రివ్వురివ్వున స్నేహితులకంటే స్పీడుగా సైకిలు తొక్కుకుంటూ ఎంతోసంతోషంతో ఇంటికొచ్చింది రాధ. సైకిలుస్టాండ్ వేస్తూ ఓడలాంటికారు ఇంటిముందు చూసి మొహం చిట్లించుకుంది.
‘ఎవరైవుంటారు? ఇంతపెద్దకారులో మారుమూల మాఇంటికి వచ్చింది!’ అనుకుంటూ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ హాలులోకి వెళ్ళింది రాధ.
‘ఆశ్చర్యం పేపర్లోచూసిన డా౹౹పద్మావతి తండ్రితో, అన్నతో ఏదోమాట్లాడుతోంది.’
“ఒకసారిటురామ్మా! పెద్దవారు నమస్కారంచేయి.” అంటూ ఆవిడని పరిచయం చేయబోయాడు తండ్రి వెంకటేశ్వర్లరెడ్డి.
“నమస్కారమండీ! మీరు డా౹౹పద్మావతి గైనకాలజిస్ట్ కదండీ! మీకు ఆంధ్రప్రదేశ్‌లోనే బెస్టుగైనకాలజిస్ట్ అవార్డు వచ్చిందికదూ! ఇవాళ మా హెడ్మాస్టరుగారు. ప్రేయర్లో పేపర్లో మీ ఫొటో చూపించి మీరు మాస్కూల్లోనే చదివారని, మమ్మల్ని మీఅంతపేరు తెచ్చుకోవాలని చెప్పారు.నాకు చాలాసంతోషంగా ఉంది.” అంటూ గలగలా మాట్లాడుతున్న రాధని నవ్వుతూ చూసింది డా౹౹ పద్మావతి.
“తల్లిలేని పిల్ల ఎలామాట్లాడాలో తెలియదు.” అన్నాడు సిగ్గుపడుతూ వెంకటేశ్వర్లరెడ్డి.
తండ్రిమాటలకు రాధ అలిగింది.’తనేం తప్పు మాట్లాడింది ‘ అనుకుంటూ వదిన ఇచ్చిన కాఫీ బిస్కట్లు తెచ్చిచ్చింది.
కాఫీ నోట్లోపెట్టుకుని”కాఫీ చాలా బాగుందమ్మా వంటకూడావచ్చా!”అంది డా౹౹పద్మావతి.
“లేదండీ ఇంకా చిన్నపిల్ల.మాపెద్దకోడలు దీన్ని కూతురుకంటే గారంగా చూసుకుంటుంది.” అన్నాడు వెంకటేశ్వర్లరెడ్డి.
“సరే! వెళ్ళొస్తానండీ!మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకోండి.” అంటున్న పద్మావతికి బొట్టుపెట్టి తాంబూలమిచ్చింది అలమేలుమంగ రాజారెడ్డి భార్య.
ఆవిడటు వెళ్ళంగానే,”నాన్నా! ఆవిడ మనింటికెందుకొచ్చింది? ఏమిటి ఆలోచించుకోమంటుంది? “అంటూ ప్రశ్నల పరంపర వేసింది రాధ.
“ఏంలేదు తల్లీ! స్కూలునించీ ఏవో చాలా మోసుకొచ్చావు?” అంటూ మాటతప్పించాడు వెంకటేశ్వర్లు.
“ఆఁ అవునవును,నాన్నా! స్టేట్‌లెవల్ కబడ్డీకి, రన్నింగ్ రేస్‌కి, సెలక్ట్ చేసారు.ఇవన్నీ కబడ్డీ,చెస్, హైజంప్, రన్నింగ్ లో గెలిచిన కప్స్.ఇదినా ‘స్పోర్ట్స్ఛాంపియన్ షీల్డ్’ నాన్నా!అన్నా!” అంటూ అవధులుదాటిన ఆనందంతో తండ్రిని అడిగిన ప్రశ్న మరచిపోయింది రాధ.
అన్నీ భగవంతుడే నడిపిస్తాడన్న వేదాంతాన్ని నమ్మిన దయగల వ్యక్తి వెంకటేశ్వర్లురెడ్డి.అందరిలా పైసాపైసా లెక్కపెట్టుకోవటం,లాభనష్టాలు బేరీజువేయటం,ఆస్తులు కూడబెట్టుకోవాలనే అత్యాశ లేనివాడు.అందుకే తోటివాళ్ళు వెంకటేశ్వర్లుని చేతకానివాడిక్రింద జమకడతారు.
