తులసి

కథ

జీవితం ఒక పాఠశాల అయితే, ప్రతిక్షణం కొత్త పాఠాన్ని నేర్వవలిసిన జీవుల,జీవన నాటకాల్ని, కాలం కలంగా మారి చిత్ర విచిత్రంగా రచిస్తుంది. అటువంటి ఒక సాగిపోతున్న రచనే ప్రస్తుత ఈ తులసి.

పాతికేళ్ల క్రితం మా అమ్మాయి పెళ్ళిలో, పెళ్ళికొడుకు పెద్దమ్మ కోడలని, పరిచయమైంది తులసి. అమాయకత్వంతో కూడిన రూపం. నునుపైన పచ్చని పసిమిమేని ఛాయతో మళ్లీ మళ్లీ చూడాలనిపించేట్లుగా పొందికగా అనిపించింది..ఆమె భర్త మాత్రం తుమ్మ మొద్దులా మొరటుగా వున్నాడు. పల్లెల్లో సహజంగా ఇంటి పని,తోట పని, కట్టెల పొయ్యిలపై వంటలు సామాన్య కుటుంబీకులకు సర్వసాధారణమే అయినా, అవన్నీ హుషారుగా చక్కపెట్టగల చురుకుదనం కూడా ఆ అమ్మాయికి ఉందని విన్నాను.

ఇన్నేళ్లలో బంధువుల ప్రసక్తి వచ్చినప్పుడల్లా, మా మధ్య తులసి విషయం కూడా ప్రస్తావనకు వస్తుండేది. ఏవో సందర్భాల్లో తప్ప తనను నేను కలిసింది తక్కువే కానీ, ఒడిదుడుకులతో కూడి మలుపులు తిరిగి సాగుతున్న ఆమె జీవిత కథనంలో, తన ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో తరచూ గుర్తుచేసుకునేట్లుగా అయ్యింది. ఓకే టౌన్ లో ఉండడం వలన మా అమ్మాయి వాళ్ళు తరచూ మా ఇంటికి వచ్చేవాళ్లు, మేమూ వెళ్లే వాళ్ళము. ఒకసారి అలా మా అమ్మాయి వాళ్ళింటికె ళ్ళున్నప్పుడు తులసి రావడం తటస్థించింది. పలకరింపులు అయిన తర్వాత పాప 10th క్లాస్ అనీ, అందుకొరకు టౌను కాపురం పెట్టామని చెప్పింది. అత్తగారు,భర్త,తను, పాప ఇది వాళ్ళ కుటుంబం. ఒక ఆడపడుచు ఆమెకు పెళ్లయి ఇద్దరు పిల్లలు. కాసేపు అవి,ఇవి మాట్లాడుకుని వెళ్లిపోయింది తను.

చూస్తుండగానే రెండు మూడేళ్ల కాలం అలా జరిగిపోయింది. ఈ మధ్యకాలంలో నేను తులసిని చూడలేదు కానీ, ఆమె విషయాలు ఏదో రకంగా వినపడుతుండేవి. ఇంటి బాడుగ కట్టలేక అవస్థ పడుతున్నారనీ,భర్త వ్యవసాయం పనులు మానేసి, టౌను నుండి కదలకుండా చాలానే అప్పులు చేసి పొలాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో అవసరాలు తీర్చుకుంటుంటే, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అన్నట్లు ఆ ముచ్చట కూడా పూర్తయింది. తులసి భర్తను మా అల్లుడుగారు వాళ్లకు తెలిసిన వారి దగ్గర కోళ్ల ఫారం యజమాయిషీకీ చేర్పించాడు అని చెప్పారు. అత్తగారు కూడా కొన్నాళ్ళు ఉండి వస్తానని కూతురింటికి వెళ్లారట.

కాలేజీలో చేరిన కూతురుతో తులసి ఒక్కరితే ఉండిపోయింది. ఒంటరి ఆడవాళ్ళయ్యేసరికి పోకిరి పిల్లల తుంటరి చేష్టలతో ఇబ్బంది పెడుతుంటే, మా అమ్మాయి వీళ్ళ పరిస్థితి గమనించి వాళ్ళింటికి దగ్గరలో మా అల్లుడు వాళ్ళు చిన్న పోర్షన్సగా ఇళ్లు కట్టి బాడుగు లకు యిచ్చి ఉన్నారు. అందులో ఒకటి ఖాళీ చేయించి తులసి వాళ్ళు అక్కడ ఉండే ఏర్పాటు చేశారు. కష్టపడే స్వభావం గల ఆ అమ్మాయి చిన్నప్పుడు నేర్చుకున్న టైలరింగ్ ఇప్పుడు ఉపయోగించుకుంది. ఇంటి వద్దనే చీరల బిజినెస్ చేస్తున్న తన వయసు ఆమెతో పరిచయం పెంచుకుని , కొంత సమయం ఆమెకుబిజినెస్లో సహాయపడేట్లు, అందుకు తగిన జీతం ఏర్పాటు చేసుకుంది. ఇంకా అక్కడికు వచ్చే కస్టమర్స్ కు చీరలకు ఫాల్స్, బ్లౌజులు కుడుతూ ఈ సంపాదనతో కొంత ఊపిరి తీసుకోగలిగింది. రేషన్ షాపులో బియ్యం ఉప్పు పప్పులు తెచ్చుకుంటూ ఇల్లు గుంభనంగా నడప సాగింది.

