వారాలబ్బాయి

పరుగు పరుగున ఇంటర్వ్యూ జరుగుతున్న ఆఫీసులోకి అడుగుపెట్టాడు శ్రవణ్. చమటలు తుడుచుకుంటూ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. అప్పటికే చాలామంది అక్కడ కూర్చుని ఉన్నారు. వాళ్ళంతా నీట్ గా ఇస్త్రీ చేసిన బట్టలతో, పాలిష్ చేసిన బూట్లతో మెరిసిపోతున్నారు. తన వంక చూసుకున్నాడు. ఎన్నేళ్లనుంచో ఇస్త్రీకి కూడా నోచుకొని ప్యాంటు, షర్టు, తెగిపోవడానికి సిద్ధంగా ఉన్న హవాయి చెప్పులు. పక్కనున్నతను తనను చూసి అసహ్యంతో అవతలకు జరిగి కూర్చున్నాడు.ఎవరో గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. “ఈ ఉద్యోగం అప్పుడే ఏ రాజకీయ నాయకుడి మేనల్లుడికో ఇచ్చేసుంటారు. మనల్ని వెర్రివాళ్ళను చేయడానికి పిలుస్తారు. అంతే!” అన్నీ తెలిసినట్లు మాట్లాడుతున్నాడు ఒకతను. గుండె గుభేలుమంది శ్రవణ్ కు.’ఈ ఉద్యోగం కూడా రాకుంటే తమ పరిస్తితి ఎలా?’ కళ్ళల్లోంచి దుమకబోతున్న నీళ్ళను బలవంతంగా ఆపుకున్నాడు.
మెల్లగా ఇంటర్వ్యూ మొదలైంది. ఒకరొకరిగా లోపలికి వెళ్ళి, నిరాశగా బయటికి వస్తున్నారు. ‘వీళ్లకే ఉద్యోగాలు రాకపోతే, ఇలాంటి వేషంలో ఉన్న తనకెలా వస్తుంది? లోపల అవమానం పొందడం కంటే వెనకకు వెళ్ళడం మంచిది.’ వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు.
అంతలో తన పేరు పిలిచారు.భయంభయంగా లోపలికి అడుగుపెట్టాడు. లోపల ఒక అందమైన యువకుడు కనబడ్డాడు. అతను అప్పటికే తన ఫైలులోని వివరాలు చదివినట్టుంది.
“మీ నాన్నగారి పేరేమిటి?” అడిగాడు. ‘ఇదేం ప్రశ్న? ఇంటర్వ్యూ లో ఇలాంటి ప్రశ్నలు కూడా వేస్తారా?’ ఆశ్చర్యపోతూ చెప్పాడు, “నారాయణమూర్తి.” తల పంకించి ఇక వెళ్ళమన్నట్టు సైగచేశాడు. డిగ్రీలో 90 మార్కులు తెచ్చుకున్న తనను సబ్జెక్ట్ కు సంబంధించిన ప్రశ్నలేవీ అడగలేదంటేనే అర్థమై పోయింది. ఈ ఉద్యోగం కూడా రానట్టే.
నీరసంగా రోడ్డుమీద నడుస్తున్నాడు. ఊగిసలాడుతున్న చెప్పు, ‘ఇక నిన్ను మోయలేం’ అన్నట్టు తెగిపోయింది. వాటిని పారేయబుద్ధికాలేదు. రిపేరుచేస్తే ఇంకొన్ని రోజులు వాడుకోవచ్చు. ఒక పేపర్ లో చుట్టి, బ్యాగులో పెట్టుకుని, ఉట్టి కాళ్ళతో నడుస్తున్నాడు. తారు రోడ్డుమీద కాళ్ళు కాలిపోతున్నాయి. నిరాశ, నిస్పృహలతో ఉన్న శ్రవణ్ కు ఆ సంగతే పట్టడంలేదు.
“ఏం శ్రవణ్! ఏమైంది నీ ఇంటర్వ్యూ?” అడుగుతున్న తల్లి సుశీలమ్మకు ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. నీరసంగా గోడకు ఆనుకుని, మొహాన్ని చేతులతో కప్పుకుని బాధపడుతూ కూర్చున్నాడు.
“అమ్మా!” బయటినుంచి వచ్చిన పిలుపుకు ఒక్కసారిగా అటువైపు చూసారు.
ఇంటర్వ్యూ చేసిన ఆఫీసరు…
ఆశ్చర్యంతో నోటమాట రాలేదు శ్రవణ్ కు.
“అమ్మా! నన్ను గుర్తు పట్టలేదా? నేను వేణుని. తల్లిని,తండ్రిని కోల్పోయిన నేను, మీ దగ్గర వారాలు చేసుకుని చదువుకునేవాడిని. అందరిళ్లలో విసుక్కుంటూ అన్నం పెట్టేవాళ్ళు. నీవు మాత్రం సొంత బిడ్డలాగా కొసరి కొసరి వడ్డించేదానివి.” అన్నాడు భావోద్వేగంతో. “నువ్వా నాయనా! ఏదో మాకున్నదాన్లోనే నీకు పెట్టాను.” అన్నది సుశీలమ్మ. “అయ్యగారూ…?” బొట్టు లేని ఆమెను చూసి అనుమానంగా అడిగాడు. “ఆయన పోయాకే, మాకీ కష్టాలు నాయనా! వీడు ఎన్నో ఏళ్ళకు లేకేలేక పుట్టిన కొడుకు వేణు. వీడు డిగ్రీ పూర్తి అయిన కొత్తలోనే ఆయన పోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వీడికి ఉద్యోగం రాలేదు. ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు మార్కులు కావట కద నాయనా! లంచం ఇవ్వడానికి మాదగ్గర తగిన డబ్బూ లేదు. పెద్దవాళ్ళ రేకమెండేషనూ లేదు. మాలాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఎవరిస్తారు నాయనా?” మొహంలో విషాదఛాయలు అలుముకోగా అన్నది.
“అప్పట్లో అయ్యగారు, నాకు చదువు చెప్పడమే కాకుండా, ఎన్నిసార్లు ఫీజు కట్టారో తెలుసా అమ్మగారూ! ఆయనకు తెలిసిన ఆఫీసర్ కు చెప్పి, నాకు ఒక చిన్న ఉద్యోగం వేయించారు. నేను అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికొచ్చాను.” అన్నాడు వేణు ఉద్వేగంగా. “చాలా సంతోషం నాయనా!” అన్నది ఆవిడ.
“ఇదంతా మీరు పెట్టిన భిక్ష అమ్మగారూ! శ్రవణ్! ఇదిగో నీకు ఉద్యోగం వచ్చినట్టు ఆర్డర్స్. ఇది నా రికమండేషన్ వల్ల రాలేదు. నీ మార్కులు చూసి వచ్చింది. ఇంకా చెప్పాలంటే…ఇలాంటి పుణ్యదంపతుల కడుపున పుట్టిన భాగ్యానికి, వాళ్ళు చేసిన పుణ్యకార్యాలకు వచ్చిన ఫలితం ఇది.” అంటూ ఆర్డర్ కాయితం శ్రవణ్ కు ఇచ్చి, సుశీలమ్మ పాదాలకు నమస్కరించాడు భక్తిగా. “ఇదేదో నేనెప్పుడో చదివిన కథలాగా ఉంది కానీ నిజ జీవితాలలో ఇలా జరుగుతుందా?” ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ అన్నది సుశీలమ్మ. “అమ్మా! ఇలాంటి కథలుంటాయేమో కానీ, మన కథ మాత్రం నిజమేనమ్మా.” అన్నాడు వేణు.