వెంకటేశ్వర్లు భార్యభాగ్యం భర్తకుతగ్గ ఇల్లాలు. ఐదుగురుపిల్లల తల్లయినా ఎవరిమీద విసుక్కోవటం చిరాకు పడటం ఎరగదు.
పెద్దకొడుకు రాజారెడ్డి తల్లితండ్రుల నిదానాన్ని పుణికిపుచ్చుకున్నాడు.వెంకటేశ్వర్లుకి ఉన్న నలభై ఎకరాల భూమిని తండ్రితో వ్యవసాయం చేసుకుంటూ పెద్దచెల్లెలిని ఇద్దరుతమ్ముళ్ళని చదివిస్తున్నాడు.
పెద్దచెల్లెలు జయలక్ష్మి పోస్టల్ డిపార్టమెంట్లో సెలక్ట్ అయ్యింది. ఆతరువాత రెండేళ్ళకే చంద్రశేఖర్కిచ్చి వివాహం జరిపించారు. చంద్రశేఖర్ టెలిగ్రాఫ్స్ లో పనిచేయడంతో వారిని పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ కపులని ఆటపట్టించేవారు రాధ, శ్రీనివాసరెడ్డి. మరియు కేశవరెడ్డి.
కూతురి పెళ్ళి అవంగానే రాజారెడ్డికి మంచి సంబంధం చూసి పెళ్ళిచేసాడు వెంకటేశ్వర్లురెడ్డి. కోడలు అలిమేలుమంగ సాక్షాత్తు అలిమేలుమంగనే. రాజారెడ్డి పెళ్ళయిన కొద్ది.నెలలకే భాగ్యం ఆరోగ్యం దెబ్బతింది.గర్భసంచి కేన్సర్ ఆఖరిదశలో అంతటాపాకి ఆరునెలల్లో కన్నుమూసింది.
ఎంతో ప్రశాంతంగా ఉన్న కొలనులో రాయివేసినట్టయింది భాగ్యంమరణంతో . చదువుకుంటున్న ఇద్దరుతమ్ముళ్ళు, తొమ్మిదేళ్ళచెల్లెలు రాధ బాధ్యత రాజారెడ్డి మీద పడింది.
వెంకటేశంచేసిన పుణ్యమేమో ఆకుటుంబం విషాదంలొ ఉన్నప్పుడు అలిమేలుమంగ అటు మామగారిని, మరుదుల్ని,చిన్నాడపడుచుని కంటికిరెప్పలా చూసుకుంది.
★★★
కాలప్రవాహం ఆగదు. కొండలూగుట్టలూ అడ్డువచ్చినా అవిరామంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆప్రవాహంలో బండరాళ్ళు ఎదురొచ్చినా దాటి చదునుప్రదేశంలో స్వేచ్ఛగా పారుతుంది.కేశవరెడ్డి, శ్రీనివాసరెడ్డి జీవితాలుకూడా కాలప్రవాహంలో ఒక
ఒడ్డుకి చేరుకున్నాయి.
ఇద్దరికీ పోలీసుడిపార్టమెంటులో మంచి ఉద్యోగాలు వచ్చాయి.శ్రీనివాసరెడ్డికి తిరుమలలో కేశవరెడ్డికి అనంతపూరులో పోస్టింగ్ వచ్చింది.కొడుకులిద్దరూ దూరమవుతున్నట్టు అనిపించింది.వెంకటేశ్వర్లరెడ్డికి. కారణం భాగ్యం కాలంచేసినప్పటనించీ ముగ్గురు మగపిల్లలని,చంటిది రాధని వదిలుండలేదు.
వయసుతో వెంకటేశ్వర్లుకి ఆరోగ్యంక్షీణించింది.
దానితో ‘తనకేమైనాఅయితే చిన్నది రాధజీవితం ఎలా? పెద్దకోడలులాగా మిగతా ఇద్దరు కోడళ్ళుకుటుంబ పరిస్థితి అర్ధం చేసు కోగలరా?రాధని ప్రేమగా చూసుకుంటారా? పోనీ పెళ్ళి చేద్దామంటే పెళ్ళి వయసుకాదు.’ అనే అంతర్మధనం కృంగతీస్తోంది వెంకటేశ్వర్లుని
★★★
డా౹౹పద్మావతి చిత్తూరుజిల్లాలోనే మంచి పేరున్న
డాక్టరు. ఆమె సహృదయంతో పేదప్రజలకి
నామమాత్రపుఫీజుతో అందించే సేవ,వృత్తిలో నైపుణ్యం ఆమెని అవార్డుగ్రహీతని చేసాయి.
