సాలీ తన గుడిసెలో ఒక మూలకు పడుకొని ఉన్నది , తనకి జరిగిన అవమానాన్ని అవహేళనను మర్చిపోయేందుకు ప్రయత్నిస్తూ. తన మొదటి ప్రేమ ఒక కోయిల పాట వలె వచ్చింది. ప్రశాంతమైన నిశ్శబ్ద ఉదయాన, మంచుఖడ్గ ఘాతం వంటి తన అనుభవం నుండి కోలుకునే సరికి ప్రపంచమంతా ఒక్కసారిగా వెలుగుతున్న జ్ఞానంలా అనిపించింది. ఆమె సగం నిద్ర సగం మెలుకువ స్థితిలో ఉండి తనను తాను విస్మరించి ఉన్నది .
మొదటి ప్రేమ కోకిల పాట వంటిది మృదువైన సన్నని తీగ తనకు తాను వేరే చెట్టుకు చుట్టుకున్నట్టు, తన బలహీనతకు తానే గర్విస్తున్నట్టు అనిపించింది. ఒక సన్నని సెలయేరు తన సొంత అగాధ శబ్దంతో నిండిపోయినట్టు, ఒక నది అడవిలో పరస్పర విరుద్ధమైన ఆవేశాలతో నష్టపోతున్నట్టు, కొన్ని వస్తువులను ఆకర్షణలో విలువలను పాటించలేక సర్దుకుపోతూ లాభనష్టాల కొలమానాలను ఏర్పాటు చేసుకోవటంలో, కోకిల పాట వెనుకబడి పోయింది.
కాంతి రహితమైన గోధుమ రంగు దారులు కాళ్ల కింద అంతం లేకుండా సాగి పోయాయి. ఉన్నట్టుండి చీకటి వ్యాపించి అన్నింటిని తనలో కలుపుకుంటూ రాత్రి వచ్చింది.
ఆ నల్లటి చీకటి వేరు వేరు వ్యక్తులకు వేర్వేరు రకాలుగా కనిపించింది. కానీ వాటిలో ప్రత్యేకమైన విశేషమేమీ లేదు. మిగిలినదంతా యాంత్రికంగా జీవం లేకుండా, కొండల పక్కన ఎడతెగకుండా రాళ్లు పడుతూన్నట్టు అనుభూతి రహితంగా ఉన్నది.
సాలీ జీవితంలోకి చీకటి వచ్చింది. ఎక్కడో ఆమె లోపలి తలుపు ధడాలున
మూసుకున్నది. సున్నితమైన పూలతీగ గరుకుగా కఠినంగా మారింది. మొదటి ప్రేమ అనబడే మాయ ఇప్పుడామెకు గతం మాత్రమే.
తనకు తాను సాలీ సున్నితత్వాన్ని సమాధి చేసుకొన్నది ప్రయత్నపూర్వకంగా. ఇప్పుడామె ఒక దృఢ నిశ్చయానికి వచ్చింది. ఆ క్షణం నుండి హేమ్లా అంటే తనకు ఏ సంబంధం లేదు. కానీ తన చుట్టూ విలాసవంతంగా వసంతం చిందులు వేస్తూ తనను వెక్కిరించినట్టు అనిపించింది.
చీకట్లో ఆమె తడుముకుంటూ హేమ్లా తనకిచ్చిన చిన్న చిన్న బహుమతులను వెతికింది. చౌకబారు పూసల నెక్లెస్, పండ్లు ఇరిగి పోయిన చిన్న ఎర్రటి దువ్వెన, తన అందాన్ని మెచ్చుకుంటూ ఇచ్చిన చిన్న అద్దం, ఒక సబ్బు ముక్క. వాటిని ఉద్దేశపూర్వకంగా కసిగా పిండి పిండిగా చేసింది, పిండి దంచే రాయితో. ఆ తర్వాత వాటిని మండుతున్న నిప్పులలో వేసింది.
ఆమె ఇప్పుడు పొయ్యి ముందు కూర్చుని తన కుటుంబం కోసం మధ్యాహ్నం వంట తయారు చేస్తోంది. కానీ తన కన్నీరు ఆగడం లేదు. వంట పూర్తి కాకముందే పొయ్యి చల్లారింది. ఆమె నిశ్చేష్టగా విచారంగా కూర్చున్నది. ఆమె ఏమి చేస్తున్నదో ఆమెకే తెలియడం లేదు.
సోమ్లా వచ్చి ఆమె భుజంపై నెమ్మదిగా చేయి వేసి “ఏడుస్తున్నావా బిడ్డా” అని అడిగాడు.
ఆమె తన తండ్రి పై పడి వెక్కి వెక్కి ఏడ్చింది. రాత్రంతా తండ్రీ బిడ్డలు ఏడుస్తూనే ఉన్నారు, వారి గుడిసెలో.
బయట కొండ జాతి గిరిజనులు
“రా ప్రేయసి రా “అంటూ పాటలు పాడుతున్నారు. ఉద్రేకంతో తాపంతో నాట్యాలు నడుస్తున్నాయి. కానీ సాలీ అక్కడ లేదు.
*** *** *** *** ***
భూక్యా నిద్ర లేచేసరికి ఆరోజు ఏదో ముఖ్యమైన సంఘటన జరగబోతుందని ఒక హెచ్చరికను గమనించాడు.
ఆరోజు ఉదయం చాలా ప్రకాశవంతంగా ఆశ గొలుపుతోంది. ఇంకా చాలామంది నిద్రలోనే ఉన్నారు. వారి ఇళ్ళ తలుపులు ఇంకా మూసే ఉన్నాయి. నేలంతా చెట్ల నుండి రాలిన ఆకులతో, మద్యం తాగిన కప్పులతో నిండి ఉన్నది. ప్రతి ఇంటి ముందు మామిడి పండ్లు తినగా మిగిలిన పిక్కలు కుప్పలుగా పడి ఉన్నాయి. మనుషుల శరీరాలపై రుద్దుకున్న పసుపు ముద్దలు అక్కడక్కడా రాలిపడి ఉన్నాయి. చుట్టూ కుప్పలుగా పేర్చిన
పనికిరాని చెత్త కనపడుతున్నది. వాటినుండి వచ్చే పాచి వాసన గాలిలో తేలుతూ ఇళ్ళలోకి కూడా వస్తూన్నది.
