దొరసాని -69 వ భాగం

ఇద్దరు ఇంటికి బయలుదేరారు.

“సౌ! ఇలా వర్షం పడి ఎక్కడైనా చిక్కుకునిపోతే, సినిమాలలో అయితే పాటలు పాడుకుంటారు కదా! మనం కూడా పాడుకోవాల్సింది.

నేనైతే పాత పాటల ప్రేమికుడిని.

“చిటపట చినుకులు పడుతూ ఉంటే” అని లేదా

“తేట తేట తెలుగులా” అనే పాటను పాడుకునే వాళ్లం కదా” అన్నాడు సాగర్.

” ఏంటి! మనం వర్షంలో దారి తప్పితే నీకు పాట పాడాలని ఉందా? అసలు ఇంట్లో మనకోసం ఎంత భయపడుతున్నారో నీకు తెలుసా? ఇంకా డ్యూయెట్లు పాడుకుందామా! అసలు మనం ఆలస్యంగా బయలుదేరడమే మన తప్పు” అన్నది సౌదామిని కోపంగా.

” ఓకే ,ఓకే !ఊరికే అన్నానులే. నా లోపల ఉన్న టెన్షన్ పోగొట్టుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడుతున్నాను” అన్నాడు సాగర్.

ఇద్దరు ఇంటికి వచ్చేవరకు మధ్యాహ్నం అయింది.

భూపతి, నీలాంబరి మరియు పనివాళ్ళు అందరూ బయట కచేరీలోనే కూర్చొని వీళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

ఎప్పుడు దృఢంగా కనిపించే నీలాంబరి ఎంతగానో ఏడ్చి నీరసపడిపోయింది.

లోపలికి వచ్చిన సాగర్ మరియు సౌదామినిలను గట్టిగా వాటేసుకుని ఏడ్చింది నీలాంబరి.

” అమ్మా! ఊరుకో వచ్చేసాం కదా! అసలు మేము అంత దూరం వెళ్లాలని అనుకోలేదమ్మా! అక్కడ కొండమీద గుడిలో దర్శనం చేసుకుని కిందికి వచ్చేవరకు పెద్ద వర్షం మొదలయ్యింది. ఆ వర్షంలో దారి తప్పాము. సారీ అమ్మ” అన్నాడు సాగర్ నీలాంబరి కళ్ళు తుడుస్తూ.

” అవునత్తయ్య !మేము గుడిలో పది నిమిషాలు కూడా ఉండలేదు. వెంటనే బయలుదేరాము. హఠాత్తుగా వర్షం మొదలయ్యింది. మిమ్మల్ని ఇంత బాధలో అస్సలు చూడలేను” అన్నది సౌదామిని, నీలాంబరిని దగ్గరికి తీసుకొని.

పిల్లలను లోపలికి తీసుకుని వెళ్ళు నీలా! దిష్టి తగిలి ఉంటుంది. దిష్టి తీసేసి ,ఏమైనా తినడానికి పెట్టు. నిన్నటి నుండి నువ్వు కూడా ఏమీ తినలేదు నువ్వు కూడా. వారితో పాటే ఏదైనా తిను”అన్నాడు భూపతి

” అక్కడ మాకు గిరిజనులు షెల్టర్ ఇచ్చారు అమ్మా! నిజంగా వారి మనసు ఎంత స్వచ్ఛమైనదో! ఎంత డబ్బున్నా ఈ రోజుల్లో అవతలి మనిషికి పిడికెడు పెట్టడానికి వెనుకాడే రోజులు.వాళ్ళు మాకు కడుపునిండా రొట్టెలు పెట్టారు.తాగడానికి పాలు పోశారు. పడుకోవడానికి వారి గుడిసెలు ఇచ్చారు” అని చెప్పాడు సాగర్

” అవునా! వారు ఉండే స్థలాన్ని మీరు గుర్తుపడతారా? సమయం వచ్చినప్పుడు వారికి ఏదైనా ఉపాధి కల్పిద్దాము” అన్నది నీలాంబరి.

” నేను మొబైల్ లో ఫొటోస్ కూడా తీసుకున్నాను గుర్తుపడతాము” అన్నది సౌదామినీ.

సౌదామిని మరియు సాగర్ స్నానం చేసి నీలాంబరితో పాటుగా భోజనం చేశారు.

సౌదామిని, సాగర్ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లి పడుకున్నారు. అలసిపోయి ఉన్నారు కనుక సాయంత్రం వరకు లేవకుండా పడుకునే ఉన్నారు.

