తన మందిరం వైపు నడుస్తున్న అనంతుడు, దూరంగా చీకటి ముసుగులో మహారాజ మందిరం వైపు, వడివడిగా నడిచి వెళ్తున్న వ్యక్తిని చూశాడు. ఇంత రాత్రివేళ మహారాజ మందిరం వైపు… ఆ వ్యక్తి ఎవరో గ్రహింపుకు రాగానే, మనసు త్రుళ్ళి పడడమే కాదు, భయాందోళనలకు లోనయింది. ఎంత చీకటిలోనైనా, ఎంత దూరాన వున్నా మహారాజుని పోల్చుకోగలడు తాను. ఈ సమయంలో, మహారాజు అంతఃపురాన్ని వదిలి తన మందిరం వైపు వెళ్ళవలసిన అవసరమేమిటి? అక్కడేమైనా జరిగిందా? అక్కడ నుండి మహారాజు నిష్క్రమణకు కారణమేమై ఉంటుంది.
కోరి వలచిన కన్యను గర్భాదానం సమయంలో వదిలి రావడానికి వెనక కారణాలేముంటాయి? ఒకవేళ… మనసు కీడును శంకించింది. విదర్భదేశం మీద దండెత్తి, రాకుమారిని ఉద్వాహం చేసుకున్నారు మహారాజు. వారిని ఓడించామని, రాకుమారి కినుక పూనారా? ఐనా, ఓడిన దేశపు కన్యను, గెలిచిన రాజు వివాహం చేసుకోవడం రాజధర్మమే కదా! ధర్మయుద్ధంలో తమను గెలిచిన వీరుడు, తమ కన్యను వివాహం చేసుకోవడం, ఓడిపోయిన రాజుకు గౌరవనీయమే కదా! మరెందుకు ప్రభువు ఈ రాత్రివేళ తన మందిరానికి వెళ్తున్నారు?
ఒకవేళ… రాకుమారికి ప్రభువు అంటే ఇష్టం లేదా? ఇష్టం లేకపోయినా, ఒకసారి వివాహమయ్యాక, ఆమె మహారాజుకు సొంతం కాదా! లేక ఆమె మహారాజును పెండ్లి చేసుకోవడంలో, ఏదైనా అంతరార్థం దాగి ఉందా? ఇదేమైనా శత్రువుల కుట్రా? మనసు పరిపరి విధాల ఆలోచిస్తోంది. ఏది యేమైనా కాని, తను మరింత అప్రమత్తతతో వుండాలి. ఈ విషయం వేరే కంటికి తెలియకుండా జాగ్రత్త పడాలి, గట్టిగా నిర్ణయించుకున్నాడు అనంతుడు. విక్రమసింహకు తెలియకుండా మహారాజ మందిరం వరకు, అతనిని అనుసరించి మహారాజు మందిరంలోకి వెళ్లగానే, వెనుదిరిగాడు.
*
ఆ మరుసటి ఉదయం, ఎరుపెక్కిన కన్నులతో, వడలిన ముఖంతో దర్శనమిచ్చాడు మహారాజు అనంతునికి. అనంతుని నమస్కారాలు స్వీకరించిన అనంతరం “అనంతా” నెమ్మదిగా పిలిచాడు విక్రమసింహ.
“ప్రభూ” అంజలి ఘటించాడు అనంతుడు.
“మహారాణి వారు యుద్ధవిద్యలు నేర్చుకోవాలని వుబలాటపడుతున్నారు. ఏర్పాట్లు చూడు”
రాకుమారికి ఇప్పుడు యుద్ధవిద్యలు నేర్చుకోవాలన్న అవసరం ఏమిటి? దీని వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా? తప్పకుండా ఉండే ఉంటుంది. రాకుమారి ఈ వివాహానికి బలవంతంగా తలొగ్గితే… అంతే అయ్యుంటుంది. లేని పక్షంలో, నిన్న మహారాజు ఆమెను వదిలి ఎందుకొస్తారు? ప్రతీకారం తీర్చుకోవడానికి, ఆమె వ్యూహం పన్నుతున్నారా? అదే కారణమైన పక్షంలో మహారాజుల భద్రతకు ముప్పు వాటిల్లనుంది. ఇటువంటి సమయంలో ఆమెకు యుద్ధ విద్యలు నేర్పడమంటే బాగా ఆలోచించాల్సిన విషయం. కానీ మహారాజులు తనతో ఆలోచన చెయ్యలేదు. ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞను నెరవేర్చాల్సిన బాధ్యత తనకుంది. రాత్రి మహారాజుల అంతఃపుర నిష్క్రమణను తాను కాంచినట్లు చెప్పాలా! వద్దా! ఆలోచనలో పడ్డాడు అనంతుడు.
