హరి చందన-2

సాంఘిక నవల

లైట్స్ ఆర్పేసి, వచ్చేటప్పుడు నా సెల్ ఫోన్ తీసుకురా టివి పక్కన ఉంది. ఛార్జింగ్ లో పెట్టాను “చెప్పాడు,వాసుదేవ రావు.
*******************

ముందుగా అనుకున్న ప్రకారంగా ఉదయం తొమ్మిది గంటలకల్లా కంచన్ వేలీ రిసార్ట్స్ చేరుకున్నారు, రావ్ &రాజ్ సొల్యూషన్స్ లో పనిచేసే సుమారుగా ముప్ఫయ్ మంది ఉద్యోగులందరు . లేడీస్ కి రెండు రూమ్స్, జెంట్స్ కి రెండు రూమ్స్ బుక్ చేసుకున్నారు.అందరూ ఫ్రెష్ అయి ఒకచోట చేరి, బ్రేక్ ఫాస్ట్ చేశారు.ఒకతను అందరికీ అన్ని అందాయో లేదో చూస్తూ అంతటా తిరుగుతు ఉంటే “ఎవరే ఈ కొత్తశాల్తీ..”పక్కనున్న శ్యామల్ని అడిగింది చందన.
శ్యామల ఏమి మాట్లాడ లేదుగానీ, ఆమెకి మరో వైపున కూర్చున్న షీలా “అతనా? ….. బెంగళూరు బ్రాంచ్ నుండి ట్రాన్స్ఫర్ అయి ,వచ్చాడట. గౌతమ్ గారి టీమ్ లో ఉన్నాడట.”చెప్పింది.
ఆ మాటలు విన్న అతను చందనకి చిరునవ్వుతో నమస్కరించి,
“నాపేరు మురళీ మోహన్.అందరూ మురళీ అంటారు. మీరు అలాగే పిలవచ్చు “అన్నాడు.
నమస్కరించింది చందన.శ్యామల ముఖం పక్కకి తిప్పుకుంది.
బఫె అయినా అందర్నీ పలకరిస్తూ ఆ డిష్ బాగుంటుంది తీసుకుని టేస్ట్ చెయ్యండి, ఇది తిని చూడండి అంటూ కలయ తిరుగుతున్నాడు.
బ్రేక్ ఫాస్ట్ అయ్యాక శ్యామలకి, చందనకి అతనే కాఫీ తీసుకొచ్చి ఇచ్చాడు. షీలా “శ్యామలా!ఇతనేంటి… మీకు లైనేస్తున్నట్టున్నాడు” అoది నవ్వుతూ.
శ్యామల ముఖం చిట్లించి ఏదో అనబోతుంటే, అతను మరో రెండు కప్పులు తెచ్చి షీలాకి, ఆమె పక్కనున్న కోమలికి ఇచ్చాడు.
అతను వెళ్ళాక “నీకూ ఇచ్చాడుగా.నాకు ఇంట్రెస్ట్ లేదు. కావాలంటే నువ్వు ట్రై చేసుకోవచ్చు “అందిశ్యామల,ఏ భావం వ్యక్తంకాకుండా.
చందన టేబుల్ కింద నుంచి శ్యామల తొడ మీద తట్టింది, బాగా చెప్పావన్నట్లుగా.
లేచి అందరూ గుంపులు గుంపులుగా తలో వైపుకి బయలుదేరారు.
చందన, శ్యామల మెల్లగా నడుస్తూoటే సెల్ రింగ్ అయింది.
శ్యామల ఆగి, బ్యాగ్ లోనుంచి సెల్ తీసి “ఆ అత్తయ్యా!చెప్పండి. మీరు, బాబు టిఫిన్ తిన్నారా? వాడు లేచాడా?”అడిగింది.
“లేచాడమ్మా. టిఫిన్ తిని ఆడుకుంటా అని,పై పోర్షన్ లో ఉన్న రాము దగ్గరికి వెడతా అంటే సరే ఆడుకోమన్నాను. పరుగెట్టుకుంటూ మెట్లు ఎక్కబోయి జారి పడ్డాడు. నుదురుకి గాయం అయింది.
రాము వాళ్ళ నాన్న కారులో ఆసుపత్రికి తీసుకొచ్చారు.
నాలుగు కుట్లు పడ్డాయి.”ఏకధాటీ గబగబా చెప్పేసింది ఆవిడ.
“అయ్యో!నేను వెంటనే బయలుదేరుతున్నా అత్తయ్యా “అని, సెల్ ఆఫ్ చేసి, “చందూ!నేను వెంటనే వెళ్ళాలి. నువ్వు వాళ్ళతో వెళ్లి…”
