జరిగిన కథ
ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలు పుట్టని కారణంగా ఇబ్బంది పడుతున్న శ్రీకాంత్, వనజా “గీత” హాస్పిటల్స్‌కి వస్తారు.
అక్కడ రేవతి డాక్టర్ని కలిసాక వాళ్లలో ఆశ చిగురిస్తుంది.
వాళ్లు పెట్టుకున్న నమ్మకమే “ఇందు” రూపంలో ఎదురైంది.
అనేక కారణాల వల్ల సరోగసి (IVF)కి ఒప్పుకున్న “ఇందు”.
బిడ్డని కన్నాక ఇచ్చేయడానికి ఒప్పందం జరిగింది. ఒప్పందం ప్రకారం ఆ పిల్లని వాళ్లకి అప్పగించామని అనుకుంటుంది. కానీ ఆ రోజు జరిగిన కారు ప్రమాదం వల్ల వాళ్లిద్దరూ హాస్పిటల్లో గాయాలతో స్పృహ లేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్లు రాలేని పరిస్థితుల్లో “నయనిక” ఇందు దగ్గరే పెరుగుతుంది. 20 ఏళ్ల తర్వాత వచ్చిన శ్రీకాంత్‌ని చూసి ఆశ్చర్యపోతుంది…
ఇంకా కథలోకి వెళ్దాం…
సుధీర్‌కి, నైనికకి, నాకు కాలేజీ సెలవులు. కృష్ణ కోసం ఎదురుచూస్తున్నారు వాళ్ళిద్దరూ. సెలవుల్లో ఎక్కడికైనా వెళ్దామని కృష్ణకి కూడా ఒక నెల రోజుల పాటు షూటింగ్ విరామం దొరికింది. పెద్ద బ్యానర్లో హీరో తండ్రి పాత్ర – ఒక నెల రోజుల్లో షూటింగ్ మొదలు అవుతుంది. అందుకే పిల్లలు ఇద్దరూ కాశ్మీర్ వెళ్ళాలని ప్లాన్ చేశారు.కృష్ణ స్నానం చేసి ఒక సారి శ్రీకాంత్, వనజని చూసి వచ్చి టికెట్లు బుక్ చేద్దాం అన్నాడు. అలా మేడ మీదకి వెళ్ళిపోయిన తన్నే చూస్తూ వెళ్ళాలా, వద్దా అనే ఆలోచనలో పడిపోయింది ఇందు.వనజ వాళ్ళ అమ్మగారు, నాన్నగారు చేసిన అవమానం గుర్తుకి వస్తే అస్సలు ఒక్క అడుగు వేయాలనికూడా అనిపించటంలేదు. మనసు అంతా ముడుచుకుపోయి అలసిపోయింది. సోఫాలో కూర్చుని వెనక్కి వాలి, “నన్ను ఎవరైనా ఇంకా నువ్వు ఎలాంటి మానసిక సంఘర్షణ పడనవసరం లేదు. హాయిగా ఉండు” అంటారా? ఈ జీవితానికి ఆలాంటి రోజు వస్తుందా?అక్క గుర్తుకి వచ్చింది. అక్క కూతురి డెలివరీకి బెంగళూరు వెళ్ళింది. అక్కే ఉంటే ఈ పాటికి దాని దగ్గరకి పరిగెత్తుకుని వెళ్ళి దాని ఒళ్ళోతల పెట్టుకుని తనివి తీరా ఏడ్చేదాన్ని. ఇప్పుడు ఏడవడానికి కూడా ఎవరూ లేరు. పిల్లలు భయపడతారు, కృష్ణకి నన్ను ఓదార్చే తీరిక ఉండదు.లేదా, అక్కఊళ్ళోలేదనిదానిదగ్గరకి వెళ్ళాలనుకుంటున్నాను. ఉంటే వెళ్ళగలనా? నా మస్యలతో పోరాడి పోరాడినేనే ఒక సమస్యగా మారిపోయాను.

