ఓ ప్రేమ కథ ( మోహన రాగం! -10 వ భాగం

ధారావాహిక నవల

జరిగిన కథ

రాగమాల మోహన్ వాళ్ళ ఊరికి వెళ్లి వస్తుంది.సుమిత్ర పెద్ద కూతురు రావడంతో రాగమాలకు చదువు డిస్టర్బ్ అవుతుంది. మోహన్ అక్కకు పెళ్ళి కుదిరిందని సంతోషంగా వచ్చి చెప్తాడు మోహన్. రాగ ఎక్కువ స్పందించలేదని అలిగి వెళ్ళి పోతాడు

కథలోకి వెళ్దాం!

రాగమాల మళ్లీ టౌన్ కు బయలుదేరింది. ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూ ఉండడంతో ఎవరికి వాళ్లు చదువు కోవడంలోనే నిమగ్నం అయిపోయారు. మోహన్ అసలు కలవనే లేదు.

అనుకోకుండా ఒక అవాంతరం వచ్చి పడింది. కిషన్ రావు గారికి వేరే జిల్లాకు ట్రాన్స్ఫర్ అయింది. మరో వారంలో జాయిన్ కావాలని ఆర్డర్స్ వచ్చాయట. ఆ విషయం చెప్పగానే రాగ మాలకి టెన్షన్ వచ్చేసింది.

సుమిత్ర రాగ మాల దగ్గరికి వచ్చి,

“రాగా! మామయ్య వారం లోపల జాయిన్ కావాలట. మరో వారంలో మేము ఇల్లు ఖాళీ చేస్తాము. ఎలా మరి? ఏం చేద్దాము?”అని అడిగింది.

ఏమీ తోచని ఆమె అలాగే కూర్చుంది.

“పోనీ ఒక పని చేద్దాం! మేము నెల మొదటి వారంలోనే ఖాళీ చేస్తాము కదా! ఇంకా ఇరవై రోజుల సమయం ఉంటుంది. ఆ లోపల నీ ఎగ్జామ్స్ అయిపోతాయి. మేము సామానంతా తీసుకు పోకుండా, కొన్ని గిన్నెలు ఒక స్టవ్వు ఉంచేసి వెళ్తాము. ఎలాగూ మాకు ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి. మళ్లీ రావాల్సి వస్తుంది. అప్పుడు ఆ సామాను తీసుకొని వెళ్తాము .నువ్వు అమ్మను ఇక్కడికి వచ్చి ఉండమను. ఇలా అయితే బాగుంటుంది”అని చెప్పింది.

“అవునత్తయ్య! ఈ ఆలోచన చాలా బాగుంది. నేను రెండు రోజుల లోపల ఊరికి వెళ్లి అమ్మకు ఈ విషయం చెప్పి వస్తాను. అమ్మ కూడా అవసరం ఉన్న సామాను తీసుకొని వస్తుంది. మీరు ఇక్కడ సామాను ఏమీ ఉంచకండి. మళ్లీ రావడం ఎందుకు? ఆ నెల రెంట్ మేము కట్టేసుకొని మేమే ఉంటాము.ఇన్ని రోజులు నాకు ఎంతో సహకరించారు.ఎప్పటికీ మిమ్మల్ని మరచి పోలేను”అని చెప్పింది.

సుమిత్ర కూడా అదే చెప్పింది..”నువ్వు కూడా మా ఇంటి అమ్మాయి లాగే అయ్యావు.చక్కగా కలిసి పోయావు” అంటూ దగ్గరకు తీసుకుంది.

ఈ విషయం నిర్ణయం అయిన తర్వాత, రాగమాల మోహన్ ని కలిసి జరిగిన విషయం చెప్పింది.

“మరి ఊరికి ఎప్పుడు వెళ్తావు? ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. టైం వేస్ట్ చేసుకోవద్దు”అన్నాడు.

“రేపు వెళ్లి, ఎల్లుండి వచ్చేస్తాను. ఈలోపల అమ్మ ఇంట్లో పనులు ఏవైనా ఉంటే చేసుకుంటుంది”అని చెప్పింది.

అలా కిషన్ రావు గారి ఫ్యామిలీ సామానంతా సర్దుకుని వెళ్ళిపోయారు. పిల్లలైతే చాలా బాధపడ్డారు. ఎక్కువగా వీణ బాధ పడింది.

“అక్క! మిమ్మల్ని మేము చాలా మిస్ అవుతున్నాము”అని వీణ చెప్పింది.

“అక్కా! ఎప్పుడైనా ఉత్తరం రాయి. మళ్ళీ ఎప్పుడైనా నిన్ను వచ్చి కలుస్తాము”అన్నది త్రిష.

