” కనిపించే మూడు సింహాలు నీతికీ,న్యాయానికీ,ధర్మానికీ ప్రతిరూపాలైతే, కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ ”
2007 లో విడుదలైన పోలీస్ స్టోరీ 2 అనే చిత్రంలోని ఈ డైలాగ్ ప్రజల్లోకి ఎంతగా చొ చ్చుకు వెళ్ళిందో అందరికీ తెలిసిందే.
తోవ మరిచిన లేడీకూనేదో జనారణ్యంలోకి అడుగు పెట్టిందనుకున్నారు. వేట మొదలెట్టి బెదర గొట్టాలనుకున్నారు. లేడి కూన కాదు, మఫ్టీ లో ఉన్న కనిపించని ఆ నాలుగో సింహమే అని తెలిసి ఠారెత్తి పోయారు.
మల్కాజ్ గిరి పోలీసు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే మహిళల భద్రతకు సంబంధించిన విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో దిల్సుఖ్నగర్ బస్టాండ్ లో అర్థరాత్రి రహస్య ఆపరేషన్ నిర్వహించిన వీరి అంకిత భావానికీ, ధైర్యసాహసాలకు నెట్టింట ప్రశంసల వర్షం కురిసి, దేశవ్యాప్తంగా చర్చనీయాంశ మైంది.
వివరాల్లోకి వెళితే….
జోగులాంబ గద్వాల జిల్లా, ఉండవెల్లి మండలం, కలుగోట్ల గ్రామంలో సుజాతమ్మ,తిరుపతి రెడ్డి దంపతులకు 1974 వ. సంవత్సరంలో జన్మించారు.
స్వగ్రామంలో ప్రాథమిక విద్య, కర్నూల్ లో ఇంటర్మీడియట్, ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్సి అగ్రికల్చర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, నల్సార్ విశ్వవిద్యాలయం నుండి ‘సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ లా’ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం పోటీ పరీక్షల సముద్రాన్ని ఈది ఖాకీ దుస్తుల్లో పైకి లేచారు.
2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా డి.ఎస్.పి. గా,కేవలం ఆరేళ్ల వ్యవధి (2007)లో కన్ఫమ్డ్ ఐ.పీ.ఎస్. పదోన్నతి పొందిన తొలి మహిళగా, మల్కాజి గిరి పోలీస్ కమిషనరేట్ కు తొలి మహిళా పోలీస్ కమిషనర్ గా చరిత్ర సృష్టించారు.
పలు ఇంటర్వ్యూల్లో వీరు వెల్లడించిన విషయాల ఆధారంగా పది సంవత్సరాలు గ్రామ సర్పంచ్ గా సేవలందించిన తన తండ్రి ప్రజా సమస్యల్ని పరిష్కరించిన విధానాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభవం, రాముడు అనే ఒక పాలేరు ఎదుర్కొన్న వివక్ష, అతని మాటల్లోని వేదనే ఈ
రంగాన్ని ఎంచుకోవాలనే ఆలోచనకు బీజం వేసి ఉండవచ్చని చెబుతారు. తన తల్లి,నానమ్మ ఇద్దరూ తనను అత్యంత ప్రభావితం చేసిన స్త్రీలని చెబుతారు.
రంగారెడ్డి జిల్లాలో ట్రైనీగా ఉన్న సమయంలో బందిపోటు దొంగలు విజృంభించే వారినీ,నెల రోజులు వారి కదలికలను గమనించి, చివరికి ఒకరోజు వెంబడిస్తూ వెళ్లడం, కడపలో ఎదురు కాల్పుల్లో వారు హతమవడం సినీ ఫక్కీ మాదిరిగా అనిపించిందనీ, ఉద్యోగం అంటే ఇంత అద్భుతంగా ఉంటుందా! అని మొట్టమొదటిసారిగా అనిపించిందనీ,ఆనందంగా స్వచ్ఛంగా నవ్వుతూ చెప్పారు.
నాటకీయ పరిస్థితుల నడుమ వ్యభిచార గృహంపై చేసిన దాడి, ఆ రోజుల్లో పోలీసు వ్యవస్థను ఎంతగా ఉత్కంఠభరితం చేసిందో కూడా సంతృప్తిని నిండిన స్వరంతో చెప్పారు. మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి జరిగిన చర్చల్లో కీలకపాత్ర పోషించినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.
మహిళలు, బాలలపై నేరాలు, సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నియంత్రణ, ట్రాఫిక్ సమస్యలు వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తానన్నారు. పారదర్శకమైన, సమర్థవంతమైన పోలీసింగ్ ను సాంకేతిక పరిజ్ఞానంతో బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమనీ చెప్పారు. కర్తవ్యనిష్ట,ధైర్యం, క్రమశిక్షణ, ప్రజాసంక్షేమం అనే నాలుగు అంశాల ఆధారంగా అడుగులు కదుపుతూ ఉంటాననీ చెప్పారు. పదవి అలంకారప్రాయం కాదనీ, అనుక్షణం అప్రమత్తంగా ఉండమని చేసే హెచ్చరికనీ, దానికి బద్దురాలినై ఉంటానని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ప్రసారమాధ్యమాలకు సూచించారు.