కమ్లీ గురించి ఆలోచిస్తూ అతడు నిద్రపోయే ముందు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇక ఏమాత్రం సమయాన్ని వృధా చేయకూడదని, ఎట్టి పరిస్థితుల్లో తన ఇంటికి కమ్లీని తీసుకు రావాలని అనుకున్నాడు. తన సెలవుదినాల్లో ఒకరోజు గడిచిపోయింది. ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాలం వేగంగా పరిగెడుతోంది.
ఒక రెండు ముఖ్యమైన పనులలో ఒకదాన్ని తొందరగా తేల్చుకోవలసి ఉన్నది. కమ్లీని బలవంతంగా ఎత్తుకు రావడం, లేదా తన తండ్రి తన పెళ్ళికి కావలసిన డబ్బును అప్పుగా షావుకారు నుండి తేవడం. తరువాత భూక్యా గోటీగా మారాలి అప్పు తీరే అంత వరకు, అంటే కన్యాశుల్కంతో సహా అప్పు చెల్లించాలి అనుకున్నాడు.
భూక్యా తనలో తాను కూనిరాగం తీసుకుంటూ నదీ ప్రవాహం వైపు స్నానానికి బయలు దేరాడు. అతడు తన పెండ్లిలో పూజారికి ఇవ్వాల్సిన డబ్బు గురించి, వాయిద్యాల వారికి అద్దె చెల్లించడానికి లెక్కలువేస్తూ ఆలోచిస్తున్నాడు. అదేవిధంగా పెళ్లి విందు కూడా ఉంటుంది, భూక్యా చాలా పొదుపుగా అన్నీ తగ్గించి లెక్కలు వేసుకున్నాడు. అప్పటికప్పుడు పాట పాడడం మొదలు పెట్టాడు.
“కమ్లీ ఓ నా కమ్లీ
సారియా వాళ్ళ ఇంటిదగ్గర
నీకోసం ప్రేమగా పాటలు పడతాను
సుంది వాళ్ల ఇంటి వరండా దగ్గరికి
రావోయి నా చిన్నదానా
నీవెంత యవ్వనవతివో నన్ను చూడనివ్వు”
అంటూ పాటపాడుతూ నది గట్టు పైకి ఎక్కుతన్న భూక్యా, నీటికోసం తన కుండతో నది వైపు కిందకి దిగుతున్న కమ్లీని చూశాడు.
అతడిని చూసి ఆమె ఆగింది.
“కమ్లీ” అంటూ అతను పిలిచాడు.
“చెప్పు భూక్యా ” అన్నదామె.
“నాతో వేటకు వస్తావా” అని అడిగాడు,
“ఏంటీ, నేనా” అంటూ తప్పించుకో చూస్తూ కపటంగా కన్ను చివరల నుంచి చూసి నవ్వింది.
“అవును” అంటూ భూక్యా ఆమె వైపు అడుగులు వేసాడు .ఆమె తొందరగా నది తీరం వైపు పరిగెత్తింది. అతడు పట్టుకోవాలి అనుకున్నాడు ఆమె తప్పించుకుంది. అతడు ఆమె వెంట నడవడం మొదలుపెట్టాడు ఈల వేస్తూ. ఆగి చుట్టూ చూశాడు కానీ ఎక్కడా ఆమె కనపడలేదు. భూక్యా అయోమయంలో పడ్డాడు. వెనుకకు తిరిగి మళ్లీ నది గట్టు పైకి ఎక్కాడు. ఇప్పుడు తన తోటివారితో నది వైపు నడుస్తూ కనపడింది కమ్లీ. మసక చీకటి గానే ఉంది నదీ ప్రాంతమంతా, అడివి అంతా అప్పుడే సూర్యకిరణాలు వ్యాపించడం మొదలు పెట్టాయి.
భూక్యా అమ్మాయిల వైపు అడుగులు వేస్తూ, దాదాపుగా పరిగెత్తినట్టుగా ఒంపులోకి అడుగులు వేశాడు. కొండ పైనుంచి బొట్లుగా పడుతున్న నీళ్ళు గర్జిస్తున్నట్టు అతనికి వినపడ్డాయి. ఒక్కసారిగా కమ్లీ వైపు దుమికాడు భూక్యా. అతను రెండు చేతులతో ఆమెని చుట్టేశాడు. ఆమె శ్వాస అతని చెవులకు వేడిగా తగులుతుంది. కమ్లీ చెంపలు ఎరుపెక్కాయి, ఆమె శరీరం ఒక్కసారిగా జలదరించింది సిగ్గుతో. ఆమె విడిపించుకోడానికి విపరీతంగా పెనుగులాడింది.
“భూక్యా నన్ను వెళ్ళనివ్వు” అడిగింది ఆమె.
భూక్యా వదిలేశాడు. కానీ ఆమె వెనకే నడుస్తూ, అరుస్తూ మళ్ళీ ఆమెను పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని ముఖమంతా ఆలోచన రహితంగా తీవ్రమైన కోరికతో ఉన్నది.
“ఇంక నేను ఏ మాత్రం ఆగలేను కమ్లీ” అన్నాడు దృఢంగా.
“రా మనిద్దరం పారిపోయి పెళ్లి చేసుకుందాం” అన్నాడు.
కానీ ఆమె దిక్కారంగా తల ఎగరేస్తూ అడ్డంగా ఊపింది. వెనుకకు తిరిగి విడిపోయిన తన జడను సరిచేసుకుంటూ, చాలా స్పష్టంగా సమాధానం చెప్పింది. దానితో అతని కోరిక చల్లారిపోయింది.
అతను నిశ్శబ్దంగా వెనుకకు తిరిగి ఊరి వైపు వెళ్ళిపోయాడు. అతని వెనకే కజోడి నడిచింది. ఒక్కసారిగా ఆమె కళ్ళలో నీళ్లు నిండాయి.