కాని ఎంతమందికో పురుళ్ళుపోసి పండంటి పాపాయిలని తల్లులవడిలో ఉంచిన ఆమె 65 వడినిండలేదు.పెళ్ళయి ఇరవైఏళ్ళయింది. ఆడదానిగా పిల్లలులేరన్నలోటు అప్పుడప్పుడు ముల్లులా గుండెల్లో గ్రుచ్చుకుంటూ ఉంటుంది.కానీ తనుకాన్పుచేసిన ప్రతీతల్లి బిడ్డలోనూ తన బిడ్డని చూసుకునేది.
భర్త డా౹౹జయచంద్ర పీడియాట్రీషియన్. జయచంద్రకి పిల్లలంటే ప్రాణం.అందుకే పీడియాట్రీషియన్ గా సెటిల్ అయ్యాడు.పిల్లలఏడపుతో వారి బాధను పసిగట్టగల నేర్ఫరి.
డా౹౹ పద్మావతిది చిత్తూరు దగ్గిర చాలాచిన్న పల్లెటూరు.తండ్రి అనంతరెడ్డి గాంధేయభావాలు కలవాడు. స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్నవాడు. వినోభాభావే భూదానోద్యమంలో వంద ఎకరాలు దానంచేసాడు.తన పిల్లలపేరులో కులాన్నితెలిపే ‘రెడ్డి ‘ లేకుండా పేరుపెట్టాడు. ఆడపిల్లలకి విద్య ఎంతో అవసరమని,ఇద్దరు కూతుళ్ళని చదివించాడు.పెద్దకూతురు పద్మావతి ఎంతో చురుకుగా మెడిసిన్చేస్తే చిన్నకూతురు జయదుర్గ ఫిజిక్సులోడాక్టరేట్ చేసి ఇస్రోలో సైంటిస్టుగా ఉంది.
అనంతరెడ్డి ఆనందానికి అంతరాయం, లేకలేక కలిగిన కృష్ణమోహన్.ఐదేళ్ళవరకూ అందరినీ ముద్దుమురిపాలతో అలరించి విధివక్రించి పిల్లలపాలిటి రాక్షసి పోలియోబారినపడి ఒక కాలుచేయి అవకరంతో అందరినీ దుఃఖంలో ముంచాడు.ఎడమకాలు ఎడమచేయికి రావటంతో కృష్ణమోహన్‌ని జీవితంలో తిరిగిలేవకుండా దెబ్బతీసింది మాయదారి పోలియో.
లేకలేక కలిగిన మగబిడ్డకి కాలుచేయిసరిలేక కాలీడుస్తూ నడుస్తుంటే చూడలేక నడక రావాలని మ్రొక్కనిదేవతలు చేయించనివైద్యం లేదు.కొంతవరకూ కేరళావైద్యంతో మెరుగై నడకవచ్చింది కానీ కుడికాలుకిఎడమకాలుకి, కుడిచేతికిఎడమచేతికి చాలావ్యత్యాసంవలన నడకకుంటిదైంది.
భగవంతుడు అవకరంతోపాటు దానిని అధిగమించే శక్తిసామర్ధ్యాలు కూడాఇస్తాడన్నట్లు చదువులో అక్కలకిదీటు కృష్ణమోహన్.పదిహేనేళ్ళవరకూ కొడుకు గురించి ఆహోరాత్రులు శ్రమించినజగదాంబ కాలంచేసింది.
అక్కపద్మావతి బావ జయచంద్ర కృష్ణమోహన్‌ని చిత్తూరు తమదగ్గరకు తెచ్చుకున్నారు. పిల్లలు లేకపోవటం ఇద్దరూ కృష్ణమోహన్‌ని ఎంతోప్రేమతో పెంచుకున్నారు.
కృష్ణమోహన్ తనకి అవకరంఉందనేధ్యాస, ఇన్ఫీరియారిటీకాంప్లెక్స్ లేకుండా అడపాదడపా కౌన్సెలింగ్ చేస్తూ ఆత్మస్థైర్యంకలిగేలా పెంచారు.
