విధివంచిత

దట్టమైన మబ్బులతో ఆకాశం వర్షించటానికి ఇప్పుడాఅప్పుడా అన్నట్టుంది. ఆదిత్యుడు నిస్తేజుడై మేఘాలలో దాక్కున్నాడు.

ఉన్మేష తండ్రివడిలో తలపెట్టుకుని పడుకుంది. ఉన్మేషతల్లి ఉన్మేష కాళ్ళురాస్తూ మౌనంగా కన్నీరు కారుస్తోంది.

ప్రకాష్ ఉన్మేష తలనిమురుతూ కంటనీరుని దిగమింగటానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. కన్నకూతురి మీదప్రేమ కన్నీరుగా కట్టలు త్రెంచుకుంది.

” అమ్మా! వెళ్ళొస్తా!” అంది ఉజ్వల.

” జాగ్రత్తమ్మా! టిఫిన్బాక్స్ పెట్టుకున్నావా! డబ్బులు తీసుకున్నావా?” అంటూ ఉజ్వల వెనకే వెళ్ళింది ప్రశాంతి.

అమ్మా! నాగురించి ఆలోచించకు.ముందు అక్కని జాగ్రత్తగా చూసుకోండి.” అంటూ తల్లిని కౌగలించుకొని ముద్దుపెట్టుకుంది ఉజ్వల.

గేటు తీసిన ఉజ్వలకి గేటుముందున్న కొబ్బరిమట్టలు కాలికి కొట్టుకున్నాయి.

” అమ్మా!!! అని చూసి కళ్ళనీళ్లు ఆపుకోలేకపోయింది. పందిరికని వేసిన కొబ్బరాకుమట్టలు మన్సిపాలిటీవాడు తీసికెళ్ళనేలేదు ఇంతలో ఇంత ఘోరం.అక్కకి తనకి రెండేళ్ళే తేడా. కవలల్లా పెరిగారు. జీవితమంటే ఇంతేనా!’ ఆలోచనల్లో బస్స్టాప్ చేరింది ఉజ్వల.

★★★

“తల్లిగా! ఎమ్.ఎస్ చేయటానికి ఎబ్రాడ్ వెళ్తావా!” అడిగాడు ప్రకాష్ ఉన్మేష బి.టెక్ మూడవ సంవత్సరంలో ఉన్నప్పుడు.

” లేదు నాన్నా! నేను ఇక్కడే ఎమ్.టెక్ లో సీట్ తెచ్చుకోగలిగితే చదువుకుంటా.కేంపస్ సెలక్షన్లో మంచి కంపెనీకి సెలక్ట్ అవుతే జాబ్ చేస్తూ ఎమ్.ఎస్ కి ట్రైచేస్తా.ఇంకాచెల్లి చదువుంది. ఎబ్రాడ్ చదువులంటే మాటలు కాదు.స్కాలర్షిప్ దొరకాలి. వెళ్ళటానికి బేంక్ లోన్ తీసుకోవాలి. నాకంత ఇంట్రెస్ట్ లేదు.” అంటూ ఖచ్చితమైన అభిప్రాయం వెలిబుచ్చింది.

ప్రకాష్ , ప్రశాంతి ఇద్దరూ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ లో లెక్చరర్స్. యాజమాన్యం వారు వీరిరక్తం ఆఖరి బొట్టువరకూ పీల్చాకనే నెలజీతం ఇస్తారు.పిల్లలు పొదుపు, ఇంటిబాధ్యత మానవత్వపు విలువలు చెప్పకుండానే గ్రహించారు.

★★★

ఫోర్త్ఇయర్లో ఉండంగానే కేంపస్ ఇంటర్వ్యూలో మైక్రోసాఫ్ట్ కంపెనీకి సెలక్టయింది ఉన్మేష.

ఫైనలియర్ ఎక్జామ్స్ తరువాత రిజల్ట్స్ వచ్చేవరకూ ఉన్మేష అందరినీ కాలేజీకి పంపి ఎంతో ఇష్టమై తండ్రి కవితాసంకలనాలని చదివేది.ఎంతో స్ఫూర్తినిచ్చే తండ్రి కవితలంటే ప్రాణం. తను సంపాదనా పరురాలైన తరువాత మొట్టమొదట తండ్రి కవితలన్నీ పుస్తక రూపంలో ప్రచురించి తండ్రిని కవిగా సమాజానికి పరిచయం చేయాలన్నదే ఉన్మేష సంకల్పం.అందుకే తండ్రిలేనప్పుడు కవితలన్నీ ఒక పధ్ధతిలో క్రమబధ్ధీక‌రణ చేస్తోంది.