కోరి తెచ్చుకున్నానా? అందరిలా ఉండలేకపోయానా? నాన్న మీద ఉన్న పిచ్చి ప్రేమతో నా జీవితాన్ని నేనే సమస్యల చట్రంలో బిగించుకున్నానా? ఏమిటి ఈ ప్రశ్నలు?స్త్రీల జీవితాలు ఇంతేకదా పనిచేస్తూ గానుగా ఎద్దులా తిరుగుతున్నంతసేపు ఎవరికీ పట్టదు. ఒక్కసారి ఆగిపోయినా పట్టదేమో-
జీవితం నడి రోడ్డు మీద నిలబడి ఆలోచించుకునే సమయం కూడా మిగలదేమో?శ్రీకాంత్ వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి తలనిండా బూజు పట్టినట్లు ఆలోచనలు ఎంత దులిపినా వదలటం లేదు. ఇంతలో గేటు ముందు కారు ఆగిన చప్పుడు వినిపించింది.ఎవరా అనుకుంటూ తలుపు తీసాను. ఎదురుగా శ్రీకాంత్, వనజ! వనజ నన్ను చూస్తూనే చిన్న పిల్లల్లా ‘ఆంటీ’ అంటూ వాటేసుకుంది.’రండి’ అంటూ లోపలికి పిలిచాను. శ్రీకాంత్ వైపు చూశాను. ఏమిటిది అన్నట్లు నిర్వికారంగా నా వైపు చూస్తూ, ‘ఇంట్లో చాలా గొడవ చేస్తోంది. నీ దగ్గరకి రావాలని ఇంకా తప్పలేదు ఇందు’ అంటూ ఇద్దరూ లోపలికి వచ్చారు. మేడ మీదనుంచి ఫ్రెష్ అయ్యి వచ్చాడు కృష్ణ.సారీ ఇందు, నువ్వు వెళ్ళిన దగ్గరనుంచి నా ప్రాణాలు తోడేసింది. నీ దగ్గరకి తీసుకు వెళ్ళమని” మరోసారి అన్నాడు శ్రీకాంత్.కృష్ణ శ్రీకాంత్‌ని కౌగలించుకుంటూ “ఎలా ఉన్నారు? ఎన్నాళ్ళు అయ్యింది” చూసి అంటూ పలకరించాడు.“కూర్చోండి. అసలు ఇవాళ మీదగ్గరకే బయలుదేరుతున్నాము” అన్నాడు.“అవునా?” అంటుంటే, వనజ కృష్ణ దగ్గరకి వచ్చి ‘ఈ ఆంటీ నీకు ఏమవుతుంది? అడిగింది.అప్పుడు వనజని చూసి ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోయాడు కృష్ణ.శ్రీకాంత్‌తో పాటు సోఫాలో కూర్చుంటూ శ్రీకాంత్“ఇవాళ లంగా జాకెట్ వేసుకోలేదు చూడిదార్, టాప్ వేసుకుంది. చక్కగా దువ్వుకుని పోనీ పెట్టుకుంది. మిదగ్గరకి రావడానికి మంచి పిల్లకాదా!
అవును అంటూ వనజని దగ్గరకి తీసుకుంది ఇందు.తను వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్పుడు లంగా జాకెట్ వేసుకుని రెండు జడలు వేసుకుంది”అనుకుందివనజనిచూస్తూ.’వనజ’ని అలా చూస్తూ ఉండిపోయిన కృష్ణని మళ్ళీ అడిగింది, “ఈ ఆంటీ నీకు ఏమవుతుంది?”ఎదురుకుండాఉన్న కుర్చీ లాక్కుని కూర్చుంటూ, “నా భార్య” అన్నాడు కృష్ణ.“
ఓ అలాగా! అలాయితే నువ్వు నా అంకుల్” అంటూ తమాషాగా కళ్లు తిప్పుతూ. కృష్ణకి కూడా దిగులు వేసింది.వనజని అలా చూస్తుంటే ఇందు చెప్పింది, “కానీ ఇంతలా ఉంటుందని అనుకోలేదు. ఇరవై ఏళ్ల క్రితం ఎంతో హుందాగా శ్రీకాంత్ వెనక వచ్చిన ఆవిడేనా? ఇలా చిన్న అమ్మాయిలా ప్రవర్తిస్తున్న ఆమెని చూస్తుంటే- ఇందు ఎందుకు అంతగా బాధపడిందోఅర్థంఅయ్యింది.
