శుభ ముహూర్తం- 12వ భాగం

ధారావాహిక నవల

జరిగిన కథ: చిత్రపటాన్ని గాంచి, ప్రమీలాదేవి మనసునర్థం చేసుకొని యుద్ధానికి బయలుదేరుతాడు విక్రమసింహుడు. యుద్ధం జరుగుతున్న సమయంలో, ఆగంతకులను అంగరక్షకులుగా నియమించి, వారితో రహస్యంగా అర్ధరాత్రి శిబిరాన్ని విడిచి వెళ్లిన మహారాజుకు, పొంచి ఉండే ముప్పునూహించి, ఆందోళన చెందిన అనంతుడు, మహారాజు రాకతో శాంత పడతాడు. యుద్ధాన్ని గెలిచి, రాజ్యానికొచ్చిన మహారాజుకు మహారాజ మందిరంలో ఆహ్వానమిస్తుంది ప్రమీలాదేవి. రాజ్య వ్యవహారాలను కూడా పక్కనపెట్టి, మహారాణితో కొన్నాళ్లు ఏకాంతవాసం గడిపి, విజయోత్సవాలను నిర్వహించిన సందర్భంలో, ఈ ఇద్దరు వీరులకు సన్మానం చేయవలసిందిగా అనంతుడిని కోరుతున్నానన్న మహారాజు మాటలకు, ఆ వీరులెవ్వరో తెలియగానే ఆశ్చర్యపోవడం అనంతుడి వంతవుతుంది. ఆ వీరులెవరో, అనంతునికంత ఆశ్చర్యమెందుకో చూద్దాం రండి….

వేదిక మీద తన చేతుల మీదుగా, బహుమానంగా బంగారు కరవాలాన్ని అందుకునే ముందు ఆ వీరులిర్వురూ, “ఈ ప్రతిభ మా గురువర్యులు అనంతుల వారిదే” అని ప్రకటించారు. సంపూర్ణ కవచధారులై ఉన్నా, వారి కంఠస్వరాన్ని పోల్చుకున్నాడు అనంతుడు.

వారు… రాకుమారి ప్రమీలాదేవి, వారి అనుంగు చెలికత్తె ప్రియంవద.

తాను కలలో కూడా ఊహించలేదు. జైత్రయాత్రలో తనకు ఆవగింజంతైనా అనుమానం రాకుండా వారు ప్రవర్తించిన తీరు అమోఘం, అద్భుతం. ఆఖరికి వారు స్వరాన్ని కూడా మార్చివేసి, తనకు కొంచెం కూడా అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. తాను గుర్తించ లేనప్పుడు మహారాజుల వారెలా గుర్తించారు, వారు వారేనని. శిక్షణ నిచ్చినప్పుడు తప్పించి, మహారాజు రాకుమారిని, అంతఃపురం మందిరంలో ఏనాడు కలవలేదని, తనకన్నా బాగా ఎవరికి తెలుసు? మహారాజులను అంతఃపురానికి తోడ్కొని రావడం, వారు రహస్యంగా మహారాజ మందిరానికి వెళుతుంటే తాను అనుగమించడం, ప్రతిరోజు జరిగినదేగా? అటువంటప్పుడు మహారాజు రాకుమారినెలా గుర్తుపట్టారు?
*
యుద్ధంలో మహారాజు ఆ వీరున్ని ఏకాంత మందిరంలోనికి రప్పించుకోవడం, ఆ వీరుడు పక్కనే ఉండాలనుకోవడం… ఇప్పుడంతా తేటతెల్లమయింది అనంతుడికి. తాను చేసిన తప్పిదం తెలియవచ్చింది. మహారాణిపై కత్తి దూసినందుకు, వారు తనను క్షమిస్తారా?

వారి విషయంలో తనకు నివృత్తి కాని ప్రశ్నలెన్నో ఉన్నాయి. ఆ చిత్రపటంలోని యువకునికి, మహారాజుకు సంబంధమేమిటి? ఆ యువతి ఎవరు? ఆ చిత్రపటం చూడగానే మహారాజు ఎందుకంత ఉద్విగ్నతకు గురయ్యారు? ఎన్నో నెలలుగా మహారాజులను భర్తగా అంగీకరించని రాకుమారి, విదర్భకు వెళ్లేముందు తమ మనసును మార్చుకొని, మహారాజు మందిరానికి వెళ్లడానికి కారణమేమిటి? తనకు తెలియని నిఘూడమేమిటో? ప్రభువుల వారినే అడిగి తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు అనంతుడు.
*
సభ ముగిసింది. ఎప్పటిలా అలవాటుగా మహారాజును అనుసరించిన అనంతుడు, మహారాజ మందిరం ప్రధానద్వారం దగ్గరకు రాగానే ఆగిపోయాడు. మునుపటిలా తాను రాజ్యకలాపాల దగ్గర తప్ప, మహారాజును వెన్నంటి ఉండటానికి వీలుకాదు. అత్యవసరమైతే తప్ప ప్రభువుల వారి దర్శనం లేదన్న దేవసేన మాటలు గుర్తుకొచ్చి, అడుగు ముందుకు పడలేదు.

