అమ్మా!ఆకలి వేస్తుంది. త్వరగా అన్నంపెట్టు’ అంటూ రాధ వాళ్ళమ్మ వకుళను అడిగింది. వకుళ ఏదో ఆలోచనలతో వంటిట్లో మసిబారిన గొడపై వ్రాసి ఉన్న వాటిని చదువుతుంది. 2 రోజులలో పరీక్షలున్నాయని, తన ఆందోళన. అమ్మ చదివే అక్షరాలపై రాధ ధ్యాస పడింది. ‘అవేంటి అమ్మా?’ అంది రాధ. ‘విభక్తులు- తెలుగు వ్యాకరణం లోనివి. నాన్న తెలుగు విశారద పరీక్ష వ్రాయాలని, నాకోసం ఫీజు కట్టాడు. ఆ పరీక్షకు సన్నద్ధమవుతున్నాను’- అన్నది వకుళ.
10 ఏళ్ల వయసులో వకుళకు పెళ్ళ చేసారు. చదువుకున్న కుటుంబంలో అడుగుపెట్టింది. తనకు చిన్నప్పటి నుండి చదుకోవాలన్న ఆసక్తి ఉన్నా, ‘ఉత్తరం చదివే చదువుంటేచాలని, 4వ తరగతిలో ఆపేసారు. పెళ్ళయ్యాక భర్త ప్రోత్సాహంతో తిరిగి చదివే అవకాశం మళ్ళి వచ్చింది . సంతోషంతో చదవాలని అనుకుంది. కానీ పరిస్థితులు ముందుకు సాగనివ్వట్లేదు . తనకు 4గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు. దేవాలయంలో నిత్య నైవేద్య తయారి. ఇంటి భారం ఎక్కువై సమయం దొరకడంలేదు. భర్త వెంకట్ తనకు అనువుగా, పొగచూరిన గొడలపై చదువుకోవాల్సిన సిలబస్ ని వ్రాసిపెట్టాడు. తీరిక దొరికినప్పుడల్లా, వాటిని చదువుతూ ఉండేది వకుళ. మధ్యలో అవాంతరాలు. ఎంత శ్రద్ధ పెట్టినా తాను చదువ లేక పరీక్షలో ఉత్తీర్ణతను పొందలేక పోయింది. ఇది సాగని పని అని నిర్ణయించుకొని, తన సన్నిహితులకు, సంతానానికి చదువు విలువను తెలుపుతూ ప్రోత్సహించేది .
తన పిల్లలు చదువులో వెనుక పడకుండా, వారికి నిత్యం మార్చోబెట్టుకొని, కంఠస్థం చేయించుకొనేది. విలువలను తెలుపుతూ, చదువుతో పాటు సంస్కారాన్ని నూరి పోసేది. మౌనంగా ఉంటూనే, కనుసన్నలలో భయభక్తులను నేర్పించింది. ఎన్నో భావావేశాలు ఉన్నా చిరునవ్వుతో వాటిని కనిపించకుండా దాచుకొనే మృధుస్వభావి. ఏది ఎవరికి కావాలన్న క్షణంలో వారికి చేసిపెట్టేది. ‘నలుగురికి ఉపయోగపడడమే జీవితం’అనే సంఘజీవి. ‘మానవ సేవే మాధవ సేవ” అని నమ్మే సిద్ధాంత వాది. ఇన్ని సుగుణాలు ఉన్న భాగ్యశీలి వకుళ.
సమయాన్ని వృధాచేయని నిత్యచైతన్యశీలి అయిన వకుళ గ్రామంలో మహిళాభ్యుదయానికి ఒక సంఘాన్ని ఏర్పాటు’ చేసింది. ప్రతి మహిళ స్వీయ సంపాదన చేసే విధంగా కుట్టుపని నేర్చుకొని, అందరికి నేర్పించింది. ‘మహిళా మండలి’ ద్వారా ఉచితంగా కుట్టుమిషన్లు ఇప్పించారు. అంతేకాక ‘ పద్మావతి మహిళా సూపర్ బజారు’ ఏర్పాటు చేసి, గ్రామమహిళల సహకారంతో ‘సహకారసంఘం’ ఏర్పాటు చేసింది. అందరికి ఆత్మ స్థైర్యాన్ని నూరిపోసి, వారి జీవితాలలో వెలుగులు నింపాలను కుంది. ఆ కలలను సాకారమయ్యే విధంగా వెంకట్ తోడున్నాడు. ఏ అధికారి వద్దకు వెళ్ళినా తోడగా వెళ్ళి వకుళకు చేదోడువాదోడుగా నిలిబడ్డాడు. ఇంటా, బయట ఎప్పుడు ఏదో కార్యక్రమాలను నిర్వహిస్తూ,’ పనియె పరమేశ్వరారధన’గా భావించింది వకుళ.
