“సర్వం జగన్నాథం”

మహాకవిని కదిలించిన “జగన్నాథ రథోత్సవం” మన భాగ్యనగరంలోనూ జరుగుతున్న సందర్భంగా దానికి సంబంధించిన జాతీయాన్ని గురించి తెలుసుకుందామా!

“అయిపోయింది!సర్వం జగన్నాథం అయిపోయింది.నా మడి అంతా మంట కలిసింది” అంటూ వెనకటి తరం బామ్మలు చిందులు వేసేవారు.

“వాళ్ళింట్లో అంతా సర్వం జగన్నాథమే.కులం,మతం తేడాలేవీ
చూడరు గాక చూడరు” అంటుంటారు.

ఈ జాతీయం ఎలా,ఎందుకు మన మాటల్లో కలిసిపోయిందో తెలుసుకుందాం.

జగన్నాథ రథయాత్ర సందర్భంగా పూరీలో 56 రకాల ప్రసాదాన్ని మట్టి కుండల్లో,కట్టెల పొయ్యిలపై తయారుచేస్తారు.ఒక గుట్టలా పోసిన ఆ ప్రసాదాన్ని జాతి,మత,కుల భేదాల్లేకుండా ఎవరైనా ఆస్వాదించవచ్చు.చాలా రుచికరంగా ఉంటుందని అందరూ చెబుతారు.
“సర్వం” అంటే అందరూ,అంతా అని అర్థం.అందుకే “సర్వం జగన్నాథం” అనే జాతీయం పుట్టిందన్న మాట!

“అవినాభావం”

“వారిరువురికీ మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉందోయ్”

“మా ఇద్దరి నడుమ విడదీయరాని అవినాభావ సంబంధం ఉంది,కృష్ణార్జునుల్లా.”

“నిను వినా నాకెవ్వరు దిక్కు?! ఏనాటి బంధమో ఇది-అవినాభావ సంబంధమైంది”

ఇలాంటి సంభాషణలు వింటుంటాం.

“వినా” అనే సంస్కృతావ్యయానికి “లేని” అని అర్థం.అవినాభావ సంబంధం అంటే ఒకరిని విడిచి మరొకరు బతకలేనంత స్నేహం ఒకరు లేనిదే మరొకరుండనంత మైత్రి అనే అర్ధాలు వచ్చాయి.ఒక సంస్కృత అవ్యయం ఇలా తెలుగులో జాతీయమైంది.

“అన్నమో రామచంద్రా!”

“అన్నమో రామచంద్రా అని అలమటిస్తున్నా,పెట్టే దిక్కు లేదు ఇంట్లో”

“పేదలంతా అన్నమో రామచంద్రా అని అలమటిస్తున్నారు”

ఈ జాతీయం ఎలా వచ్చిందంటే—
రామరాజ్యంలో తప్ప,ఇతరత్రా ఇతర కాలాల్లో తిండికి కరువుండేదిట. ఆ కాలంలో మాత్రం అన్నమడగాల్సిన పని లేదు.కలికాలంలో వర్ణసాంకర్యం, ధర్మసాంకర్యం వచ్చినందువల్ల దరిద్రం రాక చస్తుందా అని కోప్పడేవాళ్ళున్నారు. వారయినా ఇంత అన్నదానం చేస్తే,కొంతవరకైనా కరువు తీరుతుంది.బిచ్చమెత్తుకుని బతకలేని వాళ్ళందరూ “అన్నమో రామచంద్రా!” అని,ఒకప్పుడుండి అన్నం పెట్టి,ఇప్పుడు లేని మహాదాతల కోసం ఆక్రోశిస్తుంటారు.తిండిలేనివాళ్లకీ,తిండి సంపాదించుకోలేనివాళ్ళకీ ఆ రామచంద్రుడు తప్ప మరెవ్వరూ గుర్తురాకపోవడమే విశేషం.

మరిన్ని జాతీయాలను మరల తెలుసుకుంటూనే ఉందాం.
**************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నేలతల్లి నవ్వింది  2

చిట్టి కథ గొప్ప సందేశం