”ఏమి చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో అలా రాయిలా ఎదురుకుండా ఉన్న సోఫాలో కూర్చుని చూస్తూ ఉండిపోయిన శ్రీకాంత్‌ని చూస్తుంటే ఇంకా దిగులు వేసింది.ఇంతలో నైనిక, సుధీర్ కింద వినిపిస్తున్న కబుర్లకి “ఎవరు వచ్చారో” అని చూడటానికి ఇద్దరూ కిందకి వచ్చారు. “గుడ్ మార్నింగ్ అంకుల్” అంది సుధీర్ కూడా విష్ చేస్తుంటే.వనజ కుర్చీలోంచి లేచి “ఆంటీ, మీ పిల్లలా?” అడిగింది.అప్పుడు గమనించిన నైనిక, సుధీర్ “అంకుల్, ఈ విడ ఎవరు?” అడిగింది నైనా.శ్రీకాంత్ ఏదో చెప్పబోతుంటే, వనజ నైనా దగ్గరకు వచ్చి “నీకు అంకుల్ కాదు నా అంకల్! వీళ్ళ అమ్మగారు, నాన్నగారు అస్సలు మంచి వాళ్ళు కారు తెలుసా” అంటూ చిన్న పిల్లలా కళ్లు తిప్పుతూచెబుతుంటే.హఠాత్తుగా శ్రీకాంత్ కళ్లల్లో నీళ్ళు తిరగాయి. చేతి రుమాలుతో కళ్లు తుడిచుకుంటుంటే ఓదార్పుగా చేయి పట్టుకున్నాడు కృష్ణ.
“కాఫీ తెస్తాను” అంటూ కిచెన్‌లోకి వెళ్తుంటే నైనిక “నా వెంటే వస్తూ అమ్మా! ఎవరు వీళ్ళు?
మీ నాన్నకి, నాకు శ్రీకాంత్ చాలా మంచి స్నేహితులు.
కారు యాక్సిడెంట్లో ఆవిడ మెదడుకి బలంగా దెబ్బ తగిలింది. అప్పటి నుంచి ఇలాగే ఉంది ఆమె పరిస్థితి. అయితే కొన్నాళ్ళకి ఎప్పుడైనా అకస్మాత్తుగా ఆవిడకి గతం గుర్తుకి రావొచ్చని డాక్టర్ చెప్పారు అంకుల్‌కి. దానికోసమే అందరం ఎదురుచూస్తున్నాము.”కాఫీ కప్పులు ట్రేలో అందించి బిస్కెట్లు సర్ది హాల్‌కి తెస్తున్న నైనీకని చూస్తూ, “నువ్వు నా కూతురివి” అన్న వనజ మాటలకి అక్కడ ఉన్నఅందరూఉలిక్కిపడ్డారు.
మరుక్షణంలోనే ట్రేలో ఉన్న కాఫీ కప్పు అందుకుని మౌనంగా తాగుతూ కూర్చుంది. అక్కడ ఉన్న అందరి ముఖంలో ఇంకా ఆశ్చర్యం, అనుమానం పోలేదు. తాము విన్నది నిజమేనా? లేక భ్రమా? అనుకుంటుంటే…
ఇంటికి వెళ్ళి పోదాం అంటూ లేచిన వనజ శ్రీకాంత్ చేయి పట్టుకుంది. మొట్టమొదటి సారి అంతా నిదానంగా చేయి పట్టుకోడం. డాక్టర్ దగ్గరకి వెళ్తానన్న అతని ముఖంలో అనందం చూస్తే భయం వేసింది ఇందుకి.వెళ్ళి పోతున్న వాళ్ళిద్దరినీ కారు దాక సాగనంపి వచ్చిన కృష్ణ కూడా ఆలోచనలో పడ్డట్టు వెనక్కివాలికూర్చున్నాడు. “బయటికి వెళ్దాం, ఇంట్లో చేసే ఓపిక లేదు” అన్న ఇందుతో.
సరే పద” అంటూ సుధీర్, నైనిక బయటికి వచ్చి ఇంటికి తాళం వేసి కారులో వచ్చి కూర్చున్నారు.
