పైకి వెళ్ళబోతుంటే,”చిన్నా!ఉదయం తొందరగా లేవాలని చెప్పు వాళ్ళకి. భోగి మంట వేస్తాం కదా” అన్నాడు రామ్ ప్రసాద్.
“అలాగే నాన్నా ” చెప్పి వారి వెంట లోపలికి వెళ్ళి, అందరికీ పక్కలు సరిగ్గా కుదిరాయో లేదో చూశాడు.
కాసేపు ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పి, “రేపు భోగి మంటలు వేస్తాం, చూడచ్చు తొందరగా పడుకుంటే ఉదయం తొందరగా లేపుతాను గుడ్ నైట్ ” రెండు రూముల్లోని వాళ్ళకి చెప్పి, తలుపులు దగ్గరగా వేసి కిందకి వచ్చాడు హరి
తండ్రి, పినతండ్రి కూర్చుని పొలంలో పండిన పంట, మార్కెటింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు..
వాళ్ళ దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు.
“ఈ ఏడాది పంట దిగుబడి బాగా వచ్చింది చిన్నా! సుశీల పెళ్లి కి డబ్బుకి ఇబ్బంది ఉండదు “అన్నాడు రామ్ ప్రసాద్.
“అది ఎమ్మెస్సీ చేస్తానoటోంది కదా నాన్నా.. ఫైనల్ ఇయర్ లో ఉండగా సంబంధాలు చూడడం మొదలు పెడితే పరీక్షలు అవగానే చేసేయవచ్చు. దాని వయసు ఎంతని “?
“అది అలాగే అంటుందిరా, ఆలస్యం చెయ్యడం మంచిదికాదు. ఈ రోజుల్లో పిల్లలకి తొందరపాటు ఎక్కువ. ఆనక బాధపడి ఉపయోగం ఉండదు”అన్నాడు,బాబాయ్ కృష్ణ ప్రసాద్.
“నిజమేరా అబ్బాయ్! ఈ లోపల ఏదైనా మంచి సంబంధం దొరికితే చేసేయడమేమంచిది.తరువాత చదువుకుంటుంది ఈ రోజుల్లో బోలెడు అవకాశలున్నాయి “.
“అవకాశాలున్నాయి కానీ, వచ్చేవాడు వేరే ఊళ్ళో ఉంటే ఇది కాలేజీ అని ఇక్కడ కూర్చుంటే ఇబ్బంది కదా.”
“సింగినాదం! పెళ్లయితే ఇంట్లో కూర్చుని చదువుకుని పరీక్షలకి తీసుకొచ్చిరాయించవచ్చు.” అన్నాడు కృష్ణ ప్రసాద్.
“సరే చూడండి… నాన్నా!నేను మీతో ఒక విషయం మాట్లాడాలని….”
“చెప్పరా “వెనక్కి జార్లబడి కూర్చున్నాడు రాంప్రసాద్.
“మీ అంగీకారం అయితే…. ఈ రోజు వచ్చిన అమ్మాయిల్లో చందన అనే అమ్మాయిని. పెళ్లి.”
“మనకులమేనా?”అడిగాడు కృష్ణ ప్రసాద్.
“కా… కాదు”
“మనకులం వాడిని కాదని వేరే కులంవాడిని చేసుకుందని….మీ అలివేలుమంగ అత్తయ్య కి నువ్వులు, నీళ్లు వదిలేసి, మళ్ళీ దాని మొహం చూడలేదు తాతయ్య. తెలుసా?” కాస్త కోపంగానే అన్నాడు రామ్ ప్రసాద్.