ఒక రెండు రోజుల తర్వాత సాగర్ తాను వ్యవసాయం చేద్దామనుకుంటున్నానని, అది కూడా సేంద్రియ వ్యవసాయం అని నీలాంబరితో , భూపతితో చెప్పాడు.

వాళ్ళిద్దరికీ సాగర్ చెప్పిన విషయం చాలా నచ్చింది. తాను సేంద్రియ వ్యవసాయం చేయడంతో పాటు మిగతా రైతులకు కూడా ఎలా చేయాలో నేర్పించి, ఎక్కువ డబ్బు వెచ్చించి కొనే వినియోగదారులకు సాధారణంగా విక్రయించే ఏర్పాటు కూడా చేయాలని,తాను కూడా శిక్షణ పొందాలని నిశ్చయించుకున్నాడు సాగర్.

” సాగర్! సౌదామినితో ఈ విషయము చర్చించావా?నీకెరియర్ సంబంధించినది . తనకు కూడా ఎంతో అవసరం కదా! మీకు ఇద్దరికీ నచ్చితే నీవు అనుకుంటున్నట్లుగానే చెయ్యి .మాకు సంతోషమే. ఇద్దరు ఇదే ఊర్లో ఉంటూ ఇంకా మిగతా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు” అన్నది నీలాంబరి.

” అమ్మ అన్నది నిజమే సాగర్ .మీరు ఇక్కడ ఉంటే నాకు కూడా ఎంతో ధైర్యంగా ఉంటుంది .నేను సర్పంచ్ గా ఉండే ఎన్నో పనులు చేయగలనని గుర్తించిన యాజమాన్యం నెక్స్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేయమని అంటున్నారు. మన నియోజకవర్గంలో చాలామందికి నాసేవలు తెలుసు.నేను కూడా ఆ దిశగా వెళ్లాలని అనుకుంటున్నాను. మనం ఎవ్వరం ఏం చేసినా అభివృద్ధి కోసం మాత్రమే చేస్తాము కాబట్టి అందరమూ ఒకటిగా ఉంటే మనకు కూడా ఒక ధైర్యం ఉంటుంది .నీవు ఇక్కడికి రావడం వల్ల నాకు ఎంతో సపోర్టుగా ఉంది. అందులో మన అదృష్టం సౌదామిని లాంటి అమ్మాయి మన ఇంటి కోడలు కాబోతుంది. తాను బాలసదనం బాధ్యతలు నిర్వర్తిస్తుంది ..ఇంక అమ్మ అన్ని విషయాలలో మనకు అండదండగా ఉంటుంది” అన్నాడు భూపతి.

ఇలా వారనుకున్న ప్రణాళికకు సమయం పట్టింది కానీ దాన్ని భవిష్యత్తులో విజయం సాధించేలా తీర్చిదిద్దుకున్నారు.

వీరు అనుకున్నది ఒక కార్యరూపం దాల్చగానే సాగర్ , సౌదామినుల పెళ్లి నిశ్చయించారు.

ఒక మంచి రోజు చూసి సౌదామిని తల్లిదండ్రులను గోపాలపురానికి పిలిపించారు.

అమ్మాయి పెళ్లి నిశ్చయం అనగానే రవీంద్ర, విజయమ్మ ఎంతో సంతోషంగా గోపాల పురానికి వచ్చారు.

ఇల్లంతా అప్పటికే పెళ్లి కళ సంతరించుకుంది.

అలేఖ్య , సుధీర్ తమ్ముడు పెళ్లి గురించి ముందుగానే రావడానికి ఏర్పాటు చేసుకున్నారు.

నీలాంబరి ముందుగానే సౌదామిని తల్లిదండ్రులకు చెప్పింది.

” పెళ్లి ఆడపిల్ల వాళ్ళింట్లో జరగాలని ఆచారం ఉన్నా, మేము మిమ్మల్ని ఒకటి అభ్యర్థిస్తున్నాము.ఇక్కడ మా బలగం చాలా పెద్దది. బంధువులే కాకుండా చుట్టుపక్కల ఊర్ల నుండి చాలామంది వస్తారు. అంత ఒత్తిడిని మీరు తట్టుకోలేరు. కాబట్టి పెళ్లి ఇక్కడ మా ఖర్చులతో గోపాలపురంలో చేద్దాము. మీ ఊర్లో మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఎలాగూ చేస్తారు కదా! అప్పుడు మేము మా దగ్గర బంధుమిత్రులతో వస్తాము .ఇది మీరు తప్పకుండా ఒప్పుకోవాలి” అని చెప్పింది నీలాంబరి.

