హృదయ వీక్షణ

కవిత

మాటల పదును కర్కశంగా
హృదయ విచ్ఛేదనం చేస్తున్నప్పుడు
మరల మరల గాయాలు
రక్తాన్ని ఓడుతున్నప్పుడు
పొంగుతున్న కల్లోల భావాలు
కుమిలిపోతున్నాయి వెతల్లో

అంతరంగాన్ని అన్వేషించి
లోపలి కుహరాలను ఛేదించి
మథించిన అనుభవంతో
నిశ్శబ్దాన్ని శ్వాసించడం మొదలుపెట్టాక
నెమ్మది నెమ్మదిగా సాగుతున్న
విశ్వప్రయాణం బోధపడింది

మౌనాన్ని ఒంపుకోవడం
ఒంటరి చిరునామా కాదని
మనుషులకు మధ్య
దూరాలకు తీరం కాదని
సుడులు తిరుగుతూ
నిలువెల్లా ఆవరించిన
నిర్వేదం నుండి
ఆత్మశోధనకు పరిచిన
ప్రామాణిక పథమని తెలిసింది

మొత్తంగా అర్థమయ్యాక..
నిశ్శబ్దాన్ని ఉచ్ఛ్వాసగా
మౌనాన్ని నిశ్శ్వాసగా భావిస్తూ
అనుభూతిపర జగత్తులో
మనో విజేతను నేను!!

Written by Aruna Dhulipala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పిప్పలాద మహర్షి చరితము

హరిత హారం