” ఆంటీ, మన కాలనీలో వినాయకుని పెడుతున్నాం. చందా ఇవ్వరా?” అడిగారు మా కాలనీలో ఉండే పది మంది కుర్రాళ్ళు వచ్చి.
” ఆంటీ, ఐదు వందలు తక్కువ కాకుండా రాయాలి” అన్నాడు ఒక కుర్రాడు.
. ” చందా అంటే ఎంతో ఇస్తే అంతే తీసుకోవాలి. డిమాండ్ ఉండకూడదు” అంటూ లోపలికి వెళ్ళి ఐదు వందలు తెచ్చి ఇచ్చాను.
” ఆంటీ, గణేష్ కి రోజుకొకరు ప్రసాదం చేస్తున్నారు. మీరు కూడా ఒక రోజు చేస్తారా?” అడిగాడు ఒక కుర్రాడు.
” ఏం రోజు చేయమంటారో చెప్పండి” అన్నాను.
కాసేపు వాళ్ళలో వాళ్ళు తర్జనభర్జన పడి,
” ప్రసాదాలు రోజుకి ఇద్దరు , ముగ్గురు చేస్తున్నారు. ఒక రోజు అన్నదానం అనుకుంటున్నాము. నిమజ్జనం రోజు దారిలో పంచటానికి పులిహోర చేయిస్తున్నాం. అన్నదానానికి బిర్యానీ అనుకుంటున్నాము. దానికి కావాల్సిన ఐటెమ్ ఏదైనా మీకు తోచినది మీరు ఇవ్వవచ్చు” అన్నారు.
సరే ఏదో ఒకటి ఇస్తాలే అన్న తర్వాత వెళ్ళిపోయారు.
*. *. *
“వదినా, రేపటి నుంచి నవరాత్రులు కదా! . ప్రతిరోజూ ఉదయం తొమ్మిది గంటలకు పూజ ఉంటుంది. నేను వెళుతున్నాను. నీవు కూడా వస్తావా?” అడిగింది మా ఆడపడుచు అన్నపూర్ణ.
” నేను రాలేనులే అన్నపూర్ణా. ఇంట్లో పూజ పూర్తి అయ్యేసరికే నాకు పది దాటుతుంది. రోజూ అంటే కష్టం.పదిరోజుల్లో ఏదో ఒక రోజు వస్తాలే” అన్నాను.
” వంట పని పెట్టుకోకు. కాస్త ప్రసాదం చేసుకుని పూజ త్వరగా కానిచ్చి వచ్చేయి. అక్కడ రోజు అన్నదానం ఉంటుంది. నీవు కూడా వెయ్యి నూట పదహార్లు చందా కట్టావుగా పది రోజుల పూజకి” అన్నది అన్నపూర్ణ .
అన్నపూర్ణ మాటలకి నవ్వు వచ్చింది. అంటే రోజు అక్కడ భోంచేసి పూజకి కట్టిన డబ్బులకి న్యాయం చేయాలన్నమాట.
ఒకప్పుడు శ్రీరామ నవమికి మాత్రమే చలువ పందిళ్ళు వేసి చేసేవారు. పానకం, వడపప్పు పంచేవారు. ఎండాకాలం కాబట్టి వేడి నుండి ఉపశమనం పొందటానికి,దాహం తీయటానికి ఈ రెండు ప్రసాదంగా ఇచ్చేవాళ్ళు.
కాల క్రమంలో, ముంబై లాంటి పట్టణాలకి పరిమితమైన వినాయక చవితి,కలకత్తా, పశ్చిమ బెంగాల్ తరహాలో నవరాత్రులు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా టెంట్లు వేసి చేస్తున్నారు.
ఇలా ఉత్సవాలు చేయటం అభిలషించదగినదే. కాకపోతే చేసే విధానం వెర్రితలలు వేస్తున్నది.
వినాయకునికి కుడుములు, ఉండ్రాళ్ళు ప్రీతిపాత్రమైనవి. కానీ ఎక్కడా అవి కనపడవు. ‘ఎప్పుడూ అవేనా తినీ,తినీ బోర్ కొట్టదా’ అనుకుంటున్నారేమో భక్తులు పులిహోర, దద్దోజనం, పరమాన్నం, చక్రపొంగలి, కట్టె పొంగలి ప్రసాదాలతో రకరకాల స్నాక్స్ కూడా ప్రసాదాల కింద నివేదన చేస్తున్నారు.
శ్రీరామనవమి పానకం, వడపప్పు అసలు ఎవరికి గుర్తులేవు. భగవంతుని కంటే భక్తుల అభిరుచులు ఎక్కువ అయిపోయాయి.
కొన్ని ఆలయాల్లో, ముఖ్యంగా కొత్తగా కట్టిన ఆలయాల్లోపధ్ధతి మరికాస్త చిత్రంగా ఉంటుంది. రోజూ కొందరు భక్తులు వారి వారి ఇళ్ళ నుంచి ప్రసాదాలు చేసి తీసుకువస్తారు. నివేదన అనంతరం వారిలో వారే పంచుకుంటారు.