అలాగేనని ఒప్పుకున్నారు రవీంద్ర, విజయమ్మ.

వర నిశ్చయము, కన్య నిశ్చయము సింపుల్గా చేద్దామని అనుకున్నారు. ఎందుకంటే పెళ్లి మరో పదిహేను రోజుల్లోనే పెట్టుకుంటున్నారు కాబట్టి, దగ్గర బంధువులను మాత్రం పిలుచుకొని చేసుకుందామని అనుకున్నారు .అది సౌదామినీ వాళ్ళ ఊర్లోనే చేయాలని నిశ్చయించారు.

నిశ్చితార్థం రోజు రానే వచ్చింది.సౌదామిని హాస్పిటల్ కి సెలవు పెట్టి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది .సౌదామిని తల్లి తండ్రి కూడా నీలాంబరిని అడిగారు.

“పెళ్లయ్యాక ఎలాగూ ఇక్కడే ఉంటుంది కదా! ఇప్పటినుండి పెళ్లయ్యే వరకు మా దగ్గరే ఉండనీయండి” అని.

” అదేమిటి మీఅమ్మాయి కదా! మీ అమ్మాయి మీ ఇంట్లో ఉండటానికి నా అనుమతి ఎందుకు? ఇన్ని రోజులు పెంచి, పెద్ద చేసి, విద్యాబుద్ధులు చెప్పించిన మీకు కాక అమ్మాయి మీద ప్రేమ ఆప్యాయత ఇంకెవరికి ఉంటుంది? ఇప్పుడే కాదు పెళ్లయిన తర్వాత కూడా సౌదామిని ఎప్పుడు మీదగ్గరికి రావాలన్నా నాఅనుమతి అవసరం లేదు” అని చెప్పింది నీలాంబరి.

ఇంత మంచి ఆధునిక భావాలు ఉన్న నీలాంబరి గురించి ప్రత్యక్షంగా చూస్తున్నందుకు రవీంద్రకు మరియు విజయమ్మకు ఎంతో తృప్తిగా అనిపించింది. వాళ్ళ అమ్మాయిని సరైన చోటుకే పంపిస్తున్నాము అనే విషయం వారికి ఎంతో ఆనందం కలిగించింది.

సౌదామిని తల్లిదండ్రులతో పాటు వాళ్ళ ఊరైన వనపర్తికి వెళ్ళింది.

నిశ్చితార్థానికి ముందే అలేఖ్య, సుధీర్ , సౌందర్య వచ్చారు.

ఇల్లంతా ఎంతో సందడిగా ఉంది .సౌందర్య పరుగులతో చిన్న చిన్న మాటలతో నీలాంబరి మరియు భూపతి ఆనందానికి అవధులు లేవు.

సాగర్ ఎక్కువగా సౌందర్యలహరితోనే ఆడుకుంటున్నాడు.

నిశ్చితార్థంకు దగ్గర బంధువులను మాత్రమే పిలుచుకున్నారు.

ఆరోగ్యము మరియు సంప్రదాయము రెండూ కలిసేలా ఆలోచించడం నీలాంబరి మనస్తత్వం.

సౌదామినికి నిశ్చితార్థం చీర వంగ పండు రంగులో తీసుకుంది. వంకాయ రంగు చీరకి ఆకుపచ్చ అంచుతో చీర ఎంతో చక్కగా ఉంది. మెడలో వేసుకోవడానికి ముత్యాల హారం తీసుకుంది. దానికి సరిపడా గాజులు, ఝుంకాలు కూడా తీసుకుంది.

ఐదు రకముల స్వీట్లు ఇంట్లోనే తయారు చేయించింది.
కుల వృత్తులను ప్రోత్సహించే నీలాంబరి
తోటల్లో పూసిన పూలను తెప్పించి, వాటిని మేదరి వాళ్ళు అలిన బుట్టలలో నింపించింది. గులాబీలు చేమంతులు, కనకాంబరాలు, మల్లెలు, బంతిపూలు వీటన్నిటిని చక్కగా బుట్టలో సర్ది వాడిపోకుండా పైన డెకరేషన్ గా పాలిథిన్ పేపర్ తో వేయించి పెట్టారు.