అనుకోకుండా ప్రకాష్ దూరపు బంధువు ఉన్మేషకు మంచి సంబంధం తీసుకొని వచ్చాడు.

” పిల్లవాడు చెన్నైలో ఐ.ఐ.టి చేసాడు.మల్టీనేషనల్ కంపనీలో పని చేస్తున్నాడు.ఒక్కడే కొడుకు.తండ్రి నేవీలో హైర్యాంక్. తల్లి కాలేజ్ ప్రిన్సిపాల్. ఉన్మేషకి ఈడూజోడు ఏమంటావు ప్రకాష్?” అన్నాడు శ్రీకాంత్.

కూతురికి ఐ.ఐ.టి సంబంధమనేసరికీ మనసు ఉవ్విళ్ళూరింది ప్రకాష్ కి. ఆ సాయంత్రం ప్రశాంతితో చర్చించాడు. ఇద్దరూ కలసి ఉన్మేష అభిప్రాయం అడిగారు.ఉన్మేష పిల్లవాడి చదువు తెలివితేటల గురించి విని కొంత మగ్గుచూపింది.

ఇంకేముంది ఆలస్యం ఫోటోల్లో చూసుకోవడం, పెళ్ళిచూపులకి రావడం, పిల్లనచ్చిందని,
పిల్లని చూడంగానే “ముహూర్తం చూడండి ఆన్నయ్యగారు!”అంటూ వరుస కలిపింది పెళ్ళికొడుకు తల్లి.

“ఫోటోలోనే మావాడికి పిల్లనచ్చింది. మీకు మాఅబ్బాయీని చూడాలని ఉంటుందని ఫార్మాలిటీగా వచ్చాం.” అంటూ తనమెళ్ళోహారం తీసి మరోమాటకి అవకాశం ఇవ్వకుండా ఉన్మేష మెడలో వేసింది.

ఉన్మేషకి ఆ పిల్లవాడితో మాట్లాడాలని తన ఆశయాలు చెప్పాలని ఎంతో ఆశ పడ్డది. కళ్ళు కళ్ళు కలిపి పెళ్ళిచూపుల మధురఘట్టాన్ని పదిలంగా మదిలో దాచుకోవాలని ఆశపడ్డది. ఆడపిల్లకంటే ఒక్కసారి ఏదో మొక్కుబడిగా చూసి చూడనట్లు చూసిన అతగాడిని చూసి నిరాశ పడ్డది ఉన్మేష

★★★

పెళ్ళికి ఇంకా నాలుగు నెలలు మాత్రమే ఉంది.పెళ్ళివారు కట్నంవద్దన్నారు. పెళ్ళిమాత్రం గ్రాండ్ గా చేయమన్నారు. అయినప్పటికి
ఉన్మేష పెళ్ళి లోపం లేకుండా చేయాలని కొంత కొబ్బరి తోట అమ్మకానికి పెట్టాడు ప్రకాష్. కా‌రణం సంపాదించిన దాంట్లో చిన్నఇల్లు కట్టుకున్నారు. ఒక్కడే కొడుకు ఇద్దరు ఆడపిల్లలవటంతో తల్లితండ్రుల బాధ్యత, అక్కచెల్లెళ్ళ బాధ్యత, ప్రకాష్ దే. ఇద్దరూ సంపాదించింది హళ్ళికిహళ్ళీ అయ్యేది. వెనకేసుకోవడానికి లేకపోగా అడపాదడపా ఫైనాన్స్ లో లోన్ తీసుకుని అప్పటి కష్టం దాటేయటం అనేదే అన్ని మధ్యతరగతి కుటుంబాలలోలా ప్రకాష్ కుటుంబానికి తప్పలేదు.

ఆలోచనల ప్రభావమో! పని ఒత్తిడి ప్రభావమో ఒకరోజు హఠాత్తుగా విపరీతమైన తలనొప్పితో బాధపడ్డాడు ప్రకాష్. సాయంత్రానికల్లా వాంతులు తలతిరగటం మొదలు పెట్టింది. వెంటనె హాస్పిటల్ లో చేరటం బ్రెయిన్ ట్యూమర్ గా డయోగ్నసిస్ చేసి ఎమర్జెన్సీసర్జరీ చేసారు. పొలం అమ్మిన పైకం చేతిలో ఉండబట్టి ఆర్ధికంగా ఇబ్బంది ఏమీలేకుండా సర్జరీ సక్సెస్ఫుల్ గా అయింది.

