ఐదారు నెలలుగా బ్యాంకు ‘లోన్’ గాని ఇంట్రెస్ట్ గాని కట్టకపోయేసరికి బ్యాంకునించి నోటీసు వచ్చింది.
“ఆంటీ!రిటైర్ అయ్యాక హైదరాబాద్ వచ్చేయండి అందుకే త్రీ బెడ్రూం హౌస్ తీసుకున్నా.” అన్న సంతోష్ మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి రాధకి.
తన దగ్గర ఉన్న అమౌంటు చూసుకుంది. సరిపడేటట్టులేదు.
కృష్ణ తనూ కన్నకలల సౌధమే కూలిపోగా అపరూపంగా కొనుక్కున్న ఈ సిమెంటురాళ్ళ అపార్టమెంటెంత అనుకుంది.అదిఅమ్మటానికి
నిర్ణయించింది.
“అత్తా!నీ అపార్టమెంటు నేను కొనుక్కుంటా !నువ్వుచెప్పిన రేటుకి.నీకు ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంటే చెప్పత్తా !”అని రాజారెడ్డి కొడుకు యశ్వంత్ అన్నాడు.
రాధ కళ్ళలో నీళ్ళుచిప్పిలినాయి.
“తప్పకుండా నాన్నా! నీ అంత బుధ్ధి ప్రణవ్ కు లేదురా .కొండంత కష్టంలో లెక్కలు కట్టాడు.”అంటూ వాపోయింది రాధ.
వెంటనే పుట్టలో పాములా ప్రణవ్ తయారయ్యాడు. వాటా అంటూ.
“ఈ ఇల్లు నాది .నాపేర ఉంది .నాదినాన్నది స్వార్జితం.ఇందులో నీకు వన్ పై ఇవ్వను.”అంది రాధ.
అందితే జుట్టూ అందకపోతే కాళ్ళుమనస్తత్వం ప్రణవ్ ది.
“అమ్మా! నేను ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టు మొదలు పెట్టాం.ఎమ్మెల్యే చేత ఇనాగ్యురేషన్ చేయించాము.బెంగుళూరు కి రెండువందల కిలో మీటర్ల దూరంలో తొంభైఎకరాల స్థళంలో’ రిసార్ట్ ‘కట్టాలని.ప్రక్కనే హిల్ మీద హార్టీకల్చర్ . నాదగ్గర ఉన్న క్యాష్ సమీర గోల్డంతా కలిపి ఫిఫ్టీపర్శంట్ పెట్టగా ఇంకా మూడుకోట్లు తక్కువ పడింది.ఈ అపార్టమెంటు.అమ్మిన దాంట్లో ఫిఫ్టీ పర్సంట్ ఇవ్వు .పోనీ అప్పుగానే.నువ్విప్పుడు అమ్మతున్నది అమ్మూ గురించేగా. అది ఒక దరిద్ర దేవత మనపాలిటి.” అన్నాడు ప్రణవ్.
“నోర్ముయ్ ! అదికాదురా నువ్వు మాపాలిటి శనివి.శని తో కూడా నిన్ను పోల్చకూడదు.శనికూడా అప్పుడప్పుడు మేలుచెస్తుంది.మనం కోటీశ్వరులం కాదు.మీనాన్న ఒక కాలేజ్ ప్రిన్సిపాల్. నేను ఒక మామూలు బ్యాంకు ఉద్యోగస్తురాలిని.ఆస్తులనే కాలదన్నిన వంశంలో అంతులేని డబ్బు దాహంతో నువ్వెట్లా పుట్టేవురా!ఊళ్ళో ఇల్లు అమ్మి మా షేర్లు కూడా తాంబూలంలో పెట్టి నీకే ఇచ్చాగా!”అంది రాధ.