ఊరి తోటలో కాసిన పండ్లను ఐదు రకాలుగా తెప్పించింది. జామ, దానిమ్మ, నారింజ, సపోటా మరియు కొబ్బరి బోండాలు ఈ ఐదు రకాల పండ్లను కూడా పెద్ద బుట్టలలో సర్ది పెట్టారు.

ముందు రోజు రాత్రి అందరూ వనపర్తికి చేరుకున్నారు. రవీంద్ర విజయమ్మ వారికి ఉన్నంతలో ఘనమైన ఏర్పాట్లు చేశారు.

బయట చక్కని పందిరి వేయించి ఇల్లంతా బంతిపూల తోరణాలు కట్టించి ఎంతో అందంగా అలంకరించారు.

ఆరోజు రాత్రికి చక్కని విందు భోజనం ఏర్పాటు చేశారు.

అందరికీ పడుకోవడానికి హాల్లో చుట్టూరా పరుపులు వేసి ఏర్పాటు చేశారు.

అలేఖ్యకు సౌదామిని ఒక గదిలో పడుకున్నారు. భూపతి మరియు సాగర్ ఒక గదిలో పడుకున్నారు. నీలాంబరి అందరితోపాటు హాల్లో పడుకుంటానని చెప్పింది.

అందరూ కాసేపు కబుర్లు చెప్పుకొని నిద్రపోయారు. తెల్లవారి అందరూ లేచి వారి దినచర్యను చేసుకొని తయారయ్యారు.

పూజారి గారు అప్పటికే వచ్చి కూర్చున్నారు .ముహూర్తం సమయం చూసి వధువును వరుడిని విడివిడిగా కూర్చోబెట్టి పూజ చేయించారు.

ముందుగా నీలాంబరి భూపతి సౌదామినికి బట్టలు నగలు తాంబూలం ఇచ్చారు.

తర్వాత సౌదామినీ తల్లిదండ్రులు సాగర్ ను కూర్చోబెట్టి అతనికి బట్టలు పెట్టారు.

ఇద్దరూ కొత్త బట్టలు కట్టుకొని వచ్చిన తర్వాత వారిద్దరి చేత ఉంగరాలు తొడిగించారు. తర్వాత పూలదండలు మార్పించి పీటల మీద కూర్చోబెట్టారు.

ఆ తర్వాత నీలాంబరి వైపు నుండి ఒక్కొక్క ముత్తయిదువతో పండ్లు పూలు గాజులు ఇప్పించారు.

తీసుకొచ్చిన పండ్లన్నీ వచ్చిన ముత్తయిదువులకి జాకెట్టు బట్టలతోపాటు తాంబూలంగా ఇచ్చారు.

సౌదామిని తల్లిదండ్రులు కూడా సాగర్ కి అదే విధంగా కానుకలు ఇచ్చారు.

ఎంతో ఘనంగా జరిగిన నిశ్చితార్థాన్ని వేడుకగా చూసుకున్నారు ఇరువైపులవాళ్లు.

అలాగే లగ్నపత్రిక రాయించుకొని పెళ్లి ముహూర్తము పెట్టుకొని అందరూ భోజనాలకి కూర్చున్నారు.

సాంప్రదాయమైన వంటలే కాకుండా కొత్త రకాల వంటలు ఎన్నో చేయించారు. అందరికీ అరిటాకుల్లో భోజనాలు వడ్డించారు.కొందరికి బఫే భోజనాలు ఏర్పాటు చేశారు.

అందరూ తృప్తిగా భోజనం చేసి ఎవరిళ్లకు వాళ్లు బయలుదేరారు.

దొరికిన కొద్ది సమయంలో సాగర్ మరియు సౌదామిని మేడ పైకి వెళ్లి మనసారా మాట్లాడుకున్నారు.

సుధీర్ మరియు అలేఖ్యకు ఎంతో సంతోషంగా ఉంది. తన చెల్లెలైన సౌదామినినీ అలేఖ్య తమ్ముడికి ఇవ్వడం ఊహించలేని విషయం. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకి అతనికి ఎంతో ఆనందంగా ఉంది.

అందరూ ఆ రాత్రికి గోపాలపురం చేరుకున్నారు.

ఒక మంచి రోజు చూసుకుని పెళ్లి పనులు ప్రారంభించారు ఇరువైపుల వాళ్ళు.

మంచి తిథి, వార నక్షత్రం చూసి ముందుగా ఐదుగురు ముత్తైదువులను పిలిచి పసుపు దంచుకున్నారు.