Written by Rohini Bhairava Josyula

నా పేరు రోహిణి భైరవజోశ్యులు. మా ఊరు అనంతపురం.
ప్రస్తుత నివాసం హైదరాబాద్.
నేను M.Com., M.A ( ఇంగ్లీష్) చేశాను. పెళ్ళయ్యాక చేసినవి.
20 సంవత్సరాలు కామర్స్ లెక్చరర్ గా వివిధ కళాశాలల్లో పని చేశాను.
మా వారు బ్యాంక్ లో Assistant General manager గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఉద్యోగ రీత్యా మేము
Asansol (West Bengal), Faridabad (Haryana) near Delhi, Kannur ( Kerala) తిరిగాము.
అలాగే ఆదోని ( కర్నూలు), నిజామాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాలకు వెళ్ళాము.
కొడుకులు, కోడళ్లు , ముగ్గురు మనవళ్ళు ఉన్నారు.

నేను 3 1/2 సంవత్సరాల నుంచి కథలు రాస్తున్నాను.
నేను ఎక్కువగా కుటుంబ కథలు రాస్తుంటాను. అప్పుడప్పుడు హారర్ కథలు, హాస్య కథలు కూడా రాస్తుంటాను.
ఈనాడు ఆదివారం పత్రికలో రెండుకథలు పబ్లిష్ అయ్యాయి.
సంచిక, విశాలాక్షి, విశాఖ, ఉషా, సుమతి, సహరి, తిరుపతి రచయితల పోటీ, విజయనగరం జిల్లా రచయితల సంఘం మొదలగు పత్రికలు నిర్వహించిన పోటీలలో బహుమతులు వచ్చాయి. ఇప్పుడు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి.
ఇదీ నా పరిచయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

విత్తు

వారాహీ అమ్మవారు