***
బయట లంచ్ చేసి వచ్చి శరీరం కన్నామనసుబాగాఅలసిపోయిందనుకుంది. తన పక్కనే వచ్చి పడుక్కున్న కృష్ణ సన్నటి గురక వినిపించింది. తానూ చాలా అలసిపోయాడు నాతో పాటు అనుకుంది. వెల్లకిలా పడుక్కుని నిద్రపోతున్న అతన్నే చూస్తూ నుదిటి మీద పడుతున్న ఉంగరాల జుట్టుని చూసి ఎప్పుడూ వెక్కిరించేది – సినిమా హీరోలా ఏమిటి ఈ ఒక్క పాయనుదిటి మీద వాలుతుంది! “చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు హీరో అయిపోతా” అనేవాడు. ఇప్పుడు హీరోలకి తండ్రి పాత్రల్లో స్థిరపడిపోయాడు.పక్కకి తిరిగి తిరిగిన కృష్ణ అడిగాడుచూస్తూ ఇందునిద్రపోలేదా? ఇంకా తెలిసే ఉన్నావా ఎందుకు?ఎక్కువగా ఆలోచించకు, కంగారు పడకు. ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే! వాళ్ళ పిల్ల మీద వాళ్ళకి హక్కు ఉంటుంది, అభిమానం ఉంటుంది. ఎంతో ఆత్రంగా ఎదురుచూసిన ఆ అమ్మాయి వాళ్ళకి చెందిందే కదా! కానీ నైనిక ఎలా అర్థం చేసుకుంటుంది? నన్ను ఏమనుకుంటుంది? అదే దిగులుగా ఉంది కృష్ణ” అన్నాను
నా చేయి మీద చేయి వేసి. ఈ రోజుల్లో పిల్లలు అన్నీ అర్థం చేసుకుంటారు. నువ్వు అంతగా మరీ దిగులు పడకు, చూద్దాం. కాలమే సమాధానం చెబుతుంది. నిజంగా ఆవిడకి గతం గుర్తుకొస్తే మంచిదే కదా? అతను కూడా ఆవిడతో నలిగిపోతున్నాడు. అందరికీ మంచిది. ఇన్నాళ్ళుగా మనం పెంచిన అమ్మాయిని వాళ్ళకి చూసుకోవాలని ఉంటుంది కదా? ఈ వయసులో నైనిక వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి ఎంత సంతృప్తి…అంటూ ఓదార్చాడు..
ఓదార్చిన తర్వాత నా మనసంతా తేలిక అయిపోయింది.వాళ్ళ అమ్మాయి వాళ్ళకి ఇచ్చేయాలి కదా? ఈ వయసులో ఆ అమ్మాయి వాళ్ళకి ఎంతో తోడు అవుతుంది. నిజమే అది. అందుకే నాకు జీవితంలో లభించిన మంచి స్నేహితుడు కృష్ణ. భర్త కన్నా స్నేహితుడిగా ఎక్కువ నేను అనుకుంటాను. మా ఇద్దరి అనుబంధం స్నేహంతో మొదలై, నాకు చేసిన సహాయానికి ఎప్పుడూ మర్చిపోలేనంత కృతజ్ఞత కృష్ణ మీద నాకు.