“ఆగిపోయావేం అనంతా! లోపలికిరా” పిలిచారు మహారాజు. ఇంకా సందేహం వదలలేదు అనంతుడికి. మహారాణి వారు ఉంటుండగా రాజమందిరానికి తానెలా వెళ్లగలడు? అనంతుని సంకోచాన్ని చూసి, చిరునవ్వుతో చేయిపట్టి విశ్రాంతి మందిరం లోపలకు తీసుకువెళ్ళాడు మహారాజు.

“మహారాణీ! ఎవరు వచ్చారో చూడండి” ప్రమీలాదేవిని పిలిచాడు. తాను వచ్చినందుకు మహారాణిని పిలవడమా! సంభ్రమంతో లేచి నిల్చున్నాడు.

“గురువర్యులకు మా ప్రణామములు” అని తన ఎదురుగా వచ్చి నిలబడిన మహారాణిని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు అనంతుడు. ఆమెను ఎక్కడ చూశాడో గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆమె… చిత్రపటంలో ఉన్న యువతి. అంటే ఆ యువకుడు మహారాజే. క్షణమైనా మహారాజును విడవకుండా అనుగమించేవాడు తాను. అటువంటిది తన కళ్ళుగప్పి, తనకు తెలియకుండా మహారాజు ఆ పల్లెవాని వేషంలో ఎప్పుడు వెళ్లారు? ఎక్కడికి వెళ్లారు? వారిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు? ఇది పూర్తిగా, మహారాజుల వారి భద్రత విషయంలో క్షమించరాని వైఫల్యం. అందుకు తానే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

“మహారాణి వారు మన్నించాలి. మీరెవరో తెలుసుకోకుండా, మీపట్ల కఠినంగా వ్యవహరించినందుకు” తల దించుకొని రెండు చేతులూ జోడించి మహారాణిని వేడుకున్నాడు అనంతుడు.

“గురువర్యులు మమ్ములను క్షమించాలి. భద్రతా విషయంలో మిమ్ములను ఆందోళనకు గురి చేసినందుకు” సవినయంగా వేడుకుంది మహారాణి.
“అనంతా! నీవు కూడా నన్ను క్షమించాలి. భద్రత విషయంలో నీ సూచనలను మేము పాటించనందుకు.” విక్రమసింహ.

“ప్రభూ! మీరు నా అపరాధాన్ని మన్నించాలి. సాహసం చేసి, నా అనుమానాలను మీ ముందు ఉంచుతున్నాను. నా అనుమానం నివృత్తి చేయవలసిందిగా ప్రార్థన” అంజలి ఘటించాడు అనంతుడు.

“మాకు తెలియకుండా మీరు రాకుమారిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిసారు ప్రభూ! గడియయినా, మేము మిమ్ము విడిచి ఉన్నవారము కాదు కదా!” అంటూ తన సందేహాన్ని వెలిబుచ్చాడు.
మహారాణిని తొలిసారి తామెప్పుడు కలుసుకున్నారు? జ్ఞప్తికి తెచ్చుకున్నాడు విక్రమసింహ.
*
వివాహానికి పూర్వం మారువేషంలో విదర్భ వెళ్ళిన సందర్భంలో రాజధాని వెలుపల ఉన్న అటవీ ప్రాంతంలో, ఎలుగుల బెడద ఎక్కువగా ఉందని రాత్రిపూట ప్రయాణం చెయ్యాలంటే భయంగా ఉందని బాటసారులు అనుకోవడం విన్నాడు. విదర్భదేశానికి అటవీ సంపద ఎక్కువే.

యువరాణిని స్వయంగా కలుసుకోవాలన్న తన కోరిక నెరవేర్చడం కోసం, అంతఃపురంలో భద్రతా లోపాలేమైనా ఉన్నాయేమో కనుక్కోవడానికి అనంతుడొకరోజు బయటకు వెళ్లాడు.

అనంతుడు ప్రక్కన లేక, ఏమి చెయ్యాలో తోచని తాను క్షత్రియ ధర్మం ప్రకారం, అక్కడ ఉన్న ఆ సమయంలో, ఎలుగుల బెడద నుంచి ఆ దేశప్రజలను రక్షించాలని, పల్లెవానిగా వేషం వేసుకుని అటవీ ప్రాంతానికి బయలుదేరి వెళ్ళాడు.