ఆమెకు అలా వాళ్ళ ఇంటి రుణం తీరిపోయింది.

వసుంధర వచ్చి ఇక్కడే ఉంటూ, కూతురికి అవసరమైనవి చేసి పెడుతూ ఉంది.

మోహన్ కు రావడం ఎంతో సులభం అయింది. బుక్స్ , రికార్డ్స్ కోసము వచ్చేవాడు. ఎగ్జామ్స్ ముందు రికార్డ్స్ సబ్మిట్ చేయాలని చెప్పారు. రాగమాల తన రికార్డ్స్ అన్ని కంప్లీట్ చేసి కాలేజీలో సబ్మిట్ చేసింది.

మోహన్ మాత్రం ఒక్క రికార్డ్ కూడా కంప్లీట్ చేయలేదు. ఒకరోజు వచ్చి,

“రాగా! నేను రికార్డ్స్ ఇంకా మొదలు పెట్టలేదు. ప్లీజ్! నా రికార్డ్స్ రాసివ్వవా” అని అడిగాడు.

“అసలు టైమే లేదు. ఇప్పటివరకు ఏం చేశావు? ఎందుకు రాయలేదు?”అని అడిగింది కంగారుగా.

“ఏమో రాయలేదు. ఇదిగో బొటనీ నువ్వు కంప్లీట్ చేసేయ్. అందులో డయాగ్రామ్స్ వేయడం నాకు కష్టం. నేను కెమిస్ట్రీ, జువాలజీ చేసుకుంటాను”అన్నాడు.

మొహన్ రికార్డు కష్టపడి కంప్లీట్ చేసింది. ఇంకా హెర్బెరియం కూడా తయారు చేసుకుంది. కొన్ని జాతులకు సంబంధించిన ఆకులు, పువ్వులని ఒక బుక్ లో అతికించి వాటి గురించి వివరించడమే హర్బేరియం.

ఇంట్లో, ఇంటికి సమీపంలో దొరికే మొక్కలను, చెట్ల ఆకులను,పూవులను తీసుకొని హెర్బేర్యాన్ని అందంగా తయారు చేసుకుంది. అతను అది కూడా చేయ లేదన్నాడు.

రికార్డ్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత, హెర్బెరియం సబ్మిట్ చేసింది. మొదటి బ్యాచ్ రాగ మాలదైతే రెండవ బ్యాచ్ మోహన్ ది.

రికార్డ్స్ కైతే రంద్రం చేసేస్తారు. హెర్బెరియంకి కూడా సంతకాలు పెడతారు. కానీ ఆకులు,పూవులు అలాగే ఉంటాయి. రాగమాల తన హెర్బెరియం తెచ్చుకొని జాగ్రత్తగా, ఆకులని, పువ్వులని తీసి వేరే బుక్ లో అతికించి వాటి గురించి వివరించి వ్రాసి అతనికి ఇచ్చింది.

” వెళ్లి సబ్మిట్ చెయ్యి ఇప్పటికైనా” అని చెప్పింది.

అలా అన్నింటికీ ఆధార పడేవాడు. ఆమె కూడా సంతోషంగానే చేసి ఇచ్చేది. ఎగ్జామ్స్ సమయంలో అతను వంట చేసుకోకుండా ఒక్కడే ఉన్నాడని తెలిసి, వసుంధర అతన్ని ఇక్కడే భోజనం చేయమని చెప్పింది.

ఎగ్జామ్ అయ్యాక, ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లేవాడు.

అప్పుడే శ్రీరామనవమి వచ్చింది. వసుంధర చెల్లెలి ఊర్లో శ్రీరామనవమి ఉత్సవాలు బాగా జరుగుతాయని, తాను పక్కింటి సునందతో వెళ్లాలని అనుకుంది.

“ఒక్క రోజుకే కదమ్మా వెళ్లిరా”అని చెప్పింది.

“ఒక్క దానివి ఎలా ఉంటావు?”అని వసుంధర అన్నది.

అనుకోకుండా రాగమాల పెద్దక్క కొడుకు వచ్చాడు. అతను “నేనుంటాను నువ్వు వెళ్ళు అమ్మమ్మ”! అని చెప్పాడు.

మోహన్ ఆసమయంలో ఒకరోజు ఒక వంటకం వండి తీసుకొని వచ్చాడు.

“ఎలాగూ మీ అమ్మగారు లేరు కదా! అందుకని ఈరోజు నేను వంట చేసుకుని తీసుకొని వచ్చాను. ఎగ్జామ్స్ కి రెండు రోజులు గ్యాప్ ఉంది కదా?”అన్నాడు మోహన్.