“ఆఁ ఈచ్చావులే ఒక డెభ్భైలక్ష లు.అది బిజినెస్ కి ఏమూలకి సరిపోతుంది . నేనేం చింతపండు వ్యాపారం చేయటం లేదు. సరే నాదగ్గర చిల్లికానీ లేదు నీ మనుమరాళ్ళిద్దరూ మెడిసిన్ చేస్తామంటూ ఎగురుతున్నారు .లయ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎక్జామ్ ఫీజుకి నాదగ్గిర డబ్బులేదు.దాన్ని
కాలేజీ మాన్పించి ఇంట్లో కూర్చోపెడతా ” అంటూ రుసరుసా వెళ్ళాడు ప్రణవ్.
తలపట్టుకుని కూలబడింది రాధ.రాగిణి అసక్తతతో తల్లిని చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
★★★
“నానమ్మా!నాన్న ఫీజుకట్టనంటున్నాడు అంటూ ఏడ్చింది” లయ .
“తల్లీ ఏడవకు.భయపడకు.కాలేజ్ అక్కౌంట్ కి ఫీజ్ పంపిస్తా.కాస్త ఆఫీస్ నంబర్ కానీ ప్రిన్సిపాల్ నంబరుకానీ ఇవ్వురా తల్లీ.”అంది రాధ.
కాలేజీ బ్యాంకు అక్కౌంటుకి ఎక్జామినేషన ఫీజు ట్రాన్సఫర్ చేసింది.
హమ్మయ్య ఒక ప్రోబ్లం సాల్వ్ అయిందనుకుంది .
రాధకి పదహారు ఏళ్ళలో ఉన్నపట్టదల మళ్లీ ప్రవేశించింది.తనకి యాభైనాలుగేళ్ళు.ఇంకొక నాలుగేళ్ళ లో పరిస్థితులు చక్కదిద్దాలనుకుంది.
“అమ్మడూ వైషూ !నువ్వూ అమ్మా బట్టలు సర్దుకోండి.హైదరాబాద్ వెళ్దాం .” అంది రాధ.
హైదరాబాద్ రాంగానే ముందు బ్యాంకు కి వెళ్ళి సంతోష్ లోను డీటైల్స్ కనుక్కుంది.
లోను నాలుగువంతులు మాత్రమే తీరింది.వడ్డీనే మూడులక్షలు ఉంది.
బ్యాంకుకి వెళ్ళి గోల్డ్ లోను తీసుకొని ముందు నాలుగు నెలల ఇన్స్టాల్ మెంట్ ఇంట్రెస్ట్ తో సహా కట్టింది .
“అమ్మూ! నా సర్వీసు ఇంకా నాలుగేళ్ళుంది.ఈలోగా
వైషూ టెన్త్ కంప్లీట్ చేస్తుంది నేనురిటైర్ అయ్యాక ఎలానూ నీదగ్గిరే ఉంటా.తిరపతి అపార్ట్మెంటు అమ్మేయదలచుకున్నా.నువ్వు తిరపతి రానంటున్నావు . బ్యాంక్ క్వార్టర్స్ లో ఉంటా.బ్యాంక్ వాళ్ళు ఎటూ హౌసింగ్ ఎలవెన్స్ ఇస్తారుకదా! ఈ నాలుగేళ్ళు నేను వస్తూ పోతూ ఉంటా .నువ్వు వయసులో ఉన్నావు.వైషూ ఎటూకాని వయసు.ఇరుగు పొరుగు వాళ్ళందరూ మంచివాళ్ళు. జాగర్త.వైషూ ఎంతవరకూ చదవగలిగితే అంతవరకూ చదివిస్తా.”అంటూ ఇద్దరికీ జాగ్రత్తలు చెప్పి తిరుగు ప్రయాణమైంది.
తిరుపతి హైదరాబాద్ షటిల్చేస్తూ రోజులు వెళ్ళతీస్తోంది.