భూక్యా ఆమె జీవితంలో మొదటి ప్రేమికుడు. అతనితో ఆమెకు నిశ్చితార్థం కూడా అయ్యింది. కానీ హేమ్లా వైపు ఆమె మనసూగింది. ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకోవడం చాలా సులువు. హేమ్లా అప్పులు లేకుండా స్వేచ్ఛగా ఉన్నాడు. భూక్యా రుణగ్రస్త బానిస. హేమ్లాకు ఆనందంగా చొరవగా స్త్రీలను పొగుడతూ వారి మనసులను గెలిచుకోవడం బాగా తెలుసు. కానీ భూక్యా విషయం అట్లా కాదు, ఎప్పుడో ఒకసారి అతని కళ్ళలో కోరిక కనిపిస్తుంది.
ఇప్పటికీ పాతజ్ఞాపకాలు ఆమె కళ్ళల్లో కన్నీరు పెట్టిస్తూ బాధకొనసాగింది. కానీ ఆమె వాటిని తుడిచెయ్యాలని సంకల్పించింది. భూక్యా తన మనసులో ఒక మూలకు జరిగి పోయాడు.
కమ్లీ తన చేతిలో కుండను నీటితో నింపుకొని ఇంటి దారి పట్టింది
*** *** *** *** *** ***
భూక్యా మనసు కమ్లీ తిరస్కారంతో అవమాన భారంతో బరువెక్కింది. కానీ ఎప్పుడైతే మధ్యాహ్నం మళ్లీ వాయిద్యాలు మోగుతూ వేటకు పోదాం రమ్మని అందరినీ పిలిచారో, అతడు మళ్ళీ తనను తాను యోగ్యునిగా భావించుకున్నాడు. తిరస్కారం వలన కలిగిన బాధ కొంత తగ్గింది.
మొదటిరోజు వేటలో పురుషులంతా పూర్తిగా విఫలం అయ్యారు. ఇప్పుడు స్త్రీలు వారికి వేటాడడం ఎలాగో సలహాలు ఇస్తారు. మైదానంలో డప్పుల మోత పెరగడంతో స్త్రీలు ఆనందంతో పసుపు రాసుకుని పూలు పెట్టుకొని మంత్రాలతో నవ్వుతూ ఉత్సాహంగా బయలుదేరారు.
అడవిలోకి ప్రవేశించేముందు అందరూ సమూహాలుగా విడిపోయారు. దట్టమైన అడవిలో ఈ గుంపులు విడివిడిగా వేరు వేరు ప్రాంతాలకు యువ దంపతులతో సంచరించడానికి వేరువేరు దిక్కులకు వెళ్లారు. అది మార్చి నెల. దాదాపు చెట్లన్నీ ఆకులు రాల్చి బోడిగా ఉన్నాయి. చిరుపొదలు మాత్రం అడవి జంతువులకు దాచుకోవడానికి వీలుగా ఉన్నాయి. వేటగాళ్ళు సులువుగా భయం లేకుండా అడవిలో ముందుకు సాగారు. అడివంతా వీరి అరుపులతో తన శాంతిని కోల్పోయింది.
అడివంతా వాయిద్యాలతో శబ్దాలతో ఈలలతో అరుపులతో సజీవంగా మారింది. వారంతా తాగి నిర్లక్ష్యంగా ఉన్నారు. పురుషులు మాహువా పూల (ఇప్పపూల)సారాయి తాగారు. ఆడవారు లెక్కలేనంత ఘాటైన మాండ్యా (రాగుల) బీరును లేదా లందాను సేవించారు. మాండ్యా బీరు కొంత బలాన్ని కలిగిస్తుంది. వారు ఒకరికొకరు పువ్వులతో కప్పుకొన్నారు. యువకులు యువతులను వారి కోరిక మేరకు విసుగు లేకుండా వీపుల మీద, భుజాలమీద , మెడల మీద మోస్తున్నారు, ముసిముసి నవ్వులు నవ్వుతూ దట్టమైన అడవుల్లో. కొన్ని చోట్ల వారిని ఎండుటాకుల పైన దొర్లిస్తున్నారు. అక్కడ ఎటువంటి నిబంధనలు లేవు. వసంతోత్సవం సందర్భంగా జీవితం కొత్తగా పునరుద్ధరించ బడుతుంది దానికదే. అన్నింటినీ త్యజించి పాత బంధాలకు స్వస్తి పలికి చెట్ల నీడలో కొత్త బంధాలు ఏర్పడుతున్నాయి. ఆమోదించలేని చూపులున్న పవిత్ర సమాజాన్ని మిలియన్ల మైళ్ళ దూరంలో వదిలి.
టిక్యా ఒక ఇరుకైన కొండ చరియ లోకి ఇద్దరు అమ్మాయిలతో కలిసి పాకుతూ పోయాడు. ఒక్కరొక్కరు దాచుకుంటూ మిగిలిన బృందాలకు కనిపించకుండా ముందుకుసాగారు. కానీ ఇప్పుడు టీక్యాకు ఒక ఇబ్బంది ఎదురయ్యంది. ఇద్దరమ్మాయిలతో కలిసి పైకి ఎట్లా ఎక్కాలో అర్థం కాలేదు. తీగలతో అల్లుకున్న చెట్టుపైన ఉన్న పక్షి గూట్లోకి చూడడానికి పైకి పాకాడు. ఒక అమ్మాయి జారిపోయింది. తనతో ఉన్న మరో అమ్మాయితో కలిసి ఉసిరి చెట్లు పొదల్లోకి జారి పడ్డాడు. ఎత్తు లేని ఒక కొమ్మ పైకి జారి ఒకరికి ఒకరు పుల్లటి పళ్లను తినిపించుకున్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికి ఇద్దరూ కిందికి దూకి, వారికి కేటాయించిన పని చేయడానికి వాగు నుండి ధారగా పడుతున్న లోయ వైపు వెళ్లారు. అంతటితో వారి వేట ముగిసినట్టు లెక్క.
