‘ప్రేమికుల రోజు ‘ కాదు ఇది ‘ప్రేమ రోజు’

ఫిబ్రవరి తరుణి పత్రిక సంపాదకీయం

ప్రేమ ఒక మధురానుభూతి. ఒక వ్యక్తికి మరో వ్యక్తి పై ఉండే అనురాగం. సాధారణంగా స్త్రీ పురుష జాతి మధ్యన ఉన్న ఈ ఆసక్తిని ప్రేమగా చెబుతూ ఉంటారు. వయసులో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డారు అనే మాట వింటుంటాం. అది నిలుపుకుంటే కదా ‘నిజమైన ప్రేమ’ అయ్యేది. ఊరికే పడిపోతే సరిపోదు… లేవాలి, నిలబడాలి,గెలవాలి. ఎన్ని అడ్డంకులు  వచ్చినా ఎదిరించి నిలవాలి, జీవితాంతం నిలవాలి. అప్పుడు కదా ప్రేమకు అర్థం సరిపోయినట్టు! అయితే ఇరుపక్షాల వారిలో ఇలాంటి భావనలు ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది ఇది నిజం. పెద్దలు కుదిరించి చేసిన పెళ్లిళ్లలో ఒకవేళ  ఏకపక్షంగానే ప్రేమ ఉన్నప్పుడు దాన్ని నిలుపుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. దీనికి ఉదాహరణగా భారతీయ కుటుంబ వ్యవస్థను చెప్పుకోవచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడ్డారు. అందుకే కుటుంబాలు బాగా నిలిచాయి. కానీ ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు, ప్రేమలో పడిన వాళ్ళు తమ ప్రేమను నిలుపుకోకుంటే  ఇంక అర్థం ఏముంది? ఈ ప్రేమ విషయం గురించి, ప్రేమికుల రోజుల గురించి, ప్రేమ రోజును గురించి మాట్లాడుకుందాం…

ప్రేమ… ప్రేమ… ప్రేమ.. ప్రేమ. లేనిదే బ్రతకలేరు. నిజమే… ఈ ‘ప్రేమ’ అనేది పుట్టిన శిశువు నుండి ఎదుగుతున్న క్రమంలో ప్రతి దశలోనూ ప్రేమ కావాలి తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, సోదర సోదరీమణుల ప్రేమ, నానమ్మ అమ్మమ్మ తాతయ్యల ప్రేమ, చిన్నాన్న చిన్నమ్మల ప్రేమ, మేనమామల  మేనత్తల ప్రేమ. ప్రేమ ఇంటివాళ్లే కాదు సమాజంలో కాలు బయటపెట్టినప్పటినుంచి ఆ శిశువుకు ఆ పసిపాపలకు ప్రేమ అందాలి . మనం మాట్లాడుకుంటున్న వాలెంటైన్స్ డే ప్రేమ ప్రస్తుతం అదేనా?  కాదు యువ జంట మధ్య చెలరేగే ప్రేమను వాలెంటైన్స్ డే కు సంధించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఎప్పుడూ తాజా తాజాగా చర్చనీయాంశమైన విషయమె. ఎందుకంటే భూతద్దంలో ఈరోజుల్లో చూపిస్తున్నారు కదా అందుకే!

ఈ సమాజం ఎంత విచిత్రమైన ‘పదార్థం’ అంటే ఏదో ఒక చిన్న కొత్తదనాన్ని

చూపించారు అంటే చాలు …దాన్ని పట్టుకొని వేళాడుతూ ఉంటారు . ఇదే జరిగింది వాలెంటైన్స్ డే అనే పేరును ఇంటింటా చేరేలా చేసారు. అయితే ప్రేమ ఎదిగి ఎదిగి మహావృక్షంగా మారడానికి ఒక  ‘కారణం ‘ గా ఇదీ మంచిదే. మంచి ఎక్కడుంటే అక్కడ వాలిపోవడం, మంచి ఎక్కడుంటే దాన్ని తీసుకోవడం మంచిదే . అయితే వాళ్లు పెట్టిన ఉద్దేశ్యం ఏంటి? ప్రస్తుతం చూస్తున్న పరిస్థితులు ఏంటి ? అని ఒక్కసారి బేరీజు వేసుకుంటే.. ఇప్పుడంతా వ్యాపారమే. ఇప్పుడు అంతా షో పుట్ ప్. ఒక ఫ్యాషన్. ఒక స్టేటస్. ఇలా మారడానికి కారణాలేవి?