కృష్ణమోన్ ఇంగ్లీష్ లిటరేచర్‌లో డాక్టరేటయ్యాడు. గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ గా సెటిలయ్యాడు.
సహజంగా అందగాడు,దానికితోడు పరిపక్వమైన వ్యక్తిత్వం, తండ్రితాతల దయాగుణం పుణికిపుచ్చుకున్నాడు.వయసుముఫ్పైనాలుగేళ్ళు.
పెళ్ళికిసుముఖంగా లేడు.పద్మావతికి మాత్రం తమ్ముడికి ఒకతోడు తేవాలి.పేదింటిపిల్లయినా తమ్ముడిని ఆదరించే గుణముంటేచాలని పెళ్ళికావలసిన ఆడపిల్లల గురించి వాకబుచేస్తోంది.
తెలిసినవారి ద్వారా కేశవరెడ్డి చెల్లెలు పెళ్ళికుందని వింది.కాని వయసు తెలియదు.అందుకే వెంకటేశ్వర్లురెడ్డిని కలవటానికి వచ్చింది.
రాజారెడ్డికి చెల్లిలిని వయసులో అంతవ్యత్యాసమున్న వ్యక్తికిచ్చి అందునా అవిటివానికిచ్చి చేయటం ససేమిరా ఇష్టం లేదు. అందుకేవారి అయిష్టతను పద్మావతికి తెలిపారు.
రాధని చూసిన పద్మావతికి వయసులో పెద్దవ్యత్యాసం అనిపించలేదు. ‘ రాధ మంచిపొడగరి పొడవుకుతగ్గ అవయవ సౌష్టవం. సోగకళ్ళు, కవులవర్ణనా అన్నట్టు సంపెంగపూవువంటి నాసిక,నవ్వినా నవ్వకపోయినా నవ్వినట్టుండే పెదవులవంపులు,నడుము క్రిందకు అరచేయివెడల్పు నల్లపట్టుదారాలనే జడల్లినట్లున్నజడ.చామనఛాయతో తనతమ్ముడు కృష్ణమోహనుకు చక్కని జోడి.మాయదారి పోలియో వాడిని వేటాడిఉండకపోతే!’ అనుకుంది.పద్మావతి .
మనసులో ‘రాధ కుదురుతే బాగుండును’ అని ఆశపడ్డది.
డా౹౹పద్మావతి వచ్చి వెళ్ళాక వెంకటేశ్వర్లుకి అంతులేనిదిగులు ఆవహించింది.చిట్టితల్లికి వచ్చిన
మొదటి సంబంధమే ఇటువంటి సంబంధం అని.
తాతముత్తాతలనించీ మంచిపేరున్నకుటుంబం. పిల్లవాడు గుణవంతుడు విద్యావంతుడు కానీ……..! అక్కడే బ్రేకుపడింది.
అంతటివాళ్ళు తమంతతాము తమ గడపలోనికి రావటం అదృష్టమో!దురదృష్టమో ఇదమిథ్థంగా తేల్చుకోలేని పరిస్థితిలో మానసికసంక్షోబంతో గుండెపోటువచ్చింది వెంకటేశ్వర్లుకి.
డా౹౹పద్మావతి సలహామేరకు కార్డియాలజిస్ట్. డా౹౹విజయకుమారుకు చూపించి అడ్మిట్ చేసారు.వరుసగా చేయవలసినపరీక్షలు, ఏంజియోగ్రామ్ అయినతరువాత బైపాస్ తప్పనిసరి అని తేల్చటంతో,డా౹౹పద్మవతి రాజారెడ్డి. అన్నదమ్ములకి ధైర్యంచెప్పింది.దగ్గరుండి ఆపరేషన్. వ్యవహారమంతా చూసుకుంది స్వంతమనిషిలాగా.
డా౹౹పద్మాతి నిరాడంబరత,నిస్వార్ధ సేవ, దయాగుణం ఆనోట ఈనోట కధలుగా వినటమేకాని ప్రత్యక్షంగా చూసి అనుభవించిన రాజారెడ్డి. అన్నదమ్ములు మనస్సులోనే నమస్కరించారు.