భర్త నుండి సహాయం లేకపోగా కొద్ది రోజులకు,ఆ చేస్తున్న పని కూడా మానేసి, తన అసమర్థత కప్పి పుచ్చుకోవడానికి ఏవో సాకులు వెతుకుతూ, ఏదో విధంగా ఆ అమ్మాయి సంసారాన్ని గు ట్టుగా నడుపుతుంటే, ఖాళీగా కూర్చుని రోజూ గొడవలతో పొద్దుబుచ్చడం మొదలుపెట్టాడట. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆ అమ్మాయి చేయి చాచి ఎవ్వరిని సహాయం యాచించలేదు. దగ్గరగా చూస్తున్న వారికి తప్ప, తను పడే అవస్థలు నోరు విప్పి ఎవ్వరికీ చెప్పుకోలేదు కూడా. అయినప్పటికీ “సంసారంలో సమన్వయం లోపిస్తే ప్రపంచానికి మనం బట్టబయలయినట్లే ” “నాలుగు గోడల మధ్య విషయాలు నడిరోడ్లో ఉంటాయి “.
కూతుర్ని ఇంజనీరింగ్ చదివించాలని ఆశపడిన తులసి రోజు రోజూ ఇంట్లో గొడవలకు, ఊర్లో ఉన్న ఆ కాస్త పొలం, చేయిజారక ముందే, వీలైనంత త్వరగా అమ్మాయికి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలని ఆతృత పడసాగింది.
తులసి కూతురు కూడా తల్లిలాగా అందమైన అమ్మాయి. బ్రతికి చెడ్డ కుటుంబంగా ఊరిలో కొంత ఆదరణ మిగిలి ఉంది కనుక,ఊరి పెద్దలు సహాయంతో పొలాలు అమ్మి అప్పులు కట్టి అమ్మాయికి ఇవ్వవలసింది నిర్ణయించుకున్నారు. అదృష్టం కొద్ది పొలాలు అనుకున్న దానికన్నా ఎక్కువ రేటుతో అమ్ముడయ్యాయి. అమ్మాయికి కూడా సంబంధం కుదిరింది. ఇక పెండ్లి ఖర్చులు అవి ఎలాగూ ఉంటాయి. పదిమందితో కూడినవ్యవహారం కాబట్టి కొంత వితరణగానే జరగాలి మరి. పెండ్లి కని ప్రస్తుతం ఉంటున్న చిన్న ఇంటి నుండి రెండు గదుల బాడుగ ఇంటికి మారారు. అనుకున్న శుభకార్యం తలొక చెయ్యి వేసి సజావుగా జరిపించారు.