“నీకు వంట చేయడం వచ్చా”అని అడిగింది.

“ఏవో కొన్ని చేస్తాను. ఈరోజు మాత్రం పాలకూర, టమాటా కలిపి చేశాను. ఎలా ఉందో చెప్పు”అన్నాడు.

“పాలకూర, టమాట కలిపి చేయకూడదంటారు కదా! నీకు తెలియదా”? అన్నది.

“ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదులే. బాగుంటుంది. నువ్వు తిని చూడు”అన్నాడు.

అన్నం పెట్టుకొని, అతను తెచ్చిన కూర వేసుకొని తింటూ..

“నిజంగానే చాలా బాగుంది. నేనైతే ఇలాంటి కూర ఎప్పుడు తినలేదు. చాలా బాగా చేశావు”అని ప్రశంసించింది.

అతను కూడా తినేసి ఇంటికి వెళ్ళిపోయాడు.

అలా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి. ఇల్లు ఖాళీ చేసి ఊరికి వెళ్లాలని అనుకున్నారు.

అనంతరం రాయబోయే ఎంట్రన్స్, చదువు గురించి ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు.

మోహన్ వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేశారు. అందరూ హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోయారు.

అనుకోకుండా రాగమాల తండ్రి దక్షిణామూర్తి గారికి కూడా వాళ్ళ సొంత ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు మోహన్ నాన్నగారు రామారావు గారు, దక్షిణామూర్తి గారు ఒకటే ఆఫీసులో పని చేస్తున్నారు.

ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి.ఆమె ఎంట్రన్స్ ల కోసం చదవడానికి బుక్స్ తెచ్చుకుని, రోజంతా చదువుతూ కూర్చునేది.

అతను కూడా హైదరాబాదులో ప్రిపేర్ అవుతున్నాడు. ఎప్పుడో ఒకసారి వాళ్ళ ఊరికి వెళ్లేటప్పుడు వచ్చి కలిసి వెళ్ళి పోయేవాడు. కానీ అంతగా మాట్లాడు కోవడానికి సమయం కూడా దొరికేది కాదు.

ఒకరోజు రాగమాల కరుణ ఇంటికి వెళ్ళింది. మాటల సందర్భంలో కరుణ అడిగింది.

“మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక అతన్ని చూశాను. పరిచయం కూడా చేశావు మోహన్ అని. అతను నీకు మామూలు ఫ్రెండ్ లాగా అనిపించలేదు. ఏదో ఉంది అని అనిపిస్తుంది! చెప్పొచ్చు కదనే”అని అడిగింది.

“నిజంగా అట్లా అనిపించిందా? ఎందుకని అనిపించింది?”అని రాగమాల అడిగింది.

“ఏమో నాకు అట్లా అనిపించింది. నువ్వు చెప్పు”అని కరుణ అన్నది.

“నిజమే!” అని చెప్పి, మొత్తం జరిగిన విషయం చెప్పింది.

అనురాగ్ కి మోహన్ తరచుగా రావడం ఇష్టం లేదు.అందులో అతనికి విషయం తెలుసు.

ఆమె అందుకని ఇంటికి వద్దని చెప్పింది.

ఒకరోజు తనని కలవడానికి వచ్చిన మోహన్, కరుణ వాళ్ళింటికి వెళ్ళాడు. వీళ్ళ విషయం తెలిశాక రెండు మూడు సార్లు వాళ్ళింట్లోనే కలిశారు.

ముందు గదిలో కరుణ వాళ్ళమ్మ కూర్చుని ఉంది.

ఇంటి ముందు నిలబడ్డ ఇతన్ని చూసి,

“ఎవరు కావాలి బాబు” అని అడిగింది.

అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు..

మోహన్ కాసేపు ఆలోచించి,

“ఆయుర్వేదం డాక్టర్ రామ భద్రయ్య గారి ఇల్లు ఎక్కడండి?”అని అడిగాడు.

రామ భద్రయ్య గారి ఇల్లు కరుణ ఇంటికి రాగమాల ఇంటికి మధ్యలో ఉంటుంది. ఆ ఇల్లు మోహన్ కి కూడా తెలుసు. కానీ సమయానికి ఆమెను చూసాక నోటమాట రాక ,ఏదో ఒకటి చెప్పేశాడు.

“అటు ముందుకు వెళ్ళు బాబు. ఆఇంటి దర్వాజాలకు నల్ల రంగు వేసి ఉంటుంది. అదే వాళ్ళ ఇల్లు”అనీ కరుణ వాళ్ళ అమ్మ చెప్పింది.