ఇవికాక, నవరాత్రులలో రోజు ఎవరో ఒకరి ఇంట్లో లలితా సహస్రనామ పారాయణ పెట్టుకుంటారు. చాలా శ్రద్ధగా పారాయణ చేస్తారు, గీతాలు ఆలపిస్తారు. అంతవరకూ బాగుంటుంది.
తదుపరి ఘట్టం మళ్ళీ ప్రసాదాలు. పోటీలు పడి మరీ చేస్తుంటారు. మూడు రకాలు, ఐదు రకాలు . అలాగే గిఫ్టులు, జాకీటు బట్టలు. ఆ మధ్య ఒకసారి మా వారు కిచెన్ లోకి వచ్చి
“ప్లాస్టిక్,టప్పర్ వేర్ డబ్బాలు ఇన్ని కొన్నావేమిటీ ? కొనే దానివి ఒకే మోడల్ కొనవచ్చు గా, రకానికి ఒకటి కొన్నావు ” అని అడిగారు.
” అవన్నీ పారాయణ రిటర్న్ గిఫ్టులండీ ” అనగానే
” పారాయణలకి కూడా ఇస్తున్నారా!” అంటూ ఆశ్చర్యపోయారు.
ఇక అసలు ప్రహసనం అన్నదానాలు. శ్రీరామనవమి, వినాయక చవితి, నవరాత్రులు ఇలా అన్నిటికీ అన్నదానం కామన్. అదికూడా బిర్యానీలే.
చందా కట్టాం కాబట్టి దానికి తగ్గట్టు బంధుమిత్రులతో కలిసి వెళ్ళి మరీ తినేసి రావటం.
ఎందుకు ఈ అన్నదానాలు? అసలు అన్నదానం,ప్రసాదం అనే మాటలకి అర్ధం ఏమిటి?
ప్రసాదం అనగా భగవంతునికి సమర్పించే సాత్విక ఆహారం, పూజానంతరం స్వీకరించటం. సాధారణంగా ఈ ప్రసాదం గుడి ప్రాంగణంలోనే తయారు చేయాలి అనేది శాస్త్రం.
ఇక అన్నదానం అంటే ఆకలితో ఉన్నవారికి, కటిక దారిద్ర్యం తో బాధపడుతున్నవారికి కడుపునిండా అన్నం పెట్టటం. ఇలా చేయటం వల్ల పూర్వ జన్మల పాపాలు తొలగి భగవదనుగ్రహం పొందగలుగుతము. అన్నదానం అనేది ఒక పవిత్రమైన ఆర్పణ. ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెడితే అతను ఇచ్చే ఆశిస్సులు వలన జీవితంలో సానుకూలత ఏర్పడుతుంది.
దూరప్రాంతాలలోని పుణ్య క్షేత్రాలకి, ముఖ్యంగా కాశీ, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు, భక్తుల సౌకర్యార్థం అన్నదాన సత్రాలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. దానివల్ల యాత్రికులకి ఎంతో మేలు జరుగుతుంది.
అన్నదానానికి డబ్బులు కట్టిన వ్యక్తి అక్కడ భోజనం చేయకూడదు అని పెద్దలు చెప్తారు.
కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ప్రతి వారం, నెల , ఇలా ప్రత్యేకమైన ఉత్సవాల్లోనూ అన్నిటికీ అన్నదానమే. ఇది పేదవారికోసమో, ఏదో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి కోసమో కాదు. లోకల్ గా ఉండే వారి కోసమే. నిజం చెప్పాలంటే ఇవి ఒక గెట్ టు గెదర్ లా మారిపోయాయి. వారు కట్టిన డబ్బును బట్టి బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి పూర్తి న్యాయం చేసి రావాలి.
ఒక కాలనీలో గణేష్ మంటపాలు ఐదారు దాకా ఉన్నాయి. అందరూ ఒకేరోజు నిమజ్జనం, అదేరోజు అన్నదానం. కిలోల కొద్దీ బియ్యం కూరగాయలు వండారు. ఎవరికివారు కాలనీ అంతటినీ కౌంట్ చేసుకున్నారు. తీరా చూస్తే దానం చేసేవాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు తక్కువ అయ్యారు . వండినదంతా చెత్త బుట్ట పాలే.
పండుగలు మనం సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించే గొప్ప పర్వదినాలు. ఏం పండుగ ప్రత్యేకత ఆ పండుగకి ఉంది. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆర్భాటాలు అవసరం లేదు. కొబ్బరి ముక్కలు, వడపప్పు, పానకం, పండు, తాంబూలం చాలు.
“పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయఛ్ఛతి ” అంటూ భగవద్గీత లో చెప్పినట్లు భక్తితో సమర్పించే ఏ చిన్న దానినైనా ఆ భగవంతుడు , ఆ అమ్మవారు తప్పక స్వీకరిస్తారు.
ఏదేమైనా గణేష్ ఉత్సవాలు మొదలు నవరాత్రులు వెళ్ళె వరకూ మా ఆడపడుచు లాంటి వాళ్ళకి అన్నదాన ,ప్రసాదాల పుణ్యమా అని ఇంట్లో పొయ్యి వెలిగించే అవసరం రాదు.
ఇదండీ నేటి లోకాభిరామాయణం