“గుడ్ నైట్ “చెప్పి నిద్రకి ఉపక్రమించబోతుంటే, సెల్ రింగ్ అయింది.
చెయ్యి చాపి సెల్ అందుకుని చూసింది.
శ్రీ కాంత్.”అన్నయ్యా! చెప్పు మళ్ళీ కాల్ చేశావేంటి?” అంది.
“నిద్ర పోతుంటే డిస్టర్బ్ చేశానా?”
“లేదు లేదు… ఇప్పుడే పడుకోబోతున్నా. ఇంత వరకూ శైలుతో మాట్లాడుతూ.. ”
“తను ఎలా ఉంది?”
“ఫైన్… చెప్పు….”
“ఏం లేదు చందూ.. డాడీ అన్నారు ఇద్దరికీ పెళ్లి సంబంధాలు
చూద్దామనుకుంటున్నాం అని….”
“ఏంటీ…. అక్కడ ఎవరినైనా…..”
“అయ్యో.. అలాంటిదేమి లేదు తల్లీ”నవ్వేసి “నేనూ నీ గురించి మాట్లాడడానికి చేశాను. నువ్వూ కూడా అమెరికా రావాలనుకున్నావు కదా… డాడీ పెళ్లయ్యాకే అన్నారని నువ్వూ ఫీల్ అయ్యావు. ఇక్కడ ఒక మంచి కుర్రాడు… ఫోటో పంపిస్తా.. చూడు.. నీకు నచ్చితే…..”మధ్యలోనే “అప్పుడే వద్దు అన్నయ్యా!అయినాఅమెరికా ఆలోచన డ్రాప్ చేసుకున్నా. ఇప్పుడు అక్కడి పరిస్థితులు మారిపోయాయిగా…” అమెరికా వద్దు స్వదేశం ముద్దు “అంటూ స్లొగన్స్ మొదలయ్యాయి ఇక్కడ. నీకేమి ప్రాబ్లమ్ లేదుగా.”
“ఏమి లేదు… కొందరు స్టూడెంట్స్ కే కాస్త ఇబ్బంది “.
“మొన్ననే గా జాబ్ లో చేరాను. కొన్నాళ్ళు ఈ లైఫ్ ఎంజాయ్ చేశాక పెళ్లి ఆలోచన అని డాడీ కి చెప్పాను.”
“సరే గుడ్ నైట్ “చెప్పి సెల్ ఆఫ్ చేశాడు.
*******************
శ్యామల తో మాట్లాడదామానుకుంటూనే ఆఫీస్ వర్క్ లో పడి ఆమాటే మరిచిపోయింది చందన. అది ఆమె పర్శనల్ మేటర్. నా కెందుకు, అడిగితే ఏమనుకుంటుందోననే సoకోచం కూడాఆమెని తొoదర పడనివ్వలేదు..
ఆఫీసు నుంచి ఇంటికి వస్తుంటే పిల్లవాని చెయ్యి పట్టుకుని హరి పార్క్ లోకి వెడుతుండడం చూసి, అప్రయత్నంగానే స్కూటీ ఆపి, దిగి లాక్ చేసి లోపలికి నడిచింది చందన.
బంటి అక్కడ ఉన్న పిల్లలతో ఆడుతూ ఉంటే,తను పక్కనే నిలబడి పిల్లవాడిని ప్రోత్సహిస్తున్నాడుహరి.
అతన్ని పలకరిస్తే ఏమనుకుంటాడో అని, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉన్న అతన్ని చూస్తూ, ఒక బెంచిమీద కూర్చుంది. బ్యాగ్ లో నుంచి సెల్ తీసి, నాలుగైదు ఫోటోలు తీసింది.
నవ్వుతున్నప్పుడు మరింత అందంగా ఉన్న అతని రూపాన్ని చూస్తూ అలాగే ఉండి పోయింది.
“హలో!”పలకరింపు తో ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ఆ కంగారులో సెల్ జారి కింద పడింది.