తులసి అల్లుడు ఒక్కడే కొడుకు . పెద్ద కాంట్రాక్టర్ వద్ద చేరి గౌరవంగా గడుపుకుంటున్నాడు. అమ్మాయి అత్తగారు గడసరి బాధ్యత లేని ఇల్లాలు.ఈ విషయమై తులసి కొంత వెనుక ముందు ఆడినా, పిల్లవాడు కష్టపడి సంపాదించుకుంటున్నాడు పెండ్లాన్ని పోషించగలడు. తన పరిస్థితిని కూడా గుర్తుపెట్టుకుని ఎక్కువ ఆలోచించకుండా పెళ్లి జరిగిపోయింది.
తులసి,కూతురు,అల్లుడిని తొలి పండగలకు తీసుకురావడం, సారె పెట్టి పంపడం, వియ్యపురాలి గొంతెమ్మ కోరికలు సహనంతో తీర్చడం శక్తికి మించిన పనే అవుతున్నది. ఊపిరి తీసుకునే లోపు అమ్మాయి గర్భవతి. ప్రసవానికి పుట్టింటికి తీసుకువచ్చి పురుడు పోసి తల్లి బిడ్డను క్షేమంగా లాంఛనాలతో పంపింది. పొలం అమ్మగా మిగిలిన డబ్బు కూడా అయిపోయింది.
ఇప్పుడు ఇంటి పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అత్తగారు,భర్త కోరికలకు తగ్గట్టుగా తులసి సదుపాయాలు చేయలేకపోతున్నది. ప్రొద్దున లేచి అన్నీ పేచీలే, తులసి సంపాదన సరిపోవడం లేదు
. ఒకరోజు షాపు నుండి వచ్చేసరికి తల్లి కొడుకులిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చినట్లు, తులసీ! ఇలా వచ్చి కూర్చో అంటూ ఆదరంగా పిలిచి కూర్చోబెట్టి. ఇక ఇక్కడ ఉండడం కష్టం. ఇంటా, బయట పనులతో నువ్వూ అలసిపోతున్నావు. మనం కూడా,అమ్మాయి అల్లుడు వాళ్ళ వద్దకు వెళ్లి ఉందాము. అమ్మాయితో మాట్లాడు నువ్వు చెప్తే కాదనరు అంటూ అనునయంగా మాట్లాడుతున్న వారిని ఏ కోవలోకి చేర్చాలో అర్థం కాక తెల్లబోయింది. ఇప్పటివరకు సహిస్తూ వస్తున్న తులసి ఈ విషయంలో పెద్ద గొడవే పడి ఆ ప్రయత్నం ఆపగలిగింది.
నిన్న సాయంత్రం నేను,మావారు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. పక్కింటి వాళ్లు వ్రతం చేసుకుంటూ పిలిచారమ్మ త్వరగా వచ్చేస్తాను అంటూ, అమ్మా! మీరు డిన్నర్ ఇక్కడే చేస్తారు అన్ని ప్రిపేర్ చేసేసాను అని చెప్పి మా అమ్మాయి వెళ్ళింది.

ఇంటి వెనుక వైపు తులసి కోట మెట్లపై కూర్చుని ఏదో చదువుకుంటున్నాను. ఇదిగో నిన్నే! తులసి వచ్చింది అని చెబుతూ, మా వారు,ఆ వెనుకనే తులసి వచ్చారు. రామ్మా! అని పలకరిస్తూ లేవబోతుంటే, లేవకండి ఆంటీ ఇక్కడే కూర్చుందాం చల్లగా గాలి వస్తున్నది అంటూ, తాను తెచ్చిన సంచి పక్కనపెట్టి కూర్చుంది. ఆకు కూరలు కూరగాయలు ఉన్నాయి అందులో. వంటా మెకు తులసి కొరకు టీ,స్నాక్స్ తెమ్మని చెప్పి. మార్కెట్ కెళ్ళి వస్తున్నావా! మంచినీళ్లు తాగుతూ లేదు ఆంటీ ఇవన్నీ ఇంటి వద్ద పండించినవే, ఊరికి వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నాను అని చెప్పింది. ఒక్కర్తివేనా? అవునాoటీ టౌన్ లో ఖర్చులకు తట్టుకోలేము . ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది పెడుతున్నది. పాప పెళ్లి అయ్యి ఆ బాధ్యత తీరిపోయింది కదా, పల్లెటూర్లో అయితే తన మన అనుకునే వాళ్ళింకా ఉన్నారు. పొద్దున వాకిట్లో కళ్ళాపి జల్లి ముగ్గు వేయలేదంటే, ఏమైందోనని తలుపు తట్టి ఎలా ఉన్నావని పలకరించుకుంటారు. ఇంటి చుట్టూ ఖాళీ స్థలంలో ఆకుకూరలు, కాయగూరలు నాలుగు గింజలు చల్లితే, ఇంటికి సరిపడా కాక ఇరుగుపొరుగుకు కూడా పంచవచ్చు.

ఎవరికి వీలైనవి వారు ఇచ్చిపుచ్చుకోడాలు పల్లెల్లో మామూలే కదా, దేనికీ వెతుక్కోకుండా జరిగిపోతుంది. రెండు గేదలను పెట్టుకుంటే పాలు పెరుగుకు లోటు లేకపోవడమే కాక మిగలగా అమ్మిన పాలతో పది రూపాయలు చేతి ఖర్చులకు కూడా మిగులుతున్నది. దిగులు లేకుండా జరిగిపోతుoది. ఇవన్నీ చేతనైనవి, ముందు చేస్తున్న పనులే కదా ఆంటీ! ఇది మా అత్తగారికి, మా వారికిచెప్పి ఒప్పించలేకపోయాను. వాళ్ళిద్దరూ మొండిగా టౌన్ లోనే ఉంటున్నారు. ఎలా జరుపుకుంటున్నారో భగవంతుడికే తెలియాలి. ఊర్లో ఇంటి స్థలాన్ని కూడా అమ్మివేయాలన్న వారి ఆలోచనకు, మీ అమ్మాయి,అల్లుడు గారి సహాయంతో నిలుపుకున్నాను.

