కుటుంబ ” ఆదర్శ సోదరీమణులు”

ఆదర్శ నారీమణులు చర్ల మృదుల,విదుల

ఈ అక్కచెల్లెళ్లు కవలపిల్లలకన్నా మిన్నగా పెరిగి సాహిత్య సమాజసేవలో ఓప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్నారు.వీరు చర్లగణపతిశాస్త్రి, సుశీల గార్ల 4_5 సంతానం విదుల మృదుల. నిడదవోలుకి చెందిన వీరిలో విదుల 1943 లో,మృదుల 1944లో పుట్టారు .ముందుగా విదులగారిని గూర్చి తెల్పుతాను.తల్లిదండ్రుల ప్రభావంతో మానవసేవే మాధవసేవ అనేభావం మనసులో పడి గట్టిపడి వారిజీవితం సాగింది.కాలువలో స్నానంచేసి గుమ్మ పాలు తాగడం 8గంటలకు అల్పాహారంతో వారు పనిమొదలు పెట్టేవారు.పెసలు అరటిపండ్లు,కొబ్బరిముక్కలు వారి బ్రేక్ ఫాస్ట్.అతిధులొస్తేనే బియ్యంవాడేవారు. ఇక భోజనంలో పచ్చిబెండ దొండ,బీర,ఆనప ముక్కలు టమాటాలుతీసుకునేవారు. సాయంత్రం నూకలజావలో ఆవకాయ పెరుగు కలుపుకుని కల్పుకుతినేవారు. సాయంత్రం 6కే భోజనం అంటే జావతాగి ఆరుబయట మంచాల మంచాలేసుకుని తండ్రి చెప్పే విషయాలు వింటూ నిద్ర లోకి జారుకునేవారు.

విదులకి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండేది.పార్శ్వనెప్పితో బాధ పడే ఆమెకి తండ్రి హోమియోవైద్యంచేశారు.రోజూ అల్లం పెసరట్టు ఈమెకి తల్లి ప్రత్యేకంగా చేసిపెట్టేది. విదుల కి దయా దానగుణం ఎక్కువ. విదుల అంటే వీరమాత,ధైర్య శాలి అనే చెప్పొచ్చు.మాలపల్లిలో వీధులూడ్చటం,చదువుచెప్పడం దేశ భక్తి గేయాలు నేర్పటంతో బాటు వివాహం చేసుకోకుండా సమాజసేవకు అంకితమైనారు. విదుల బి.ఎ.తర్వాత, ఆంధ్ర యూనివర్శిటీలో హిందీ ఎం.ఎ. ఉస్మానియా నుండి ఎం.ఫిల్. చేసి బి.ఇడి చేశారు.విశాఖ సెయింట్ ఆన్స్ ఉమెన్స్ కాలేజీలో1976_2000 దాకా హిందీ లెక్చెరర్ గా పనిచేశారు.13ఏళ్లు ఎన్.ఎస్.ఎస్.ఆఫీసర్ గా విద్యార్థుల మన్నన పొందారు.
అప్పుచేసైనా దానధర్మాలు చేసే ప్రవృత్తి ఈమెది.చెల్లి మృదులతో కల్సి బుర్ర కథలు,నాటకాలు ఎన్నో ప్రదర్శించారామె. కస్తూరీబాయి మహిళాసమాజంకి అధ్యక్షురాలిగా హిందీ క్లాసులు,కుట్టు,సంగీతం కూరగాయల తోటపెంపకం, పేద విద్యార్థినుల కు చదువు,వివాహాలు చేయడం ,చర్లసుశీలవృద్ధాశ్రమం బొబ్బర్లంకలో,ఇంకా అనేక రకాల సమాజకార్యకలాపాలు చేసి అందరిమెప్పు పొందారు.విశాఖ లో విశ్రాంతి ఓల్డ్ ఏజ్ హోంను1999లో నెలకొల్పారు.విదుల సాహిత్యంలో కూడా అందెవేసిన చేయి.తీరంచేరిననావ,మురళీకృష్ణ మొదలైన నవలలు రాశారు.బ్రహ్మసూత్రాలు,ఉపనిషత్తులపై వ్యాసాలు,హిందీలో పొడుపు కథలు,ఇంకా తెలుగులో వచనకవితలు రాసి తన కలం బలంని చూపారు.2024లో కాలం చేసినా ఆమె చిరంజీవి.