సర్జరీ అయిన నెలరోజులకి తనంతట తాను తనపనులు చేసుకునే పరిస్థితికి వచ్చాడు ప్రకాష్. అందరూ పెళ్ళి పోస్ట్పోన్ చేయమని మగపెళ్ళివారిని అడగమన్నారు.మంచిసంబంధం. చేయిదాటనివ్వద్దని ప్రకాష్ పెదతల్లి పినతల్లి పిల్లలు. మేము అండగా ఉంటామంటు పెళ్ళికి పదిరోజులముందే విదేశాలనుంచి సహితం వచ్చారు.కారణం ప్రకాష్ , ప్రశాంతుల ప్రేమాభిమానాలే .

★★★

చిన్నకూతురి గురించి ఆలోచించకుండా. పెద్దకూతురికి తాహతుకు మించి పెళ్ళిచేసాడు ప్రకాష్.

ఉన్మేష మొఖంలో పెళ్ళికూతురికి ఉండల్సిన ఆనందం,ఎక్జైట్మెంటు కనబడలేదు. ఆవిషయం పసికట్టింది ఉజ్వల.తల్లితో అదేవిషయం చెప్పింది ఉజ్వల.

” పాపా! పెళ్ళప్పుడు ఆడపిల్లలు మిక్స్డ్ ఫీలింగ్సుతో ఉంటారు తల్లీ. అక్క ఇప్పుడు అదే పరిస్థితి లో ఉంది.నువ్వుకూడ అక్క వెళ్ళిపోతుందన్న దిగులుతో ఉండటంతో నీ కళ్ళకి అలా కనపడుతోంది.” అని సర్దిచెప్పింది ఉజ్వలకి ప్రశాంతి.

కానీ ప్రశాంతికి కూడా పిల్లవాడికి చదువు,అందం ఉన్నప్పటికి అసంతృప్తి గా ఉంది..అదేమాట అప్పగింతలముందు ప్రకాష్ తో అంటే, ‘తల్లి ప్రేమ'” అని చిరునవ్వుతో కొట్టి పారేసాడు.

అప్పగింతలప్పుడు అంతవరకూ గంభీరంగా ఉన్న ప్రకాష్ హఠాత్తుగా బర్స్ట్ అయ్యాడు.

★★★

పెళ్ళయి ఇరవై రోజులైంది. చెన్నై వెళ్ళిన ఉన్మేష నించీ ఖబురు లేదు. ఫోన్చేయగా చేయగా ముక్తసరిగా మూడు ముక్కలు మాట్లాడింది.

ఒకరోజు వాయస్మెసేజ్లో ఉన్మేష, “నాన్నా నాకు బ్రతకాలని లేదు చచ్చిపోవాలని ఉంది. నీతో మాట్లాడాలని ఉంది మాట్లాడలేను.బ్రతకాలని ఉంది.బ్రతకలేను”అంటూ పెట్టింది.

ఆమెసేజ్ చూసి నిలువెల్లా వణకి పోయాడు ప్రకాష్ వెంటనే పదేపదే ఫోన్ చేసాడు.ఆఖరికి ఫోన్ ఎత్తింది.

“తల్లిగా ఎలాఉన్నావురా?’ అన్న తండ్రి పలకరింపుకి అగ్నిపర్వతమే బద్దలయింది.

“నాన్నా!” అన్న పిలుపు, వెనక సముద్రపు ఘోషలో సన్నగా వినపడింది.

” తల్లీ! నామాట వినపడుతోందా!” అన్నాడు ప్రకాష్ .

” ఆఁ నేను సీ షోర్ కి వచ్చా!”
నిశ్శబ్దం……..

“తల్లీ ఉన్మేషా!నువ్వు సంతోషంగా లేవు. జరగరానిది జరిగిందని తెలుస్తోంది. నాతల్లి పిరికిది కాదు. చదువుకున్నదానివి. ధైర్యస్తురాలివి. ఎటువంటి
క్లిష్టపరిస్థితినైనా ఛేదించగల శక్తి ఉంది. మీనాన్న నీకు ఎప్పటికీ అండగా ఉంటాడు.నాకు సముద్రపుహోరుకి నాగుండె అదురుతోంది. నువ్వు లేకపోతే ఈనాన్నని ఎవరు చూసుకుంటారు తల్లీ! ”

“లేదు నాన్నా! నేనా యింటికి వెళ్ళను.”

“తల్లీ! నేచెప్పేది విను.

స్వార్థం,లేకితనం.అవకాశవాదాలే
ద్వంద్వ ప్రమాణాలు కాగా
అవి పాటించడమే పరమావధిగా అనుకున్ననపుడు

“బంధుత్వాలు” అనుబంధాల పరువు తీస్తాయి!

