఐఐటి చేసిన తాను చెప్పడంతో చదువుకున్న అమ్మాయిల్నే చూడడం మొదలుపెట్టారు. పేరుకే డిగ్రీలు గాని, ఎవరికీ చదువు తెలివితేటలు లేవని చాలామందిని చూశాక అర్థమైంది తనకు. అలాంటి సమయంలో… తండ్రి టీచర్, పిల్ల డిగ్రీ వరకు చదివిన సంబంధమొచ్చింది. పెద్దగా ఆశలేమి పెట్టుకోకుండా ఆ అమ్మాయిని చూడడానికి వెళ్లిన తనకు “ఏమీ లేకపోయినా బాగా చదువుకున్న మీలాంటి వాళ్ళంటే, నాకు చాలా ఇష్టం. మీలాంటి వాళ్లు తర్వాతి తరానికి ప్రేరణ కావాలి. మీ గురించి ఎంతో విన్నాను. మిమ్మల్నిలా కలుసుకోవడం నా అదృష్టం” ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చెబుతుంటే, కొత్తగా కలుసుకున్నట్టు అనిపించలేదు ఎన్నో తరాల అనుబంధంలా అనిపించింది. ఇంటికి రాగానే “ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని” తానన్నప్పుడు మేనత్తన్న మాటలవి.
“అన్నా! నువ్వు కష్టపడి చదువుకున్నావన్న మాట నిజమే గాని, అంతమాత్రాన నీ స్వభావం మంచిదై ఉంటుందని నిన్ను చూడగానే ఎలా చెప్పగలరెవరైనా? నాకెందుకో ఆ అమ్మాయి మాటలు సహజంగా అనిపించలేదు” అనేసింది పెద్దచెల్లి కూడా. చెల్లి మాటలు విన్నాక నిజమేననిపించింది.
“పెళ్లిచూపుల్లో కలిసిన వ్యక్తి చదువు, ఉద్యోగం తెలుస్తుంది గాని, వ్యక్తిత్వం ఎలా తెలుస్తుంది? ఆ అమ్మాయి నన్ను పొగిడిన మాటల్లో నిజమెంతని?” ఆలోచించుకుంటే ఆ మాటల్లోని నిజాయితీని శంకించాల్సి వచ్చింది. అలా ఆ సంబంధం క్యాన్సిలయింది. ఒకవేళ ఆ సంబంధమే చేసుకుని వుండుంటే ఈ రోజివన్నీ జరిగుండేవా?”
“ఏమిటండీ అంత దీర్ఘాలోచన?” చేతిలో చెయ్యి వేసి మరీ అడిగింది పక్కనే కూర్చున్న భార్య శోభన. భార్యని చూసిన ప్రభాకరుకు తామిద్దరి పెళ్లి ఏ పరిస్థితులలో అయిందో గుర్తుకొచ్చింది.
ఎకరం పొలం తప్పించి, సొంతాస్తుల్లేవు. పొలం మీదొచ్చిన పంట చాలక కూలిపని చేస్తేనే గడిచే సంసారం. ఏదో తాను కష్టపడి చదువుకొని, ఉద్యోగం సంపాదించుకున్నాడు. చెల్లి పెళ్లి చెయ్యాలంటే, పీటలమీద కూర్చోడానికి కోడలుండాలని, నాన్న చూసిన సంబంధాలేవి తనకి నచ్చలేదు. అలాగని పెద్దింటి సంబంధాలకు వెళ్లలేరు. గాని, తమ ప్రమేయం లేకుండానే, పెద్ద నాయుడుగారిని సంబంధం గురించి అడిగిన పంతులెన్ని మాటలు పడాల్సివచ్చిందో ఊరంతా విన్నారు.
అలాంటి పరిస్థితులలో అనూహ్యంగా వచ్చింది శోభన సంబంధం. పెద్ద నాయుడుగారి దాయాది కూతురే శోభన. చిన్నప్పటినుండి కార్లలో తిరిగిన పిల్ల. తాతగారి వ్యసనాలకు ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోతే, మునిగిపోబోయిన ఓడలా ఉంది వాళ్ళ కుటుంబం. పొలం తాకట్టులో ఉంది. అమ్మాలంటే కొనేవాళ్ళు లేరు. కొంటామన్న వాళ్లు చాలా తక్కువ ధరకు అడుగుతున్నారు. కూతురికి కట్నమిచ్చి పెళ్లి చెయ్యలేని పరిస్థితుల్లో వున్న శోభన తండ్రి చినరాయుడికి, నేనొక ఒక ఆశాకిరణంలా కనిపించానేమో! ఈ సంబంధం చేసుకుంటే దాయాదుల ముందు చిన్నచూపని తెలిసినా, సాహసంచేసి తన తండ్రిని అడిగేసాడు. కట్నం కింద కొంత బంగారం మాత్రమే ఇవ్వగలనని, వేరే ఏమీ ఇచ్చుకోలేనని కూడా చెప్పేశాడు.
