ఒడిపిళ్ళు 17వ భాగం

అతనికి తప్పించుకోవడానికి వీల్లేదు. సాక్ష్యాధారాలతో పట్టుబడ్డాడు. దీనంగా దయ చూపమని ఆశించడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. అతడు న్యాయ విరుద్ధంగా చట్ట వ్యతిరేక పనిని చేశాడు కాబట్టి శిక్ష అనుభవించవలసిందే అనుకున్నాడు.

ఎక్సైజ్ అధికారులు కుండలను, సారా డ్రమ్ములను భూక్యా భుజాలపై మోస్తూ రమ్మని చెప్పి ఊరిలోకి దారి తీశారు. అక్కడ నాట్యం మొదలైంది. చాలా మంది యువతులు ఒక రకమైన మత్తులో ఉన్నట్టు నాట్యం చేస్తున్నారు. అందులో ఒక్కరిద్దరికీ గిరిజన దేవతాగణాలు పూనారు. వారు చేసే వికార చేష్టలను మిగిలిన గిరిజనులు భక్తిగా వారి పద్ధతిలో చూస్తున్నారు. అయితే ఎక్సైజ్ అధికారులు గ్రామంలో ప్రవేశించగానే, గిరిజనులపై పూనిన దేవతలు వదిలిపోయారు. నాట్యం చేసే వారు, వాయిద్యాలు మోగించే వారు చిందరవందరగా వదిలి వారి గుడిసెల్లోకి పారిపోయారు. నిమిషాల్లోనే ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. భయం గొలిపే సాల్టు అంటే ఉప్పుఅధికారులు, ఆప్కారి శాఖ అధికారులు తనిఖీ కోసం వచ్చారు.

చట్టవిరుద్ధమైన దొంగ సారాయి కాచే వారి కోసం ఊరిలోని అన్ని గుడిసెలను దగ్గరలో ఉన్న పొలాలను జాగ్రత్తగా వెతికారు. గ్రామంలో ప్రతి గుడిసెలకు వెళ్లి సారా బట్టీలు ఉన్నాయేమో అని శోధించారు. గుడిసెల చూరుల కింద గోడల నడుమ పెరటి తోటల్లో వెతుకుతూ ఉండగా, గ్రామస్తులంతా వినయంగా తలలు వంచుకుని ఉన్నారు. ఒక్కరు ఒక్క మాట మాట్లాడలేదు. చాలా బట్టీలు కనుగొనబడ్డాయి. అందులో కొన్ని చాలా రోజులుగా ఉపయోగించనివి, కొన్ని ఇంకా వేడిగా ఉన్నాయి. కొన్ని కాళీ డబ్బాలు, కిరోసిన్ డబ్బాలు, పగిలిన సీసాలు సారా వాసనతో ఉన్నాయి. ఈ వస్తువులన్నింటిని ఆధీనం చేసుకొని చాలా వివరంగా పరిశోధనాంశాలను నమోదు చేసుకున్నారు అధికారులు దృడమైన సాక్షాధారాలతో. అధికారులు కుండలను వాసన చూస్తూ పరీక్షించి చల్లారిన పొయ్యిలో నుండి బూడిదను కూడా సేకరించారు. తరువాత కోర్టులో వాటిని సాక్షాధారాలుగా ప్రవేశపెట్టడానికి.

అధికారులు నిందితుల నుండి వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. వారు చెప్పినట్టుగా ఏమి నమోదు చేసుకోలేదు. నిందితులు తమ అంగీకారాన్ని సుదీర్ఘంగా తప్పు చేసినట్టు ఒప్పుకొన్నారు. అధికారులు చెప్పినట్లు వారు చూపించిన చోట వేలిముద్రలను వేశారు. వారు నమోదు చేసినదంతా చదివి వివరించ వలసి ఉన్నది. కానీ కొందరికి మాత్రమే ఏమి జరగబోతోందో అర్థమైంది. వారు అధికారులు చెప్పినట్లు వేలిముద్రలను వేశారు. ఎక్సైజ్ అధికారులు చాలా తృప్తిగా తమ అధికారాన్ని ప్రదర్శించి, బలాన్నినొక్కిచెప్తూ నిరూపించారు.

ఆరోజు రాత్రి ఆ గ్రామానికి సంతాప దినం. ఎవరో ఆ ఊర్లోనే వ్యక్తే అధికారులకు సమాచారాన్ని ఇచ్చి తనిఖీకి వచ్చేలా చేసారు. అందుకు నిస్సహాయంగా కోపంతో ఊగి పోయారు వారు. చాలామంది వ్యక్తులపై అనుమానంతో వారిని కఠినమైన పరుషమైన మాటలతో ఒకరినొకరు పెద్ద పెద్దగా తిట్టుకున్నారు. శాపనార్థాలు పెట్టుకున్నారు. అంతటితో పంటల పండుగ అయిపోయింది.