‘ఇక రాగ మాలను కలవడం కుదరదు. కరుణ బయటకు వస్తే బాగుండు’ అని కాసేపు అటూ ఇటూ కదిలినట్లు చేశాడు. ఇంతలో కరుణ బయటకు వచ్చింది.

“మోహన్ మీరా? లోపలికి రండి. ఇక్కడ నిలబడ్డారేంటి?”అన్నది.

“ఎవరే ఇతను? రామ భద్రయ్య గారి ఇల్లు కావాలని అడిగాడు. నీకు తెలుసా?”అని అనుమానంగా చూసింది కరుణ వాళ్ళ అమ్మగారు.

“తెలుసులే! అమ్మా! రాగమాల వాళ్ళ చుట్టాలు. ఇక్కడికి వచ్చాక, నిన్ను చూసి కంగారుపడి వాళ్ళ ఇల్లు అడిగి నట్టున్నాడు. ఇప్పుడు రాగమాల వస్తుంది”అని కరుణ చెప్పింది.

అతను లోపలికి వచ్చి కూర్చున్నాడు.

కరుణ లోపలికి వెళ్లి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది.

“రాగకు మీరు వస్తున్నట్లు తెలుసా? లేక ఎవరినైనా పంపించనా?”అని అడిగింది.

“తెలియదు . తనకు రేపు వస్తున్నట్లు చెప్పాను. కానీ అనుకోకుండా ఈరోజే రావాల్సి వచ్చింది. ఇంకా వాళ్ళింట్లో కలవడం ఇబ్బందిగా ఉందనిపించి, మీ ఇంటికే వచ్చాను”అని అతను అన్నాడు.

“సరే, నేను మా తమ్ముడిని పంపిస్తాను”అని చెప్పి కరుణ తన తమ్ముడిని రాగమాల ఇంటికి పంపించింది.

కాసేపట్లో ఆమె కరుణ ఇంటికి వచ్చింది.

“ఏంటి ఇక్కడికి వచ్చావు? వీళ్ళింట్లో కరుణ వాళ్ళ అమ్మగారు వాళ్లు ఏమైనా అనుకుంటారు కదా?”అన్నది టెన్షన్ గా.

“నువ్వు ఆపవే?మా అమ్మ ఏమీ అనుకోదు. వస్తే ఏమైంది?”అని కరుణ కోపంగా అన్నది.

కాసేపు ముగ్గురు మాట్లాడుకున్న తర్వాత, వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. రాగమాల ఇంటికి వచ్చేసింది.

రామారావు గారు ఇదే ఊర్లో పనిచేయడంతో అప్పుడప్పుడు మోహన్ బుక్ అడిగాడని ఇంటికి వచ్చేవాడు. కొన్నిసార్లు రాగమాల బుక్స్ తెచ్చి ఇచ్చేవాడు.

మోహన్, రాగమాల ఆ బుక్స్ తో మెసేజెస్ పంపించు కునేవాళ్ళు. ఉత్తరాలు కాకుండా బుక్ లో ఉన్న అక్షరాలను రౌండప్ చేసి మెసేజెస్ పంపించు కునేవాళ్ళు.

అదంతా తెలియని రామారావు గారు, బుక్స్ ఇవ్వడం తీసుకెళ్లడం చేసేవారు. అప్పుడప్పుడు వాళ్ళ చిన్న కొడుకు రాముని కూడా ఇక్కడ దింపే వాడు.

అలా ఇటు చదువు, అటు ప్రేమ రాయబారాలు నడుస్తూనే ఉన్నాయి.

ఒకరోజు వసుంధర..

“రాగా! మామ నీ గురించి మోహన్ గురించి తప్పుగా అనుకుంటున్నాడు. అతను ఎందుకు ఇంటికి వస్తున్నాడు? అట్లా రావడం బాగా అనిపించడం లేదు? నువ్వు వాళ్ళకి చెప్పు!వాళ్ళిద్దరి పరిచయం ఎందాక వెళ్తుందో? అన్నాడు”అని చెప్పింది.

“మరి నువ్వేమన్నావమ్మా”? అని ఆమె అడిగింది. చెప్పాల్సిన సమయం వచ్చింది అని మనసులో అనుకుంది. ఆమెకు తల్లి దగ్గర ఎక్కువ చదువు ఎక్కువ. ఆమె ప్రతిఘటించే తత్వం లేదు. కాబట్టి అమ్మకు చెప్పడమే మేలు అనుకుంది.

“వాడన్నీ అలాగే అనుకుంటాడు. వాళ్ళ మధ్య అట్లాంటివి ఏమీ లేదు. ఆ అబ్బాయి కూడా చాలా మంచివాడు. అని చెప్పాను”అని ఆమె అన్నది.

