ఒకరోజు ఒక కళాశాలలో పని చేస్తున్న ఒక ప్రొఫెసర్ తరగతి గదిలోనికి వచ్చి తన విద్యార్థులతో ఈ విధంగా అంటాడు. స్టూడెంట్స్ ఈరోజు మనం ఒక ఆట ఆడుకుందాం సరేనా అని అడుగుతాడు. విద్యార్థులంతా సంతోషంగా సరేనని అంగీకారాన్ని తెలియజేస్తారు. అప్పుడు ఆ ప్రొఫెసర్ ఒక విద్యార్థిని లేపి నేను ఒక ప్రశ్న అడుగుతాను దానికి మీరు సమాధానం చెప్పాలి అని అంటారు. అప్పుడు ఆ విద్యార్థిని లేచి నిలబడి సరేనంటుంది. అప్పుడు ఆ ప్రొఫెసర్ ఆ విద్యార్థినితో నీకు బాగా ఇష్టమైన 30 మంది పేర్లను బోర్డు మీద రాయమని చెప్తాడు. అందుకు ఆ విద్యార్థిని సరేనని తల్లిదండ్రుల పేర్లు, భర్త పేరు ,పిల్లల పేర్లు, కొంతమంది స్నేహితుల పేర్లు, బంధువుల పేర్లు రాస్తుంది. అది చూసి ప్రొఫెసర్ ఇందులో నువ్వు చాలా తక్కువ ప్రయారిటీ ఇచ్చే వ్యక్తులను ఒక ఐదుగురి పేర్లు చెరిపేయమని చెప్తాడు. అప్పుడు ఆ విద్యార్థిని బాగా ఆలోచించి ఒక ఐదుగురు స్నేహితుల పేర్లను చెరిపేస్తుంది. తర్వాత వాళ్ల దృష్టిలో నువ్వు అవసరం లేదు అనుకున్న ఐదుగురి పేర్లను చెరిపేయమని చెప్తాడు. అప్పుడు ఆ విద్యార్థిని ఒక ఐదుగురు బంధువుల పేర్లను చెరిపేస్తుంది. తర్వాత ఆ ప్రొఫెసర్ ఇప్పుడు నిన్ను అవసరానికి వాడుకొని నీ అవసరానికి ముందు పడని వ్యక్తుల పేర్లను పదిమందిని చెరిపేయమని చెప్తాడు. అప్పుడు ఆ విద్యార్థిని కొంతమంది స్నేహితుల పేర్లు కొంతమంది బంధువుల పేర్లను చెరిపేస్తుంది. ఇదంతా గమనిస్తున్న మిగతా విద్యార్థులు విద్యార్థినిలు ఇది ఆట కాదని ప్రొఫెసర్ గారు తమకు ఏదో విలువైన సమాచారాన్ని అందజేయటానికి వచ్చారని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు .ప్రొఫెసర్ గారు ఏం చేయబోతున్నారా అని. అప్పుడు ప్రొఫెసర్ గారు అది చూసి నీకు బాగా ఇష్టమైన ఐదుగురి పేర్లను చెరిపేయమని చెప్తాడు. అప్పుడు ఆ విద్యార్థిని బాగా ఆలోచించి ఎంతో బాధపడుతూ ఇద్దరు స్నేహితులను ముగ్గురు బంధువుల పేర్లను చెరిపేస్తుంది. ఇక ఇప్పుడు ఉన్న ఐదుగురిలోతల్లిదండ్రులు, పిల్లలు, భర్త మిగిలి ఉంటారు. అది చూసిన ప్రొఫెసర్ ఈ ఐదు పేర్లలో ఏ రెండు పేర్లనైనా తొలగించాల్సి వస్తే ఏ పేర్లను తొలగిస్తావు అని అడుగుతారు. అప్పుడు ఆ విద్యార్థిని ఎంతో బాధపడుతూ కన్నీటి పర్యంతమై తప్పని పరిస్థితులలో తల్లిదండ్రుల పేర్లను తొలగిస్తుంది. తరువాత మిగిలిన ముగ్గురిలో మరో ఇద్దరి పేర్లను తొలగించమని చెప్తారు