పెద్ద వాళ్ళు కొందరు వేటకు వచ్చిన వారి సంఖ్య తగ్గినట్లుగా గుర్తించారు.
“మిగిలిన వారెక్కడ” అంటూ, “వేట ప్రారంభానికి ముందు చాలామంది కనిపించారు కదా” అని అడిగారు.
కొందరు నవ్వుతూ “ఒక మనిషి తన కొంగుకి స్త్రీని కట్టుకొని అడవి లోకి వస్తే వేట ఎలా కుదురుతుంది” అన్నారు.
కానీ విచ్చలవిడిగా తిరిగే వారిని వెతకడానికి వెళ్లలేదు. కానీ పొదల వెనుక వారి నవ్వుల శబ్దాన్ని విని ముసిముసిగా నవ్వుకున్నారు. ఆ తర్వాత వేట కోసం అడవిలో తమ తమ స్థానాలకి బయలుదేరారు.
కమ్లీ తనతో పాటు చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నట్టు గుర్తించింది. కానీ కొద్దిసేపు తర్వాత కొందరు విడిపోయి హేమ్లా, భూక్యా, ఫూల్మతి, సారియాఫుల్, కమ్లీ మాత్రమే మిగిలినట్టు గుర్తించింది.
కొండ దిగువన నీటి ప్రవాహం ముందు ఉన్నారు వారు. ఫూల్మతి చురుకుగా రాళ్ళ మీద దుముకుతూ ఆ ప్రవాహాన్ని దాటింది. కమ్లీ మాత్రం సోమరిగా నిలబడి చూస్తోంది. వెంటనే భూక్యా ఆమెను తన చేతుల్లోకి తీసుకొని మోసుకుంటూ కాలువ దాటాడు. ఆమె అతని చేతుల్లో దగ్గరిగా ఒదిగింది. చుట్టూ నీటి ప్రవాహం అలలతో ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నది. హేమ్లొ సగం దూరం దాటిన తర్వాత సారియాఫుల్ అతన్ని వెనుకకు పిలిచింది, తనను మోసుకొని పోవలసిందిగా అడిగింది. అందరూ కాలువ దాటే సమయానికి అమ్మాయిలంతా ఆనందంతో నవ్వుతూ ఉన్నారు. కానీ పురుషులు మాత్రం నిశ్శబ్దంగా ఉన్నారు.
భూక్యా అన్నాడు “హేమ్లా, ఆపై వైపు వెళ్ళు అది అడవి ఎలుగుబంట్లు నడిచే దారి. ఏమైనా కనిపిస్తాయేమో” అని.
“ఎందుకట, నేను వెళ్ళే వరకూ అవి దారి దగ్గర ఆగి, నేను వేటాడడానికి నిలబడి ఉంటాయని, నువ్వు అనుకుంటున్నావా” అని సమాధానం ఇచ్చాడు హేమ్లా.
కొద్ది సమయం తర్వాత కొండపైకి వచ్చారు అందరూ. పక్కనే ఒక వాగు ప్రవహిస్తూన్నది.
ఈసారి హేమ్లా, భూక్యాతో “నువ్వెందుకు పైకి ఎక్క కూడదు. నేను కిందవైపు చూస్తాను” అన్నాడు. ఈసారి ఏ కారణం లేని సలహాలకు సమాధానం చెప్పవలసిన వంతు భూక్యాది.
అక్కడ పనికిరాని చెత్త చెదారం అడవిలో పెరిగి నిటారుగా అడ్డదిడ్డంగా ఉండి చీకటిగా చికాకు కలిగించేలా ఉన్నాయి కొండలు. ఆ పక్కన ఎత్తైన కొండ శిఖరంపై చాలామంది మనుషులు కనిపించారు. వారు డప్పులు కొట్టడం మొదలు పెట్టారు. బొంగురు గొంతులతో గట్టిగా అరుస్తున్నారు. వేటగాళ్లు సమూహంగా దాదాపు కొండవాలుకు చేరుతున్నారు. కుతూహలంతో భూక్యా మరి కొందరు జంతువులు నడిచే దారి పక్కన నిలబడి, ఏవైనా వస్తే వేటకు సిద్ధంగా ఉన్నారు. అక్కడ సమయం ఎక్కువ లేదు నష్టపోవడానికి. వారంతా దారిలో ఎదురుగా దగ్గరదగ్గరగా చారల చారల సాల్ చెట్ల మధ్య కొండలపై ఈనెల వలె నిలబడ్డారు.
“హేమ్లా, ఫూల్మతి నీవు ఇక్కడే వేచి చూడండి, నేను కమ్లీ, సారియాఫుల్ కలిసి ముందుకు పోయి సరయిన స్థలాన్ని వెతుకుతాం” అన్నాడు భూక్యా.
కానీ హేమ్లా అడ్డుకుంటూ “వద్దు అందరం ఒకే చోట కలిసి ఉందాము. ఒకవేళ పులి వచ్చినట్లయితే అమ్మాయిలంతా భయపడి అరుస్తారు” అన్నాడు.
అమ్మాయిలంతా బడాయి వదిలిపెట్టి భయంతో భూక్యా, హేమ్లాలను అల్లుకొని దగ్గరగా నిల్చున్నారు. హేమ్లా మాటలను సమర్థించారు.
ఆ విధంగా భూక్యా ఉపాయం నీరుగారిపోయింది.