“ఒకవేళ అది నిజమే అయితే ఏం చేస్తావ్?” అని అడిగింది.

“నిజమా! అట్లా అవుతుందా? ఏమో నేను ఆ విధంగా ఆలోచించలేదు”అన్నది కంగారుగా.

“ఒకవేళ అయితే ఏమవు తుందమ్మా”అన్నది.

“నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? అసలు ఇది జరగదు. నువ్వు అట్లాంటి ఆశలు ఏమి పెట్టుకోవద్దు”అని అన్నది.

ఒక్కసారిగా ఆమెకు బాధ కలిగింది. తల్లి ఇలా అంటుందని ఊహించలేదు. రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంది.

అలా కొన్ని రోజులు జరిగాయి. రాగ మాల రోజు రోజుకు చిక్కి పోతూనే ఉంది. అసలు భోజనం చేస్తుందా! లేదా! అన్నట్లుగా అయిపోయింది. గుప్పెడు మెతుకులు కూడా పట్టుమని తినేది కాదు.

ఒకరోజు..

“ఒరే అనురాగ్! చెల్లె ఎందుకో చిక్కి పోతుంది. ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లరా! అన్నం కూడా సరిగా తినడం లేదట”అన్నాడు బాధగా.

“సరే! నాన్న తీసుకెళ్తాను”అన్నాడు. కానీ అతనికి తెలుసు చెల్లి ఎందుకు చిక్కి పోతుందో.

డాక్టర్ దగ్గరికి వెళ్లి వచ్చారు. ఏదైనా జబ్బు ఉంటే కదా! చెప్పడానికి .ఏదో అరగడానికి టానిక్కు రాసిచ్చాడు. అది తెచ్చి ఇచ్చాడు అనురాగ్ .

కొన్ని రోజుల తర్వాత దక్షిణామూర్తి గారు రాగ మాలను పిలిచాడు.

“రాగా! ఇలా రామ్మా”అన్నాడు.

“పడక కుర్చీలో కూర్చుని, ఎంట్రన్స్ కు ప్రిపేర్ అవుతున్న ఆమె మెల్లిగా లేచి వచ్చి,

“ఏంటి నాన్న!”అని అడిగింది.

“వచ్చి ఇక్కడ కూర్చో”అన్నాడు.

పక్కనే కూర్చున్న కూతురు చేయి చేతిలోకి తీసుకొని, చూడు ఎంత సన్నగా అయిపోయావు. నిన్ను చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకిలా అవుతున్నావు? ఎందుకు భోజనం చేయడం లేదు. ఎప్పుడు మాట్లాడే దానివి.మౌనంగా ఉంటున్నావు”అన్నాడు.

“తింటున్నాను నాన్న. బాగానే ఉన్నాను”అన్నది మెల్లగా.

ఎప్పుడూ అల్లరి, అల్లరిగా ఉండే రాగమాలలో ఆ చురుకుదనం నశించి, ఎప్పుడు స్తబ్దుగా ఉండేది .ఇల్లంతా పరుగులు పెట్టే తాను మాట్లాడకుండా, ఒక పక్కన కూర్చునేది. ఇదంతా చూస్తున్న దక్షిణామూర్తి గారికి చాలా బాధ కలిగింది.

“అమ్మ చెప్పిన విషయం గురించే ఇలా అవుతున్నావా?”అన్నాడు.

ఒక్కసారి తండ్రిని కళ్ళు ఎత్తి చూసింది.

“నాకు అమ్మ చెప్పింది. చిన్నప్పటినుండి నువ్వు ఏది అడిగినా కాదనకుండా, నా శక్తికి మించి చేశాను. నువ్వు బాధ పడితే నేను అసలు తట్టుకోలేను. నువ్వు ఇలా అవుతుంటే నాకు ఎంతో బాధగా ఉంది. పెళ్లి గురించే ఇలా అవుతున్నావా?”అన్నాడు.

ఆమె మౌనంగా అలాగే కూర్చుంది .

“అదే విషయం అని నాకు అర్థం అవుతుంది. నువ్వు ఏది అడిగినా కాదన ని నేను, పెళ్లి గురించి కాదంటానా? కానీ వాళ్లకి మనకు శాఖా భేదం ఉంది. అది కూడా నాకు అభ్యంతరం లేదు. వాళ్ళింట్లో ఎలాంటి అభ్యంతరాలు చెప్తారో అది కూడా తెలియదు. సరే ఇవన్నీ చిన్న విషయాలు అనుకున్నా, మీ ఇద్దరూ ఎత్తులో సమానంగా ఉంటారు. రేపు దీని గురించి మీ మధ్య అభిప్రాయ భేదాలు వస్తే, ఇద్దరూ కలిసి బయటకు వెళ్లడానికి అతనికి ఏదైనా అభ్యంతరంగా అనిపిస్తే, అప్పుడు సమస్యలు వస్తాయేమో ! ఇవన్నీ ఆలోచించుకున్నారా? అన్ని ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నారా”? అని కూతురు చేయి పట్టుకుని అడిగాడు.