అతని కూతుర్ని కోడలిగా తెచ్చుకునే ధైర్యం తండ్రికి లేక, ఆ విషయం తనకు కూడా చెప్పలేదు. గాని చిననాయుడు తండ్రినడిగిన విషయం… ఎలాగో వూరంతా పాకిపోయింది. “చావనైనా చస్తాను గానీ, నా కూతురిని కూలోడి ఇంటికి కోడలిగా పంపించనన్నాడట” పెదనాయుడు, చిననాయుడు వింటుండగా చుట్టాలందరిముందు. తర్వాత కొన్నాళ్లు తనకు సంబంధాలే చూడ్డం మానేశాడు తండ్రి. ఆ విషయాలన్నీ గుర్తొచ్చాయి ప్రభాకరుకు.
*
పెదనాన్నను చూసినప్పుడల్లా తన పెళ్ళికయిన అల్లరే గుర్తుకొస్తుంది శోభనకు. “ఒరేయ్ తమ్ముడూ! ఎందుకు చెప్తున్నానో విను. నా కూతురొకటి, నీ కూతురొకటి కాదు నాకు. నా కూతుర్ని ఇవ్వనన్నప్పుడు, నీ కూతుర్నెలా ఇస్తావు? కూలీ చేసుకు బతికిన వాళ్ళింటిలో మన పిల్లెలా యిమడగలదు? అంతేకాకుండా నాయుడోళ్ల పరువు మర్యాదలు మన చేతుల్లో ఉన్నాయి. ఈ రోజు ఉద్యోగం వచ్చిందని ఆడూ, మనమూ ఒకటై పోతామా? ఊర్లో మన పరువేం గావాలి? నీ పరిస్థితి నాకు తెలియంది కాదు. ఒక పన్జెయ్యి. ఏదో ఒక సంబంధం చూడు. భువనకు, శోభనకు ఒకేసారి పెళ్లి చేసేద్దాం. ఇన్నాళ్లూ మనల్ని పెద్దింటోళ్ళని గౌరవమిచ్చారు. ఈ పెళ్లి జరిగితే ఇప్పుడా గౌరవం మట్టిలో కలవాల్సిందే. పెద్దవాడిని చెప్తున్నాను వినని” ఆ రాత్రి పెదనాన్న తనింటికొచ్చి నాన్నతో అన్న మాటలు పక్కగదిలో ఉన్న తాను వింటున్నట్టు వాళ్లకు తెలియదు.
ఈ విషయం తెలుసుకున్న క్లాస్మేట్, కాలేజీలో తనను చూడగానే “ఆడుతు, పాడుతు పనిచేస్తుంటే” అని యాక్షన్ చేసి మరీ పాడేవాళ్ళు. తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమయ్యేది కాదు. భూమి నిలువునా చీలి తనను కప్పేస్తే బాగుండునని ఉండేది. తన ఇంటి పరిస్థితి తనకు తెలుసు. భూములన్నీ తాకట్టులో ఉన్నాయి. ఇంట్లోని విలువైన వస్తువులు కదిలిపోతున్నాయి. తల్లి బంగారమొక్కటే ముట్టుకోలేదు తాతగారు. ఈ పరిస్థితుల్లో తన పెళ్లి చెయ్యాలంటే తండ్రికి తలకు మించిన భారమే. పేరుకే చిన్ననాయుడు గాని, ప్రతి నిమిషం తండ్రెంత క్షోభ ననుభవిస్తున్నాడో తనకు తెలుసు. అయినా ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో తాను.
ఇది జరిగిన కొన్నాళ్లకు…
భువనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అబ్బాయి లా చేశాడు. బాగా కలిగిన కుటుంబం. త్వరలోనే ముహూర్తాలు కూడా పెట్టుకుందాం అనుకుంటున్నారు. అప్పుడు పెదనాన్న తమ ఇంటికొచ్చి “తమ్ముడూ! శోభన పెళ్లి గురించి ఏమాలోచించావు? భువనతో పాటు శోభనక్కూడా పెళ్లి చేసేద్దాం. ఖర్చులు కలిసొస్తాయి” అనడిగాడు “శోభన చదువయ్యాక చూస్తానులే అన్నయ్యా. ఇప్పుడు భువనకు పెళ్లి చేసేద్దామన్నాడు” నాన్న. భువన పెళ్లిలోనూ గుసగుసలే. పెళ్లికొచ్చినవాళ్లు కూడా నాన్నకు చెప్పడమే “ఇలాంటి ఆలోచనలు నీకెందుకు? మేమంతా లేమా!” అని.
డిగ్రీ అయిపోయింది. పీజీలో జాయినయింది. కాంపిటేటివ్ ఎగ్జామ్సుకు ప్రిపేరవుతూ… తాను మంచి ఉద్యోగం తెచ్చుకుంటే నాన్నమీద భారం తగ్గుతుందనే ఆశ. అప్పుడొచ్చాడు ప్రభాకర్, తమ కాలేజీకి టీం లీడరుగా క్యాంపస్ సెలక్షన్స్ ఇంటర్వ్యూ చెయ్యడానికి. ఎలా తెలిసిందో అందరికీ? అతనే ఇతనని. అందరూ చాటుమాటుగా అతనిని చూడడం… చూసి చాలా బాగున్నాడని తనకు చెప్పడం… అసలతనికి, తనకి ఏమి సంబంధం?