***
ఇందుకి కృష్ణ పరిచయం గుర్తుకి వచ్చింది.అక్కకి గవర్నమెంట్ కాలేజీలు జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం రాగానే ఇంకా నీకు పెళ్లి సంబంధాలు చూడాలి నాన్న అన్నాడు. అక్కకి నాలాగా విదేశాలు వెళ్ళే ఉద్దేశమే లేదు. మీఇష్టం నాన్న, నువ్వు ఎలా చెప్తే అలాగేఅంది అక్క. నాన్న గిరిజత్తకి చెప్పారు, మంచి సంబంధం ఉంటే చూడమని. ఆ రోజు అక్క,నేను,నాన్న చాలా తీరికగా ఉన్నాం. చాలారోజుల తర్వాత ఇంత తీరికగా కూర్చుని మాట్లాడుకుని ఎన్ని రోజులైందో! నేను GRE రాసి అమెరికా వెళ్ళే ప్లాన్‌లో బిజీ అయిపోయాను. అక్క కొత్తగా కాలేజీలో జూనియర్ లెక్చరర్‌గా జాయిన్ అయిన హడావిడిలో ఉంటే ఇద్దరికి ‘నాన్నని’ పలకరించే తీరికలేనంతగా అయిపోయింది. ఈరోజు అక్క పుట్టినరోజు. అందుకే అందరూ చాలా తీరికగా ఉన్నాం. మాట్లాడుకోవడానికి కూడా సమయం దొరికింది.అక్క పుట్టినరోజు కావడంతో గిరిజత్త కూడా మా ఇంటికి వచ్చేసింది. అత్త, అక్క భోజనాలు తయారు చేయడంలో హడావిడిగా ఉన్నారు. అత్త కూతురు గిరిజ ఇండియాలో డాక్టర్ చదివి పై చదువుకుని అమెరికా వెళ్ళిపోయింది. అక్కడే తన కొలీగ్ డాక్టర్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. మావయ్య పోయాక అత్త ఇంచుమించు గిరిజ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండేది. మొన్ననే అమెరికా నుంచి వచ్చింది. రాగానే మా ఇంటికి వచ్చేసింది.నాన్న అత్తని “ఇక్కడే ఉండు కొద్ది రోజులు ఆ తర్వాత వెళ్ళుదువుగానిఅన్నాడు.
భోజనాల ముందు అత్త,అక్క పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది.
దూరం చుట్టం అయినా భాస్కరరావు కొడుకు ఉన్నాడని, అయితే అతను టీవీలో యాక్ట్ చేస్తూ ఉంటాడని చెప్పింది. అతని పేరు ‘రవిశంకర్’ అనగానే అక్క, నేను ఇద్దరం ఒక్కసారి మొఖముఖాలు చూసుకుని నవ్వుకున్నాం.
అతను అక్కకి చాలా ఇష్టమైన యాక్టర్.నాన్న సాయంకాలాలు టీవీ చూస్తున్నప్పుడు అక్క కూడా కాలేజీ నుంచి వచ్చాకఏదో ఒక పని చేసుకుంటూ నాన్నతో పాటు చూస్తూ అలవాటు పడిపోయింది నాన్నకి తోడుగా.అందుకే అతను చాలా పరిచయం, అక్కకి ఇష్టం కూడా. అక్క నా దగ్గర చాలాసార్లు అంది ‘అతను అంటే ఇష్టమ్. అని చాలా బాగా యాక్ట్ చేస్తాడని ఇంత అభిమానిస్తున్నావు,
అతనే నీ భర్తగా వస్తే ఏం చేస్తావ్ ఆటపట్టించేదాన్ని.’పోవే!
అతను ఎవరో మనం ఎవరో, ఎలా కలుస్తాం? టీవీలో చూస్తూ ఇష్టపడడం వేరు. ఇష్టపడినంత మాత్రాన నిజ జీవితంలోకి వచ్చేస్తారా ఏంటి!
ఒకరిని చూస్తే ఒక ఇష్టం ఏర్పడుతుంది అంతే…కానీ ఈరోజు అతనే పెళ్లి కొడుకు చూసావా నేను చెప్పిందే జరిగింది అన్నాను అక్కతో ఇంకా మాటలు జరగాలి.
అతనికి నేను నచ్చాలి, నాకు అతని ఆలోచనలునచ్చాలి ఇవన్నీ అయినప్పుడు కదాఅప్పుడు ఆలోచిద్దాం…
మరో 10 రోజుల్లో అక్కని చూడడానికి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. అక్క బాగా నచ్చింది. అతను షూటింగ్ హడావుడిలో ఉన్నాడని, మళ్ళీ తర్వాత వచ్చి కలుస్తాడని వాళ్ళు చెప్పారు. ఒకరోజు ‘రవి’ఫోన్ చేసి కాఫీ షాప్‌కి రమ్మని పిలిచాడు.
నన్ను కూడా తోడు రమ్మంటే. నేను ఎందుకు? నువ్వు వెళ్ళు మాట్లాడుఅంటే వినలేదు.
సరే అని తోడుగా వెళ్ళాను.