“అనుబంధాలు”. అవమానాలను ప్రసాదిస్తే
.
“పరువు” పోయిన బ్రతుకు బరువవుతుంది!

ఆ బ్రతుకు భారంగా పరిణమిస్తే
వదలాల్సింది బంధాన్నే తప్ప
బ్రతుకును కాదు…!
‘అణుమాత్రం’గా పరిణమించిన ఆ బంధాన్ని
వదులుకున్నపుడు జరిగేది ‘అణు’బంధ విస్పోటనం!

కాబట్టి నువ్వు ఈఅణుబంధ విస్ఫోటనానికి వెరవద్దు.” అంటూ ధైర్యం చెప్పాడు ఫ్రకాష్.

“అయితే నేను మీదగ్గరకి వచ్చేయవచ్చా నాన్నా?”వెక్కిళ్ళమధ్య అడిగింది ఉన్మేష.

ధైర్యంగా వాళ్ళకిచెప్పి ఫ్లెట్లో మాదగ్గిరికి రా తల్లీ.నేనిప్పుడే టికట్టు బుక్ చేసి వాట్స్ ఏప్ లో పంపుతా!ఈనాటి స్త్రీవి. ధైర్యం సాహసం నీ ఆయుధాలు .” అంటూ ఉన్మేషకి ధైర్యం చెప్పాడు.

“అలాగే నాన్నా!” అన్న.మాటలువిన్న ప్రకాష్ ఉన్మేష రాకకోసం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూడ సాగేడు.ముందు జాగ్రత్తగా బాధతో ఉన్మేష మాట్లాడిన మాటలని రికార్డు చేసి పెట్టుయకున్నాడు ప్రకాష్.

★★★

కట్టుగుడ్డలతో గడపలో నుంచుంది ఉన్మేష. పెళ్ళైన ఇరవైరోజులకి వళ్ళుచేయాల్సిన పెళ్ళికూతురు చిక్కిశల్యమై, కళ్ళచుట్టూ నల్లచారలతో, నిద్రలేమి కళ్ళతో నుంచున్న ఉన్మేషను ప్రకాష్, ప్రశాంతులు ఆదరంతో అక్కున చేర్చుకున్నారు.

ఉన్మేష తేరుకున్న తరువాత లాలనగా “అసలేమైంది తల్లీ?” అని అడిగాడు ప్రకాష్.

“నాన్నా! మనం మోసపోయాము.అతగాడు హైలీ డ్రగ్ఎడిక్టర్. డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకుంటూ పగలూ రాత్రి గదిలో పడుంటాడు వాళ్ళమ్మ మాటగానీ నాన్నమాటగానీ లెక్కలేదు.

పెళ్ళిచేస్తే వాళ్ళబ్బాయి మారతాడన్న ఆశతో మనల్ని మోసం చేసారు. ఆ దంపతులిద్దరూ నా కాళ్ళు పట్టుకుని అతనిని మార్చమంటారు. ఆజుగుప్సాకరమైన వ్యక్తికి డ్రగ్స్ కాక ఇంకేమి అలవాట్లున్నాయో తెలియదు.ఈ ఇరవై రోజులలో ఒక్కసారికూడా నా మొఖం చూడలేదు.
మాట్లాడలేదు.ఎప్పుడూ ఆ గదిలో పడి ఉంటాడు.
అప్పుడప్పుడు బయటకు వెళ్తే ఏదో పెద్దపేకెట్తో తిరిగి వస్తాడు. అప్పుడు ఇంట్లో గొడవలవుతాయి. ఆయన బాగాతిడతాడు ఆవిడ ఏడుస్తుంది. నామొహం చూసి మా‌రమంటుంది.
ఒకరోజు ధైర్యంచేసి గదిలోకి వెళ్ళా.టేబుల్ మీద సామానంతా నా మీద విసిరి కొట్టాడు. సిరంజితో నాకు డ్రగ్ ఇంజెక్ట్ చేయబోయాడు.” తలచుకుంటూ వెక్కివెక్కి ఏడ్చింది ఉన్మేష.

“మళ్లీ తమాయించుకుంది.ఆటైమ్ కి వాళ్ళిద్దరు వాళ్ళని అత్తమామ అనమంటావా నాన్నా !వాళ్ళు అడ్డుపడ్డారు అప్పుడే చచ్చిపోదామని పించింది. జీవితమంతా శూన్యం అనిపించింది.