“తెలుసు. అది నేను పుట్టక ముందు జరిగినది.దండ వేసున్న అత్త ఫోటో చూసి అడిగితే నాన్నమ్మ చెప్పింది.కానీ నాన్నా!కాలం, పరిస్థితులు ఆడపిల్లల మనస్థత్వాలు మారాయి. మీరే ఎన్నో సంబంధాలు చూశారు. చాలా మంది “పెద్ద కుటుంబం, మా పిల్ల చాకిరీ చేయలేదు” అని వెనక్కి వెళ్లిపోతున్నారు.ఆ విషయం మీకూ తెలుసు. నానమ్మ మా చిన్నప్పుడు ఇంట్లోకి పనిమనిషిని రానిచ్చేది కాదు. బయట గిన్నెలు తోమి పెడితే, మామ్మ మళ్ళీ వాటిపై నీళ్లు జల్లి, మళ్ళీ కడుక్కుని తెచ్చి వాడుకునేది. కానీ, ఇప్పుడు పనామె
బెడ్ రూమ్ లో వరకూ వచ్చి తుడుస్తోంది. గిన్నెలు తెచ్చి తనే లోపల పెడుతోంది. ఒక్కక్కసారి అమ్మ,పిన్నికి బాగులేకపోతే కూరలు కూడా తరిగి ఇస్తోంది. నాన్నమ్మ మడిగా ఉన్నప్పుడు ఎవరైనా పిల్లలు ముట్టుకుంటే, మళ్ళీ స్నానం చేసి వచ్చి, మరో మడి బట్ట కట్టుకునేది. కానీ, ఇప్పుడు… మీరే చూస్తున్నారు కదా, ఎవరేనా ముట్టుకున్నా అమ్మ, పిన్ని పట్టించుకోనట్టు, గమనించనట్లు ఉండిపోతున్నారు. పరిస్థితుల్ని బట్టి నడుచుకోవాలని మీరే చెప్తుంటారు. ఆ ఏలూరు సంబంధం వాళ్ళు నేను ఈ ఉమ్మడి కుటుంబం వదిలేసి వస్తేనే పిల్లనిస్తామన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోను.. నేను పెళ్లి చేసుకోవడం అయినా మానేస్తాను కానీ ఈ కుటుంబాన్ని వదిలి ఇల్లరికం వెళ్ళను.
నాన్నా! ఈ అమ్మాయితో “మనం పెళ్లి చేసుకుందాం”అని నేను అంటే ‘పెద్దవాళ్ళు ఒప్పుకుంటేనే పెళ్లి. లేకుంటే ఇలాగే స్నేహితుల్లా ఉండిపోదాం ‘అంది.
మాది ఉమ్మడి కుటుంబం అంటే తను ఒంటరిగా పెరిగానని, పది మంది ఉన్న కుటుంబం అంటే ఇష్టమని అంది. బాబాయ్! రెండు రోజులు ఇక్కడ ఉంటుంది. మీరిద్దరూ చూడండి. తను మనలో కలిసిపోతుందని మీకనిపిస్తేనే అమ్మకి, తాతయ్యకి చెప్పండి. మీరు కాదన్నా నేనేమి బాధ పడను. పెళ్లి కాకపోయినా ఫరవాలేదు కానీ ఈ కుటుంబం వదిలి వెళ్లే ప్రసక్తి లేదు. “లేచి వెళ్లి పడుకున్నాడు.
అన్నతమ్ములిద్దరూ మొహ మొహాలు చూసుకున్నారు.
“ఇదేంట్రా వీడు ఇలా మాట్లాడుతున్నాడు?”
“వాడు చెప్పిందంతా నిజమేగా అన్నయ్యా. వాడన్నట్లు వచ్చిన సంబధాలన్ని ఉమ్మడి కుటుంబం అనగానే వెనక్కి వెళ్లిపోతున్నాయి.
వాడికీ ముప్ఫయ్ ఏళ్ళు వచ్చేస్తున్నాయి.. ప్రేమ దోమ అని మనకి చెప్పకుండా చేసేసుకుంటే మనం ఏం చేయగలిగే వాళ్ళం? ఇటీవల కుల హత్యలు, పరువు హత్యలు అంటూ ఎన్నో గందరగోళాలు జరుగుతున్నాయి.ఒకవేళ మనకులంలో అమ్మాయి ముందు ఒప్పుకుని తరువాత నీకు నీ కుటుంబం కావాలా? నేను కావాలో తెల్చుకో అంటే మనవాడు ఖచ్చితంగా కుటుంబమే కావాలంటాడు.
అప్పుడు ఆపెళ్ళి వల్ల సుఖం ఏముంటుంది? మనం వింటూనే ఉన్నాం పెళ్ళి చేసుకోకుండా సహజీవనం అంటూ కాపురాలు వెలగ బెడుతున్న సంఘటనలు. ఆ కరణం సుబ్బారావు కొడుకు సతీష్ లేడూ! వాడు బొంబాయిలో అలాగే చేస్తున్నాడట . అది మరీ అప్రదిష్ట. ఆలోచించు. అంతెందుకు మన జగ్గూ గాడి భార్య ముందు ఒప్పుకుంది. పట్టుమని రెండేళ్లుకాపురం చేసిందో లేదో, ఒక బిడ్డను కూడా కని, నీకూ నీ కుటుంబానికీ ఓ దండం అంటూ పిల్లాడిని కూడా వదిలేసి వేరేవాడితో వెళ్ళిపోయింది. పరువు పోతుందని చచ్చిపోయిందని అందరికీ చెప్పుకుంటున్నాం.