సమీర తండ్రి పోతూ పోతూ ఆస్థి అంతా చిన్నకూతురికి కొడుకుకి రాసి కాలంచేసాడు.దీనితో సమీరకి పుట్టింటి వారు తనని పూర్తిగా వెలి వేసారని అర్ధమైంది .అత్తగారు శ్రుతి కి మెడికల్ కాలేజి ఫీజు, చిన్న కూతురి ఎక్జామ్ ఫీజు కట్టి నట్లు తెలిసికొని మనస్సు లోనే నమస్కరించింది.
రాధ అపార్టమెంటు అమ్మేసింది.ఆ ఆమౌంటు తో సంతోష్ అపార్టమెంటు లోను పూర్తిగా తీర్చగా
యాభైలక్షల వరకూ చేతిలో ఉంది. అది ఫిక్సడ్ లో వేసింది.
లయ ‘నీట్ ‘ క్రేక్ చేసింది.రాధ ఆనందం అంబరాన్ని దాటింది. అక్కకాలేజీలో మెడిసిన్ ఫస్ట్ ఇయర్లో సీటు సంపాయించగలచింది లయ. ఇంకా ఒకే ఒక్కసంవత్సరం సర్వీసు ఉంది.ఏదైనా మిరాకిల్ జరిగి ఇంకొక్క రెండేళ్ళు ఎక్కడైనా ఉద్యోగం వస్తే నా ముగ్గురు తల్లుల జీవితాలని ఒక ఒడ్డుకు తెచ్చిన దాన్నవుతానని అనుకుంది.
మరుసటి రోజు బ్యాంకుకు వెళ్ళిన రాధకి బ్యాంక్ అంతా కోలా హలంగా ఉంది మేనేజర్ వచ్చింది కూడా పట్టించు కోకుండా. ఏమిటా అంటే రిటైర్మెంటు ఏజ్ ఎక్సటెన్షన్ ప్రపోజల్ గవర్నమెంటు ఎగ్రీ అవటంతో రిటైర్మెంటు ఏజ్ యాభై ఎనిమిది నించీ అరవై అయింది. నెక్స్ట్ఇయర్ రిటైర్ అయేవాళ్ళకి ఇంకో రెండేళ్ళు సర్వీసు పొడిగించ బడింది.
“నేను నెక్స్ట్ ఇయర్ స్టేట్స్ వెళ్ళి అరునెలల పాటు అబ్బాయి దగ్గిర ఉందామనుకున్నా!”
“నేను పిల్లడెలివరీకి అమెరికా వెళ్ళాలనుకున్నా!”
“ఎప్పుడెప్పుడా హాయిగా ఇంట్లో కూచుందామనుకున్నా. ఈ కీళ్ళనొప్పులతో దినదినగండంగా ఉంది.”
అంటూ రకరకాలుగా అందరూ వాపోతున్నారు.
రాధకి ఫస్ట్ బ్యాంక్ అప్పాయింట్‌మెంటు వచ్చినప్పుడు ఎంత సంతోషపడిందో అంతకు వెయ్యిరెట్లు సంతోషమనిపించింది.”తండ్రీ ఈఆదివారమే నీకొండకొస్తానని నమస్కరించింది .దుఃఖం కట్టలు త్రెంచుకొనివస్తోంది.గబగబా వాష్రూముకెళ్ళి తనివితీరా ఏడ్చింది.
అమ్మూకి ఫోన్‌చేసి శుభవార్తచెప్పింది.
★★★
యముడు ప్రాణాన్నిహరించి నీకింకా ఆయుష్షు వుందని భూమి మీద వదలినట్లుంది రాధకు రిటైర్ మెంట్డేట్ ఎక్స్టెన్షను.
వైషూ ఇంటర్ సెకండియర్ ఐ.ఐ.టి ఎయిమ్ తో చాలా కష్టపడుతోంది. శ్రుతి లయలకంటే చాలా మెచ్యూర్డ్ వైష్ణవి.తల్లి అమాయకత్వం , అమ్మమ్మ తెలివితేటలు కష్టం ఆకళింపు చేసుకుంది.
