నిబద్దతకు నిలువెత్తు నిదర్శనం – నేరెళ్ల శారద

చట్టబద్ధమైన బాధ్యత కలిగిన ఒక వ్యక్తి అధికారిగా పరిగణింపబడతాడు. పరిపాలన, చట్టాల రూపకల్పన వంటి బాధ్యతలు నిర్వర్తించడానికి ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తి ప్రజాప్రతినిధిగా వ్యవహరించబడతాడు. నిబద్దత, నిజాయితీ కలిగిన ఈ ఇద్దరు వ్యక్తుల ఆత్మీయ కరచాలనంలో పరిష్కరింపబడని ప్రజా సమస్యలంటూ బహుశా ఉండకపోవచ్చు.

ఒక సాధారణ వ్యక్తిగా అడుగులు ప్రారంభించి, దారిలోని కంటకాలను ఏరివేస్తూ, సవాళ్లను ఎదుర్కొంటూ తన్నుతాను మహాశక్తిగా మలుచుకుని, ఎందరికో బాసటగా, మరెందరికో ప్రేరణగా నిలిచిన స్త్రీ రత్నాలు మనకు దాదాపు అన్ని రంగాల్లో కనిపిస్తూనే ఉంటారు. అటువంటి వారిలో ఒకరైన నేరెళ్ల శారద గారి రాజకీయ ప్రస్థానంపై ఓ సింహా వలోకనం.

కరీంనగర్ జిల్లాలో జన్మించిన వీరు, హైదరాబాదులోని రెడ్డి కళాశాల నుండి పట్టభద్రురాలై, విజయవాడలోని ‘Super viz ‘ సంస్థలో శిక్షణ తీసుకుని సీ.ఏ. ఇంటర్ పరీక్షలు వ్రాశారు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలోనే సమీప బంధువు(మేనత్త కొడుకు)ను వివాహమాడి, ఇద్దరు పిల్లల(ఆడ పిల్లలు)కు జన్మనిచ్చారు. ఏ విధమైన రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుండి భర్త, అత్తమామలే కాకుండా ఊరి పెద్దల ఆత్మీయ ప్రోత్సాహంతో ‘ భారత జాతీయ కాంగ్రెస్ ‘ పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసి, పాతికేళ్ల రాజకీయ ప్రస్థానంలో పలు పదవులకు వన్నె తెచ్చారు. 2001 లో రామడుగు నియోజకవర్గం నుండి జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యురాలిగా ఎన్నికై, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) మహిళా విభాగం అధ్యక్షురాలిగా, అఖిల భారత మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా, అక్టోబర్/2004 లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(TPCC) ఎథిక్స్ కమిటీ కార్యదర్శిగా నామినేట్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక సభ్యురాలిగా సేవలందించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా 17/07/2025 న బుద్ధభవన్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
21/11/2025 న HITEX Seminar Hall-1 లో జరిగిన ‘ Prevention of frontline action on woman ‘s safety’ అనే అంశంపై మండలి సభ్యురాలిగా పాల్గొన్నారు.

ఉమెన్ కమిషన్ పరిధిలోకి వచ్చే అంశాలేమిటని ఒక ఛానల్ వారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా భద్రత, రక్షణ, సంక్షేమం, అభివృద్ధి అని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన వారు మొదలుకొని వయోవృద్ధుల వరకు ఎవరైనా తమను సంప్రదించవచ్చనీ, తమ పరిధికి లోబడిన సమస్యలేవైనా పూర్తి సహకారాన్ని అందిస్తామనీ, ఒకవేళ తమ పరిధికి సంబంధించని సమస్య అయితే కూడా వారిని సంబంధిత విభాగానికి పంపించి, న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు.

మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వీరు రాష్ట్రంలోని ప్రముఖ కళాశాలలు, వసతి గృహాలపై ఆకస్మిక తనిఖీలు జరిపారు. భోజనశాలలు, విద్యార్థినుల పడకగదులు, స్నానాల గదులు ప్రత్యక్షంగా చూసి, యాజమాన్యాలతో కొన్నిసార్లు స్నేహపూరితంగా వ్యవహరించి, అవసరమైన చోట నిలదీసి సత్వర చర్యలు తీసుకున్నారు. విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి వారి సాదకబాదకాలను తెలుసుకొని వాటిని బోధకుల దృష్టికి తీసుకువచ్చి ఆ దిశగా కూడా మార్గాన్ని సుగమం చేశారు. వీరు అందిస్తున్న సేవలకు
సంతృప్తి చెందిన పలువురు సాధారణ పౌరులు వీరికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి గూగుల్ ని ఆశ్రయించడం గమనార్హం.

జిల్లా సంక్షేమ కార్యాలయం, సఖి, భరోసా వంటి కేంద్రాలు గ్రామీణ స్థాయిలో సేవలందిస్తున్నాయనీ, గృహహింస, 498 వంటి సేవలు నగర కేంద్రంగా పని చేస్తున్నాయని చెప్పారు.

పేరున్న సంస్థలపై తనిఖీలు జరిపారు కదా ఎప్పుడైనా భయపడిన సందర్భాలు ఉన్నాయా అని ఛానల్ వారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒక వ్యక్తిలో న్యాయం అనేది ఎక్కువ పాళ్లలో ఉన్నప్పుడు బెదిరింపులు రావడం సహజమనీ, వాటికి లొంగకుండా ముందుకెళ్లడంలోనే సమర్థత దాగుందనీ,ఏ పదవి అయినా అలంకారప్రాయం కాదనీ, దానికి పూర్తి న్యాయం చేయగలిగినప్పుడే ఆ వ్యక్తి జీవితం ధన్యమ వుతుందనీ చెప్పే వీరు ఆ నిస్వార్థ సేవ, అంకితభావాల కారణంగానే పలువురి హృదయాలలో పీఠం వేసుకోగలిగారని చెప్పవచ్చు.

2003 లో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జరిగిన డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ మీటింగ్ లో తాను ప్రసంగించిన తీరు, వాగ్ధాటి పలువురి ప్రశంసలు అందుకుందనీ, అన్ని న్యూస్ చానల్స్ లో ప్రసార మవడం, ఇండియా టుడే వంటి ప్రముఖ పత్రికల్లో ప్రచురించబడ టం చరిత్రలోనే మొదటిసారనీ హాయిగా నవ్వేస్తూ చెబుతారు.

రాజకీయ రంగం పట్ల ఉన్న ఆసక్తి కలిగిన తన భర్త తన నెంతగానో ప్రోత్సహించారనీ, చక్కని విద్యనభ్యసించి, తమ కాళ్ళపై తాము నిలబడ్డ తన కూతుళ్ళిద్దరూ తనకన్ని విధాలుగా సహకరిస్తూ, అవసరమైన చోట సలహాలిస్తూ ఉంటారనీ అందమైన తమ బంధాలను గూర్చి అంతే అందంగా నవ్వుతూ చెబుతారు.

మహిళా సాధికారత కోసం కృషి చేయడం, మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను నివారించడం, ఏ విధమైన ఒత్తిళ్లకు లొంగకుండా బాధితులకు సత్వర న్యాయం అందించడమే మహిళా కమిషన్ ప్రధాన ఉద్దేశమనీ చెబుతారు.

ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించిన వీరి దృష్టిని దాటిపోయిన సమస్య అంటూ బహుశా ఉండకపోవచ్చు. ఆ క్రమంలోనే వీరు ఒక సమస్యను వెలికి తీసి, సమాజానికి సూచన చేశారు.

వారి సూచన విని ఉలిక్కిపడ్డ వారు కొందరైతే, ఉదాసీనత వహించినవారు మరికొందరు. ఉలికిపాటుకైనా, ఉదాసీనతకైనా ఎవరి కారణాలు వారికి ఉండవచ్చు.

అదేమిటంటే కొన్ని వందల మంది అమ్మాయిలు రుతుచక్రానికి సంబంధించిన సమస్యలతో బాధపడటం.