వారంతా కలిసి గుంపుగా ఎదురు చూస్తూన్నారు. వంకరలు తిరిగి ఎత్తుగా ఉన్న లోయల పక్కన చెట్ల మధ్య ఖాళీల నుండి మాత్రమే లోయలను చూడడానికి వీలవుతుంది. కొండపక్కన సూటిగా కిందకి పడినట్టు లోతైన లోయల్లో ప్రవహించే జలపాతాల శబ్దం వినపడుతుంది. దూరంగా ఉన్న గ్రామాలు టునుపూర్, కానాపడి, డియాన్సిల్ సులభంగా గుర్తుపట్టేట్టు ఎత్తుగా మామిడి చెట్లతో చుట్టుకొని ఉన్నాయి. వాటికి ఒక వైపు కొండలు ఒక్కసారిగా నిటారుగా పెట్టిన గోడలవలె కొండలు వానికి తాపడం పెట్టినట్టు గుహలతో కూడిన అడివి. రెండు వరుసల నడుమ పెద్ద మైదానం, దారి తప్పినట్టు లోతైన లోయలోకి వ్యాపించి దూరంగా కలిసిపోయిన గుంపులు గుంపులుగా వరి పొలాలతో ‘చంపి’గ్రామం. ప్రక్కన భయంకరమైన ‘పిల్లుల లోయ’. ఒక చివర కొండలతో ముడిపడి అక్కడ ‘ధరమ్ ధూర్’ ఊరి పొలిమేర ఉన్నది.
కమ్లీ తన ఎడమ వైపు గోపురం వలె ఎత్తుగా ఉన్న కొండ వైపు చూసి, “ఇదేమి కొండ” అని అడిగింది.
అది తాబేలు కొండ వెనుక భాగం వలె కనిపిస్తుంది.
“అది ‘పండర్ మాలి’ ” అన్నాడు హేమ్లా.
కానీ భూక్యా దాన్ని వ్యతిరేకిస్తూ. “కాదు కాదు అది ‘బారీగోన్ పర్వతం’ దస్మంతపూర్ దగ్గరలో ఉంటుంది” అంటూ కుతూహలంగా వాదించడం మొదలు పెట్టాడు.
అది అమ్మాయిలకు మంచి వినోదంగా మారింది.
భూక్యాకు కోపం పెరిగింది, ఎందుకంటే? హేమ్లా తనకుతాను మెరుగైన వాడిగా చూపించుకుంటూ, తనను ఎగతాళి చేస్తున్నట్టు అనిపించింది అతనికి. ఆ తర్వాత ఇద్దరు మౌనంగా ఉన్నారు. కానీ అది నిశ్శబ్దంగా రగులుతున్న పిడుగులా ఉంది. కమ్లీ సులువుగానే దానిని పసిగట్టగలిగింది. నీడలు పొడవుగా సాగుతున్నాయి.
ఉన్నట్టుండి వారికి హెచ్చరిక చేస్తున్నట్టు డప్పుల మోత వినపడింది. అడవంతా నిశ్శబ్దంగా ఉంది డప్పుల శబ్దాలు మంద్రంగా, చిన్న గొంతుతో దూరం నుంచి దయ్యాలు మాట్లాడుకున్నట్టు వినిపిస్తుంది. హేమ్లా, భూక్యా ఒకరి ముఖం ఒకరు ఆతృతగా చూసుకున్నారు.
దాదాపు ఒక యాభై గజాల దూరంలో జోడి చెట్టొకటి పొట్టిగా శాకోపశాఖలుగా ఉండి, రెండు కొమ్మలు మాత్రము విస్తరించి ఉన్నాయి. ఒక కొమ్మ తామంత అటువైపు కదిలేందుకు వీలుగా ఉన్నది. కమ్లీ ఒక కొమ్మ పైకి ఎక్కేందుకు హేమ్లా సాయం చేశాడు. కానీ అందరికంటే ముందు భూక్యా ఒక్కసారిగా దుముకుతూ వేరొక కొమ్మ పైకి చేరాడు. మరొకరికి అవకాశం ఇవ్వకుండా.
“మీరు ఆ చెట్టు వైపు వెళ్లి దానిని ఎక్కండి” అంటూ. ఇంకొక జోడి చెట్టును కొద్ది దూరంలో ఉన్న దానిని చూపిస్తూ “టైం లేదు తొందరగా తొందరగా” అంటూ అరిచాడు.
అతని అరుపులు పట్టు పట్టినట్టుగా ఉన్నాయి. హేమ్లా గంభీరంగా తల ఊపాడు. సారియాఫుల్, ఫూల్మతి నిజంగానే భయపడిపోయారు. అప్పుడు వారు బలవంతంగా అతనిని గట్టిగా పట్టుకొని మరోచెట్టు వైపు ఈడ్చుకెళ్ళారు. కమ్లీ ముఖం వైపు చూస్తూ నవ్వాడు హేమ్లా అమ్మాయిలు వైపు వెళుతూ.
కమ్లీ, భూక్యా ఒక చెట్టు మీద ఆకుల మధ్య దాక్కొని కూర్చున్నారు.
“ఇది ఎంత నిశ్శబ్దంగా ఉంది “అంటూ కమ్లీ గుసగుసలాడింది.
భూక్యా ఆమెకు మరింత దగ్గరగా జరిగి, ఒకరి శరీరాలు ఒకరికి తగిలేట్టుగా కూర్చున్నాడు. “భయపడకు, నేను ఇక్కడ ఉన్నాను” అన్నాడతను.
“ఎవరు భయపడుతున్నారు” అని నవ్వింది ఆమె. అతడు ధైర్యం చేసి ఆమె చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నాడు. ఆమె అతనిపై ఒరిగింది. పొడవైన చెట్టు నుండి బరువైన పండ్లతో కలిసి వేలాడుతూ ఉన్నాయి తీగలు. కొండ పక్క ప్రాంతము పక్కటెముకల గతుకుల వలె ముడుతలతో ‘కర్మంగా’ చెట్టు పండ్లలా కనిపిస్తున్నాయి కొండలు. ఒక పాతమామిడి చెట్టు ఎండిన కొమ్మ పై వాలుగా కిందికి వంగిన భాగంలో ఒక నెమలి కూర్చుని కనపడింది.
“దాన్ని కాల్చేయనా? అది చాలా దూరంగా ఉన్నది. కానీ నేను పాక్కుంటూ దగ్గరికి వెళ్తాను ” అన్నాడు భూక్యా.
“వద్దు వద్దు. ఎంత అందమైన పిట్టలు కదా” అన్నది కమ్లీ.