మా అమ్మ వాళ్లు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు ఆంటీ, సంసారానికి సర్దుబాటు చాలాఅవసరమని,అలాగే కూతురి సంసారంలో కలుగజేసుకోవడం పద్ధతి కాదని కూడా చెప్పి పెంచారు నన్ను. అంతంతమాత్రంగా పండీ, పండక అవస్థలు పడే చిన్న రైతు కుటుంబం మా నాన్న వాళ్ళది. అప్పటికీ వాళ్లకున్న దాంట్లోనే పదీ,పరకా సర్దుతూ వచ్చారు. ఒక్కతే కూతుర్ని లోటు లేకుండా పెంచారు. కొరత పడకుండా పెండ్లి చేశారు. ఇప్పుడు నేను వారి దగ్గరే ఉండిపోవచ్చు. వాళ్లకూ నా అవసరం ఉందిప్పుడు. కానీ కాపురం వదిలేసి పుట్టింట్లో కూర్చుందన్నమాట అమ్మ వాళ్ళు భరించలేరు, నాకూ సమ్మతం కాదు. పైగా నా కూతురు, అల్లుడు పిల్లలు వచ్చిపోవాలన్నా,నా యిల్లు నాకు ఉండాలని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను ఆంటీ. ఇన్నేళ్లలో మీరు ఎప్పుడూ నన్ను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. మీరు అడగకపోయినా ఈరోజు మీకు చెప్పి భారం దించుకుంటున్నాను. అమ్మానాన్న తర్వాత అంతటి వారు మీరు నాకు. నా మనసు నొ చ్చుకోకుండా, ఎవరికీ తెలియకుండానే, మీ అమ్మాయి ద్వారా మీరు చేసిన సహాయాలు కూడా నాకు తెలుసు ఆంటీ.

తాగుడు, తిరుగుడు లాంటి వ్యసనాలు ఏవి మా ఆయనకు లేవు. సోమరితనం, మగవాడి నన్న అహంకారం, ఆడవాళ్లు అంటే చులకన భావం, అందులోనూ భార్య అస్సలు నోరెత్తకూడదు. అన్నింటికంటే సునాయాసంగా అప్పులు తెచ్చి వాడుకుని తిరిగి ఇవ్వాలన్న ఆలోచన లేని నిర్లక్ష్యం ఈ స్థితికి తెచ్చాయి మా సంసారాన్ని. సంసారం గుట్టు,రోగం రట్టు అంటారు. నా శాయశక్తుల గుప్పెట విప్పకుండా ప్రయత్నించాను ఆంటీ, ఈరోజు నా గుప్పెట్లో ఏమీ లేకుండా చేశారు. మొండి గోడల్లో నిలబడిన ఇంటిని, నోరు మంచిదైతే ఊరు మంచిగా చేసుకొని, ఇసుక,సిమెంటు మోస్తూ, కూలి మిగుల్చుకుని ఇల్లు నివాసయోగ్యంగా చేసుకుంటున్నాను. “వినా దైన్యేన జీవితం” అని మా ఊరి పూజారి చెబుతుంటారు. భగవంతుని కోరేది ఒక్కటే ఆంటీ ఏ మొండి ధైర్యంతో ఆయాచితంగా చెయ్యి చాచకూడదనుకుంటున్నానో అందుకు తోడుగా నిలువు స్వామీ !అని.

తులసి చేస్తున్న వేడుకోలు తప్పక భగవంతుడు విని ఉంటాడు. కాలుష్యం లేని పల్లె గాలి పీలుస్తూ, కపటం లేని అమాయకత్వమే అందంగా, ఆనందంగా పెరిగిన తులసి పెళ్లయ్యే వరకు టౌను కూడా చూడలేదు. ఆరోగ్యకరమైన ఆలోచనలు, ఆదర్శవంతమైన భావాలతో పెరిగిన ఒక ఆడపిల్లలో కొత్తగా ఇంకా ఏమి కోరగలo.
ఇది ఒక పేరుకు, వ్యక్తికి, సంబంధించిన జీవనయాత్ర కాదు.
ఆత్మాభిమానం కవచంగా, తెగువతో సంసార రణరంగంలో ఒంటరి పోరాటం చేస్తున్న వారందరిదీ. ఆ తెగువకూడా లేనివారు కుటుంబం అనే ముసుగులో ఊపిరాడక,నిత్యం మానసిక పోరాటం చేస్తూ, కనుచూపుమేరలో కనిపించినట్లుండే” మరీచిక” పై ఆశతో బ్రతుకు సాగిస్తూ, మూగవేదనతో ముగింపు పలుకుతారేమో!

Written by Shyama Dasi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చిలిపి తగవులు

ఒడిపిళ్ళు -32