పసిదనంతో ప్రయాణం (కాలమ్ 10)

ఉత్తములతో చేరితే…

పిల్లలను గురించి చాలా మందిమైన మన పెద్దవాళ్ళం ఆఁ ఏముందిలే చిన్నవాళ్ళు వాళ్ళకు ఏం తెలుస్తుంది? మనం ఏం చెప్పినా వినాల్సిందే? వాటిని బుద్ధిగా ఆచరించాల్సిందే అనుకుంటాం. అంటుంటాం కూడా. కానీ వాళ్ళలో ఆలోచించే శక్తి ఉందనీ, ఏదైనా విషయం చెబితే ఆ బుజ్జి జీవితాలకు అన్వయించుకుంటారనీ, అలా అన్వయం కుదరనప్పుడు నిజానిజాలు నిలదీసి మరీ అడుగుతారని,వారి సందేహాలను నివృత్తి చేసుకుంటారని ఇదిగో ఈ సంఘటననే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఇలా అడిగే చనువు ఇవ్వకపోతే వాళ్ళ ప్రశ్నించే తత్వాన్ని మనం నొక్కివేసిన వాళ్ళం అవుతాం. ఇంట్లో అమ్మా నాన్నల దగ్గర ఎంత చనువుగా వుంటారో తరగతి గదిలో ఉపాధ్యాయులు అంత చనువుగా ఉంటే తప్ప వాళ్ళలోని ప్రశ్నించే ధైర్యాన్ని, అభిప్రాయాలు పంచుకొనే అవకాశాన్ని ఇవ్వలేం.
మరి ఓ బుజ్జి కన్నమ్మకు వచ్చిన సందేహం ఏమిటో చూద్దాం.
అది ఆరవ తరగతి. వారికి సూక్తి సుధ పాఠంలోని పద్యాలను నేర్పతూ అందులోని అర్థ తాత్పర్యాలను చెబుతూ ఉన్నాను.
ఓ రోజు నీరము తప్త లోహమున యనామకమై నశించు పద్యం చెప్పి నీటి చుక్క కాలే ఇనుము మీద పడితే ఆవిరై పోతుందనీ, తామరాకు మీద పడితే ముత్యంలా మెరుస్తుందనీ, అదే నీటి చుక్క ముత్యపు చిప్పలో పడితే ఆణిముత్యమై గౌరవాన్ని పొందుతుందని వివరణ ఇచ్చి దానిని కవి అన్వయించిన తీరు చివర్లో చెప్పాను. మనిషి కూడా అధములతో చేరితే అధముడుగానూ, మధ్యములతో చేరితే మధ్యముడుగానూ, ఉత్తములతో చేరితే ఉత్తముడుగానూ అవుతాడని చెబుతూ తరగతి గదికి అన్వయిస్తూ ఒరే నాన్నా, కన్నా మనం కూడా చదువురాని వారితో చేరితే చదువు రాదు కాబట్టి వచ్చిన వారితోనే చేరాలి. అలా అయితేనే చదువు వస్తుంది.” అని చెప్పి అలా ముగించానో లేదో “అవును టీచర్ చదువంటే బాగా ఇష్టం ఉండాలి. చదువే మనకు సంతోషాన్ని ఇస్తుంది, ఆరోగ్యం కూడా ఇస్తుంది” అనగానే ఆరోగ్యమా అదెలా అన్నట్టు మొహం పెట్టగానే మన పుస్తకాల్లో పరిసరాలు- ఆరోగ్యం గురించి వుంటాయి కదా టీచర్. అవి పాటిస్తే ఆరోగ్యం కూడా ఇస్తుంది కదా అనగానే ఆ చిన్ని మనసు చెందిన మానసిక పరిపక్వతకు ఆశ్చర్యపోయాను.