చర్ల మృదుల అక్కతో కల్సి సమాజసేవ చేశారు.ఇప్పటికీ చేస్తున్నారు.ఆఖరి కూతురుగా అమ్మ నాన్నల మాటలు వింటూ అక్క పథం లో ఆమె అడుగులో అడుగేస్తూ నేటికీ సేవ చేయటం గొప్ప విషయం.

ఈపిల్లలు బాల్యంలో బడికెళ్లలేదు.తండ్రిదగ్గరేతెలుగు సంస్కృతం,హిందీ నేర్చుకున్నారు.అక్కలాగా ఈమెకూడా అవివాహితగా ఉండిపోయింది.మృదుల బి.ఇడి చేశారు.బి.ఎ.ఎం.ఏ.కూడా ప్రైవేట్ చదివిన ఆమె హిందీలో పి.హెచ్.డి.చేశారు.విశాఖ ఎ.ఎన్.రాజాకాలేజీలో15ఏళ్లు వి.ఎం.సి.విద్యాపీఠ్ లో లెక్చెరర్గా,రెడ్ క్రాస్ లేడీ గైడ్ కెప్టెన్ గా పనిచేసి2002 లో రిటైరైనారు.ఇకనాటకాలు బుర్ర కథలు అన్నిరకాల ప్రోగ్రాంలలో అక్కతో కల్సి ఇచ్చారు.మనం సంపాదించిన దానిలో కొంత దానం చేయాలని ఈమె అభిప్రాయం.తండ్రి చర్లగణపతిశాస్త్రి నెలకొల్పిన కస్తూరీబాయి మహిళాసమాజం(1950) అభ్యున్నతి కై చేసిన సేవ లు చెప్పుకోదగ్గవి. ఇక వీరు చేసిన సేవాకార్యక్రమాలు …పాతపట్టిశంలో నిత్యాన్నదానం ఏర్పాటు,చర్లసుశీల వృద్ధాశ్రమం,లయన్స్ క్లబ్ ఆఫ్ తిమ్మరాజుపాలెంలో చేసిన కృషి తో అందరిప్రశంసలు అందుకున్నారు.గాంధీజీ మనవరాళ్లు తారాగాంధీని,ఉషాగోకాని కలవటం మధుర స్మృతిఅంటారామె.మృదుల సాహిత్య సేవ నిరుపమానం. హిందీలో డాక్టరేట్ చేసిన మృదుల పద్యాలు,కథలు వ్యాసాలు రాశారు.తండ్రి పెట్టిన ప్రింటింగ్ ప్రెస్ బాధ్యతలు అక్కతో కల్సి నిర్వహించారు.జాతీయ అంతర్జాతీయ అవార్డులు రివార్డులు రాలేదు కానీ 25పైగా సంస్థలు వీరిని సన్మానించాయి. ఆత్మ తృప్తి దీనజనోద్ధరణ,ఖద్ధరువస్త్రధారణ వినోబాసర్వోదయ పాదయాత్ర లో పాల్గొనడం,తండ్రి 5ఎకరాలభూమిని దానంచేయటం ..తమ జీవితంలో మరువలేని మరపురాని మధుర ఘట్టాలు అంటారు మృదుల. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అనేది వీరి లక్ష్యం.ఈదంపతులు తణుకులో ఉంటారు.contact no.8688320173

సగుణోపాసనలో తరిస్తున్న మృదుల గారు వందేళ్లు ఆరోగ్యంగా ఉండి నేటి తరానికి వెలుగుదివ్వెకావాలని ఆశిద్దాం.

ఈ ఆర్టికల్ ను అందరూ చదవవలసిన అవసరం ఉంది, ఈ కాలం లో ఇటువంటి గొప్ప విలువలతో నడిచిన మంచి మనుషుల గురించి మళ్లీ మళ్లీ తెలుసు కోవడం చాలా ముఖ్యం. నిజమైన దేశ భక్తుల జీవితాలు గుర్తింపు నోచుకోవు అని ఇలాంటి వాళ్ళను చూస్తే తెలుస్తుంది.

( ఈరచనకు పూర్తి సహకార మందించిన తణుకు జర్నలిస్ట్ శ్రీ కానూరి బదరీనాథ్ గారికి,ఆయన శ్రీమతి రమామురళి రాజేశ్వరి గారికి ధన్యవాదాలు…..- రచయిత)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రాణిక్ హీలింగ్ లో నేర్పరి రమాదేవి తెలిపిన విశేషాలు తెలుసుకుందాం!

పిప్పలాద మహర్షి చరితము