అప్పట్లో అయితే ఇంట్లోనే అప్పడాలు, వడియాలు పెళ్లికి సరిపడా పెట్టుకునేవాళ్ళు అదే పద్ధతిగా చేయించింది నీలాంబరి.

బియ్యం పిండి అప్పడాలు, జంతికలు, మినప ఆపడాలు, అవన్నీ పెళ్లికి సరిపడా చేయించింది నీలాంబరి.

బట్టల షాపింగ్ పనులన్నీ అలేఖ్య ,సుధీర్ ,సాగర్ చూసుకున్నారు. పెళ్లికి సంబంధించిన పనులన్నీ భూపతి చూసుకున్నారు.

ప్రతి ఫంక్షన్ కి తెలంగాణలో ఆనవాయితీ ప్రకారం కొన్ని పదార్థాలను చేస్తారు.

చకిలాలు, అరిసెలు, పప్పు బిళ్ళలు, కరియలు( కర్జి కాయలు) శనగపిండితో చేసే మురుకులు లేదా సేగు.ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంటికి వచ్చే కోడలికి వడిలో పెట్టడానికి కొన్ని ఐటమ్స్ చేస్తారు.

పుట్నాల లడ్డూలు, పల్లీల లడ్డులు, గసగసాల లడ్డులు, ఇంట్లో చేసిన సేమియా లడ్డూలు, నువ్వుల లడ్డూలు ఇవన్నీ చేసి రెండు రెండు లడ్డూలను దారంతో చుట్టేస్తారు .ఇవన్నీటిని “లడ్డువ మోరుండలు” అంటారు.

వీటితో పాటుగా లక్క కుంకుమ భరణలు, వెండి కుంకుమ భరిణలు,చిన్న చిన్న దువ్వెనలు, నల్లపూసలు ఇవన్నీంటిని వడిబియ్యంతో పాటుగా ఒడిలో పెడతారు.

పెళ్లి కూతురుకు బట్టలతోపాటుగా బొట్టు పెట్టే, తాహతును బట్టి వెండి లేదా మామూలు చెక్క బొట్టు పెట్టెను ఇవ్వడం సాంప్రదాయం.

ఒక చిన్న ఊయల, అందులో ఒక చిన్న బొమ్మను కూడా పెడతారు .ఇది పెళ్లి అయిన తర్వాత నాగవెల్లి సమయంలో పెళ్లికూతురు ఊయలలో బొమ్మను పెట్టుకుని బంధువుల అందరి దగ్గరికి వెళితే వాళ్లకు పుట్టబోయే బిడ్డను ఆశీర్వదించుతున్నట్లుగా, అందరూ ఆశీర్వదించి వారికి తోచినంత కట్నం చదివిస్తారు.ఇది ప్రతి పెళ్లిలో తప్పకుండా ఉంటుంది.

ఆడపిల్ల వాళ్ళు వియ్యం పురాలికి, వియ్యంపురాలు వందనం చేస్తారు. విడి దింటి నుండి తీసుకుని వచ్చి ఆమెకు అలంకరణ చేస్తారు. పెళ్లి బొట్టు పెట్టడం, కాళ్లకు పసుపు పారాణి దిద్దడం చేసి ఆమెకు చక్కని వస్త్రములు బహుకరించి, ఒక పెద్ద అద్దం ఇస్తారు. ఆ అద్దంలో ఆమె కోడలు కొడుకుతోపాటు అద్ధం చూసుకుంటుంది. ఇంకా కొన్ని కానుకలు కూడా ఇస్తారు.

ఇరు ప్రక్కల వాళ్ళు సాంప్రదాయం ప్రకారం ఏమేమి ఉంటాయో అవన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు.

అన్ని పనులు చకచకా పూర్తయ్యాయి. ఇంటి ముందు పందిరి వేయడం కూడా ఒక పద్ధతి. దానికి ఐదు రకముల పచ్చికొమ్మలతో వేస్తారు.. రాగి ,జువ్వి, మేడి, మర్రి, కానుగ. వీటిచిగుళ్లని అమ్మాయిని లేదా అబ్బాయిని పెళ్ళికొడుకుని చేసినప్పుడు ఉపయోగిస్తారు వీటిని పంచ పల్లవాలు అంటారు.

అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆడపిల్ల వారికి ఒక ఇల్లు శుభ్రం చేయించి, రంగులు వేయించి, వాడుకోవడానికి ఇచ్చారు. బంధువులందరికీ విడిది ఏర్పాట్లు చేశారు.

భూపతి గారి గడి కొత్త రంగులుతో ఎంతో అందంగా కనబడుతుంది .ఒక కోటలా దర్జాగా ఉంది.

ఊరంతా కూడా వాళ్ళింట్లో పండగ జరుగుతున్నంత సంబరంగా ఉన్నారు.

ఎన్నో రకముల సాంప్రదాయ కోలాటా లను, నృత్యములను ఏర్పాటు చేయించారు.

వారం రోజుల ముందుగానే సౌదామిని కుటుంబం గోపాలపురంకి వచ్చి, అక్కడ వీళ్ళు ఏర్పాటు చేసిన ఇంట్లో ఉన్నారు.

ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఏమేం చేయాలి అనేది ఇరువైపు వాళ్ళు చర్చించుకొని చేసుకుంటున్నారు.

భూపతి గారి గడిలో అబ్బాయికి స్నాతకం చేశారు. అనంతరం పెళ్ళికొడుకుని చేశారు. చక్కని మంత్రాల మధ్య జరిగే ఈ తంతు ఇంట్లో జరిగే శుభాలకి సూచకం.

స్నాతకానికి కావలసిన సరంజామా శుభ్రం చేసి, వాటికి పసుపు కుంకుమ సున్నం జాజు పెట్టి అలంకరించారు.

రెండు కుదుళ్ళు, రెండు ఇసిర్రాళ్ళు, రెండు రోకళ్ళు వీటిని అలంకరించి హాల్లో పెద్దజంపకానపరిచి పెట్టించారు.

పెళ్లి కొడుకు లేదా పెళ్లికూతురుని మధ్యలో కూర్చోబెట్టి అటు ఇటు తల్లిదండ్రులు కూర్చొని కార్యక్రమం అంతా పూర్తి చేస్తారు.

ముత్తైదువలు అందరూ కలిసి పసుపు కొమ్ములను రోట్లో వేసి దంచుతారు. తర్వాత ఆ పసుపు కొమ్ములను విసుర్రాయి లో వేసి విసురుతారు. ఆ తర్వాత అదే పసుపును తలంబ్రాల బియ్యం లో పోసి ముత్తైదువు కలిసి పాటలు పాడుతూ కలుపుతారు.

ఇదంతా జరిగిన తర్వాత అంకురార్పణం చేస్తారు. నవధాన్యాలను తీసుకొచ్చి పుట్టమన్నులో కలిపి, కంచుళ్లలో నింపుతారు. ఇదంతా పెళ్లికూతురు లేదా పెళ్లికూతురుతో మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా చేయిస్తారు. ఇవన్నీ కొన్ని రోజులకి చక్కగా మొలకలు వస్తాయి .అప్పుడు వాటిని ముత్తైదువులకు ఇస్తారు.

ఆడపడుచు ఇచ్చే హారతి తో పాటుగా చిక్కసం పిండిని తల మీద చల్లి, నూనెతో తల అంటుతారు. ఆ తర్వాత మంగళ స్నానం చేయిస్తారు. ఇప్పుడు వేడుకగ పెళ్ళికొడుకు లేదా పెళ్లి కూతుర్ని చేయడం.

ఆడపిల్ల కైతే గోరింటాకు పెట్టి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పెట్టుకుని , పెళ్లికూతురుతో అందరికీ పెళ్లి పందిట్లో గాజులు ఇప్పిస్తారు.

అలా ఎన్నో గంపలలో ఆకుపచ్చ మరియు ఎరుపు రంగు గాజులను సైజుల వారి ప్రకారంగా వాకిట్లో వేసిన పందిట్లో అమర్చారు.

సౌదామిని తన మేనమామ ఇచ్చిన పట్టుచీరను మొదట కట్టుకొని, పీటల మీద కూర్చొని, అందరికీ గాజులు పసుపు, కుంకుమ ఇచ్చింది.

వచ్చిన వాళ్ళందరూ చేతుల నిండా గాజులు వేసుకొని ,పసుపు కుంకుమలతో ఇల్లంతా తిరుగుతుంటే, కళకళలాడుతూ లక్ష్మీనివాసంలా అనిపించింది.

ఇటు నీలాంబరి గడిలోనూ అటు సౌదామిని వాళ్ళకి ఇచ్చిన ఇంట్లోనూ చక్కని వేడుకలు జరుగుతున్నాయి. సన్నాయి వాయిద్యాలు మోగుతున్నాయి.