“అనంతా! నీ మౌనానికి అర్థమేమి?” ప్రశ్నించాడు విక్రమసింహ.
“అలాగే ప్రభూ. ఏర్పాట్లు చేస్తాను.” తన మనసులోని సందేహం, మోముపై కనబడకుండా జాగ్రత్త పడుతూ అన్నాడు అనంతుడు.
*
ఆ రాత్రి యధావిధిగా, అంతఃపురానికి బయలుదేరాడు విక్రమసింహ, అనంతుడు తోడురాగా. సింహద్వారం దగ్గర అనంతుని వీడ్కోలు స్వీకరించి, పరిచారికలు వంగి నమస్కారాలు పెడుతుంటే లోపలకు నడిచాడు. విక్రమసింహ రాకను తెలుసుకున్న రాకుమారి, అతని రాకలోని ఆంతర్యాన్ని అన్వేషిస్తూ, సంభ్రమంగా ఎదురు వెళ్ళింది. మగధదేశ మహారాజు గురించి ఎన్నో విన్నది తాను. ధర్మానువర్తులని, యుద్ధతంత్రాలలో ఆరితేరిన వారని, ధనుర్విద్యలో అర్జునుని తలపిస్తారని, అందంలో మన్మధుడికి సాటియని, చక్రవర్తుల కుమార్తెలు కూడా వీరిని వివాహం చేసుకోవడానికి తహతహలాడుతున్నారని… వివాహానికి పూర్వం, ఏవైనా సందర్భాలలో తనవంటి రాకుమార్తెలతో కలిసి గడపడం జరిగితే, వారి మాటలలో ముందుండేది వీరే! తమ మనసు అన్యాక్రాంతం కాకుంటే, వీరిని తృణీకరించవలసిన అవసరమొచ్చేదా? రాత్రి అంత స్పష్టంగా చెప్పినా, నేడు వారి రాకలో పరమార్థమేమిటో! రాకుమారి కనుసైగతో, వారిరువురికి ఏకాంతాన్ని కలుగజేస్తూ, ప్రియసఖి ప్రియంవదతో సహా, చెలికత్తెలు బయటకు నడిచారు.
“మహారాజులకు మా ప్రణామాలు” చేతులు జోడించింది రాకుమారి.
“రాత్రి మీరు విన్నవించిన మీఅభీష్టం మేర, తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ విషయంలో మీరు…”
విక్రమసింహ మాట పూర్తిగా కాకుండానే “మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. నా ప్రియ సఖులకు తప్ప వేరే ఎవరికీ ఈ విషయం తెలియకుండా, జాగ్రత్త పడతాం” ముకుళిత హస్తాలతో విన్నవించుకుంది.
“ఇంకొక ముఖ్య విషయం. మీకు విద్యను నేర్పేందుకు ఈ దేశ సర్వ సైన్యాధిపతి అనంతుల వారిని నియమిస్తున్నాను. వారు మాకు అత్యంత ప్రీతిపాత్రులు. వారి తర్వాతే మాకు ఎవరైనా! ఆ విషయంలో ఎటువంటి సందేహాలకూ తావులేదు”
“మీరు సందేహపడనవసరం లేదు మహారాజా! మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని మన పూర్వులు నుడివిన పలుకులను త్రికరణశుద్ధిగా నమ్ముతాను. విద్య నేర్పిన ఎవరైనా మాకు దైవంతో సమానం మహారాజా!” వినయ ప్రపత్తులతో తెలిపింది రాకుమారి.
సంతృప్తి చెందిన విక్రమసింహ, “ఈనాటికి వారము దినముల తర్వాత, మీ మందిరాన్ని ఆవరించి ఉన్న ఉద్యానవనం ఎడమవైపు మార్గం మిమ్ములను గుబురు పొదల దగ్గరకు తీసుకువెళ్తుంది. ఆ పొదలు దాటితే ఒక ద్వారం వస్తుంది. అది దాటితే, వేరొక ఉద్యానవనంలోకి దారితీస్తుంది. అందులో విశ్రాంతి మందిరంతో సహా, మీరు విద్యలు నేర్చుకోవడానికి కావలసిన సర్వ సౌకర్యాలు ఆ రోజుకి సన్నద్ధం చేయబడతాయి” అని అంటూ తన రాకలోని ఆంతర్యాన్ని తెలియచెప్పాడు.
“మహారాజా! మీకు మా కృతజ్ఞతను ఎలా తెలుపుకోవాలో కూడా అర్థం కావడం లేదు. ఇంత తక్కువ వ్యవధిలోనే, మా కోరిక మన్నించినందుకు సదా మీకు కృతజ్ఞురాలిని” విక్రమసింహ నిల్చున్న చోట భూమినంటి ప్రణామం చేసింది రాకుమారి.