“ఎత్తు గురించిన సమస్య మా ఇద్దరికీ లేదు నాన్నా!మీరు ఒప్పుకుంటే చాలు. వాళ్ళ ఇంట్లో ఎలా ఉందో నాకు తెలియదు. అది తను చూసుకుంటాడు”అని చెప్పింది. కానీ వాళ్ళ ఇంట్లో తను చూసుకుంటాడు అనే విషయం చిన్నది కాదు అని ఆమెకు అప్పుడు అర్థం కాలేదు.

“సరే, ఈ విషయంలో నేనేమీ కాదనను. నువ్వు సంతోషంగా ఉండు? భోజనం సరిగా చేయి. నువ్వు బాధపడే పని నేనెప్పుడూ చేయను”అని దగ్గరికి తీసుకుని చెప్పాడు.

ఆమె సంతోషానికి అవధులు లేవు. వెంటనే లోపలికి వెళ్లి అమ్మతో అన్నం పెట్టించుకుని తినేసి, అతనికి ఉత్తరం రాస్తూ కూర్చుంది. ఆరోజు రాసిన ఉత్తరం పది పేజీలు ఉంటుందేమో!

అలా సంతోషంతో ఉత్తరం రాస్తూ కూర్చుండిపోయింది.

ప్రియమైన మోహన్!

ఎలా ఉన్నావు? నీ లెటర్ నిన్న అందింది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం బాగా చదువుతున్నట్లున్నావ్! మరి సమయానికి తింటున్నావా? అందులో మీరు నలుగురు అన్న తమ్ముళ్ళు కలిసే ఉంటారు. వంట చేసుకోవడం వచ్చా? సరే అసలు విషయం చెప్తాను.

ఇంత తొందరగా చెప్పేసేయ్యాలా? నువ్వు ఊహించ గలుగుతావా? ఏమో నాకైతే అనుమానమే! నువ్వు ఊహించలేవు.

అసలు విషయం చెప్పే ముందు నిన్ను ఒకటి అడుగుతాను . నువ్వు మీఇంట్లో మన విషయం చెప్పావా? వాళ్ళకి ఏమైనా తెలిసిందా? ఇలా ఇంకెన్ని రోజులు నాన్చడం చెప్పు. తొందరగా చెప్పు. ఎలాగూ మీ అక్కయ్య పెళ్లి కూడా వచ్చే నెలలో ఉందని చెప్పావు. ఇప్పుడే చెప్తే బాగుంటుంది.

నేనైతే ఇంట్లో చెప్పేశాను. అమ్మకి డౌట్ వచ్చి అడిగితే ఉన్న విషయమే చెప్పాను. కానీ నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అమ్మ సరే అంటుంది అనుకుంటే అమ్మ మన పెళ్ళి జరగదు అన్నట్లు చెప్పింది. కానీ మా నాన్న పిలిచి అడిగారు. నేను చిక్కి పోతున్నందుకు చాలా బాధపడ్డారు. అమ్మ ఈ విషయము నాన్నకు చెప్పిందట. నన్ను సూటిగా అడిగారు.

“అన్ని ఆలోచించి నిర్ణయం తీసు కున్నావా?” అని “అవును” అన్నాను. అవునూ ,మన హైట్ గురించి నీకేమైనా ఇబ్బందిగా ఉందా? నేను ఇంచుమించు నీ ఎత్తులో ఉంటాను కదా! నాకైతే అలాంటి ఆలోచన ఏమీ లేదు. ఆ విషయం మానాన్న అడిగారు. మాకు అలాంటివి ఏమీ లేవని చెప్పాను. మా నాన్న ఏమన్నారో తెలుసా?