‘రవి’ టీవీలో కనిపించిన దానికంటే ఇంకా అందంగా ఉన్నాడు. చాలా సహజంగా- మేకప్ లేని ముఖం ఇంకా తాజాగా కనిపించింది. అతనితో పాటు వచ్చిన అతని మేనత్త కొడుకు ‘కృష్ణ’ కూడా ఉన్నాడు
ఎం కామ్ చేసి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్‌తో యాక్టింగ్ స్కూల్లో చేరి ఇప్పుడు ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడని పరిచయం చేశారు రవి.
రవి,అక్క.మాట్లాడుకుంటూ ఉంటే మేమిద్దరం ఒకరినొకరు పలకరించుకున్నాం. అక్కని రవిని వదిలేసి దూరంగా ఉన్న టేబుల్ దగ్గర ఇద్దరం కూర్చుని కబుర్లు మొదలుపెట్టాం. కొద్దిసేపట్లోనే చాలా స్నేహంగా మాట్లాడిన కృష్ణ నాకు చాలా నచ్చాడు.
ఆతర్వాత కూడా ఇద్దరం ఫోన్లో చాలా చాలాసార్లు మాట్లాడుకునేంత స్నేహం పెరిగింది మాఇద్దరి మధ్య…
మరో వారం రోజులకే తాంబూలాలు మార్చుకుందామని కబురు పంపించారు.
రవి నాన్నగారు అమ్మగారు ఆ రోజు నాకు ఎంత ఆనందంగా అనిపించిందో! అక్క బావ జోడి చాలా బాగుంది. ఇద్దరూ చాలా ఆనందంగా కనిపించారు.
అక్క పెళ్లి ఉన్నంతలో చాలా బాగా జరిపించారునాన్న…
పెళ్లికి బావతో పాటు సీరియల్ ఆర్టిస్టులందరూ వచ్చారు. పెళ్లిచాలాగొప్పగా ఒకవేడుకలా ఆనందంగా జరిగింది…
అక్క వాళ్ల అత్తవారి ఊరు వెళ్లినప్పుడు నేను తోడుగా వెళ్లాను – వాళ్లది చాలా పాత ఇల్లే, కానీ కొన్ని సదుపాయాలను ఆధునికంగా చేసుకున్న అందమైన ఇల్లు. అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది నడవాలో ఉన్న ఉయ్యాల బల్ల. అందులో కూర్చుని ఊగుతుంటే ఎంతో బాగుండేది. దాంట్లో మెత్తటి బాలీసులు వేసారు.నడవా చుట్టూతా గదులు. బావ ‘రవి ‘
ఒక్కరే కొడుకు. బావ వాళ్ల అమ్మ, నాన్న, నాయనమ్మ కూడా ఉన్నారు. వాళ్ల ఆచారాలు, మర్యాదలు ఎంతో నచ్చేశాయి నాకు. పల్లెటూర్లోసినిమాల్లోపెంకుటిల్లు చూపించినట్టు, నడవ మధ్యలో ఖాళీగా ఉంచి, వర్షం పడిన నీళ్లు పోయేలా ఏర్పాటు చేసిన ఆ ఇల్లు ఎంత బాగుందో!ఎవరు వచ్చినా కాళ్లు కడుక్కోవడానికి పెట్టిన గంగాళాలుచింతపండుతో విలమిలా మెరిసిపోయేలా తోమిన ఆ పెద్ద పెద్ద గంగాళాలు అందులో ఇత్తడి చెంబులు చూస్తే సరదాగా వేసింది. పెరడులో దూరంగా స్నానాలకు రాగి బాయిలర్‌తో నీళ్లు కాచడం ఇంకా అబ్బురంగా అనిపించింది. బాయిలర్‌లో నీళ్లు కాచి, పనివాళ్లు ఎవరి బాత్రూంలో వాళ్లకు కాగిన నీళ్లు పెట్టడం కొత్తగా అనిపించింది.”రాగి బాయిలర్‌లో నీళ్ల వాసన ఎంత బాగుందో! అన్నాను. “నీళ్లకు వాసన ఏమిటి? నువ్వు మరీ చెప్తావ్?” అంది అక్క. ”
అవును, నీటికి వాసన ఉంటుంది. ప్రదేశాన్ని బట్టి, మట్టిని బట్టి నీళ్లకువాసనఉంటుంది,అన్నాను.