తండ్రిని మృత్యుముఖంనుండి కాపాడిన డా౹౹పద్మావతి మీద రాధకి రెట్టింపు గౌరవం పెరిగింది.
తండ్రిని చూడటానికి హాస్పిటలకి వెళ్ళినప్పుడు ఆదేవీధిలోఉన్న డా౹౹పద్మావతి నర్సింగ్హోముకు వెళ్ళిపద్మావతిని కలిసింది రాధ.
“డాక్టరుగారు!నాన్నకి హఠాత్తుగా ఎందుకిలాజరిగింది? నాన్నని అనారోగ్యంతో నేనెప్పుడూ చూడలేదు.” అమాయకంగా అందిరాధ.
“దానికి కారణం పరోక్షంగా నేనేనమ్మా!”అంది పద్మావతి.
“మీరెలాఅవుతారు డాక్టరుగారు!”ప్రశ్నార్ధకంగా అడిగింది రాధ.
“ఏంలేదమ్మా!ఆరోజు మీ ఇంటికి నేను వచ్చింది మాతమ్ముడికి నిన్ను అడగటానికి.మాతమ్ముడుకి పోలియో మూలాన ఒక కాలుచేయి సరిగ్గా ఉండదు.ఆవిషయం మీనాన్నగారిని బాధించిందేమోనని చాలా గిల్టీగా ఉందమ్మా!”అంటూ రాధ చేతులు పట్టుకుంది క్షమించమన్నట్లు.
మౌనంగా ఆమెకు నమస్కరించి వెనుకకు తిరుగుతున్న రాధకి “అక్కా” అంటూ కన్సల్టేషన్ రూమ్ లోకి అడుగుపెడుతున్న వ్యక్తి ఎదురొచ్చాడు.అతను లోపలికివస్తుంటే దారిఇస్తూ తలవంచుకొని పక్కకి జరిగింది రాధ.
“రాధా! ఒక్కనిమిషమమ్మా!”అంటూపద్మావతి రాధని పిలిచింది.
అసలే అయోమయంగాఉన్న రాధ ఏమిటన్నట్లు చూసింది ప్రశ్నార్ధకంగా!
“రాధా! మాతమ్ముడు కృష్ణమోహన్” అంటూపరిచయం చేసింది.
“కృష్ణా! నాపేషంట్ వాళ్ళమ్మాయిరాధ.”అంటూ పరస్పరం పరిచయం చేసింది.
తలెత్తి కృష్ణమోహన్ ని చూసిన రాధ అప్రయత్నంగా నమస్కారం చేసింది. ఆశ్చర్యపోయింది.
‘భగవంతుడా! కళ్ళుతిప్పుకోలేని తేజస్సు.మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందం.ఈమనిషికా ఈ అవకరం.భగవంతుడు ఎంత నిర్దయుడు. ఇంతటి తేజస్సును అధిగమిస్తూ విషాదవీచికలు.’ అనుకుంది రాధ.
‘ఎంతోమంది స్టూడెంట్స్‌ని చూసిన తనకు ఈ అమ్మాయి ఎంతో ప్రత్యేకంగా కనపడుతోంది. ఆమె కళ్ళల్లో ఎంతో పట్టుదల ఆత్మస్థైర్యం’ కృష్ణమోహన్‌ని అబ్బురపరచింది.
చిరునవ్వుతో కృష్ణమోహన్‌కి నమస్కారంచేసి, “వెళ్ళొస్తానండీ” అంటూ నిష్క్రమించింది రాధ.
“ఎవరక్కా! ఆ అమ్మాయి..ఆ అమ్మాయిలో ఏదో ప్రత్యేకత ఉంది.చాలా తెలివిగలది.” అన్నాడు.ఎంతోమంది విద్యార్ధులని చూసిన అనుభవంతో.
“అవునురా కృష్ణా! అందుకే నీకు తోడుగా మనింటికి నా మరదలుగా తెచ్చుకుందా మనుకున్నా!”అంది పద్మావతి క్రీగంట తమ్ముడి ముఖకవళికలు గమనిస్తూ.
“అక్కా నాది అవిటి బ్రతుకు.నాజీవితాన్ని ఇంకొకళ్ళతో ముడిపెట్టి వారి జీవితం నాశనం చేయటం నాకిష్టంలేదు.నా అవకరాన్ని చూసి జాలిపడి కాక మనస్పూర్తిగా ఏక్సెప్ట్ చేసేవాళ్ళని తప్ప నేను ఎవరినీ నాజీవితంలోకి ఆహ్వానించలేను.” అంటూ వెనుదిరిగాడు.