ఈ అమ్మాయిది మంచిమనసు అయి ఉంటుంది.కనుకనే పెద్దవాళ్ళు అంగీకారం లేకుండా చేసుకోనంది.వదినతో ఆలోచించు అన్నయ్యా ” తనూ పడుకోడానికి వెళ్ళిపోయాడు కృష్ణ ప్రసాద్.
*******************
కొత్త ప్రదేశం కావడం వల్ల రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోయినా నాలుగు గంటలకే మెలకువ వచ్చేసింది చందనకి.
బయట బాల్కనీలోకి వచ్చింది. చల్లనిగాలితెర చుట్టుముట్టేసరికి పైట కొంగుని భుజాలచుట్టూ కప్పుకుంది.
ఇలా పల్లెటూరులో పండుగ సరదా చూడడానికి వెడుతున్నాం శైలజా, తనూ అని ఇంట్లో చెప్తే “జాగ్రత్తగా వెళ్లి రండి “అన్నాడు తండ్రి వాసుదేవ రావు. రేవతి” పల్లెటూళ్లలో డ్రెస్సులు వేసుకుంటేబాగుండదు.అదీ సంక్రాంతి అచ్చమైన తెలుగు పండుగ. పట్టుచీరలు ఫ్యాన్సీచీరలే తీసికెళ్ళు,డ్రెస్సులు వద్దు “అని చెప్పింది. అందుకే అన్నీ చీరలే తెచ్చుకుంది.
బయట ఏవో మాటలు వినిపిస్తుంటే పిట్టగోడ దగ్గరికి వెళ్లి, కిందకి చూసింది. సుశీల, సీతమ్మ, రుక్మిణి చీర కుచ్చేళ్ళు పైకి దోపి, పైట కొంగులు ముందుకి దోపి, ఇంటి ముందు ముగ్గులు వేస్తున్నారు. గాలికి చెదిరిన జుట్టుని పైకి తోసుకుంటూ తలెత్తి చూసిన సుశీల, చందనని చూసి రమ్మన్నట్లు చెయ్యూపింది.
లోపలికి వచ్చి బాల్కనీ తలుపు మూసి, జుట్టుకి పెట్టుకున్న రబ్బర్ బాండ్ తీసి జుట్టు దువ్వుకుని, చీర సరి చేసుకుని,
ఒకసారి అద్దంలో చూసుకుని, తలుపు తెరిచి మెల్లగా కిందకి వెళ్లి, దగ్గరగా వేసి ఉన్న ప్రధాన ద్వారం తలుపులు తెరిచి, బయటికి వెళ్ళింది. చలిని కూడా లెక్క చేయకుండా అప్పటికి ఎంత సేపటి నుంచి వేస్తున్నారో, ఆ ప్రాంగణం అంతా చిన్న, పెద్ద ముగ్గులతో నిండిపోయింది.
“సూపర్ గా ఉన్నాయి. చేత్తో ఇంతబాగా వేస్తారని నాకు తెలియదు. సిటీలో అంతా ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది.
నున్నటి గచ్చు మీద ముగ్గు నిలవదని ముగ్గు స్టిక్కర్స్ అంటించేస్తున్నారు. మెయిన్ గేట్ ముందు వాచ్ మేన్ వాళ్ళు మెల్లిగా ఏ పది గంటలకో ఊడ్చి,గొట్టంతో నీళ్లు కుమ్మరించి.. అవును….జల్లడం కాదు గొట్టంతో పొసేసి కడిగామనిపించి ముగ్గు వేస్తారు చిన్నగా చాక్ పీస్ తో. అదేమిటంటే వాహనాలు తిరిగినా చెరిగిపోదట ” చెప్పింది నవ్వుతూ.
“పేడనీళ్లతో జల్లితే సూక్ష్మజీవులు లోపలికి రావని, పిండితో ముగ్గు వేస్తే పిట్టలకి ఆహారం అని, అందంగా ఉంటుందని వేస్తారు” చెప్పింది రుక్మిణి.
ముగ్గువెయ్యడం పూర్తి అయ్యాక పేడతో గోబ్బెమ్మలు చేసి,తెచ్చి పెట్టింది సుశీల.