అంతటితో ఆగకుండా “టీచర్! ఈ పద్యంలోది నేను ఒప్పుకోను టీచర్” అంది.” ఇది ప్రముఖ సంస్కృత కవి రాసిన సుభాషిత పద్యమిది. ఒప్పుకోను అంటుందేమిటి ఈ బుజ్జి బంగారు” ఆశ్చర్యపోతూ “ఎందుకురా బంగారూ?” అన్నాను.
“మరి,మరీ నాతో చేరి రోజూ తిరుగుతున్న నా దోస్తుకు మరెందుకు రావడం లేదు?” అనేసరికి పద్యంలోని విషయాన్ని నిత్య జీవితానికి అన్వయించుకున్న ఆ బుజ్జి కన్నమ్మ మేధస్సుకు అభినందనలు తెలుపుతూ ” మరి నీతో తిరుగుతున్న నీ దోస్తును బాగా చదివేలా మార్చాల్సిన బాధ్యత నీదే మరి. చదువంటే ఇష్టం కలిగించాలి మరి. ” అనగానే “అలాగే టీచర్” అంటూ బుద్ధిగా తలూపింది.
ఈ చిన్ని చిన్ని బుజ్జి కన్నమ్మ, కన్నయ్యలకు కొంచెం స్వేచ్ఛ ఇస్తే చాలు వాళ్ళ మనసును మనముందు స్వచ్ఛమైన వెన్నెలలా పరుస్తారు.
మాటల స్పర్శ…
***
అన్ని ఉద్యోగాలకు ఉపాధ్యాయ వృత్తికి ఉన్న భేదం ఇదే. మన చెంతకు చేరిన పసి మొగ్గలు జ్ఞానవిరులుగా వికసిస్తూ వారి విజ్ఞాన పరిమళాలు వెదజల్లుతూ వుంటే.. అంతకంటే మనోజ్ఞమైన దృశ్యం ఏముంటుంది ?కల్మషం లేని మాటల స్ఫర్శ హృదయాన్ని తాకుతుంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది?
ఇలా బుజ్జి కన్నమ్మలు, కన్నయ్యల ఊసులు చెప్పుకుంటూ పోతే కాలం తెలియదు.కాగితాలు సరిపోవు.
ముఖ్యంగా మహిళా టీచర్లలో వాళ్ళు తమ అమ్మల్ని చూసుకుంటారు.గారాలు పోతుంటారు.చనువిస్తే అల్లరి చేస్తారు.ఇంట్లో జరిగే సంఘటనలను అందులో తమ బుజ్జి మనసులకు దొరికే ఆనందాలను,కలిగే కష్టాలను పంచుకుంటారు. ఇక కొంతమంది బుజ్జి కన్నమ్మ కన్నయ్యలు బడికి ఆలస్యంగా రావడానికి, హోం వర్క్ చేయకపోవడానికి గల కారణాలు చెబుతుంటే అంత చిన్న వయసులోనే వాళ్ళు మోస్తున్న పెద్ద బాధ్యతల గురించి విన్న తర్వాత ఇక ఏమీ అనడానికి మాటలు వుండవు.అందులోంచి వాళ్ళని టీచర్లుగా తప్పించలేని నిస్సహాయ స్థితికి మనమీద మనకే కోపం వస్తుంది.
ఇక చాలా మంది పిల్లలు ఉదయం ఏమీ తినకుండా , కొన్ని చాయ్ నీళ్ళు తాగి వస్తుంటారు.మధ్యాహ్న భోజన సమయంలో వాళ్ళు ఒక్క మెతుకు కూడా కింద పడనీయకుండా అన్నాన్ని ఎంతో యిష్టంగా తినడం చూస్తుంటే మనకూ తిండి మీద ధ్యాస కలుగుతుంది.తినాలనే కోరిక పుడుతుంది.