ఇలా ఉండగా ఒకరోజు తన కూతురుని చదివించే సమస్య ఎదురయ్యింది. పెద్దకూతురు విజయ, రెండవకూతురు గిరిని ఒకే దగ్గర ఉంచి ‘జనగామ’ కాలేజీలో ఇంటర్ చదువును చదివించారు. విజయ వివాహం కాగానే గిరిని (డిగ్రీ ), కూతురు రాధను ఇంటర్ పూర్తి చేయించారు. తాము ఉన్న గ్రామంలో (షాపురం) 10 వ తరగతి వరకే ఉంది. పై చదువులకు ‘జనగామ’ పట్టణానికి వెళ్ళాల్సిందే . ఇంటర్ పూర్తయిన రాధ పైచదువులు చదివించాలంటే ఒంటరిగా ఉంచడం (ఆడపిల్లను) కష్టం. ఎలా? అని ఆలోచనలో పడ్డారు.’చదువు ఆగిపోతే ఎలా? ‘అని ఆందోళనపడింది రాధ. జీవితంలో అక్షరాలకు దూరమై అజ్ఞానంలో ఉండిపోవాలా? అని మదనపడింది. కాని వకుళ కూతురి మనసు తెలుసుకొని, భర్తను ఎదురించలేక మౌనంగా ఏదో పని కల్పించుకొని జనగామ వెళ్ళింది. అక్కడ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అంజయ్య గారి వద్దకు వెళ్ళి, అప్లికేషన్ నింపించి, అభ్యర్ధన దరఖాస్తు పెట్టి వచ్చింది.ఇంట్లొ ఎవ్వరికి చెప్పలేదు. వారం గడిచాక వెంకట్ కి కళాశాల ప్రిన్సిపల్ నుండి ఉత్తరం వచ్చింది. మీ అమ్మాయికి (రాధ) BA లో సీటు వచ్చింది,వచ్చి చేరండి’ అంటూ. వెంకట్ దిగ్భ్రాంతికి లోనయ్యాడు. అంతలోనే వకుళ తానే దరఖాస్తు చేసానని, చదివిస్తే, రాధ భవిష్యత్తు బాగుంటుంది. మనం కట్నం ఇవ్వలేము.చదువు చూసైనా మంచి సంబంధం వస్తుంది’ అంటూ నచ్చచెప్పింది . కాని ఒంటరిగా ఎలా ఉంచుతాము? పోని రోజు ప్రయాణంచేసే వీలులేదు (పొద్దున, సాయంత్రం తప్ప Buses లేవు) ఎలాగా అనుకుంటుండగానే, వకుళ అంది. నేను మనకు తెలిసిన నెల్లుట్ల దొరసాని కమలమ్మని అడిగివచ్చాను . తాను ఉంచు కుంటానకి, తనకు సహకారంగా ఉంటుందని చెప్పింది. రాధను కొంత తన దగ్గర ఉంచుదామని చెప్పింది. వెంకట్ ఆలోచించినా చివరికి రాధ భవిష్యత్ ను గుర్తించి ఒప్పుకున్నాడు.
ఇంటి పనులలో కమలమ్మగారికి సహకరిస్తూనే, చక్కగా చదువుకుంది రాధ . ఎలాంటి సమస్యలు ఎదురయినా చదువే ధ్యేయంగా, ఇంట్లో చెప్పకుండానే వాటిని అధికమించు కుంటూ డిగ్రీ పట్టాను పొందింది. ఇంకా చదవాలనే కోరికతో ఉన్న రాధను M.A ఎంట్రన్స్ కట్టించి, సీటు సంపాదించాక హైదరాబాదులో కొడుకు యదుమోహన్, చిన్న కూతురు కరుణతో ఒక గది అద్దెకు తీసుకొని చదివించారు. ఇలా అందరు పిల్లల్ని డిగ్రీలు చేయించి, కుటుంబంలో చదువుల వెలుగులు నింపారు.
వివాహానంతరం ఆ ఉత్తేజంతో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి రాధ Ph.D డిగ్రి పొంది, ఒక రచయితగా అధ్యారకురాలిగా ఎందరో విద్యార్థుల భవితలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే యజ్ఞంలో పాలుపంచుకుంటుంది. అందుకే “ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు” అన్నారు పెద్దలు .
మహిళాశక్తిని అంచనా వేయలేం. వకుళ విద్యాదికురాలు కానప్పటికి చదువువిలువ తెలుసుకొని, తన కుటుంబంతోపాటు, మహిళా సమాజాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన ధీశాలి. అలాంటి మహిళలు ఉంటే, దేశం కూడా అభివృద్ది పథంలో నడస్తుంది.