భద్రతే మా ధ్యేయం – మీ రక్షణే మా బాధ్యత
సేవకు గౌరవం – ప్రతిభకు గుర్తింపు
హై బీమ్ – హై రిస్క్
మీ సురక్ష – సహచరి
వంటి కార్యక్రమాలతో పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో భరోసాని కలిగిస్తున్నారు.
80 వ. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మహిళా వాద్య బృందాన్ని ప్రవేశపెట్టి, తెలంగాణ పోలీస్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. దేశ ప్రగతిలో మహిళా భాగస్వామ్యాన్ని నొప్పి చెప్పిన ఈ సంఘటన చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోనుందని పలువురి ప్రశంసలను అందుకుంది.
వీరు నిర్వహించిన బాధ్యతలు :
వరంగల్ అదనపు డి. ఎస్. పి.
మెదక్ ఎస్. పి.
హైదరాబాద్ నార్త్ జోన్ డి.సి.పి.
చిక్కడపల్లి ఏ.సి.పి.
సి.ఐ.డి.
కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ ( ఎస్ ఐ బి )
తెలంగాణ మహిళాభద్రత విభాగం డఐజి
మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్
వీరిని వరించిన పురస్కారాలు:
ఫిక్కీ స్పెషల్ జ్యూరీ అవార్డు
బెస్ట్ కోవిడ్ వారియర్ వుమెన్ అవార్డు
తెలంగాణ విశిష్ట మహిళా పురస్కారం
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సహ విద్యార్థి ఐన శ్రీనాథ్ గారితో ఏర్పడిన పరిచయం క్రమంగా స్నేహం, ప్రేమ వంటి పలు రూపాలు సంతరించుకొని దాంపత్య బంధంతో ముడి వ డింది. ఇద్దరు ఆడపిల్లల( ప్రకృతి, సంస్కృతి) కు జన్మనిచ్చి అటువృత్తి జీవితాన్ని ఇటు వ్యక్తిగత జీవితాన్ని చక్కగా సమన్వయ పరుచుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఉన్నత విద్యాభ్యాసంలో ఒకరు, జాతీయ స్థాయిలో అవార్డులు పొందుతూ మరొకరు తల్లిని మించిన తనయలుగా రూపొందడంలో వీరి జీవిత భాగస్వామి( ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ లో ఎంబిఏ పూర్తి చేసి, వ్యాపార రంగంలో స్థిరపడిన) శ్రీనాథ్ గారి సహకారం మెండుగా ఉందనే విషయం వీరి కూతురైన సంస్కృతిని ఒక ఛానల్ వారు చేసిన ఇంటర్వ్యూలో స్పష్టంగా అర్థమౌతుంది.
వివాహమైన తొలినాళ్లలో వీరు ఉపయోగించిన ద్విచక్ర వాహనం, దాంపత్య ఫలాలైన ప్రకృతి, సంస్కృతి ఇద్దరి పేర్లుతో ఆకుపచ్చని అందాల నడుమ వీరి ఇంటి ప్రాంగణం వారి అనురాగ బంధానికి భాష్యంగా ముచ్చట గొలుపుతూ ఉంటుంది. ప్రకృతి ఆరాధకులు, సంస్కృతీ సాంప్రదాయాలను గౌరవించే ఈ దంపతులు బహుశా ఆ కారణంగానే వీరి పిల్లలకు ప్రకృతి,సంస్కృతి అని నామకరణం చేసి ఉండవచ్చు. సవాళ్లతో నిండిన పోలీసు వ్యవస్థలో అధికారిణిగా ఒత్తిడిని ఎలా జయించ గలుగున్నారని ఒక ఛానల్ వారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఇద్దరు ఆడపిల్లల తల్లినైన తాను వారితో సమయం గడపడంలోనే సేద తీరుతానని హాయిగా నవ్వేస్తూ చెబుతారు. వీరి కంఠస్వరం చాలా శ్రావ్యంగా ఉండటమే గా కుండా రచనా వ్యాసంగంలో కూడా ప్రవేశం ఉంది.
సమర్థమంతమైన మహిళా శక్తికి నిదర్శనంగా, కుటుంబ వ్యవస్థకు సిసలైన నిర్వచనంగా సాగుతున్న వీరి ప్రయాణం సమాజానికి నమూనాగా మారాలని ఆశిస్తూ, అభినందిస్తూ…..