“నీ ఇష్టం ఎప్పుడూ కాదనలేదు. ఇప్పుడు మాత్రం కాదంటానా? అన్నారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అమ్మతో అన్నం పెట్టించుకుని కడుపునిండా తిన్నాను. వెంటనే నీకు ఉత్తరం రాస్తున్నాను. నువ్వు కూడా చాలా సంతోష పడతావని అనుకుంటున్నాను. నువ్వు కూడా మీ ఇంట్లో ఈ విషయం తొందరగా చెప్పేసేయ్. ఎందుకంటే ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది. కాబట్టి నాకు పెళ్లి చేయాలని ఇంట్లో అనుకుంటున్నారు. అందులో అన్నయ్య కూడా ఉన్నారు కదా! ఇద్దరిదీ ఒకేసారి చేయాలని ఇంట్లో అభిప్రాయం. మా బంధువుల్లో అయితే నా వయసు ఉన్న వాళ్ళ పెళ్లిళ్లు అయిపోయాయి. అందరికీ తొందరగానే చేసేస్తారు కదా! అందుకని ఈ విషయాన్ని ఎక్కువ రోజులు డిలే చేయొద్దు.

నా ఉత్తరం నీకు చేరగానే నువ్వు ఎంత సంతోషపడ్డావో నాకు చెప్పాలి. ఆ సంతోషం నాకు నీఅక్షరాలలో కనపడాలి. అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. లేదా వీలైతే కలిసి వెళ్ళు. ముఖాముఖి పంచుకుంటే ఆ సంతోషం ఇంకా వేరుగా ఉంటుంది.

సరే, నేను కాసేపు చదువుకొని పడుకుంటాను.

ఉంటాను .

రాగ మాల

ఇలా ఎన్నో విషయాలను ఉత్తరంలో రాసింది. ఉత్తరం రాయడం పూర్తి అయ్యాక, కాసేపు చదవాలని ప్రయత్నం చేసింది. కానీ చదవాలి అనిపించలేదు. నాన్న ఇంత తొందరగా ఒప్పుకుంటారని అనుకోలేదు. అందుకు చాలా సంతోష పడింది. కానీ ముందు మరికొన్ని సమస్యలు ఎదురవుతాయని ఊహించలేదు.

హైదరాబాదులో ఉన్న అనురాగ్ దగ్గరికి అప్పుడప్పుడు మోహన్, అతని తమ్ముళ్లు వచ్చి వెళ్లే వాళ్ళు. అనురాగ్ కూడా వాళ్లని బాగానే ఆదరించేవాడు. ఎలాగూ చెల్లి పట్టు పట్టి అతన్నే చేసుకుంటుంది అనే విషయం అతనికి అర్థమైంది. కానీ అప్పుడప్పుడు భయపడేవాడు. చెల్లె సరైన నిర్ణయమే తీసుకుందా? అతనికి జాబ్ రావాలంటే టైం పడుతుంది. పెద్ద కుటుంబం. ఇంట్లో అందరి అభిప్రాయం ఎలా ఉంటుందో! భవిష్యత్తులో చెల్లి మీద బాధ్యతలు ఎక్కువ పడతాయేమో! ఇలా ఎన్నెన్నో ఆలోచనలు వచ్చేవి. కానీ రాగమాలకు నచ్చ చెప్పడం చాలా కష్టమైన పని అని అనుకున్నాడు. అందుకని వాళ్లతో బాగా మసులు కునేవాడు.

మూడు రోజుల్లో ఉత్తరం అందుకున్న మోహన్ కి చెప్పలేనంత సంతోషం కలిగింది. కానీ విపరీతంగా ఆలోచన చేశాడు. అక్క పెళ్లి కాగానే వెంటనే తన పెళ్లి అంటే బాగుంటుందా? అసలు ఇంట్లో ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? అతనికి ఏమీ అర్థం కాలేదు. రెండు రోజుల తర్వాత రాగమాలను కలిసి ఊరికి వెళ్లాలి అనుకున్నాడు.

ముందుగానే ఉత్తరం రాసాడు. ఎప్పటిలాగానే కరుణ వాళ్ళింటికి వస్తానని చెప్పాడు. అతను వచ్చే సమయానికి వాళ్ళింటికి చేరుకుంది.

ఆరోజు కరుణ వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు. అందుకని మాట్లాడుకోవడానికి కూడా మంచి అవకాశం దొరికింది.

“నేను లోపలికి వెళ్తాను. మీరు మాట్లాడుకోండి”అన్నది కరుణ.

” పర్వాలేదు నువ్వు ఇక్కడే ఉండు. ఈ విషయాన్ని వినవచ్చు”అని జరిగిందంతా చెప్పింది.

కరుణ చాలా సంతోషపడింది. ఇప్పుడైతే నేను ఊరుకోను. మనం సినిమాకి వెళ్లాల్సిందే అన్నది.

“సరే అయితే మ్యాట్నీ కి వెళ్దాము. నేను ఇంట్లో చెప్పేసి వస్తాను” అని రాగమాల అన్నది.