“మేడమ్!నేను… హరిశ్చంద్ర ప్రసాద్….”అంటూ, కింద పడిన సెల్ తీసి ఇవ్వబోతూ, స్క్రీన్ మీద ఉన్న తన ఫోటో చూసి “అరే!నా ఫోటో…”ఫోటోని చందనని మార్చి మార్చి చూశాడు.
కంగారునుంచి తేరుకున్న చందన “సారీ! మా ఫ్రెండ్ వస్తానని అంటే ఎదురు చూస్తూ కూర్చుని, కాలక్షేపం కోసం ఫోటోలు తీశాను. సారీ మీ అనుమతి లేకుండా మీఫోటోలు తీసినందుకు “అంది, తడబాటు అణుచుకుంటూ.
“ఇట్స్ ఓకే.. ఈ మాత్రానికి సారీ ఎందుకులెండి.ఈ ఫోటోలు నా సెల్ కి ఫార్వర్డ్ చేసుకుంటున్నా “ఆమె అనుమతి తీసుకోకుండానే
ఫోటో గెలరీ నుండి ఆ ఫొటోలతో పాటు చందన ఫోటోలు రెండు తన సెల్ కి ఫార్వర్డ్ చేసుకుని సెల్ ఆమెకి ఇచ్చేశాడు.
అటు వైపు వీపు పెట్టి ఉండడం వల్ల హరి గమనించలేదు గానీ బంటి
ఉయ్యాల ఊగుతూ క్రిందపడడం గమనించి “బాబు…”అంటూ అటు పరుగెత్తింది చందన.కిందపడిన బంటిని లేవదీసిoది.
ఈ లోపల హరి కూడా అక్కడికొచ్చి,, మోచేతికి, మోకాలికి అంటిన మట్టి దులిపి,దెబ్బ తగిలిందేమోనని చూశాడు.
“పెద్దగా తగిలినట్లు లేదులెండి. మోకాలి దగ్గర కొద్దిగా గీరుకుంది . భయం వల్ల ఏడుస్తున్నాడు. అంతే.”అంటూ బంటీ భుజాలమీద చేతులు వేసి “బంటీ ఈజ్ ఏ గుడ్ బాయ్… గుడ్ బాయ్స్ ఎక్కడైనా ఏడుస్తారా? చూడు ఆ పిల్లలు ఎలాచక్కగా నవ్వుతున్నారో.. నువ్వు కూడా అలా నవ్వాలి ”
ఆడుతూ చప్పట్లు చరుస్తున్న పిల్లల్ని చూపించింది.
బంటి ఏడవడం ఆపేసి, నవ్వుతున్న పిల్లల్ని చూసి, అటు పరుగెత్తాడు ఆటలకి.
“ఏడుస్తున్న పిల్లల్ని ఊరుకోబెట్టడం కూడా ఒక ఆర్ట్ అనుకుంటా.
ముఖ్యంగా అది ఆడవాళ్ళకి మాత్రమే తెలిసిన కళ.” అన్నాడు నవ్వుతూ.
చందన నవ్వేసి, వాచ్ చూసుకుంటూ “మా ఫ్రెండ్ వచ్చేలా లేదు.. ఇంక నేను బయలుదేరుతా ” అంది చందన.
“ఫ్రెండ్…. అంటే.. శ్యామలా? ”
“అహ కాదు.. అన్నట్లు మీరు శ్యామలతో మాట్లాడారా?”ఏ ఫ్రెండ్ లేదు అతన్ని చూసే వచ్చానని చెప్పడానికి సంకోచం. అందుకే మాట మార్చింది.
“లేదు…. కొంచెం పర్సనల్ పనుల కోసం మా ఊరు వెళ్లాను. అందుకే కుదరలేదు.”
“మీ ఊరు… అంటే…. ”
“అంటే మా స్వస్థలం గోదావరిజిల్లాలోని ఒక పల్లెటూరు…. పేరు ఆత్రేయపురం. అక్కడ మా తాతయ్య నానమ్మ, అమ్మ, నాన్న, పిన్ని బాబాయ్,అందరూ ఉన్నారు.”