*** *** *** *** ***

భూక్యా మిగిలిన తన తోటివారితో న్యాయమూర్తి ముందు హాజరయ్యాడు. న్యాయమూర్తి నిందితునిగా సంబోధిస్తూ “బోనులో ఉన్న నిందితుడా.. భూక్యా.. నీవు చట్టవ్యతిరేకంగా ఫలానా తేదీన ఫలానా చోట నీవు అక్రమంగా సారాయిని వండుతుండగా పట్టుబడ్డావు. ఫలానా చట్టప్రకారం, ఫలానా శిక్షణ ప్రకారం అక్రమంగా సారాయిని వండడాన్ని అమ్మడాన్ని నేరం అంటారని నీకు తెలుసా? పై కారణాల వల్ల ఫలానా చట్టంలోని ఫలానా సెక్షన్ ప్రకారం నీవు దోషివి. నీకు శిక్ష విధించబడుతుంది అని తెలుసా ” అని అడిగాడు.

భూకూ మూగ కళ్ళతో న్యాయమూర్తి వైపు చూడడం మొదలు పెట్టాడు. వారు తన నుండి ఏమి సమాధానం ఆశిస్తున్నారో అతనికి తెలుసు. దానిని వారంతా కంఠస్తం చేశారు.

అతడు యాంత్రికంగా “ఘనమైన ప్రభువా నేను నేరస్తుడిని” అన్నాడు. ఆ విధంగా విచారణ తంతు కొనసాగింది చివరికి న్యాయమూర్తి తన తీర్పును వెలువరించాడు.

” నీవు చెప్పిన అపరాధ భావనతో కూడిన నేర అంగీకారాన్ని నేను విన్నాను. ఫలానా యాక్ట్ ప్రకారం, ఫలానా సెక్షన్ కింద ఫలానా నేరం కింద తీర్పు చెప్తున్నాను. ఏబది రూపాయల జరిమానా చెల్లించవలసి ఉన్నది. లేని పక్షంలో పదిహేను రోజుల కఠినమైన కారాగారం శిక్ష విధించబడుతుంది” అని ముగించాడు.

ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చి భూక్యాని తీసుకొని వెళ్ళాడు. అతని స్థానంలో మరొక నిందితుడు వచ్చాడు. ఈ విధంగా విచారణ కొనసాగింది రోజంతా. కోర్టు ముగిసే సమయం వచ్చింది. న్యాయమూర్తి తొందర తొందరలో ఉన్నాడు.

భూక్యా తన వద్ద జరిమానా చెల్లించడానికి డబ్బు లేదని చెప్తే వినే వారు ఎవరు లేరు. అతడు కోర్టు గది బయట వరండాలో తల వంచుకుని కూర్చుని ఉన్నాడు. అది సంధ్యా సమయం చీకట్లు అలుముకుంటున్నాయి. కోర్టులో లాంతర్లు వెలిగించి పెడుతున్నారు. కోర్టు ఆవరణ ముందు దూరంగా విశాలమైన పొలాలు పంటకోత తర్వాత జీవం లేకుండా కనిపిస్తున్నాయి. అవి తన పొలాలు కావు. కానీ వాటిని చూస్తుంటే అతనికి విచారంగా అనిపించింది. మొదటి చుక్క పొడిచింది. చిన్న పొరపాటు వల్ల అక్కడే ఉండాల్సి వచ్చింది తనకు. జనాలు వస్తున్నారు పోతున్నారు కానీ అతని వైపు ఎవరు చూడను కూడా లేదు.

భూక్యా జరిమానా చెల్లించడానికి సమయం కావాలని అభ్యర్థన పెట్టాడు. కొందరు అతనికి జమానతు నామాకు మద్దతు ఇవ్వడంతో, అతనిని ఇంటికి వెళ్ళనిచ్చారు. అతడు చీకటిలో కొండ మార్గాల గుండా తన గ్రామం వైపు బయలుదేరాడు. పాత దారిలో అప్రయత్నంగానే పెద్దపెద్ద అడుగులు వేస్తూ ఒక చిరుత వలెనడుస్తున్నాడు. బయటికి చూడటానికి భూక్యా ఎప్పటి వలెనే ఉన్నాడు. తల పైకెత్తి శక్తివంతమైన చాతిని విశాలంగా ముందుకు చాపి. ఎండకు వాడిన ఒక సాల్ వృక్షం వలె. కానీ లోపల వృక్ష సారము వాడినప్పటికీ జరిగిన నష్టం బయటికి కనపడకుండా ఉన్నాడు. అతని కళ్ళలోకి చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది విషయం.

భవిష్యత్తు ఆశలన్ని ఇంకిపోయాయి, అతనిని అరెస్టు చేసినప్పటి నుండి

అతనికి కమ్లీ ఒక్కసారి కూడా జ్ఞాపకం రాలేదు. అతడు మనో ఘాతానికిలోనై గురయ్యాడు. విచారము లేదు బాధ లేదు. అతనిపై ఏ ప్రభావము లేనట్టుగా ఉన్నాడు. ఇప్పుడు తిరిగి తన గుడిసెకు చేరుతున్నాడు. వసంతోత్సవంలో వేటగాడు వెంటపడుతున్న చిన్న జింక, తన ప్రాణం కోసం పరిగెత్తుతూ అరుస్తూన్నట్టు తనను ఊహించుకుంటూ.