అద్భుతమైన భోజనఫలహారాలు కడుపుకు విందు చేస్తున్నాయి.

సాంప్రదాయంగా ఫలహారంలో పెట్టే పదార్థాలు చట్నీ పొడి కలిపిన అటుకుల చుడువా, చకిలాలు, అరిసెలు, కజ్జికాయలు అప్పాలు,బూంది లడ్డు వీటితో షడ్రసోపేతమైన పలహారం.

ఎన్ని రకాల తీపి పదార్థములు ఉన్నా కూడా, బూందీ లడ్డుది ప్రత్యేక స్థానం. తప్పకుండా ఆ లడ్డు ఉండాల్సిందే! పెళ్ళికి వచ్చిన వాళ్లు వెళ్లిపోయేటప్పుడు తాంబూలంతో పాటు లడ్డూలు కూడా ఇవ్వడం ఆచారం. ఇలా దేనికి తగ్గకుండా ఏర్పాట్లన్నీ ఎంతో బాగున్నాయి.

పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు, ఫలహారాలు చక్కగా వడ్డిస్తున్నారు. ఊళ్ళ నుండి వచ్చిన వాళ్ళు, స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్ళు ఇలా ఒకరేమిటి అందరూ తరలివస్తున్నారు.

తెల్లవారి ఎదురు కోళ్ల కార్యక్రమం. పెళ్ళికొడుకును లేదా పెళ్లికూతురుని చేసే ముందు మరొక కార్యక్రమం చేస్తారు. పెరట్లో వేసిన గాడి పొయ్యిలను చక్కగా అలికి ముగ్గులు పెట్టి ఉంచుతారు. వంటలు ప్రారంభించే ముందు పెళ్లికూతురు లేదా పెళ్లి కొడుకుతో అగ్నిహోత్రునికి పూజ చేయిస్తారు. చక్కని భోజనాలు తయారు చేయించడమే కాకుండా, ఏ ప్రమాదాలు జరగకుండా పెళ్లి నిర్విఘ్నంగా జరిగేటట్లు అగ్ని దేవుడిని ప్రార్థిస్తారు. ఆతర్వాత పెళ్లికి ముందు ఎన్ని రోజులు విరామం ఉంటే అన్ని రోజులు పెళ్లి కొడుకు, పెళ్లికూతురుని చేయవలసిందే.పెళ్లి బొట్టు,పసుపు, పారాణీ పెట్టి రోజు ఒకరు పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకును చేస్తారు.

ఇంటి ముందున్న పందిరికి పూజ చేయించి, ఒక స్తంభానికి ప్రత్యేక పూజ చేసి అక్కడ ప్రసాదంగా లడ్డూలను ఉంచుతారు.

ఎదురు కోళ్ల కార్యక్రమం ప్రత్యేకం. అమ్మాయి తరపు వాళ్ళు పెళ్లి వారిని వేడుకతో ఆహ్వానిస్తారు.

ముందుగా ముత్తైదువులు అందరూ కలిసి, మగ పెళ్లి వారు ఉన్న విడిది ఇంటికి వెళ్లి వారికి పసుపు కుంకుమలు పెట్టి ఆహ్వానిస్తారు. అలా విడిది ఇంటి నుండి ఊరేగింపుగా ఒకనాటి ముచ్చటగా ఉన్న ముత్యాల పల్లకిని తెప్పించి చక్కగా అలంకరించి అందులో పెళ్ళికొడుకుని కూర్చోబెట్టి పల్లకి ముందర పిల్లలందరూ నృత్యాలు చేస్తుంటే పెద్దవాళ్లు మంగళహారతులు పసుపు కుంకుమలు పట్టుకొని నడుస్తుంటే ఆముచ్చట ఎంతో శోభాయ మానంగా ఉంటుంది.

అలా పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చి మంటపంలో కూర్చోబెట్టి వర పూజ చేశారు. పెళ్లికూతురు తల్లి తండ్రి ఒక పల్లెలో పెళ్ళికొడుకు కాళ్ళను కడిగి పసుపు పారాణి దిద్ది కొత్త వస్త్రములను అందించారు. తర్వాత బాసింగం కట్టారు.