దట్టమైన అడవి. పెద్ద వృక్షాలు, ఫలాలతో భారంగా వాలిన శాఖలు, వాటిని అల్లుకున్న లతలు, లతల నుండి ప్రభవించిన వివిధ రంగుల అందమైన పుష్పాలు, అవి వెదజల్లుతున్న సువాసనలు, కొండలు, గుట్టలు, వాటి నుండి జాలువారే సెలయేళ్ల గలగలలు, సెలయేళ్లు నేల జారి, రాళ్ల మధ్య నుండి పరుగులు తీస్తూ, అడవి జంతువుల దాహం తీరుస్తున్న నదములు… చెంగుచెంగున గెంతుతూ కుందేళ్లు, ఆకులు రాలిన చప్పుళ్లకే అటూ ఇటూ బెదురు చూపులు చూసే లేళ్లు, పక్షుల కిలకిలా రావాలు… ప్రకృతి రమణీయకత… అనుభవైకవేద్యమే కాని వర్ణించనలవి కాదు.

ఎప్పుడూ రాచ కార్యాలతో మునిగితేలే తనకు, ఈ ప్రకృతి మధ్య గడిపే సమయాన్ని దేవుడిచ్చిన వరంగా భావించి ప్రకృతిలో తాదాత్మ్యమైపోయి, తాను వచ్చిన కార్యమే మర్చిపోయిన వేళ, దూరంగా ఎలుగుబంటి అరుపు… తననీ లోకంలోకి తెచ్చిపడేసింది. కార్యోన్ముఖునిగా చేసింది. వింటిని చెవుల వరకూ లాగి, నిశితంగా పరిశీలించి, శబ్దం వచ్చిన వైపు సంధించి వేసిన బాణం… సూటిగా దాని గుండెల్లో దిగిందేమో! అది భీకరంగా గర్జిస్తూ పరిగెడుతుంటే, దానిని వెంటాడుతూ ఇంకా ముందుకు వెళ్ళాడు. అదే సమయంలో తనలాగే వేటకొచ్చి, దానిని వెతుక్కుంటూ వస్తున్న ఒక శూరుని తోసుకుంటూ అతని వైపు వురికింది ఆ ఎలుగు. హఠాత్తుగా జరిగిన ఆ పరిమాణానికి ఆ వ్యక్తి అదుపు తప్పి పడిపోబోయాడు. అంతలో అక్కడికి చేరుకున్న తాను ఆ వ్యక్తిని ఒడిసి పట్టుకున్నాడు. ఒరిగి పడి పోవడంలో ఆ శూరుని శిరస్త్రాణం జారిపోతూ వుంది.

జారిపోతున్న శిరస్త్రాణం నుండి ఆ శూరుని ముఖం… మబ్బుల మధ్య నుండి తొంగి చూస్తున్న పున్నమి చంద్రునిలా… యువకుల్లో కూడా ఇంతందమైన వారుంటారా అని అచ్చెరువొందేలోగా, పూర్తిగా జారి క్రిందకు పడిపోయిందా శిరస్త్రాణం… అంతవరకు అది, అదిమి పట్టి ఉంచిన కేశసంపద, అలలు అలలుగా జారుతూ… యువకులకు ఇంతటి కేశసంపదా! లేడి కళ్ళను తలపించే విశాల నయనాలు… సుకుమారమైన దేహం, గాలికే కందిపోయే నునుపైన చెక్కిళ్ళు, సంపంగి మొగ్గ లాంటి నాసిక, వణికే అధరాలు… తాను పట్టుకున్నది పురుషున్ని కాదు, అందమైన యువతిని.

ఆ నిజం గ్రహించిన వెంటనే, ఒక్కసారిగా తన గుండె ఝల్లుమంది. విశాల నయనాలతో ఎవరీ యువకుడు? ఎచ్చటివాడు? అన్న బెదురులేకుండా, కళ్ళప్పగించి చూస్తూ తన చేతులలో వాలిపోయింది ఆమె. తన గుండె లయ తప్పింది. గుండె కొట్టుకునే వేగం హెచ్చింది. ఇదంతా కేవలం ఒక స్త్రీని స్పృశించినందుకా? కాదేమో! ఏ రోజూ స్త్రీని తాకాలన్న భావం కూడా మనసుకు రాలేదు. ఈమెను చూస్తుంటే యేదో ఒక మధురమైన భావం… మనసులో గూడు కట్టుకుని వున్నది, నెమ్మదిగా రెక్కలల్లార్చుతూ… ఏమిటీ వింత అనుభవం?