మోహన్ వాళ్ళ నాన్నగారు రెండు గదుల ఇల్లు అక్కడే అద్దెకు తీసుకున్నారు. ఆఫీస్ నుండి మధ్యాహ్నం ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకొని ఆఫీస్ కి వెళ్లేవారు. అప్పుడప్పుడు శ్రీదేవి గారు కూడా వచ్చి ఉండేవాళ్ళు. అందుకని మోహన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు .అటు నుండి సినిమాకు వస్తానని చెప్పాడు.

అలా ముగ్గురు కలిసి సినిమా చూశారు.

అతను వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. శుభశ్రీ పెళ్లి మరో నెల రోజుల్లో ఉంది ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. శుభశ్రీ ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉంది. అందులో ఎక్కువ సంబంధాలు చూడటం వల్ల విసిగిపోయింది. పెళ్లి కుదిరింది అనేసరికి ఆమె ముఖంలో ఆనందం కనపడుతుంది.

ఆరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మోహన్ వాళ్ళ పొలం దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. ఇంట్లో ఎలా చెప్పాలి? అని ఆలోచిస్తూ కూర్చున్నాడు

అది కాక పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది! ఒకవేళ చేసుకోకుంటే ఎలా ఉంటుంది? అని ఆలోచించసాగాడు. రాగమాలను పెళ్లి చేసుకోకుండా ఉండగలనా? అని కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆ ఆలోచనకే అతనికి చాలా బాధ కలిగింది. “లేదు నేను తనని పెళ్లి చేసుకోకుండా ఉండలేను” అని నిర్ణయం తీసుకొని ఇంటికి వచ్చాడు.

అప్పటికే శుభశ్రీకి రఘుకు ఈ విషయం తెలుసు. వాళ్లు ఇంట్లో కూడా చెప్పారట. కానీ ఎవరు డైరెక్ట్ గా మోహన్ ని అడగలేదు. తల్లి మాత్రం ఇన్ డైరెక్ట్ గా ఏదో ఒకటి అనేది. అతను కూడా పెళ్లి పనుల్లో చాలా బిజీగా అయిపోయాడు.

పెళ్లి కొన్నిరోజులు ఉందనగా శుభలేఖలు అందరిళ్ళకి వెళ్లి స్వయంగా ఇచ్చి ఆహ్వానించారు. మోహన్ మాత్రము ప్రత్యేకంగా ఆమెకు చెప్పాడు.

“నువ్వు మాత్రం మా అక్క పెళ్లికి రావాలి .రాకుంటే నేను అసలే ఊరుకోను” అన్నాడు.

ఆమెకు కూడా ఆ పెళ్లికి వెళ్లాలని అనిపించింది. శుభశ్రీ కూడా పరిచయమే కదా! అందుకని వెళ్లాలని అనుకుంది.

పెళ్లికి ముందు రోజు దక్షిణామూర్తి గారిని అడిగింది.

“నాన్న! మీరు రేపు పెళ్లికి వెళ్తారు కదా! నేను కూడా వస్తాను” అన్నది.

“నేను, అన్నయ్య వెళ్తున్నాము .అయితే ముగ్గురం కలిసి వెళ్దాము”అని దక్షిణా మూర్తి అన్నారు.

అక్కడే ఉన్న అను రాగ్ చెల్లిని పక్కకు పిలిచి

“నువ్వు పెళ్లికి వస్తావా?”అని అడిగాడు

“అవును వస్తాను అన్నా! శుభశ్రీ ప్రత్యేకంగా నాకు చెప్పింది”అన్నది.

“అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? వాళ్ళింట్లో ఈ విషయం తెలిసింది. నువ్వు వెళితే అందరూ నానా రకాలుగా మాట్లాడుతారు. ఈ సమయంలో ఇదంతా అవసరమా?” అన్నాడు.

ఉత్సాహమంతా ఎగిరిపోయింది.

“అన్న చెప్పింది కూడా నిజమే. ఎవరైనా అంటే బాధ అనిపిస్తుంది కదా !అని అనుకొని వెళ్ళను అని నిర్ణయం తీసుకుంది.

తెల్లవారి దక్షిణామూర్తి’, అనురాగ్ పెళ్లికి వెళ్లారు.

వాళ్ళ ఇంట్లోనే పందిరి వేసి పెళ్లి చేసారు. అప్పటికే చాలామంది అనురాగ్ ను చూసి ఏదేదో గుసగుసలాడుకున్నట్లు అనురాగ్ కి అనిపించింది.

ఎవరో పిలిచినట్లు అనిపిస్తే అటుగా చూసాడు.

సశేషం

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“రచయిత్రుల మహా సభలు”

వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)