వేసవికాలంలో చుట్టూతా ఉన్న మల్లె తోటల నుంచి ఆ అప్పుడే ఆకు దూసిన మల్లెమొగ్గలు ఇల్లంతా ఆ పరిమళంతో నిండిపోయేవి. సాయంకాలం మల్లె మొగ్గలతో మాలలు చేసి, విధీగా అందరి తలల్లోకి ఒక్కొక్క దండ ఇచ్చేవారు. రాత్రంతా ఆ వాసన తలగడ మీద, ఒళ్లంతా చుట్టుకుని ఉక్కిరిబిక్కిరి చేసేది. మర్నాడు వాడిన దండ తీసేసినా, ఆ పరిమళం జడ పాయల్లో నిండిపోయేది.
భోజనాల బల్ల అంటూ ఏమీ లేదు.చక్కగా అందరూ కింద కూర్చుని, వెండి పళ్లాలలో భోజనం వడ్డించేవారు.
ఆ భోజనం రుచి ఇంకా ఇప్పటికీ ఆ సువాసన గుర్తుకి వస్తుంది…
కృష్ణ ఊరు కూడా అదే.మేము వెళ్లిన నాలుగు రోజులకు కృష్ణ కూడా వచ్చాడు. ఇద్దరం కలిసి గోదారిఒడ్డుకిషికారుకువెళ్లేవాళ్ళం.
విశాలమైన గోదావరి నదిలో సాయంసంధ్యలోనదిమధ్యలో నిల్చున్న ఆ పడవలు ఎవరో చిత్రకారుడు వేసిన బొమ్మల్లా ఉండేవి. ఎంతసేపు కూర్చుని ఆ ప్రకృతిని చూస్తున్న తనివి తీరేది కాదు. రంగులు మారుతున్న ఆకాశం – ఎర్రటి ఎరుపుతో నీలాన్ని తోడు తెచ్చుకుని, రాత్రి చుక్కల కోసం సూర్యుడు డ్యూటీ దిగిపోతున్నట్టు – ఆకాశం విశాలంగా,నీలంగా.కనిపించేది…
అక్కడి నుంచి రాగానే మా ఇంటి మేడ మీద ఉండమని చెప్పారు. బావఎందుకండీ? వేరే ఇల్లు తీసుకుంటాం, అని మొహమాట పడ్డాడు. నాకు మీరు కాక ఎవరున్నారు? ఇందు అమెరికా వెళ్లిపోతే అన్నారు నాన్న.
అది లేకపోతే ఇల్లంతా ఖాళీ. నాకేంటి తోస్తుంది? మీరు మేడ మీద ఉండండి,అన్నారు.
మేడ మీద మూడు గదుల్లో ఉన్న అద్దెకున్న వాళ్లని ఖాళీ చేయించి, బావకి కావలసినట్టు కొన్ని ఆధునిక హంగులతో మేడ మీద ఇల్లు అక్క-బావకి సిద్ధం చేశారు నాన్న…
అక్క-బావ రాగానే నాకు కూడా చాలా సంతృప్తిగా అనిపించింది. నేను వెళ్లిపోతే నాన్నకి ఎలా అనే దిగులు నాకు లేదు. ఎలాగో నేను వెళ్లిన తర్వాత సెటిల్ అయిన తర్వాతనాన్ననుతీసుకెళ్లిపోదామనేఉద్దేశంలోనే ఉన్నాను…
కానీ నేను బావ మీద పెట్టుకున్న అంచనాలు, ఆశలు అంతగా సఫలం కావవేమో అని అనిపించింది నాకు – ఎందుకో తెలియదు. మెల్లగా బావ స్వభావం అక్కకి, నాన్నకి అర్థం అవుతూ వచ్చింది. తన కోసం తానే ఉంటాడు – తన బట్టలు, తన హోదా, తన కారు, తన ఇష్టాలు అన్నీ తన కోసమే. తాను అన్నట్టు ఉండటం కొంచెం అసంతృప్తినే ఇచ్చింది…
ఆలోచనల ఉయ్యాల ఊగిన కనురెప్పలు అలసిపోయి నిద్ర బడిలోకి జారిపోయాయి. పాలవాడి బెల్లు తోటి మెలుకువ వచ్చింది. ఇంకా పరుగులు మొదలు..
ఆ మరుసటి రోజు…
(సశేషం)