“శ్యామలా!ఎలా వెడతావ్….? ”
“ఫరవాలేదు క్యాబ్ బుక్ చేస్తాను.. సారీ! నీకూ కంపెనీ ఇవ్వ లేకపోతున్నాను “అంది.
“ఎక్స్యూస్ మీ!నా కారులో డ్రాప్ చేస్తాను, ఇఫ్ యూ డోంట్ మైండ్ ”
ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు.
మురళీ మోహన్… పది అడుగుల దూరంలో ఉన్నాడు.
“నో థాంక్స్….”సెల్ లో క్యాబ్ బుక్ చెయ్యబోతుంటే, చందన ఆపి, “పద! నేను తీసికెడతా ” పార్కింగ్ ఏరియా వైపు నడిచింది.
ఆ ప్రోగ్రాం ఇంచార్జి కి చెప్పి ఇద్దరూ బయలుదేరారు.
చందన కారు స్టార్ట్ చేశాక, పక్క సీట్ లో కూర్చుని “సారీ చందూ!నా మూలంగా నువ్వు మిస్ అవుతున్నావు.”అంది.
“ఓకే.. నో ప్రాబ్లమ్… నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. రానంటే వాళ్ళు గొడవ చేశారని బయలుదేరాను.”
మధ్యలో ఆగి ఆసుపత్రి వివరాలు కనుక్కుంది శ్యామల.
ఇంటికి తీసుకొచ్చేశామని చెప్పిందావిడ.
పద్మజ అపార్ట్మెంట్ ముందు ఆపమని చెప్పింది. కారు లాక్ చేసి శ్యామల వెనుకే నడిచింది.
థర్డ్ ఫ్లోర్లో ఉన్న ఇంటి బెల్ నొక్కింది. సుమారు అరవై ఏళ్ళున్న ఒకావిడ తలుపు తెరిచింది.
“అత్తయ్యా!బాబుకి ఎలా ఉంది? చేతిలో ఉన్న బ్యాగ్ పక్కనున్న బల్ల మీదకి పడేసి, బెడ్ రూమ్ లోకి వెళ్ళబోతూ “అత్తయ్యా!నాతోపాటు పనిచేసే అమ్మాయి చందన. చందనా!మా అత్తయ్య పేరు తులసిమ్మ… అత్తగారు అయినా అమ్మ కంటే ఎక్కువ ” ఇద్దరికీ పరిచయం చేసింది.
పరస్పర నమస్కారాలయ్యాక “రా చందూ!”అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.
మూడునాలుగేళ్ల బాబు బెడ్ మీద పడుకుని ఉన్నాడు.
మెడ వరకు దుప్పటి కప్పి ఉంది.నుదుటి మీద కట్టు కట్టి ఉంది.
“మెట్టు చివర అడుగు వేసినట్లున్నాడు. జారినట్లుంది పైమెట్టు అంచు నుదుటికి బలoగా తగిలింది.నాలుగు కుట్లు పడ్డాయి. వెళ్లక వెళ్లక నా బలవంతంతో వెళ్ళావు. చెప్పవద్దు అనుకున్నాను కానీ, వాడు ‘అమ్మ అమ్మ’ అని ఏడుస్తుంటే తప్పక చెప్పాను. ఏడ్చి ఏడ్చి ఇప్పుడే నిద్ర పోయాడు.”
బెడ్ మీద కొడుకు పక్కన కూర్చుని, వాడి తల నిమురుతున్న శ్యామల కళ్ళలో నీళ్లు. చందన ఆమె భుజమ్మీద చెయ్యి వేసి, ఓదార్పుగా నొక్కుతూ “శ్యామూ! కళ్ళు తెరవని పసిబిడ్డ ముందు కూర్చుని అలా కన్నీళ్లు పెట్టుకోకూడదoటారు. రెండురోజుల్లో హాయిగా లేచి తిరుగుతాడు.”అంది.
“అవునమ్మా…. బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం? అదృష్టం.. ఏ కంటికో, కణతకో తగల్లేదు “.”