“తక్కువ వ్యవధిలోనా?” ఆలోచనలో పడ్డాడు విక్రమసింహ. ఆమె తన జీవిత భాగస్వామి అవుతుందనుకున్న దగ్గరనుంచి, మహారాజు మహారాణిల మందిరాలకు దేనికదే ప్రత్యేకంగా ఉద్యానవనాలున్నా, తామిరువురి విహారానికై, రెండు మందిరాల మధ్యనున్న ఖాళీ స్థలాన్ని, దగ్గరుండి ఉద్యానవనంగా తీర్చిదిద్దించాడు. విశ్రాంతి మందిరాన్ని కట్టించాడు. తమ ఏకాంతానికి భంగం కలగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు. తన దురదృష్టం. ఇప్పుడది వేరే అవసరానికి ఉపయోగించ బడబోతుంది. రాజు, రాణిల రాకపోకలు వేరే కంటికి తెలియకుండా ఉండడానికి, రెండు మందిరాల మధ్య, ఎవరికీ తెలియని రహస్య మార్గాన్ని కూడా నిర్మించాడు. ఇప్పుడదే, తమమధ్య ఏ బంధమూ లేదన్న విషయం, బయటకు రాకుండా కాపాడుతుంది. నిట్టూర్చి, అక్కడనుండి కదిలాడు విక్రమసింహ.
అతని నిట్టూర్పులోని వేదన, రాకుమారికి సెగలా తగిలింది. బరువైన అతని అడుగుల సవ్వడి, ఆమెను మరింత చింతాక్రాంతురాలిగా చేసింది.
*
మహారాజ నిష్క్రమణను గాంచిన ప్రియంవద, దీనవదనయై నిల్చున్న రాకుమారి చెంత చేరింది “ఏమైందమ్మా” అంటూ.
“నేను చాలా తప్పు చేశానేమో!”
“అదేమమ్మా అలా అంటారు?”
“వారంత మంచి మనిషిని నేను చాలా బాధ పెట్టాను. నా పాపానికి నిష్కృతి ఉంటుందా? చక్రవర్తుల కుమార్తెలే వారితో పాణిగ్రహణానికి, ఎదురుతెన్నులు చూస్తుంటే, వారికి నాపై అనురాగమేల కలుగవలె? నాకు వేరే మహాభాగునిపై అనురాగమేల కలుగవలె? మా ఇద్దరి మనసులూ ఇలా చింతాక్రాంతమై పోవాల్సిందేనా? వేరే మార్గమే లేదా?” కన్నీరు కార్చింది రాకుమారి.
ఊరడించడం తప్ప, ప్రియంవద మాత్రమేమి చెయ్యగలదు? రాకుమారి మనసు దోచిన వారెవరో తెలియదు. ఎక్కడుంటారో తెలియదు. తామిప్పుడు పరాయి దేశంలో… వేరే దారేముంది? బాధపడడం తప్ప.
*
విక్రమసింహ సూచనను అనుసరించి మహారాణి యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నారన్న విషయం బయటకు తెలియకుండా, చుట్టూ మూడంచెల కాపలాను ఏర్పాటు చేశాడు అనంతుడు. పరిచారికలకు కూడా అనుమానం రాకుండా మహారాణి ఉద్యానవన విహారానికి వెళ్తున్నట్లు అనిపించేలా, మహారాజ మందిరానికి అంతఃపురానికి మధ్య ఉన్న ఉద్యానవనంలో మహారాణికి విద్య గరిపే ఏర్పాట్లు చేశాడు. ఉద్యానవనం చుట్టూ ఉన్న భద్రతా గోడను మరింత పటిష్టపరిచి, చుట్టూ కందకం తవ్వించాడు.
రాకుమారి ఆమె చెలికత్తెలకు తప్పించి, వేరే వారికి ప్రవేశం లేకుండా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశాడు. ఇష్టం లేకపోయినా, రాకుమారికి విద్య నేర్పించే బాధ్యతను స్వీకరించాడు. ఎందుకంటే ఈ విషయం పరులకు తెలిస్తే పర్యవసానాలు ఏ రకంగా వుంటాయో బాగా తెలిసినవాడు కనుక. ఏర్పాట్లన్నిటినీ దగ్గరుండి పర్యవేక్షించి, పూర్తి సంతృప్తి చెందాక, విద్య గరిపే బాధ్యతను రేపటినుండి స్వీకరిస్తానని విక్రమసింహకు తెలియజేశాడు. అదే వార్త రాకుమారికి చేరింది.