ఇదే తీరుగా అమ్మాయిని తీసుకుని వచ్చి, అమ్మాయికి చందనగంధములను రాసి అత్తగారు కొత్త వస్త్రములను పెళ్లికూతురికి బహుకరించారు. తర్వాత కన్య నిశ్చయం చేసారు. పెళ్లికూతురుకి కూడా బాసికం కట్టారు.

తర్వాత ఇటువైపు వాళ్లు అటువైపు వాళ్ళు కలిసి చక్కగా పసుపు, కుంకుమ, గులాల్ చల్లుకుంటారు ఒకరికొకరు తీపి పదార్థాలను తినిపించుకున్నారు. మగ పెళ్లి వారికి పానకం బిందెలు అందిస్తే ,ఆ పానకం అందరూ చక్కగా తాగారు.తర్వాత అందరికీ బట్టలు పెట్టడం జరుగుతుంది అది ఇరువైపుల వారికి సమానంగా ఉంటుంది.

ఇదంతా సాగర్ కి మరియు సౌదామినికి చక్కని వేడుకలాగా జరిగింది.

పట్టు చీర కట్టుకొని, పూల జడ వేసుకొని పెళ్లి కళతో ధ గధగా మెరిసిపోతుంది సౌదామిని.

నీలాంబరి ఇంటి పారంపర్యంగా వచ్చే నగలని చక్కగా మెరుపు పెట్టించి, సౌదామిని మెడలో అలంకరించింది.

ఇటు సాగర్ కూడా పట్టు బట్టలు కట్టుకొని పెళ్లి బొట్టు, బాసికం వేసుకొని ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. ముత్యాల గొలుసుతో పాటు, నీలాంబరి వేసిన చంద్రహారం చూడచక్కగా ఉన్నాయి.

ఇలా ఈతతంగం అంతా జరిగేసరికి దాదాపు రాత్రి పదకొండు గంటలు అయింది.

ఆతర్వాత ఆడపెళ్లి వాళ్ళు మగ పెళ్లి వారికి లుక్కోత్రం సమర్పించారు.

అలంకరణ కోసం ఉపయోగించే సామగ్రిని ఉంటుంది.

పౌడరు ,తిలకము ,సబ్బులు అయితే కుంకుడుకాయలు లేదా షాంపూ, సెంటు సీసా, పన్నీరు, దువ్వెనలు, కొత్త టవల్స్, బెడ్ షీట్స్ ఇలాంటివన్నీ వారికి అందజేశారు. తర్వాత ఐదు డబ్బాలలో నూట ఎనిమిది చొప్పున లడ్డూలు, అరిసెలు, చక్కిలాలు, అప్పాలు,జంతికలు పెట్టి వారికి అందజేసారు. ఎదుర్కోల కార్యక్రమం ఇలా సాంప్రదాయంగా ముగిసింది.

రాత్రి భోజనానంతరం అందరూ విశ్రాంతి తీసుకున్న తర్వాత తెల్లవారి ఉదయం పెళ్లి కార్యక్రమం.

మధుపర్కములు కట్టుకున్న పెళ్ళికొడుకుని, ముందుగా పందిట్లోకి ఆహ్వానించి, కూర్చోబెట్టారు .పెళ్లి కొడుకుని విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. అత్తగారు మామగారు కలిసి వెండి లేదా బంగారు యజ్ఞోపవీతమును వేసారు.

తర్వాత పెళ్లి కుమార్తెను అలంకరించిన గంపలో కూర్చోబెట్టి, మేనమామ, అన్నలు తమ్ముళ్లు కలిసి పందిట్లోకి తీసుకొని వచ్చారు. ఈవేడుక ఎంతో బాగుంటుంది.అలా కూర్చోబెట్టిన తర్వాత పెళ్ళికొడుకు కాళ్ళు కడిగిన తర్వాత ఇరువురికి జీలకర్ర బెల్లం పెట్టించారు.అదే సుముహూర్తము. అందరూ వచ్చి అక్షింతలు వేసి దీవించారు.అలా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు అప్పుడు మాత్రమే చూసుకోవాలి. మధ్యలో కట్టిన తెరను తొలగించిన తర్వాతే ఇదంతా జరుగుతుంది.

తర్వాత తాళి కట్టడం తలంబ్రాలు పోసుకోవడం ఇదంతా ఒక చక్కని వేడుక.

ఇలా సౌదామిని మరియు సాగర్ల పెళ్లి ఎంతో అద్భుతంగా జరిగింది.

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రమక్కతో ముచ్చట్లు-25

అనుభవ సుధాసారం