     ఆనాడు మూడో శతాబ్దంలో రోమ్ నగర చక్రవర్తి కూతురును  ప్రేమ వివాహానికి ప్రయత్నించిన వాలెంటైన్ అనే పూజారి ని ఆ రాజు ఖైదీ చేసి , ఉరి తీసాడట. అది ఫిబ్రవరి 14. ఈ విషయాన్ని మరికొన్ని శతాబ్దాల తర్వాత గొప్పగా నూ, రాజు తప్పుగాను భావించి దీన్ని ప్రేరేపించడానికో, దీన్ని  ఖండించడానికో  ప్రచారంలోకి తెచ్చిన విషయమిది. ఉద్దేశాలు మంచివే అవుతాయి పరిస్థితులే చేయి దాటిపోతాయి. ఆలోచనకు ఆచరణకు మధ్యన ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఖండాలు దాటింది. పరిణామాలు వేరయ్యాయి. ప్రేమ కానుకలకు పరిమితమైంది ప్రేమించడానికి బదులు.1840ల తర్వాత కానుకలు ఇచ్చిపుచ్చుకోవడాలనేదే  పెద్ద పాత్ర వహించింది. అసలు ప్రేమ విలువ పోయి, ధరల విలువ విలువైనదైపోయింది. ప్రేమను తెలుపుతూ రాసిన ‘కార్డ్స్’,  లోతైన ప్రేమకు గుర్తుగా ఎర్ర గులాబీలు ఇవ్వడం నుండి ‘ గిఫ్ట్స్’ ఎంతెంత అవి ఏ విధంగా ఏ ఇస్తున్నారు అనేదానికే ప్రాధాన్యత పెరిగింది. వీటిని వ్యాపారవేత్తలు సొమ్ము చేసుకుంటున్నారు అనే సోయి కూడా మరిచిపోయి తమ శక్తికి తమ స్థాయికి మించి గొప్పలకు పోయి ‘ప్రదర్శనలలో’ ప్రేమను బలి చేస్తున్నారు.

       కొన్ని దేశాల్లో సెలవు ఇవ్వడం, కొన్ని దేశాల్లో ఒక వారం మొత్తం ” ఏడు రోజుల పండుగ” గా జరుపుకోవడం, ఖర్చులు పెరగడం వంటివి ఎన్నో మార్పులు వచ్చాయి. భార్యాభర్తలుగా ఆ జంట కలిసి జీవించడం అనే విషయానికి ప్రతిబంధకాలయ్యాయి ఇవన్నీ అంటే ఆశ్చర్యం మనవెంత్ అవుతుంది. ఏ ఉద్దేశ్యంతోనైతే మొదలుపెట్టారో ఆ ఉద్దేశ్యం పక్కదారి పట్టింది.