*
అనుకున్న సమయానికి, ఐదు గడియల ముందే అక్కడికి చేరుకున్నాడు అనంతుడు. రాచకన్యలను ఎప్పుడూ దగ్గరనుండి చూసినవాడు కాదు. వారితో ఏ రకంగా ప్రవర్తించాలోనన్న విషయంపై, అనంతుని మనసు ఆందోళనగానే ఉంది. అందులో ఆమె మామూలు రాచకన్య కాదు. ఈ దేశానికి మహారాణి. మహారాజును దూరం పెట్టినా, మహారాజు ఇప్పటికీ ఆమెకు ప్రాముఖ్యతనిస్తున్నారన్న విషయం, ఈ ఏర్పాట్లను చేయడంలోనే అర్థమవుతుంది. అటువంటప్పుడు ఆమె ప్రవర్తన ఎలా ఉంటుంది? మహారాణినని భేషజం చూపిస్తుందా? ఆమె భేషజం చూపిస్తే తనేవిధంగా ప్రతిస్పందించాలి. ఇటువంటి ఆలోచనలతో తలమునకలై ఉన్న అనంతుడు, అలికిడికి తల తిప్పి చూశాడు. ఒక పదిమంది యువతులు… ఒకే రకమైన దుస్తులు ధరించి, వాటిపై కవచాన్ని, ముఖమంతా కప్పేలా శిరస్త్రాణాన్ని ధరించి వచ్చారు. రాకుమారి చెలికత్తెలు కాబోలని అనుకుంటూ, రాకుమారి రాకకోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు అనంతుడు.
వచ్చిన వారిలో ఒకామె, ముందుకు వచ్చి, “గురువువర్యులకు ప్రణామాలు. మమ్ములను శిష్యురాలిగా స్వీకరించినందుకు ధన్యవాదములు” నిలబడి ఉన్న అనంతునికి శిరసు వంచి నమస్కరించింది. వచ్చిన వారిలో మహారాణి ఉంటుందని ఊహించని అనంతుడు తొట్రుపడ్డాడు. ఏమని ఆశీర్వదించాలో అర్థంకాని అయోమయ స్థితిలో పడిపోయాడు.
*
మొదటి రోజే రాకుమారి ధనుర్విద్యా నైపుణ్యత ఆశ్చర్యపరిచింది అనంతుడిని. సరైన శిక్షణ లేకగాని, శిక్షణే ఉండి ఉంటే, మొన్న జరిగిన యుద్ధంలో విదర్భదేశం గట్టి పోటీ నిచ్చేదనిపించింది.
“గురువర్యా! మీ దగ్గర నేర్చుకుని మీ చేత శభాషని అనిపించుకోవడమే నా అభిమతం. అందుకు నేను ఎంతైనా శ్రమిస్తాను” అనంతునికి చెప్పింది రాకుమారి.
ఉత్సాహవంతులైన శిష్యులను చూస్తే గురువుగారికి మరింత ఉత్సాహం వస్తుంది నేర్పించడానికి. ఇటువంటి శిష్యులుంటే ఏ గురువుకైనా అంతకు మించిన ఆనందం ఏముంటుంది? కానీ అనంతుని మదిలో యే మూలో ఉన్న శంక అతని వెనుకకు లాగుతుంది. అయినా ఆమె మోములోని నిబద్ధతను, నేర్చుకోవాలన్న తపనను చూసి, “మీ అభిమతం” అని ఊరుకున్నాడప్పటికి.
మొదటిరోజు శిక్షణ పూర్తై, సెలవు తీసుకునే ముందు, అత్యంత వినమ్రంగా రాకుమారి ఇచ్చిన బహుమానం అనంతుని ఉలిక్కిపాటుకు గురిచేసింది. తొలి పరిచయంలోనే తనకిది ఇవ్వడంలో ఆమె ఉద్దేశ్యమేమిటి? తమను హెచ్చరిస్తుందా? ఈ బహుమానం ఇవ్వటంలో ఆమె ఆంతర్యమేమిటి? రాకుమారి శిరస్త్రాణం ధరించి ఉండడం వలన, ఆమె ఆలోచనలను పసిగట్ట లేకపోయాడు. ఈ బహుమతి యిచ్చి, ఆమె తనను సవాలు చెయ్యబోతుందా? ఆ తర్వాత మహారాజు వంతు వస్తుందా? రాబోయే పరిణామాలను అంచనా వేస్తూ, ఉద్విగ్నతకు, ఆందోళనకు లోనయ్యాడు అనంతుడు.
*
తర్వాత భాగం మలి సంచికలో…..