అమ్మమ్మ వడిలో పడుకొని అమ్మమ్మా నేను నిన్నూ అమ్మని చూసుకుంటా పెద్దయ్యాక.అని ఇప్పుడు మాత్రం నువ్వేనన్నుచూసుకోవాలి అని చిలిపిగా నవ్వేది.రాధకి వైష్ణవి నవ్వులో కృష్ణ కనపడేవాడు.
రాధ రిటైర్మెంటు, వైష్ణవికి ఐ.ఐ.టి చెన్నై లో రావటం రెండూ ఒకేసారి అయ్యాయి.
.
వైష్ణవిని చెన్నై తీసుకెళ్లి హాస్టల్ చేర్చి.ఎడ్మిషన్ చెయించి హైదరాబాద్ షిఫ్ట్ అయింది రాధ.
రాధ రాగిణి దగ్గర ప్రశాంతంగా ఉంది.జీవితంలో ఒడిదుడుకులు విపరీతమైన వత్తిడి వలన ఆరోగ్యం దెబ్బతింది.షుగర్,బి.పి వంటి సామాన్యమైన ప్రాణాంతకమైన అశ్వస్థతలకి లోనైంది.కూతురికి జీవితానికి ఆధారం ఏమిటి?అన్నది రాధ మెదడుని తొలుస్తూనే ఉంది. వాకింగుకు వెళ్ళి పరధ్యానంగా నడుస్తూ ఓపెన్‌గా ఉన్న డ్రింకింగ్ వాటర్ మేన్ హోల్లో పడి తలకు పెద్ద దెబ్బతగిలింది.చేయి ఫ్రాక్చర్ అయి సర్జరీ చేసి రాడ్ వెయాల్సివచ్చింది.
విషయం తెలిసి బెంగుళూరు నుంచి శ్రుతి, లయ చెన్నై నించీ వైష్ణవి వచ్చారు.
అమ్మమ్మా !నానమ్మా !అంటూ చుట్టు ముట్టారు.
రాధ మూడు పాస్ బుక్స్ తెచ్చి ఇచ్చింది . అందులో శ్రుతికి నలభై లక్షలు ,లయకి యాభై ,వైశూకి డెభ్భైఐదు లక్షలు వేసి ఉన్నాయి .”నానమ్మా ఏమిటిది మేంనిన్ను చూడటానికి వచ్చాం. మానాన్న లాగా డబ్బుకోసం కాదు “అన్నారు శ్రుతిలయలు ఒకే గొంతుకతో.
వైష్ఢవి.”నాకేంతెలుసు” నాకాడబ్బక్కరలేదు.అంది వైష్ణవి.
“నేచెప్పేది వినండి.’ అంది రాధ. “ఈడబ్బులు అపార్టమెంట్ అమ్మగాను, నా రిటైర్మెంటు బెనిఫిట్స్ తాలూకావి.నాకు నా పెన్షను మెడికల్ ఇన్స్యూరెన్స్ నాకు సరిపోతుంది.”అంది రాధ.
“ఇది మీచదువులకి ఫిక్సడ్ లో వేసిన డబ్బులు. మీ ముగ్గురుకి స్టడీ లోనులున్నప్పటికీ చాలా ఖర్చులుంటాయి.ఈ ఎమౌంటు మీద వచ్చే వడ్డీ మీఖర్చులకి సరిపోతుంది.అత్యవసరమైతే అసలు డ్రా చేయండి.” అంటూ శ్రుతిలయలకు చెప్పింది.
“వైషూ ! నీ పాస్ బుక్ అమ్మదగ్గరే ఉంటుంది.నీకు కావలసిన ప్పుడు అమ్మ డ్రా చేసి పంపుతుంది.”
అంది రాధ.
“ఇంత జరిగినా మీనాన్న రాలేదే శ్రుతి” అందిరాధ బాధతో.