ఆ గదిలో రెండు సింగిల్ కాట్స్ అటు ఇటు విడి విడిగా ఉన్నాయి మధ్యలో దారి.
ఎదురుగా టేబుల్ మీద టివి, అటు ఇటు బాబు బొమ్మల బుక్స్, బొమ్మలు ఉన్నాయి. అటాచ్డ్ బాత్రూం, పక్కనే బాల్కనీ లోకి దారి.
బెడ్ రూమ్, కిచెన్ కి ముందు పొడవాటి హాలు, కామన్ బాత్ రూమ్.ఇల్లు చిన్నగా పొందిగ్గానే ఉన్నా, అక్కడా అక్కడా పడి ఉన్న ఆట సామాను.
శ్యామల వెళ్లి ముగ్గురికి కాఫీ తీసుకొచ్చింది.
“నువ్విక్కడ, మీ వారు అక్కడ.. ఒకే కంపెనీ కదా, ఎవరో ఒకరు ట్రాన్ఫర్ కి అప్లై చేయ వలసింది.” కాఫీ తాగుతూ అంది చందన.
“అనవసరంగా నువ్వు నీ ట్రిప్ ని కేన్సిల్ చేసుకున్నావు.”
మాట మార్చింది శ్యామల.
“లీవిట్ శ్యామూ!అవసరం వచ్చినప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా?”
కుక్కర్ విజిల్ వస్తుంటే “కుక్కర్ పెట్టావా?”అడిగింది తులసమ్మ.
“అవునత్తయ్యా!చందన కూడా ఇక్కడే భోజనం చేస్తుంది.”
చందన మాట్లాడలేదు. ఆమె దృష్టి అంతా శ్యామల మాట మార్చడం వెనుక కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తోంది.
భోజనం చేసి,కాసేపు కబుర్లు చెప్పింది. శ్యామల బాబుని లేపి, బ్రేడ్ తినిపించి, పాలు తాగించింది.
నాలుగు అవుతుంటే ఇంటికి బయలుదేరింది చందన.
దారిలో శైలజని కలిసి కాసేపు కబుర్లు చెప్పి ఇంటికి వెళ్ళింది.
*తొందరగానే తెముల్చుకుని వచ్చారుగా.. ఇబ్బంది ఏమికాలేదుగా” అడిగాడు తండ్రి.
వెనక్కి వచ్చి జరిగినదoతా చెప్పింది చందన.
“అయ్యో!ఇప్పుడెలా ఉన్నాడు పిల్లాడు?”అడిగింది రేవతి .
“బాగానే ఉన్నాడు మమ్మీ.. కొద్దిగా జ్వరం తగిలింది ”
“దడుపు జ్వరం అయివుంటుంది.రేపటికి తగ్గిపోతుందిలే “అన్నాడు వాసుదేవరావు.
“అదే చెప్పి వచ్చాను ” తన రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయివచ్చింది.
తల్లిదండ్రులతో కలిసి డిన్నర్ చేసిoది.
రేవతి టేబుల్ సర్దుకుంటుంటే “బేబీ! ఈ ఏడాది నీకు పెళ్లి చేసేద్దామనుకుంటున్నాను. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు. లేదంటే నేనే ఏదైనా…..”
“డాడీ!నామనసులో ఎవరూ లేరు గానీ, కొన్నాళ్ళు ఆగండి. మొన్ననేగా జాబ్లో చేరాను. కొన్నాళ్లు ఈ లైఫ్ ఎంజాయ్ చేయనీయండి.కారు కీస్ టివి పక్కన పెట్టాను గుడ్ నైట్ ” చెప్పి తన గది లోకి వెళ్ళి
శ్యామలకి కాల్ చేసి,బాబు గురించి అడిగి తెలుసుకుంది.
తరువాత శైలజతో కబుర్లు చెప్తూoడగా………

( సశేషం )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అమ్మ కల

ఒడిపిళ్ళు 20 వ భాగం