ప్రేమ ప్రతి వ్యక్తిలో చిగురించాల్సిన విషయం కానీ కక్షలు కార్పణ్యాలు, కసి ద్వేషాలు మనుషుల్ని అతలాకుతలం చేస్తున్నాయి .ఇది మంచిది కాదు అందరినీ ప్రేమగా చూడాలి అనే ఒక ఉద్దేశ్యం తో ఈ ప్రేమికుల రోజును నిర్వహిస్తూ వస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది ఇద్దరు వ్యక్తుల మధ్య జన్మించిన ప్రేమ వయసు రీత్యా న్యాయబద్ధంగా ఉండాలి, సమాజ రీత్యా న్యాయబద్ధంగా ఉండాలి అనే స్పృహ ఉంటే బాగుంటుంది. స్త్రీ పురుషులు కేవలం పైపై ఆకర్షణలకు లోనై మితిమీరి ప్రవర్తన చేయడం తప్పు. ఇది సత్యం. ఇదే సత్యం. దీన్ని అందరూ ఒప్పుకోవడం లేదు. ఎవరి ఇష్టం ఉన్న వాళ్లతో వాళ్లు ఎంతకాలమైనా ఎలాగైనా ఉండవచ్చు అనే ఒక చెడును ప్రచారంలోకి తీసుకువచ్చి, వాలెంటైన్ డేకు ఉన్న ప్రత్యేకతను చెడగొడుతున్నారు. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే వెనువెంటనే ఫిబ్రవరి 21వ తేదీని బ్రేకప్ డే అంటే యాంటీ వాలెంటెన్స్ వీక్ అంటూ ప్రచారంలోకి తెచ్చారు ఇది ఎంత అన్యాయమో చూడండి ప్రేమ ఇలా పుట్టి అలా మాడిపోవడానికి కాదు ప్రేమ పుట్టి వందేళ్ళ ప్రయాణానికి తొలి బీజం కావాలి దీన్నే పెళ్లి అనే బంధంతో ముడివేసి కుటుంబం అనే శాఖల వృక్షానికి మూలంగా భావించి ఏర్పరిచినటువంటి ఉద్దేశ్యం. 14వ తారీకు నుండి ఓ వారం రోజులు కలిసి మెలిసి తిరిగి శారీరక సంబంధాన్ని పెంచుకొని వ్యక్తిని నచ్చలేదని వదిలేసే పిచ్చి సంస్కృతి ఎక్కడిది? ఎందుకు వచ్చింది? అంటే,

  ఇదంతా ఒక వ్యాపార ధోరణి తో చూడాలి . రెండు హృదయాలు కలవడాన్ని వస్తు వినియోగాన్ని చేయడం, విడిపోవడానికి వస్తు వినియోగాన్ని చేయడం అమానుషం . ఈ ఆంటీ వాలెంటెన్స్ వీక్ ను సింగిల్స్ కోసం ఏర్పరిచారట!!  సింగిల్స్ ఏంటి? ఇది ఎంత దారుణం? ఒక వారం రోజులు ప్రేమను సరదాగా గడపడానికి ఉపయోగించుకోవడం అట ఇది ప్రేమ అవుతుందా? విచ్చలవిడి తనం పరాకాష్ట ఇది. ప్రేమ ఒక పవిత్ర భావన! ఒక సుందరమైన హృదయ స్పర్శ. ‘పవిత్రమైన’ అనే మాటనే పరమ నీచమైన మాటగా భావిస్తున్న ఈ దుర్మార్గ ప్రపంచంలో మనం ఉన్నామా అని వేదన కలుగుతుంది.

   అయితే ప్రేమ పేరుతో బంధించి, బాధించిన వ్యక్తి   జ్ఞాపకాలను తొలగించడం సబబే కానీ, వారం రోజుల్లోనే వ్యక్తి, వ్యక్తిత్వం