చాలా దూరంగా ఉన్న మండలంలోని స్కూల్ కు బదిలీ అయ్యాను.త్వరలో వెళ్ళి జాయిన్ అవ్వాలి. అదే విషయాన్ని “ఒరే నాన్నా నేను బదిలీ మీద చాలా దూరం వెళ్తున్నా. అని అదో పెద్ద విషయం కాదన్నట్లుగా మామూలుగా చెప్పి పాఠం చెప్పడంలో మునిగి పోయాను.
చిన్నగా వెక్కిళ్లు వినిపించ సాగాయి. ఎవరబ్బా? ఎందుకేడుస్తున్నట్టు అనుకుంటూ దగ్గరకు పిలిచి ఎందుకురా నాన్నా ఏడుస్తున్నావు? అలా నా ప్రశ్న ప్రశ్నలాగే ఉండగానే భోరుమని ఏడుస్తూ ” టీచర్ నువ్వు వెళ్ళొద్దు టీచర్.ఇక్కడే వుండాలి.నువ్వు ఎక్కడికీ వెళ్ళొద్దు అంటూ ఒకటే ఏడుపు. వాడి ఆత్మీయతకు స్వచ్ఛమైన ప్రేమకు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.నేనంటే ఉన్న అవ్యాజమైన అనురాగానికి వెల కట్టగలరా ఎవరైనా? దగ్గరకు తీసుకొని ఇప్పుడు కాదులే నాన్నా ఇంకా చాలా టైం వుంది కన్నయ్యా! అన్నప్పటికీ ఒక పట్టాన కుదుట పడలేదు. నేను పీరియడ్ అయిపోయి వెళ్ళిపోయినా ఏడుస్తూనే ఉన్నాడని తర్వాత వెళ్ళిన టీచర్ చెప్పారు. వాడొక్కడే కాదు మా అందరికీ ఏడుపొస్తుంది అంటూ ఆ రోజు ఏ టీచర్,సార్ల పాఠాలు సరిగా వినలేదనీ,బాధ పడ్తూ ఉన్నారని చెప్పడంతో మనసు వికలం అయ్యింది. ఈ బుజ్జి కన్నమ్మ,కన్నయ్యలను విడిచి నేను మాత్రం ఎలా ఉండగలను? వాళ్ళు పైకి ఏడ్చారు.నేను లోలోపల ఏడుస్తూ ఉన్నాను.
కేవలం గురువులకు మాత్రమే ఇలాంటి కల్లాకపటం లేని ప్రేమ దొరికేది.ఇలా నిష్కల్మష శిష్యుల వల్లే ఉద్యోగం మీద మరింత ప్రేమ పెరిగేది,ఇష్టం కలిగేది అనుకున్నా.
రకరకాల వార్తలు ఈ 317 జీవో ఆగిపోతుందట.ఎక్కడోళ్ళు అక్కడేనట.ఇప్పట్లో ఉండవట.ఇలాంటి వార్తలకు సంబంధించిన మాటలు మా టీచర్లు,సార్ల మధ్య జరుగుతుంటే వినడం.మీరు ఎక్కడికీ పోరు.ఇక్కడే ఉంటారు కదూ! టీచర్ అని సంబర పడటాలు,వెళ్ళక తప్పదు అని తెలిసిన తర్వాత వాళ్ళ బాధ పడటాలు… ఇవన్నీ వర్ణనాతీతం.
వెళ్ళక తప్పదని రూఢీ అయ్యాక రోజూ వచ్చి నన్ను అల్లుకు పోవడం. వెళ్ళే రోజు వాళ్ళ కళ్ళు కట్టలు తెగిన చెరువులు అయ్యాయి. నేను కూడా ఇక ఆపుకోలేక పోయాను.
భారమైన హృదయంతో వారి నుండి వీడ్కోలు తీసుకుని 317జీవో పుణ్యమా అని జిల్లానే మారాల్సి వచ్చింది. ఆ బుజ్జి కన్నమ్మ కన్నయ్యల జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, వారి అనురాగపూరితమైన మాటల స్పర్శను మనసుతో అనుభూతిస్తూ కొత్త పాఠశాలలో చేరాను.

Written by Urimalla Sunanda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పాడె అను నేను…

లోకాభిరామాయణం 9