తనను ఇంటర్వ్యూ చేసేది అతనేనని తెలిసాక, తనకి నోటమాట బయటకు రాలేదు. ఏదడిగినా, సరిగ్గా చెప్పలేకపోయింది. ఇంటర్వ్యూకి చాలా బాగా ప్రిపేరయింది. ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వస్తుందని ఆశ పడింది. ఇంటర్వ్యూలో అతనిని చూస్తే ఒక్కమాట కూడా బయటకు రాలేదు. తనకే రకంగానూ సంబంధం లేని వ్యక్తి తన జీవితాన్ని ఎందుకలా అతలాకుతలం చేస్తున్నాడో తెలియడం లేదు. గత మూడేళ్లుగా తన జీవితాన్ని ఒక కుదుపు కుదిపిన వ్యక్తి. ఆ విషయం ఆయనకు కూడా తెలియకపోవచ్చు.
“రాత పరీక్షలో మంచి మార్కులొచ్చాయి. ఇంటర్వ్యూలో ఏమీ చెప్పడం లేదు. ఎందుకని?” సూటిగా చూస్తూ అడిగాడతను. “అది మీవల్లనేనని” చెప్పగలదా తాను?”. “మీరు ఇంటర్వ్యూలో కూడా ఫస్ట్ వస్తారనుకున్నానంటూ” ఇంకా ప్రశ్నలడుగుతున్నాడు.
“సారీ” చెప్పి బయటికొచ్చేసింది. తన జీవితమెందుకిలా అవుతుంది? సమాధానం తెలియని ప్రశ్న. అప్పుడొచ్చింది ప్రాణ స్నేహితురాలు రాజి. “ఆ అబ్బాయికింకా పెళ్లి కాలేదట. ఇంత మంచి సంబంధం వదులుకోవడమెందుకు? మీ నాన్నకు చెప్పు, మరలా అడగమని” సలహా ఇచ్చింది.
తానేమీ నిర్ణయం తీసుకోక ముందే, “సార్! మీ అమ్మాయికి అభ్యంతరం లేకపోతే, పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ” అని చెప్పాడు నాన్నతో, తమ ఇంటికొచ్చి. అది తెలిసి పెదనాన్న ఎంత గొడవ పెట్టారు? పెళ్లి జరిగితే తామెవరమూ రామని బెదిరించారు. ఈ గొడవలన్నీ ఎందుకు అనుకున్నాడో ఏమో! రిజిస్టర్ పెళ్లన్నాడు. అలా… ఇదిగో ఇప్పుడు తామిద్దరూ…. భార్యాభర్తలుగా… చప్పట్ల శబ్దం వినిపిస్తుంటే గతం నుండి బయటపడింది శోభన.
*
“అప్పుడు తాను సరైన నిర్ణయం తీసుకొని ఉండుంటే, ఈ రోజు శోభన స్థానంలో తన కూతురు ఉండవలసింది. ఆరోజు మూర్ఖంగా ఆలోచించి మంచి అవకాశాన్ని వదులుకున్నాడు. తమలాగే పెద్దింటి కుటుంబమని, లా చదివి బిజినెస్ చేస్తున్నాడని కూతుర్నిచ్చి పెళ్లి చేసిన అల్లుడు బిజినెస్సులో ఆస్తి తగలేస్తున్నాడు. ఇప్పుడు పైన పటారం, లోన లొటారంలా ఉంది వాళ్ల కుటుంబ పరిస్థితి. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. ఓడలు బళ్ళవుతాయి. బళ్ళు ఓడలవుతాయన్న విషయం తనకప్పుడు తట్టలేదెందుకని?”
“వ్యవసాయంలో కిట్టుబాటు లేదు. వ్యాపారం చేస్తే లాభాలెక్కువన్న” అల్లుడి మాటలు నమ్మి వ్యాపారంలో పెట్టుబడి పెడితే, అసలుకే మోసమొచ్చింది. కొడుకుని చూస్తే, వాడు చదివిన చదువుకి ఉద్యోగం రాదు. వ్యాపారమంటూ ఎగిరి, ఆస్తి గుల్ల చేస్తున్నాడు. ఇప్పుడు మునగబోయే పడవలా ఉంది తన సంసారం. అప్పుడు తమ్ముడే పరిస్థితుల్లో ఉన్నాడో, ఇప్పుడు తనా పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు తనెంత దర్జాగా బ్రతికాడో, ఇప్పుడు తమ్ముడంత దర్జాగా బ్రతుకుతున్నాడు. పెద్దింటివాళ్ళన్న మాట నిలుపుకోవడం ఇప్పుడు తలకు మించిన భారమవుతుంది.” ఇవన్నీ బయటకు చెప్పుకోలేక, హైస్కూల్ ఓపెనింగ్ అయిపోయాక, గదిలో తలుపేసుకుని ఒంటరిగా చింతిస్తున్నాడు పెద్ద నాయుడు.
*