అసలీమె ఎవరో తెలియదు. ఈ అటవీ ప్రాంతంలో ఎందుకుందో తెలియదు. పల్లెయువతి అయి ఉండదు. వారు అటవీ ప్రాంతంలో తిరుగాడరు. ఈ కొండలలో నివసించే కోయస్త్రీ అయి ఉంటుందేమో! కోయస్త్రీ అయినా, ఈమెలో ఏమి అందం! రాజసం ఉట్టిపడుతుంది. కొంపదీసి, చిన్నప్పుడు తప్పిపోయిన ఏ రాకుమారో అయి ఉంటుందా! ఈమె తల్లిదండ్రులెవరో? పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో? ఇప్పుడెవరి దగ్గర పెరుగుతుందో? ఏవైనా వాటితో తనకు పనేమిటి? ఆ నిమిషంలో తానొక రాజ్యాధిపతినని, ఎప్పటినుండో కలుసుకోవాలనుకుంటున్న విదర్భ రాకుమారిని… అన్నిటినీ మర్చిపోయాడామె సమక్షంలో.

ఈమెను కలుసుకోవడానికేనా, విదర్భరాజ్యానికి రావడం జరిగింది? రాజమాత వీరిని కోడలిగా, మగధరాజ్య పట్టమహిషిగా అంగీకరిస్తారా? ఇప్పటికే విదర్భ రాకుమారిని పట్టమహిషిగా అనుకుంటున్నారు రాజమాత. మరి తను నిర్ణయం ఎలా ఉండబోతుంది? ఏది ఏమైనా, ఈమె ఎవరైనా, ఈమెను చూసిన మరుక్షణం నుండి తన మనసంతా ఈమెతో నిండిపోయింది. విదర్భ రాకుమారిని కలవడానికి వచ్చిన తాము, ఈ స్త్రీమూర్తి చూపుల వలలో పడిపోయామెందుకో! ఆలోచనలు అనంతమైనా, ఆమెను విడిచిపెట్టడానికి చేతులు రావడం లేదు. ఆమె కూడా శిల్పంలా తన చేతులలో ఒదిగిపోయింది.

తమ ఇరువురి చూపులు కలిసిన ఆ క్షణమే, తనకది శుభ ముహూర్తంలా అనిపించింది. పంచభూతాలూ తమను ఆశీర్వదించినట్టు అనిపించింది. చిరుగాలికే జలజల రాలే సుమాలే అక్షతలు అనిపించాయి. సెలయేటిహోరే మంత్రాచ్ఛటనలా అనిపించింది. పడిపోకుండా ఉండడానికి, తన కంఠాన్ని పట్టుకున్న ఆమె సుకుమార కరములే, తన మెడలో వేసిన పూల హారంలా అనిపించింది. తన గుండెలపై ఒదిగిన, ఆమె గుండెల సవ్వడి తనకెన్నో ఊసులు చెప్తున్నట్టు అనిపించింది. మొదటిసారిగా తెలుస్తుంది తనలో ఏదో మొలకెత్తిందని! ఇదేనా, ప్రబంధాలలో వర్ణించిన ప్రేమంటే! అప్పుడే ఆమెను మనసు నిండా నింపుకున్నాడు. యుగాలుగా తాను కలవాలి అనుకుంటున్న వ్యక్తిని కలిసినపుడు, కలిగిన తన్మయత్వం తనలో.

ఆమెకూ అలానే అనిపించిందేమో! అందుకే తన చేతులలో అలాగే ఉండిపోయిందా? ఏమో! ఒక్క క్షణం చూసి, తనను కళ్ళనిండా నింపుకొని, విశాలమైన ఆ కళ్ళను వాల్చుకుంది. తుమ్మెదలు ఆమె కళ్ళపై వాలాయా అన్నట్లుగా ఆమె నయనాలు. అప్పుడే నిర్ణయించుకున్నాడు ఆమె ఎవరైనా, ఆమెను విడిచి ఉండలేనని, ఆమే తనకు కాబోయే మహారాజ్ఞని…

అలా ఎంతసేపున్నారో ఇద్దరూ? దూరం నుండి మనుషుల సందోహం, అవి నెమ్మదిగా దగ్గరవుతూ… ఆ మాటల సవ్వడికి చలనమొచ్చిన బొమ్మలా, తనను మరొక్కసారి కళ్ళనిండా నింపుకొని, ఎలా వచ్చిందో అలానే మాయమైందామె. ప్రాణమున్న బొమ్మే అయిపోయాడు తాను. అలా ఎంతసేపున్నాడో! ఎరుకలేదు. చీకట్లు ముసురుకుంటుంటే, వేట కెళ్ళిన అడవి జంతువులు స్థావరాలను చేరుకునే శబ్దాలతో, ఈ లోకంలోకి వచ్చి అక్కడ నుండి కదిలాడు తాను.
ఆమె ఎవరో! ఎలా తెలిసిందో! తరువాయి సంచికలో మీకోసం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

లలితాంజలి

మహిళా దినోత్సవం నాడు స్నేహ వనం లో మేము….