ఇంటికి వచ్చిన రాధమనసు మనసులో లేదు.తండ్రి అనారోగ్యం రాధలో పెద్దరికం తెచ్చింది.ప్రతీది లోతుగా ఆలోచిస్తోంది.
“ఏమిపాపం చేసాడని భగవంతుడు కృష్ణమోనుకు అంత శిక్ష వేసాడు.డాక్టరుగారికి పిల్లలు లేరు.నాకు అమ్మ లేదు.భగవంతుడు అందరికీ ఒక్కోకష్టం పెట్టి వినోదిస్తాడేమో!” అనుకుంటూ తనకిష్టమైన వెంకటేశ్వరస్వామిని
ధ్యానించింది.
‘తండ్రీ నీనిర్ణయానికి నేను కట్టుసడి ఉంటాను. తల్లిలేని నాకు నీవేతల్లివి.నామంచి చెడు నీదే’ అంటూ ఎప్పటిలా. ప్రార్ధించి ప్రశాంతంగా నిద్రపోయింది.
★★★
వెంకటేశ్వర్లు క్షేమంగా డిస్చార్జ్ అయి ఇంటికివచ్చాడు.
డిస్చార్జప్పుడు తనను చూడటానికి వచ్చిన డా౹౹పద్మావతి మాటలు వెంకటేశ్వర్లు కి ఆమెమీద గౌరవం ఇనుమడింపజేసింది.
“వెంకటేశ్వర్లుగారు!నన్ను క్షమించండి స్వార్ధ పూరితంగా మీ అమ్మాయిని మాతమ్మునికి అడిగి మీ మనసు గాయ పరచాను. మీఅనారోగ్యానికి పరోక్షంగా నేనేకారణం. భగవంతుడు కూడా క్షమించడు.” అంటూ చేతులు పట్టుకుంది పద్మావతి.
ఏం సమాధానం చెప్పాలో తెలియని వెంకటేశ్వర్లు నిస్థాణువయ్యాడు .
రోజులు గడుస్తున్నాయి.రాధ ఫైనల్ఎక్జామ్స్ ప్రిపరేషన్ జోరుగా సాగుతోంది.ఎక్కడో కృష్ణమోహన్ ఆకృతి తనని ఏదో ప్రశ్నిస్తున్నట్లుగా కనపడటం.తల విదిల్చుకొని మళ్లీ చదువులో నిమగ్నమయ్యేది.
పరిక్షలుఅవంగానే ఎప్పటిలాగా తండ్రిపక్కన చేరి ఎన్నో విషయాలు చర్చించేది.
ఒకరోజు మాటల్లో ” నాన్నా! పెళ్లి అనేది దైవనిర్ణయమా?” అనిఅడిగింది రాధ.
హఠాత్తుగా కూతురు అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియని వెంకటేశ్వర్లు,”అవును!లేకపోతే మీ అమ్మది విజయవాడ దగ్గిర పల్లె. నేను చిత్తూరు. ఎవరెవరి ద్వారానో నాసంగతి మీతాతకి మీఅమ్మసంగతి మానాన్నకి తెలిసింది.అప్పట్లో పెళ్ళిచూపులు చూడటం నిర్ణయం అన్నీ మొగపిల్లాడివైపే ఉండేది.కానీ మా నాన్న అందుకు విరుధ్ధంగా అమ్మాయి అభిప్రాయం కనుక్కొని చెప్పమన్నారు. ఆమాటకే మీఅమ్మ ఎంతోసంతోషించింది పిచ్చిది.వెంటనే సరే అంటం పెళ్ళైపోయింది. రాసిపెట్టుంటే ఎన్నిఅవాంతరాలొచ్చినా పెళ్ళవుతుంది.” అన్నాడు వెంకటేశ్వర్లు.
“అయినా నీకివన్నీఎందుకురా తల్లీ!ఈ సమ్మర్ హాలీడేస్‌లో నేషనల్ లెవెల్ కాంపిటీషన్‌కి కోచింగుకు వెళ్ళు.కోచింగ్ ఫీజు రాజన్నదగ్గర తీసుకో.” అంటూ రాధ తలనిమిరుతుండగా …
సశేషం