హీనమైపోతుందా? పైగా ఒక రెండు మూడు నెలలు వాళ్లతో తిరిగి తిరిగి ప్రపోజ్ చేస్తారే! ఇన్నాళ్లు తిరిగినప్పుడు కూడా వ్యక్తి ఎలాంటి వాళ్ళో తెలియలేదంటే… ఎలాంటి వాళ్లతో నువ్వు స్నేహం చేస్తున్నావు అనేది నీకు నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న. భావోద్వేగాలతో జీవితాలను నిర్వీర్యం చేసుకోవద్దు. తొందరపాటు కూడదు అది వ్యక్తిని ఎంచుకునేప్పుడైనా విడిపోయేప్పుడైనా. వాళ్ళు ఇచ్చే బహుమతులను పారవేసి ఇంతలోనే అవి పాతవిపోయేలాగా భావించి, ఆ అశాంతిని తొలగించుకొని శాంతిని పొందుదాం అనుకోవడం లో ఔచిత్యం ఎంతవరకు ఉందనే ప్రశ్న ప్రతి వ్యక్తి వేసుకోవాలి. అందుకే ఈ ప్రేమ వ్యవహారం తరచి తరచి చూస్తే ప్రేమను కూడా వస్తువును చేసిన దౌర్భాగ్యం కనిపిస్తుంది. వస్తువులతో ముడిపడింది  ప్రస్తుత కాలంలో ప్రేమ . తనదైన అస్తిత్వానికి భంగం కలగుతుంటే ఎదుర్కోవడం తప్పనిసరి. కానీ, జీవితం నందనవనంగా ఎదగడానికి ఉల్లాసభరితమైన ప్రయాణాన్ని చేయడానికి మంచి సంబంధాల బ్రతుకు సూచనలతో ఉన్నటువంటి ఉద్దేశాన్ని కాలరాసి విష సంస్కృతిని ప్రేరేపించి వ్యాపార అభివృద్ధి చేసుకుంటున్నారు కొందరు. బలి అయ్యే వాళ్ళు ప్రజలు. ఎప్పుడైనా ఎక్కడైనా అన్యాయమైపోయేది వాళ్ళ అమాయకత్వం. ఈ విషయాన్ని తరచిచూసి , ప్రజల  పక్షాన ఆలోచించే వాళ్లే కరువయ్యారు.

      ఈ మధ్యనే కొన్ని నగరాలలో ఈ ప్రేమికుల రోజును, ఈ వాలంటైన్ డే ను తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ప్రేమ రోజుగా , సోదర సోదరీమణులకు మధ్య లో ప్రేమగా, టీచర్ స్టూడెంట్ ప్రేమగా, గురుశిష్యుల మధ్య ప్రేమగా, స్నేహితుల మధ్య ప్రేమగా మనిషికి మనిషికి మధ్య ప్రేమగా చూపిస్తున్నారు. పాఠశాలల్లో పిల్లలతో డిబేట్ కాంపిటీషన్స్ పెట్టడం, ఉపన్యాసాలు ఇప్పించడం, గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయించడం, వివిధ రకాల అలంకరణ వస్తువులను చేయించడం, ఒకరికొకరు క్లాసుల్లో గిఫ్ట్స్ ఇచ్చుకోవడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇవి ఆధునిక జీవన వ్యవహారంలో ఉల్లాసభరితమైన పయనంగా చెబుతున్నారు. ఇది యాంటీ వాలెంటైన్స్ వీక్ , కిక్ డే వంటి దుర్మార్గమైన చర్యల కన్నా బెటర్ ఛాయిస్ గా చెప్పవచ్చేమో… పిల్లలలో ప్రేమ మొలకలు నాటుతున్నారేమో! కానీ ప్రారంభించిన ఉద్దేశానికి నడుపుతున్న ప్రయత్నాలకు పొసగడం లేదేమో

అని  కొందరు అంటున్నారు. గులాబీలను రంగును బట్టి ఒక్కో స్నేహానికి గుర్తుగా చెప్పడం పాశ్చాత్యుల ఆచారం. పింక్ గులాబీని ఆనందానికి చిహ్నంగా ఇస్తారు తెల్ల రోజాలను శాంతికి ప్రతిరూపంగా ఇస్తారు, ఊదా రంగు గులాబీలను మేధోసంపత్తికో  సృజనాత్మకతకో అంటే రాయల్టీకి  ప్రతీకగా ఇస్తారు, పసుపు రంగులు గులాబీలను స్నేహానికి గుర్తుగా ఇస్తారు, ఎరుపు రంగును ప్రేమకు చేసినంగా ఇస్తారు . ఇన్ని రకాల పద్ధతులను అయితే అలవరిస్తున్నారు కానీ, నిజంగా వాళ్ళ మనసుల్లో ఆయా భావాలకు తగ్గట్టుగా ఉంటే అదే చాలు!

అదేంటో ఈ రంగులకు వాళ్ల ఉద్దేశ్యాలకు ఏం భాష్యాలు చెప్పగలం కానీ…. ప్రేమను మార్కెట్ మయం చేయకుంటే అంతే చాలు!!

 _____****____

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆకాశానివవ్వు….

సంఘర్షణ