“ఓహో!.. ఉమ్మడి కుటుంబం అన్నమాట.. వెరీ నైస్.!”అంది.
“మీకు నైస్ అనిపిస్తోందా? విన్నవాళ్లందరు .’ఈ రోజుల్లో ఇంకా ఉమ్మడి కుటుంబం ఏమిట్రా బాబూ’ అంటున్నారు.”నిర్జీవంగా నవ్వాడు.
“నాలాగ ఒంటరిగా పెరిగిన వాళ్ళకి ఇలా అనిపిస్తుందేమో.అందరిలో పెరిగిన వాళ్ళకి అలా అనిపించవచ్చు ”
“అంటే.. మీకు అన్నదమ్ములు.. అక్కాచెల్లెళ్లు ఎవరూ లేరా?”
“లేరు. ఒక అన్నయ్య ఉన్నాడు అమెరికాలో…ఫోన్ లోనే మాట్లాడుకుంటాం.”
“అవునా? నా వెనుక నా కుటుంబం ఉందన్న భావన నాకు వెయ్యేనుగుల బలాన్నిస్తుంది చందనా. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని.”
” ఇక్కడ మీరు, మీఅన్నయ్య గారి ఫామిలీ ఉంటారా? ”
“ఫామిలీ అని ఏమీ లేదు. నేను, అన్నయ్య ఉంటాం. బంటి హాలిడేస్ అని వచ్చాడు పది రోజుల్లో మళ్ళీ వెళ్ళిపోతాడు”.
“మీ వదినగారు, బాబూ ఇక్కడ ఉండరా?”కనుబొమలు చిట్లించి చూసింది.
” లేదు.. మా వదిన చనిపోయింది. బాబు అక్కడ మాఊళ్ళోఉంటాడు మావాళ్ళతో.”
“అయ్యో!సారీ!”
“ఇట్స్ ఓకే చందన గారు.! “లేచి ప్యాంటు దులుపుకుని “ఓకే!నైస్ మీటింగ్ యూ!”అంటూ బాబూ దగ్గరకి నడిచాడు.
తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని మెల్లగా బయటికి వచ్చి, స్కూటీ స్టార్ట్ చేసింది చందన.
రేవతి చేసిన కొత్త డిష్ చూసి, తినబుద్ధి కాక “ఆఫీస్ లో ఒక కొలీగ్ బర్త్ డే అని పార్టీ ఇచ్చాడు మమ్మీ. ఆకలిగా లేదు”అని చెప్పి,
ఫ్రిడ్జ్ లోనుంచి ఒక ఆపిల్ తీసుకుని, కొరికి తింటూ కొద్దిగా పాలు వేడి చేసుకుని తాగి,తన రూమ్ లోకి వచ్చిoది.,రేవతి బలవంతం
చెయ్యనందుకు “హమ్మయ్య!”అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది.
ఒక్కొక్కసారి “కొత్త డిష్ చందూ, టెస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు” అంటూ,ఏదో నోరు తిరగని పేరు చెప్పి,బలవంతం చేసేస్తుంది.
అప్పుడు తనని నొప్పించలేక బలవంతంగా తిని “బాగుంది మమ్మీ!”
అని కాప్లిమెంట్ ఇచ్చేస్తుంది.
రూమ్ లోకి వచ్చి లాప్టాప్ ముందేసుకుని మెయిల్స్ చెక్ చేసుకుంది.
రిప్లై ఇవ్వవలసిన వాటికీ రిప్లై ఇచ్చేసి, వచ్చి బెడ్ మీద వాలి సెల్ ఆన్ చేసింది. హరి ఫోటో దర్శనమిచ్చింది.
హరి నవ్వుతున్నప్పుడు తీసిన ఫోటో చూడగానే, ముద్దొస్తున్నట్లు అనిపిస్తే, బలవంతంగా అ కోరికని ఆపుకుంది.