నానమ్మా!నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో.నిన్ను పట్టించు కోని వాళ్ళగురించి ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోకు.మేము ఇద్దరం అక్కచెల్లెళ్ళం కాదు.వైషూ కూడా మాచెల్లెలు.నీ టెన్షనంతా వైషు గురంచి అని తెలుసు నానమ్మా!” అంది శ్రుతి పరిణితి చెందిన వ్యక్తిత్వంతో.
” నానమ్మా మాకు నానమ్మ, తాత తెలివితేటలొచ్చాయి.” అంటూ. శ్రుతి లయలు నానమ్మను చెరో చెంప ముద్దుపెట్టుకొని బెంగుళూరు ప్రయాణమయ్యారు.
” అమ్మమ్మా ఇంకా నాలుగేళ్ళు నిన్ను వదిలి ఉండాలి.’అని భోరుమని ఏడ్చింది వైషూ.
“నీకు బెంగ వచ్చి నప్పుడు వద్దుగాని టిక్కెట్లు బుక్ చేస్తా.”అని సముదాయించి వైషూని సాగనంపింది.
ప్రణవ్ ఇంకా జలగలా పీక్కుతింటూనే ఉన్నాడు
హైదరాబాద్ వచ్చినప్పుడల్లా.
“నీకు పెన్షన్ ఎంత వస్తోందీ? రిటైర్ అయ్యాక బాగానే వచ్చి ఉంటుంది కదా!నీ కొడుకు కష్ట పడుతుంటే నీ తల్లి మనసు ఎలా ఊరుకుంటోంది?నాఫ్రెండ్స్ బిజినెస్ లో ముంచారు.ఇంటి అద్దె కట్టుకోలేకుండా ఉన్నా.చిన్న ఇంట్లో సమీర ఎడ్జస్ట్ అవలేదు.”ఇలా ఉంటాయి ప్రణవ్ మాటలు.
మౌనంగా విని ఒక పాతికవేలు చెతిలో పెట్టి “నాకునీతో సంబంధం లేదు.నా మనమరాళ్ళని పైకి తేవటమే నా ధ్యేయం.” అంది రాధ.
“నాతో సంబంధంలేదా! రేపు నువుపోతే తలకొరివి పెట్టాల్సింది నేనే సంబంధం లెదంటావే.”అన్నాడు ప్రణవ్.
“నీకాబాధ అక్కరలేదు.నా మరణానంతరం నాకళ్ళు ఎల్.వి ప్రసాద్’ ఐ ‘హాస్పిటల్ కి డొనేట్ చెసా. బాడీ మెడికల్ కాలేజీకి డొనేట్ చెసా.ఏ బ్రెయిన్ స్ట్రోక్ తోనో పోతే ఆర్గన్ డొనేషను కూడా చేసా!ఇక నీతో నాకు సంబంధంలేదు.బ్రతికున్నప్పుడు పీడించుకున్న నీ చేతితో తలకొరివి పెడితే నేను చేసుకున్న పుణ్యంహరించిపోయి నీ పాపం నాకు చుట్టుకుంటుంది” అని అంది రాధ.
మూసుకున్న కళ్ళనించీ నదిలా ధారావాహికంగా ప్రవహించాయి కన్నీరు రాధ కళ్ళలోంచి.
‘కృష్ణా!అలసిపోయాను.నాశక్తిమేరకు కుటుంబాన్ని కాపాడుకున్నా అడుగడుగునా ఎదురు తిరిగిన విధితో ధైర్యంగా పోరాడుతూ.’ అంది పైకి రేపటి
ఆశా జ్యోతులు శ్రుతి, లయ,వైష్ణవి లను తలచుకుంటూ.
“అమ్మా భయంగా ఉంది నిన్ను చూస్తుంటే.” అంది రాగిణి.
“వైషూకి నిన్నప్పగించికానీ యముడు పిలిచినా వెళ్ళను అమ్మూ.నాసంకల్పం ఆ శ్రీనివాసుడికే తెలుసు.” అంది రాధ భగవంతునికి కృతజ్ఞతతో కైమోడ్చి.
సమాప్తం