“చంపండి చంపండి, దాన్ని పోనివ్వకండి,

జరిమానా చెల్లించు. లేదంటే జైలు… కాల్చేయండి చంపండి” అంటూ ఎవరో తరుముతున్నట్టు, భయంతో భ్రమలో పరిగెత్తడం మొదలు పెట్టాడు భూక్యా.

*** *** *** ***

జరిగిన దాడి గురించి విచారణ గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడడం లేదు. గ్రామస్తులంతా భూక్యాను  చిత్రంగా చూస్తున్నారు. గ్రామ పెద్దలంతా సోమ్లా ఇంటికి వచ్చారు. చాలాసేపు ఉద్వేగపూరితమైన సుదీర్ఘ సంభాషణలు జరిగాయి. భూక్యా అందులో పాల్గొనలేదు. మిగిలిన వారు ఎవరైనా తనతో మాట్లాడినప్పుడు, ఇతర విషయాలు మాత్రమే మాట్లాడేవాడు. అది కూడా చాలా తక్కువగా. అతడు అందరినీ తప్పించుకొని, వీలైనంతవరకూ ఇంటి నుండి బయటకు రాకుండా ఉండే వాడు.

నిజానికి కి అతడు సిగ్గు పడవలసిన విషయం ఏమీ లేదు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ విషయంలో ఏదో ఒకరకంగా భాగస్వాములే. మిగిలిన చాలా మంది వలె అతడు కూడా దోషి. వారు కూడా జరిమానా చెల్లించ నట్లైతే జైలుకు పోవాల్సిందే. ఆ దురదృష్ట సంఘటన గ్రామస్తులను అందరినీ ఒక్క దగ్గరికి చేర్చింది.

ఏ ఒక్కరూ నవ్వడం లేదు ప్రతి ఒక్కరూ లోగొంతుకలతో మాట్లాడుతున్నారు. స్త్రీలంతా నీటి కోసం చెరువు వద్దకు పోయినప్పుడు, ఆ విపత్తు గురించి గుసగుసగా మాట్లాడుతున్నారు. తమ కొడుకులకు భర్తలకు తెలియకుండా.

అది సోమ్లా, టీక్యా షావుకారు వద్దకు తిరిగి వెళ్ళ వలసిన సమయం అది. కానీ సోమ్లాకి అది సాధ్యపడలేదు. అతని పెద్ద కొడుకు ఆపదలో ఉన్నాడు. టిక్యా ఒక్కడే తిరిగి వెళ్ళాడు. సోమ్లా ఊరిలోనే ఉండిపోయాడు కొత్త దుఃఖంతో మౌనంగా ఉన్నాడు. కొండ ప్రాంతంలో అది ఒక పాపము కాదు, అధర్మం కాదు.

*** *** *** ***

Written by Jwalitha

కవి, రచయిత, అనువాదకురాలు, ఫ్యామిలీ కౌన్సిలర్, సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త, ప్రకృతి ప్రేమికురాలు, తెలంగాణ ఉద్యమ కారిణి అయిన జ్వలిత అసలు పేరు విజయకుమారి దెంచనాల.
‘బహళ’ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక మహిళా పత్రికను 2021నుండి నడుపుతున్నారు.
వీరి రచనలు-
కాలాన్ని జయిస్తూ నేను, సుదీర్ఘ హత్య, అగ్ని లిపి, సంగడి ముంత అనే నాలుగు కవితా సంపుటులు; ఆత్మాన్వేషణ, రూపాంతరం అనే రెండు కథల సంపుటులు; జ్వలితార్ణవాలు అనే సాహిత్య సామాజిక వ్యాసాల పుస్తకం; ఎర్రరంగు బురద, ఆత్మార్ణవం, జగన్నాటకం, ఒడిపిళ్ళు అనే నాలుగు నవలలు మొత్తం 11 పుస్తకాలు రచించారు. ముజహర్ నగర్ లో దీపావళి, ‘పరజ’ వంటి అనువాదాలతోపాటు, బహుజన కథయిత్రుల పరిచయం, మెరిసే అనువాదాలు, అనువాద నవలలు పేరుతో శీర్షికలను నిర్వహించారు.
స్వీయ సంపాదకత్వంలో ఖమ్మం కథలు, మల్లెసాల చేతివృత్తికథలు, కొత్తచూపు స్త్రీల కథలు, పరివ్యాప్త, సంఘటిత, రుంజ, కరోనా డైరీ, లేఖావలోకనం, గల్పికా తరువు, ఓరు వంటి పదో సంకలనాలను ప్రచురించారు. గాయాలే గేయాలై, పూలసింగిడి వంటి అనేక పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు.
మర్డర్ ప్రొలాంగేర్, వుండెడ్ లైవ్స్ పేరుతో వీరి కవిత్వం ఆంగ్లానువాద పుస్తకాలు వెలువడ్డాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని -65 వ భాగం

ఓం నమశ్శివాయ!