ఒళ్ళంతా మధురమైన భావనలతో నిండిపోగా, అదిరే పెదవుల్ని పళ్ళమధ్య అదిమి పట్టి, “అలా చిలిపినవ్వుతో నన్ను కవ్వించకు మహానుభావా, ఆ సొట్టబుగ్గల్ని కొరికేయ్యాలనిపిస్తోంది ” ముద్దు ముద్దుగా కసిరింది.తనలో తనే నవ్వుకుంది.
శైలజ ఫోన్ చేసింది. ఇద్దరూ ఆఫీస్ విషయాలు, చేస్తున్న ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నారు.
మరునాడు హరి గురించి చెప్పి,శ్యామలని తీసుకుని పార్క్ కి వెళ్ళింది. కాసేపటికిహరి వచ్చాడు
చాలా కాలం తరువాత కలిసిన హరి,శ్యామల మాట్లాడుకుంటూ ఉంటే ఇంటి దగ్గర పనుందని వచ్చేసింది చందన.
ఇంటికి వచ్చాక తల్లి తండ్రితో శ్యామల విషయo చెప్పింది.
“ఈ రోజుల్లో చాలామంది అలాగే తయారవుతున్నారు బేబీ. అందుకే జాగ్రత్తగా ఉండాలని నీకు పదే పదే చెప్పేది “అన్నాడు వాసుదేవ రావు.
“డాడీ! అందరూ అలా ఉండరు కదా. అందర్నీ అనుమానిస్తూ..”
“అనుమానించమని కాదు.అలాంటి వాళ్ళు కూడా ఉండవచ్చు . జాగ్రత్త గా ఉండమని చెప్తున్నారు మీ నాన్న ” అంది తల్లి రేవతి.
” ఓకే.. ఓకే.. నాజాగ్రత్త లో నేనుంటాను సరేనా?… గుడ్ నైట్ ”
చెప్పి వెళ్ళి పక్కమీద వాలింది.
***************
డిన్నర్ అయ్యాక పడుకోబోతుంటే,శ్యామల కాల్ చేసి “హరిగారు నీకెలా పరిచయం?మనిద్దరం ఫ్రెండ్స్ అని అతనికెలా తెలిసింది?””అడిగింది.
“ఒకరోజు పార్క్ లో కలిశారు….”
“పార్క్ లోనా…? నువ్వు ఒక్కదానివి పార్క్ కి ఎందుకెళ్ళావ్ ?”
“మొన్ననొకరోజు మోహన్.. మాట్లాడాలి రమ్మంటే వెళ్లాను. ” ” “మోహన్? అతనెవరు? నీ బోయ్ ఫ్రెండా?”
“ఛ ఛ! కాదు.. మురళీ మోహన్..నీ మాజీ భర్త.”
“వాడు.. నిన్ను పార్క్ కి రమ్మనడం… నువ్వు వెళ్లడం… అసలేం జరుగుతోంది.. చందూ “అంది అసహనంగా.
జరిగింది చెప్పింది చందన. “అప్పుడే హరిగారితో పరిచయం. బెంగళూరులో మీరిద్దరూ కొలిగ్స్ అని చెప్పారు. అందుకే నిన్ను పార్క్ కి తీసికెళ్ళాను. ఇంటిదగ్గర కొద్దిగా పనుండి మీరిద్దరూ మాట్లాడుకుంటారని నేను వచ్చేశాను. అప్పటి విషయాలు మాట్లాడుకున్నారా?”
“ఎక్కువ సేపు కూర్చోలేదు. బాబూ ఏడుస్తున్నాడని అత్తయ్య కాల్ చేస్తే వెంటనే వెళ్ళిపోయాను.లేకుంటే మీకిద్దరికీ ఎలా పరిచయమో హరి గారినే అడిగేదాన్ని కదా ”
“అవునా? ”
“హరి గారు చాలా మంచి మనిషి. బెంగళూరు లో ఉన్నప్పుడు మోహన్ గొడవతో ఒక్కొక్కసారి నేను లేట్ గా వెళ్లేదాన్ని. అతను నాతో గొడవ పడుతున్నాడని తెలిసి, రెండు మూడుసార్లు వాడిని మందలించారు కూడా “.