అమ్మతనానికి తొలిమెట్టైన రుతుచక్రం అస్తవ్యస్తమైతే, హార్మోనుల అసమతుల్యతతో జీవగడియారం అపసవ్యం అవుతుంది. స్త్రీ శక్తిని నిర్వీర్యం చేసే(కొందరి విషయంలో మాత్రమే) మహమ్మారి ఇది. దీని బారిన పడి వెలుగులోకి రాని జాతిరత్నాలెన్నో. నిబద్దత, సునిశిత పరిశీలన ఉన్న స్త్రీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటే, సమాజ(స్త్రీ) సంక్షేమానికి ఏ విధంగా దోహదకారి అవుతుందనడానికి ఇదొక చక్కని నిదర్శనం.

వైద్యశాస్త్రాన్ని మథించి, ధన్వంతరీ ప్రతినిధులుగా మనల్ని (ఈ సమస్యతో బాధపడుతున్న వారిని) కాపాడటానికి ఎంతోమంది స్త్రీ వైద్య నిపుణులు ఇలపై వెలిసిన దైవస్వరూపాలుగా ఉన్నారు. వారిని సకాలంలో సంప్రదిస్తే, సమస్య సులువుగా పరిష్కరించబడుతుంది.

సాధారణంగా అమ్మాయిలు ఈ విషయంలో వైద్యులను సంప్రదించడానికి(మరి కొందరైతే తల్లికి కూడా చెప్పడానికి) సుముఖంగా ఉండరు. అటువంటిది కొన్ని వందల మంది ఆడపిల్లలు బిడియాన్ని పక్కనపెట్టి వీరితో ఆ విషయాన్ని చెప్పగలిగారంటే, ఆ పిల్లల్లో వీరు ఎంత భరోసాను కలిగించారు, ఎంత మానసిక స్థైర్యాన్ని అందించారన్న విషయాన్ని మనం గమనించవచ్చు.

ఒక విద్యార్థి(స్త్రీజాతి) లోని తెలివితేటలు, శక్తిసామర్థ్యాలు ఎప్పుడైతే నిరూపించుకోవాలో, సరిగ్గా అదే సమయంలో ఈ సమస్య మొదలవుతుంది. కొంతమంది దాన్ని అధిగమించి ముందుకు దూసుకెళితే, మరికొందరి తెలివితేటలు దానికి కబళమవుతాయి. అటువంటి సమస్య ఎక్కడో వీరి అనుభవంలోనికి ప్రత్యక్షంగా వచ్చి ఉంటుంది, అందుకే వారంతగా ఆవేదన చెంది సమాజం దృష్టికి
తెచ్చి ఉంటారు.

ఈ సమస్యను ఎదుర్కొనే క్రమంలో కొన్ని సూచనలు:

సమర్థవంతమైన వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి.

తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పోషకాహారాన్ని, అవసరమైన మానసిక బలాన్ని అందిస్తూ ఉండాలి.

హాస్టల్లో ఉండే పిల్లలు ఆహారం విషయంలోగానీ, ఔషధాల విషయంలోగానీ తమకు తామే జాగ్రత్త వహించాలి.

ఏ విధమైన ఒత్తిడికి లోను కాకుండా పిల్లలు యోగ, ధ్యానం, చక్కని సంగీతం వినడం, ప్రకృతి ఒడిలో సేద తీరడం వంటి వాటితో ఈ సమస్యను దీటుగా ఎదుర్కోవాలి.

ప్రగతి రథానికి చోదక శక్తై, సృష్టికి మూలమైన స్త్రీ శక్తిని సవ్యంగా వినియోగించు కోగలిగినప్పుడే దేశం ప్రగతి బాట పడుతుంది. రచన అనేది మహత్తరమైన సామాజిక బాధ్యత అనే ఉద్దేశంతోనే వారు లేవనెత్తిన ఈ సమస్యను(నా వంతుగా) ఇంతగా నొక్కి చెప్పాల్సి వచ్చింది.

పాతికేళ్ల రాజకీయ ప్రస్థానంలో అలుపెరుగని పోరాటం చేస్తూ, సు పరిపాలన నందిస్తూ, ఎన్నో మైలురాళ్లను దాటిన వీరు, ముందు ముందు మరెన్నో దృఢమైన కార్యక్రమాల రూపకల్పనతో స్త్రీ సంక్షేమానికి దోహదపడతారని ఆశిస్తూ, అభినందిస్తూ……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సోదర

నమ్మిచెడినాంక…