నిశ్శబ్దమైన అడవి వారి మధ్య సామీప్యాన్ని పెంచింది. నలుపు రంగు ఆకాశాన్ని, కొండ వాలులో మండుతూ అస్తమిస్తున్న సూర్యుని. వారిద్దరూ పంచుకున్నారు. నల్లని చీకటితో కూడిన లోయలన్నీ వారికి ఏకాంతంలో లభించాయి. కేవలం ఇద్దరు మనుషులు మాత్రం అక్కడ ఉన్నారు.
ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక కొండఅంచున రాతిపై నల్లటి ఆకారం వేగంగా నడుస్తున్నట్టు కనిపించింది. అది ఒక మనిషి గొడుగు పట్టుకొని నడుస్తున్నట్టు తోచింది. కమ్లీ భయంతో వణికి పోయింది.
“అది అడవి ఎలుగుబంటు” అని భూక్యా చెప్తూ కిందకి దిగడానికి ప్రయత్నించాడు.
కానీ కమ్లీ అతన్ని గట్టిగా పట్టుకుని “వద్దు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళద్దు. నాకు భయమేస్తోంది” అన్నది.
భూక్యా ఆగిపోయాడు. ఆమెను దగ్గరగా పట్టుకొని “నిన్ను నేను వదిలిపెట్టను. భయపడకు” అంటూ ఊరట నిచ్చే గొంతుతో అతని ప్రేమను చెప్పేందుకు ప్రయత్నించాడు గుసగుసగా. ఆ రోజు ఆమె అతడిని కాలితో తన్ని తిరస్కరించినందుకు. ఆ తరువాత రోజు రాత్రంతా, ఏ విధంగా గడిపింది అన్నీ చెప్పాలనుకున్నాడు అతడు. కానీ ఏదైతే చెప్పాలనుకున్నాడో అది అతని మనసులో మూసుకుపోయింది. అయినప్పటికీ ఆ క్షణం అతని జ్ఞాపకాలను పంచుకున్నాడు. నిశ్చితార్థం జరిగినప్పటి నుండి తన ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్పాడు. ఆమె అతని ఒడిలో పడుకొని నవ్వుతూ విన్నది. అపారమైన అగాధం నుండి కలలు ఒక్కటొక్కటిగా తేలుతూ వచ్చాయి అలలవలె ఆ యువ జంట మధ్యకు.
అకస్మాత్తుగా అడవిలో నుండి కొన్ని శబ్దాలు క్రమంగా వినిపిస్తూ, అపరిమితమైన బరువైన శరీరాన్ని మోస్తున్నట్లు, ఎండుటాకుల పై చప్పుడుతో హెచ్చరిక చేసాయి. విలక్షణంగా అసహ్యంగా మాంసము కాలిన వాసన వంటి ఒకరకమైన వాసనను వారిద్దరు ఆ సమయంలో పసిగట్టారు.
పెద్ద శబ్దం జింక అరిచినట్టు వినపడింది. భూక్యా కొన్ని సందర్భాల్లో తక్షణం స్పందించే అంశాలలో శిక్షణ పొంది ఉన్నాడు. వెంటనే అతని ముఖంలో వేటగాడికి ఉండే కఠినత్వం కనపడింది పటపట శబ్దాలు నెమ్మదిగా దగ్గరికి వస్తున్నాయి. అతడు కింద పెరిగిన పొదల గుంపులలో కదలికలను గమనించాడు. ఒక శరీరం భారిగా కదిలి పోతున్నట్టుగా… కమ్లీ భయంతో అరవబోయింది. భూక్యా తన చేతితో ఆమె నోటిని మూసి వేశాడు అరవకుండా. నెమ్మదిగా ఆ శబ్దం దూరం అయిన తర్వాత కమ్లీ దీర్ఘంగా శ్వాస తీసుకుంది.
“వెళ్ళిపోయింది. ఈ దగ్గరలో ఉన్న చెట్టు కింది నుండి పులి వెళ్ళిపోయింది” అని అన్నాడు భూక్యా.
కమ్లీ భయంతో ఏమీ మాట్లాడలేదు.
“ఒకవేళ అది మనల్ని చూసి ఉంటే ఏమి జరిగేది” అంటూ హాస్యమాడాడు.
మాండియా చతురంగా మాటలు మొదలుపెట్టాడు “దాని కళ్ళు నీ మీద పడ్డాయి. కానీ సాలితో అతని నిశ్చితార్థం అయ్యింది” అంటూ చాలా అర్థవంతంగా చెప్పేందుకు ప్రయత్నించాడు. కానీ అతని మాటలు అనుకున్నంత సరిగా సరైన కంఠంతో చెప్పలేకపోయాడు.
ఒక తుపాకీ ఆ కొండల్లో మారుమోగింది. బాకాలు కొమ్ములు ఊదుతూ సూచనలు అందాయి.
“ఒక జంతువు చచ్చిపోయింది. అందరూ ఒకసారి రండి” అంటూ వారందరూ చెట్ల మీద నుండి దుముకుతూ ఒక్కచోటికి మూగారు. ఒకరినొకరు తోసుకుంటూ ఉరికారు. భూక్యొ వారిని నెట్టివేస్తూ దారి చేసుకుంటూ కిందపడి లేచి చివరకు మనుషులు ఉన్న కొండ శిఖరం పైకి చేరాడు. అక్కడ ఒక పెద్ద అ కొమ్ములున్న జింక రక్తపుమడుగులో పడి ఉన్నది. వారందరూ చీమల వలె దానిచుట్టూ మూగి, బొబ్బలు పెడుతూ, సైగలతో దానిని చంపినవారిని మెచ్చుకుంటున్నారు.
“ఆగదు బైద్య” అనే అనుభవజ్ఞుడైన వేటగాడు, పక్కన కూర్చుని తన తుపాకీని చిన్న గుడ్డతో తుడుచుకుంటున్నాడు. ఎటువంటి స్పందన లేకుండా, వారి పొగడ్తల పై ఎటువంటి ఆసక్తి లేకుండా చూస్తున్నాడు. ఘాటైన సిగరెట్ పొగను వదులుతూ “ఇదేమంత గొప్ప కాదు, పాపం పులి వెళ్ళిపోయింది” అన్నాడు.