“అయితే.. అందుకేనేమో…. ఆ రోజు పార్క్ లో హరిగారిని చూసి భయపడి పారిపోయి ఉంటాడు. మళ్ళీ కలుస్తా. ఫోన్ లో మాట్లాడతా అని హడావిడిగా మరో పక్కనుంచి వెళ్ళిపోయాడు.
అప్పుడు అర్ధం కాలేదు. ఇప్పుడు తెలిసింది హరిని చూసి అని ”
“అంతే, ఇంకోసారి కనిపిస్తే మాట్లాడనుకూడా మాట్లాడకు. తనకి నచ్చితే మనుషుల్ని ట్రాప్ లో పడేసే తేలివి తేటలు చాలా ఎక్కువ “.
“నువ్వూ అలాగే పడిపోయి ఉంటావు…”
” ఇలాఒంటరిగా తిప్పలు పడాలని రాసి ఉంటే అలాగే మైకం కమ్మేస్తుందేమో…. ఏం చేస్తాం…? తలరాత! నువ్వూ మాత్రం వాడితో జాగ్రత్తగా ఉండు ”
“ఓకే గుడ్ నైట్.. రేపు ఆఫీస్ లో కలుద్దాం ”
********************
బోర్లా పడుకుని మోచేతుల మీద అనుకుని, సెల్ ని మరో దిండుకి వాలుగా పెట్టి..వాట్సాప్ మెసేజ్ లు చూస్తుంటే…..”సెల్ రింగ్ అవుతుంటే, చూసింది. హరి నుంచి కాల్.
,సెల్ అని చేసింది.
“హాయ్..”
“హలో….చెప్పండి హరి గారు”అంది,
” ఏం చేస్తున్నారు? నిద్ర పోతుంటే డిస్ట్రబ్ చేశానా?”
“అహ, అదేమిలేదు.. ….”
” మీతో మాట్లాడదామనిపించిoది.”
“ఎందుకూ?ఏ విషయం గురించి?” మందస్వరంతో ప్రశ్నించింది.
“జస్ట్ లైక్ దట్”
కాసేపు ఇద్దరి మధ్య మౌనం.
“ఎదురుగా ఉంటే చెప్పీ వాడిని “.
“ఏమని?”
“ఐ లవ్ యూ ” అని.
అతనంత తొందరగా అలా డైరెక్ట్ గా చెప్పేస్తాడని ఉహించలేదు చందన.
కాసేపుమౌనం గా ఉండిపోయింది
మళ్ళీ అతనే ” థాంక్ యూ “అన్నాడు.
” ఎందుకూ? ”
“నా ప్రపోజల్ ని అంగీకరించినందుకు. ”
“అంగీకరించినట్లు నేనేమి చెప్పలేదుగా ”
“నువ్వు చెప్పకపోయినా నీ మౌనం చెప్పిందిలే”
“ఏమని?”
“నా ప్రేమని యాక్సెప్ట్ చేశావని”
“నేనలా చెప్పలేదుగా ”
“మాటల్లో చెప్పలేదు. మౌనంతో చెప్పావు. లేకుంటే నన్ను తిట్టి,ఫోన్ డిస్కనెక్ట్ చేసేదానివి.”
మాట్లాడ లేదు చందన.
“చందనా!
“ఊ!”…
“థాంక్ యూ! రేపు పార్క్ లో కలుద్దాం. గుడ్ నైట్ ”
సెల్ ఆఫ్ చేసి, బలవంతంగా కళ్ళు మూసుకుంది.
నిద్ర పట్ట బోతుంటే………
( సశేషం )