నాన్నా ఆ రోజు నేను సూసైడ్ చేసుకుందామని బీచ్ కి వెళ్ళా.ఇంటికివచ్చినా మీకు క్షోబపెట్టిన దాన్నవుతానని.కానీ మీమాటలు విన్నతరువాత ఆ క్షణికమైన ఆవేశం పోయి ఆలోచించగలిగా.
మీ మాటలే మీకూతుర్ని రక్షించాయి.. మీ మాటలు నాలో పౌరుషాన్ని లేపాయి. లైఫ్లో ఇది ఒక పెద్ద ఏక్సిడెంట్.ఇది క్షణికమైన బంధం అసలు బంధం నాతల్లితండ్రనిపించింది.నేను వెళ్తానంటే ఆదంపదులిద్దరూ చేతులు జోడించి
నమస్కరించారు.వాళ్ళు వారిస్వార్ధం కోసం నన్ను బలిచేసారు.
అదితప్పా?నాతల‌రాతా?

తండ్రిగా మీరు నేను సంతోషంగా ఉండాలని మీతాహతుకి మించి ఎంతో ఖర్చుపెట్టి నా పెళ్ళి చేసారు.మళ్లీ మీకు నేను గుదిబండనయ్యా.” అంటూ హిస్టీరిక్ గా ఏడ్చింది ఉన్మేష.

★★★

లాయర్సతో సంప్రదించి వారి సలహామేరకు చెన్నైలో ఉన్మేషతో ఎఫ్.ఐ.ఆర్ వేయించాడు.

‘ఏమిచేసినా నాతల్లిగాడి జీవితాన్ని త్రిప్పిరాయించగలనా?
నాబిడ్డ అనాఘ్రణిత పుష్పమని ఎవరిని నమ్మించగలను?
రావణాసురుని చెఱలో ఉన్న సీతమ్మ తల్లినే అనుమానించిన లోకం సప్తపదిలో ఏడడుగులు వేసిన వ్యక్తి కనీసం మొహం చూడలేదంటే ఎవరు నమ్ముతారు?
ఖర్చు పెట్టిన సొమ్ము కుక్క ముట్టిన అన్నం అయింది.
బంగారుతల్లి జీవితం………. ‘ ప్రకాష్ ఆలోచనా కెరటాలు ఉవ్వెత్తున లేచి పడుతున్నాయి.

‘నాన్నా!’ అన్నపిలుపుకి తలెత్తి చూసాడు ప్రకాష్

“నాన్నా! మీరు,అమ్మా నావిషయం ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోవద్దు. మీ మాటలతో నేను ఆత్మహత్యాప్రయత్నం విరమించుకోగలిగా. నా మిగిలి జీవితంలో నాకు మీరే మార్గదర్శి.ఇప్పుడే నాకు మైక్రోసాఫ్ట్ కంపెనీవారు జాయినింగ్ డేటడిగారు. ఏవిధి నాతో ఆడుకుందో అదేవిధి నాకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తుందన్న నమ్మకం ఉంది. నాకు నువ్వు అమ్మ కావాలి.ఇంకెవరూవద్దు.” అంటూ తండ్రి బుజంమీదతల వాల్చింది ఉన్మేష.

“అవును నాన్నా! అక్క చెప్పింది నిజం. మాకు నువ్వు అమ్మ కావాలి.మీఇద్దరూ జరిగినదానిగురించి ఎక్కువ ఆలోచించకండి.మీరే చెప్తారుకదా మనం అనుకున్నది జరగకపోతే మనకి అంతకంటే మంచి జరుగుతుందని అంటూ తండ్రి అటు బుజంమీద తలవాల్చింది ఉజ్వల.”

” అభంశుభం తెలియని నాబిడ్డకు దారిచూపించు తల్లీ.” అని గోడమీద, తన గుండెలోనూ కొలువై ఉన్న మహాదేవి ని ప్రార్ధించింది ప్రశాంతి.

‘నిజమే! తను స్ట్రాంగ్గా ఉండాలి తనబంగారు తల్లుల గురించి.’ అనుకున్నాడు ప్రకాష్.

సమాప్తం.

Written by Devulapalli VijayaLaxmi

దేవులపల్లి విజయ లక్ష్మి
విద్యార్హత. Bsc.B Ed
వృత్తి. రిటైర్డ్ టీచర్ (st Ann's Taraka)
వ్యాపకాలు కవితలు,కధలు వ్రాయటం, చిత్రలేఖనం(తైలవర్ణ చిత్రాలు వేయటం.)పుస్తక పఠనం,అల్లికలు,సంగీతం ఆస్వాదించటం ,దేశం నలుమూలల పర్యటించటం మొదలైనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పుస్తక దినోత్సవ సందర్భంగా….

వృద్ధాశ్రమాలు – శాపాలా, వరాలా