“వెళ్లి వాళ్ళని కూడా లేపి రమ్మను అమ్మాయ్, భోగి మంట వేస్తున్నారు “అంది సీతమ్మ చందనతో. అప్పటి వరకూ గమనించ లేదుగాని, గేటు ముందు రోడ్డుకి ఒక పక్కాగా కట్టెలు నిలువుగా పేర్చి ఉన్నాయి. రామ్ ప్రసాద్,కృష్ణ ప్రసాద్ మరికొందరు అక్కడ చేరి ఉన్నారు. వారిలో ఉన్న ఒక కొత్త వ్యక్తిని చూపిస్తూ “అతను మా పెద్దన్నయ్య జగదీశ్చoద్ర ప్రసాద్. బంటీవాళ్ళ నాన్న, రాత్రి వచ్చాడు ” చెప్పింది సుశీల.
చందన లోపలికెళ్లి అందరినీ నిద్ర లేపింది.
ముఖాలు కడిగి కిందకి వచ్చారు, అప్పటికే హరి,మిగిలిన ముగ్గురూ కూడా అక్కడికి చేరారు.
భోగిమంటలు వెలిగించారు. యువకులందరూ చుట్టూ చేరి ఆట పాటలతో సందడి చేశారు సశీల, చుట్టూ పక్కల ఇళ్లలోని అమ్మాయిలందరు ధనుర్మాసమ్ నెల రోజులుగా గొబ్బెమ్మలు పెట్టి, పూజ చేసి, వాటిని పిడకలుగా చేసి, గుచ్చిన దండలు తెచ్చి భోగి మంటల్లో వేశారు.
“అసలు ఈ భోగి మంటలు ఎందుకూ వేస్తారు?” అడిగింది సోనీ.
“భోగం అంటే సుఖం అని అర్ధం.దక్షిణాయనకాలంలో సూర్యుడు భూమికి దూరంగా ఉండటం, దానివల్ల ఉష్ణోగ్రతలు తగ్గి, చలి తీవ్రత పెరుగుతుంది. ఆ చలి వాతావరణాన్ని తట్టుకోడానికి, ఉత్తరాయణంలో సుఖ సంతోషాలు కోరుకుంటూ భోగి మంటలు వేస్తారు.ఇళ్లలో ఉన్న పాత సామాన్లు ఆ మoటల్లో వేసి కొత్తని ఆహ్వానిస్తారు.గోదాదేవి శ్రీ రంగనాధునిలో లీనమై భోగాలు పొందినదనిఅంటారు “చెప్పింది రుక్మిణి.
“అంతే కాదు, ఆవు పేడతో చేసిన పిడకలు మంటల్లో వెయ్యడం వల్ల గాలిశుద్ధి అవుతుంది సూక్ష్మ క్రీములు నశిస్తాయి. శ్వాసకోశ వ్యాధులనుంచి ఉపశమిస్తుందట.అన్నీ తెలిసినా మనం సిటీలో ఉండేవాళ్ళం కదా, పేడ ముట్టుకోడానికి అసహ్యించుకుంటాం” చెప్పింది చందన.
“అంతే కాదు,కులాలకి అతీతంగా అందరినీ ఒకచోట చేర్చి,వారిలో
ఐకమత్యభావాన్ని పెంచుతుంది కూడా “అంది మళ్ళీ.
“అబ్బో! చాలా విషయాలు సేకరించావే?”అంది శైలజ.
“పండుగ సరదాగా చూడడానికి వస్తూన్నప్పుడు కొన్ని విషయాలైనా తెలుసుకోవాలి కదా.. గూగుల్ లో చూశాను ” చెప్పింది చందన
ఆ మాటలు అక్కడ ఉన్నవాళ్లే కాక, వారి వెనుకగా ఉన్న రామ్ ప్రసాద్, కృష్ణ ప్రసాద్ కూడా విన్నారు.
“పనమ్మాయి కుంకుడు కాయలు కొట్టి, నానబెట్టి ఉంచింది, వెళ్లి స్నానాలు చేసిరండి.. గుడికి వెళ్లి రావచ్చు ” చెప్పింది సీతమ్మ.
“అమ్మో! కుంకుడు కాయలతోనా? కళ్ళు మండుతాయి”
భయంగా చూసింది శైలజ
శైలజ ముఖం చూసి అందరూ నవ్వుతుంటే బంటీ….
“ఆంటీ……తలంటు పోసుకోనంటే నానమ్మ……”సీతమ్మ వైపు చూసి……..
(సశేషం )