దూరంగా పక్కనే కొన్ని వెదురు కట్టెలు పేర్చి చనిపోయిన జంతువును మోయడానికి వీలుగా ఉన్నాయి. అమ్మాయిలందరూ తాము ధరించిన పూల దండలు ఆ చనిపోయిన జింక మీద వేశారు. దానిని భుజాలపై మోయడమే ఒక బహుమతిగా భావిస్తున్నారు. డప్పులు మోగడం మొదలయ్యింది ఆవేశంగా ఆ ఊరేగింపు డాన్సులతో పాటలతో వేడుకతో ఆనందంగా కొండ దిగడం మొదలుపెట్టింది.
ఆరోజు రాత్రి వేటాడిన జంతువును, గ్రామం మధ్య మైదానంలో ఉంచి, రాత్రంతా దాని చుట్టూ డాన్స్ చేస్తూ ఉన్నారు. చాలా సేపటి తర్వాత అక్కడ వెలుగుతున్న పండుగమంట ఆరిపోయింది. చలి పెరిగింది కానీ డప్పుల మోత ఆగలేదు. కొన్నిసార్లు వాటి లయ తప్పింది. ఆ తర్వాత ఏ ఒక్కరూ కూడా మళ్లీ నాట్యం చేసే ప్రయత్నం చెయ్యలేదు.
భూక్యా మధ్యరాత్రి వరకు మద్యంలో మునిగి, మండుతున్న పుల్లల కట్టెను పట్టుకొని పిచ్చివాడి వలె కమ్లీ కోసం వెతుకుతున్నాడు. కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. హేమ్లా కూడా కనిపించట్లేదు అన్న విషయాన్ని గ్రహించాడు. అతనిలో అనుమానాల ఆలోచనలు చుట్టలు చుట్టు కోవడం మొదలైంది. సుత్తితో గుండెల పై కొడుతున్నట్టు బాధపడ్డాడు.
అతనిలో నిరాశ పెరగటం మొదలైంది. మెత్తటి చేతులు తనను చుట్టేసినప్పుడు చీకట్లో, అది వ్యక్తిగతం కానీ, అది అత్యవసర ఆహ్వానమే కదా. పిచ్చెక్కించే డప్పుల మోత అతనిలో రక్తాన్ని మరిగిస్తోంది. అతడు దిగాలు పడిపోయాడు ఆరాత్రి.
ఆరాత్రి రుచిలేకుండా అయ్యింది. తియ్యగాలేదు చేదుగా లేదు. అది మంచి చెడుకు భిన్నంగా ఉన్నది. అది కేవలం ఒక రాత్రి మాత్రమే.
*** *** *** *** ***
ఒక్కసారిగా కెంపురంగు పేలి పర్వతాల నిండా వెదచల్లినట్టు , పాత తాటిచెట్ల ఎండిన కొమ్మలు నిప్పు అంటుకుని మండుతున్నాయి. సూర్యుడు ఉదయించి ఎర్రని దుమ్మును ఆకుపచ్చని కార్పెట్ పై ఎగచల్లాడు. అలంకరించిన పాదాలతో గణగణమని శబ్దంతో నాట్యం కొనసాగుతోంది. చచ్చిపోయిన మగ జింక చుట్టూ సంగీతానికి అనుగుణంగా అలిసిపోయిన కళ్ళతో బలహీనమైన ముఖాలతో బాధగాసాగుతోంది నాట్యం. పూర్వీకుల సమాధుల చుట్టూ మంచు కమ్ముకున్నది. పగిలిన మద్యపు కుండల నిండా దుమ్ము పేరుకుపోయింది. పూల దండలు అన్నీ నలిగిపోయాయి. సూర్యోదయంతో పాటు పందులు, కోళ్లు, కేకలు అరుపులతో పిల్లలు కూడా అక్కడ చేరారు. నెగళ్ళ నుండి పొగ పైకి పాకుతూ చుట్టుకుంటుంది. పరిచయమున్న వాసనలు గాలిలో తేలుతూ ఉన్నాయి. అడవి పావురాలు మృదువుగా కుహుకుహు అంటూ ఉన్నాయి చెట్లపై నుండి. ఆకుపచ్చ పావురాలు జోడి చెట్ల పైకెక్కి రేగు పళ్లను ఫలహారం చేస్తున్నాయి. పొడవు మెడ కలిగిన హార్న్ బిల్ పక్షులు కొచీల చెట్లమీదుండి కీచు మంటూ కఠోరంగా అరుస్తున్నాయి. నెమళ్ళు గట్టి గట్టిగా పిలుస్తూ కొండపైకి ఎక్కడ మొదలు పెట్టాయి.
గుసగుసలాడే గుంపుల మాటలు గట్టిగా వినపడడం మొదలయ్యాయి. వేటకు బయలు దేరిన బృందాలన్నీ దారి పక్కన గుంపుగా చేరాయి. ఒక అమ్మాయి తన చీర కొంగుతో ముఖంపై ముసుగు వేసుకుంది, ఎంతో వినయంగా తలవంచుకుని నేల చూపులు చూస్తూ. మిగిలిన వారందరూ గట్టి గట్టిగా నవ్వుతున్నారు. రోజువారి పాత దిన చర్య మొదలైంది.
కమ్లీ, హేమ్లా మాత్రం ఆ బృందం నుండి తప్పిపోయారు. ఎవ్వరు కూడా వాళ్ళు ఎటు వెళ్ళారో భూక్యాకు చెప్పడం లేదు.
మరో ఉదయం మొదలైంది కొండ జాతి పరిష్కారం జరగాలి. కాన్యజోల అంటే వధువు నివాసమున్న లోయ. అది చాలా చిన్న గూడెం పన్నెండు ఇళ్ళు మాత్రమే ఉండే గూడెం. వారంతా ఒక్క చోట కూడారు ఒక బుట్ట లాగా. ఆ కూడలి గ్రామంచే చుట్టబడి ఉన్నది. వ్యవసాయ భూముల నుండి వచ్చే దారిలో “పోడ్ గాడ్ “నదీ తీరంలో అడవి ధరించిన కొండలు మధ్య ఉన్నది.