ప్రొఫెసర్. తరగతిగదంతా నిశ్శబ్ద మలముకుంది. ఏం జరగబోతుందోనని ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు పిల్లలంతా. ఆ విద్యార్థిని చాలా ఏడుస్తూ ప్రొఫెసర్ వంక దీనంగా చూస్తూ…. ఇద్దరు పిల్లల పేర్లను చెరిపేస్తుంది. అప్పుడు ప్రొఫెసర్ ఆ అమ్మాయిని వెళ్లి కూర్చోమని చెప్తారు. ఆ అమ్మాయి చాలా బాధపడుతూ తల క్రిందకి వేసుకొని కూర్చుంటుంది దీర్ఘంగా ఆలోచిస్తూ…. ఒక్క నిమిషం ఆగి అదే అమ్మాయిని ఇంతమంది ఉండగా స్నేహితులు, బంధువులు, తల్లిదండ్రులు, పిల్లలు అందరినీ పక్కనపెట్టి భర్తను మాత్రమే చివరి వరకు ఉంచుకోవడానికి కారణం ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఆ అమ్మాయి ఎంతో బాధపడుతూ బంధువులు స్నేహితులు అవసరాన్ని బట్టి మారిపోతుంటారు. కొన్ని సందర్భాలలో వదిలేస్తూ ఉంటారు. ఇకపోతే నన్ను కన్న తల్లిదండ్రులు నాకన్నా పెద్దవారు కాబట్టి నా కన్నా ముందుగానే కాలం చేస్తారు. ఇక పిల్లలు అంటారా వారి ఉద్యోగరీత్యా పిల్లల చదువుల రీత్యా వారి జీవితాలు వాళ్ళు ఏర్పాటు చేసుకొని మమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు. అదే భర్త అయితే నేను ఉన్నంతవరకు నాతో పాటుగా ఆయన కూడా ఉంటారు. ఒకరికి ఒకరం తోడునీడగా ఉంటాము .అందుకే అందర్నీ చెరిపేసివారిని మాత్రమే మిగులుచుకున్నాను అని చెప్తుంది. ఇదండీ కథ.
నేటి సమాజంలో కుటుంబం కన్నా స్నేహితులు ,బంధువులు మిగతా వ్యక్తులతోటే జీవితం అనుకొని అవివేకంతో కుటుంబాన్ని చెల్లాచెదురుగా చేసుకుంటున్న వ్యక్తులు ఎందరో కానీ….. ఇక్కడ నిజానికి ఆలోచించాల్సింది మనతో చివరి వరకు ఉండగలిగిన వారు ఎవరు అనేది. ఆ విచక్షణ లోపించి ఎన్నో అవస్థలు పడుతున్నారు నేటితరం. ప్రొఫెసర్ అడిగిన ప్రశ్నలకు ఆ అమ్మాయి ఎంతో వివేకంతో ఆలోచించి సమాధానం చెప్పింది .ఇది నిజంగా నూటికి నూరుపాళ్ళు నిజం కదా !!!!!మీరేమంటారు???? అవునంటారా?? కాదంటారా??
నాకైతే అదే నూటికి నూరుపాళ్ళు నిజం అనిపించింది. ప్రతి మనిషి జీవితంలో ఎందరో వస్తుంటారు. పోతుంటారు. అవసరాలను బట్టి అవసరం తీరాక కానీ…. భార్యాభర్తలు మాత్రమే వారు కాలం చేసే వరకు ఒకరితో ఒకరు ఉంటారు ఇది సత్యం సత్యం సత్యం.
వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించిన కథ .నాకు బాగా నచ్చి మీ అందరితో కూడా పంచుకోవాలనిపించింది. చిట్టి కథ గొప్ప సందేశం.
సర్వేజనా సుఖినోభవంతు
విషయ సేకరణ :- సామాజిక మాధ్యమం నుండి.