ఆ ఉదయం సూర్యుడు ఒక చేతికర్ర పొడవున ఆకాశంలోకి నిటారుగా పాకిన తర్వాత, కొండజాతి వారు చెప్పినట్లు, కప్పు కిందికి ఉన్న ఒక గుడిసె నుండి కమ్లీ, హేమ్లా బయటకు వచ్చారు. ఆ గుడిసె అదే గ్రామంలో ఉన్న హేమ్లా బంధువుకు చెందినది . వారు ఒకరికి ఒకరు ప్రతి ముఖంగా నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు. అది వారి మొదటి అనుభవం. కేవలం ఆకులు కదిలిన శబ్దం మాత్రం వినిపిస్తున్నది.
చివరకు “మనం నదికి పోదామా” అన్నాడు హేమ్లా.
వారికి నది నుండి నీళ్లతో తిరిగి వస్తూన్న
అమ్మాయిలు కలిశారు. వారంతా నూతన దంపతులకు ఉత్సాహంగా గట్టిగా శుభాకాంక్షలు చెప్పారు. కమ్లీ వాళ్లతో కలిసి కొద్దిసేపు నవ్వి వెనుకకు వచ్చింది. వారి శుభాకాంక్షలను ఉత్సాహాన్ని ఆనందించాడు హేమ్లా.
ఒక గిరజనుని పెళ్ళికి కొన్ని కనీస మర్యాదలు పాటించాల్సిన అవసరం ఉంది. వీలైనంత త్వరగా అమ్మాయి అబ్బాయి కలిసి జీవించడానికి ఒక స్త్రీ పురుషులవలె భార్యాభర్తలుగా అంగీకరించాలి. ఆ పెళ్లి గిరిజన సంప్రదాయ ప్రకారం జ్యోతిష్యుడు సూచించిన అనుకూలమైన రోజున సంప్రదాయబద్ధమైన ఒక వేడుక జరగాలి. చిన్న చిన్న కొమ్మలతో ఒక కప్పు తయారుచేసి నేలపై మూడడుగుల ఎత్తున కర్రల పై ఉంచుతారు, పావురాన్ని కోడిని బలి ఇస్తారు. డప్పులు బాకాల మోతలతో పెళ్లి విందు మొదలవుతుంది. అప్పుడు మాత్రమే ఆ వేడుకతో ఆ పెళ్లి ఒక హక్కుగా ఆమోద ముద్ర వేయబడుతుంది .
పురాతన పరజా పద్ధతి ప్రకారం బంధించడం అనేది పెళ్ళకి ఒక హక్కు వంటిది. హేమ్లా ఆ పద్ధతినే నిర్వహించాడు. ఇంక మిగిలింది కమ్లీ తండ్రికి కన్యాశుల్కం చెల్లించడమే. బారిక్ అనే ఒక వార్తా వాహునితో వారి పెళ్లి సమాచారాన్ని గ్రామస్తులకు, కమ్లీ తండ్రికి, తన తండ్రికి చెప్పమని కబురు చేశాడు హేమ్లా.
అప్పుడు పెద్దవారు, రెండు కుటుంబాల వారు కూర్చుని చర్చించి చెల్లించవలసిన మొత్తాన్ని నిర్ణయిస్తారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగిన తర్వాత, అతనిని, అతని వధువును గ్రామంలోకి గౌరవంగా ఆనందంగా ఆహ్వానిస్తారు.
హేమ్లా ఉద్దేశ్యపూర్వకంగా ఆమెను ఎత్తుకు పోలేదు. కానీ ఉన్నట్టుండి హేమ్లా ధైర్యంగా అక్కడికి వచ్చాడు. మిగిలిన వారంతా వేటాడిన మగజింకను చూడడానికి పరిగెత్తారు. అప్పుడు కమ్లీ చెయ్యి పట్టుకొని దాదాపుగా గుంజుకు పోయాడు. ఆమె అతని ముఖంలోకి చూసింది, కానీ అతనిని వ్యతిరేకించలేదు. వారిద్దరూ ఏది ఆలోచించకుండా అడవిలో కొండలు గుహల్లోకి లోతైన లోయలోకి పరిగెత్తారు. ఎదురుగా వస్తున్న గాలి వారి ముఖాలపై చెమటను తుడిచివేసింది. నెమ్మదిగా కమ్లీ వణుకుతున్న తన చేతితో హేమ్లాను అంగీకరిస్తూ పట్టుకుంది. తనకు తానుగా అతనికి ఆ పరిచయం లేని అడవి దారుల్లో లొంగి పోయింది. అంతటితో గతానికి తలుపులు మూసేసింది.
తెల్లారి ఉదయం ఆమె మేల్కొనే సమయానికి అంతా ప్రశాంతం అయిపోయింది. రాత్రి ఉద్రేకం కంగారు స్థానంలో ప్రశాంతత ఏర్పడింది. తనకు, తన చుట్టూ ఉన్న ప్రపంచానికి. కానీ కొత్త బంధం ద్వారా ఏర్పడిన బాధ్యతలను ఆమె జాగ్రత్తగా గుర్తుంచుకున్నది. ఆమె చురుకైన కళ్ళు దయతో తడి బారాయి. ఎవరికైతే తనను అర్పించుకుందో అతని వైపు చూస్తూ….
“హేమ్లా నాకు నువ్వు ప్రమాణం చేస్తావా ఎప్పుడూ నన్ను అవమానించనని, నన్ను ఒక బానిసలా చూడనని” అని నవ్వుతూ కన్నీటితో అడిగింది.
ఆమెను తన చేతులతో చుట్టి కౌగలించుకొని హామీ ఇచ్చాడు హేమ్లా. ఆమె తన తలను అతడి భుజాలపై ఉంచి మౌనంగా ఉండిపోయింది. నెమ్మదిగా కొండలు మేల్కొని జీవం నింపుకున్నాయి. తమ ఒప్పందానికి అవి సాక్ష్యంగా ఆమెకి అనిపించింది.
. **** **** **** ****